Facebook Twitter
అత్తగారు - కట్టుడు పళ్లు

అత్తగారు - కట్టుడు పళ్లు

- భానుమతీ రామకృష్ణ    

            

  సున్నితమైన హాస్యం, అలంకారమైన భాషతో అలరిస్తాయి భానుమతీ రామకృష్ణ రాసిన 'అత్తగారి కథలు'. తెలుగు ప్రజల జీవన విధానాన్ని, సంస్కృతీ సంప్రదాయాల్లోని సూక్ష్మ అంశాలను కూడా పాఠకునికి అందిస్తాయి. నటిగా, గాయనిగా, దర్శకురాలిగా, రచయితగా గుర్తింపు పొందిన భానుమతి బహుముఖ ప్రజ్ఞకు 'అత్తగారి కథలు' మరో తార్కాణం.
         'అత్తగారి కథల్లో'ని ఓ మంచికథే 'అత్తగారు - కట్టుడు పళ్లు' కథ ఉత్తమ పురుషలో నడుస్తూంది. రచయిత్రి మన పక్కనే కూర్చొని చెప్తున్నట్లు, దృశ్యాన్ని చూపిస్తున్నట్లు ఉంటుందీ కథ.

        అత్తగారికి 76వ జన్మదినోత్సవం సందర్భంగా వంటయ్యరు పాయసం, వడలు, చేగోడీలు, మురుకులూ... వండుతాడు. వాటన్నిటిని చూసిన అత్తగారికి తినాలనే కోరిక ఎక్కువైనా, పళ్లు లేకపోవడం వల్ల ఏమీ తినలేక పోతున్నానని అర్థమవుతుంది. అంతలో అత్తగారి బాల్య స్నేహితురాలు అఖిలాండమ్మ పదహారేళ్ల పిల్లకుండే పలువరసతో నవ్వుకుంటూ వస్తుంది. ఆమె కట్టుడు పళ్ల వ్యవహారం తెలుసుకున్న అత్తగారు తనూ కట్టించుకుంటుంది. అయితే పిసినారితనంతో పంటికి పదిరూపాయలు ఖర్చు అవుతుందని లెక్కకట్టి పద్నాలుగు పళ్లు మాత్రమే కట్టించుకుంటుంది. పద్దెనిమిది పళ్లకు కలిసి 180 రూపాయలు మిగుల్చుకుంటుంది.
       ఇక ఆ కట్టుడు పళ్లతో ఆమె తంటాలు మొదలవుతాయి. పని మనిషిని కోపంతో అరుస్తూ కంగారులో ఆ పళ్లను బావిలో పడేసు కుంటుంది. మళ్లీ కట్టించుకుంటే డబ్బులు ఖర్చుఅవుతాయని పనిమనిషి ద్వారా ముగ్గురు మగాళ్లతో బావిలో వెతికిస్తుంది. పళ్లు దొరక్కపోగా వాళ్లు మట్టి పూడిక తీస్తారు. యూబై రూపాయలు కూలీ పట్టుకుపోతారు.
     అయితే తెల్లారి పేపర్లో వాళ్లు దొంగలని, పోలీసులు పట్టుకున్నారని, చాలామంది అలానే గడ్డాలు పెంచుకొని తిరుగుతున్నారని వార్త వస్తుంది. దాంతో అత్తగారు భయపడిపోతుంది. పనిమనిషి మీద కేకలేస్తుంది. ఇంట్లో పనివాడు అయ్యప్ప స్వామి మాల వేసి గడ్డం పెంచుకుంటే వాడిని గడ్డం తీయమని అరుస్తుంది.  వంటవాడు పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మొక్కుతో గడ్డం పెచుకున్నానన్నా వినకుండా గడ్డం తీయించుకోమంటుంది. ఇలా నానా అల్లరి చేస్తూ అందరినీ ముప్పతిప్పులు పెడుతుంది.
       ఒకరోజు పనివాడు, వంటవాడు రాత్రి పూజకు వెళ్లి వస్తుంటే గడ్డాలు పెరిగి ఉండడంతో పోలీసులు పట్టుకుంటారు. అడ్రస్ చెప్తే వీళ్ల ఇంటికి తీసుకొస్తారు. పోలీసులు అడిగితే ఈ గడ్డం పెంచుకున్న వాళ్లు మాకు తెలియదని అత్తగారు చెప్తుంది. అప్పడే కారు డ్రైవర్ సింగ్ వచ్చినా అతనూ మాకు తెలియదని చెప్తుంది. వాళ్ల ముగ్గురూ ఎంత మొత్తుకున్నా గడ్డం పెంచుకున్న వాళ్లు ఎవరూ మాకు తెలియదని గట్టిగా చెప్తుంది. అంతలో కొడుకు సింగ్ ను పిలవగానే ముగ్గురూ పరుగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్లి పోతారు. అత్తగారి ముఖం పాలిపోతుంది.
      పనిమనిషి పరుగెత్తుకుంటూ వచ్చి 'అమ్మగారూ మీ పళ్లు పూడిక తీసిన మట్టిలో కనిపించాయని' చెప్తుంది. దాంతో వంటవాడితో, పనివాడితో 'నా పళ్లు దొరికాయని' సంతోషంతో కేకలేస్తూ చెప్తుంది. అప్పుడు వాళ్లు 'మా పెద్దమ్మ గారికి పళ్లులేవు.  నువ్వెవరో మాకు తెలియదు' అని ఆటపట్టిస్తారు.
       ఇలా కథంతా నవ్వులతో నిండిపోతుంది. అత్తగారి నిర్వాహకాలు, పెద్ద వయసుతో వచ్చిన చాదస్తాలు.. కథలో మనల్ని మంత్రముగ్థుల్ని చేస్తాయి. 'ఒకదానికొకటి సంబంధం లేకుండా.... పాడుబడ్డ దేవాలయ స్తంభాల్లా ఆడుతుంటాయి.' 'పన్ను ఒకటి కుతుబ్ మీనారంత పొడుగ్గా...' 'పంటికి పది రూపాయలు పెడుతున్నాం గనుక కాస్త వెడల్పాటి పళ్లు కట్టించుకుంటే సగం చోటు కలిసొస్తుంది...' ఇలా... చతురోక్తులు మనల్ని కడుపుబ్బా నవ్విస్తాయి. అందుకే అత్తగారి కథలు మన తెలుగింటి ఆణిముత్యాలు.
                                               
డా. ఎ. రవీంద్రబాబు.