Facebook Twitter
వికసిత

  వికసిత...!!!  (కవిత)
                                                                   
- డా. ఎ. రవీంద్రబాబు

 

ఏ అభౌతిక చలనాల్లోనో... మౌనానికి అందని తర్కంలో... సృష్టి, స్థితి, లయలకు పూర్వమే నీవు నాకు తెలుసు. మనదిద్దరం బాగా పరిచయం. అందుకే... నీకోసం ఇప్పటికీ అన్వేషిస్తూనే ఉన్నాను. కాలం పొలిమేరకు దూరంగా నీ జ్ఞాపకాల గుర్తులు చెదిరిపోకుండా నిలిచే ఉన్నాయి. అవి నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. సరే,  నీ గురించి నీకు కొన్ని విషయాలు చెప్తా... విను.
       ఉషోదయ కిరణాల మేలి ముసుగు తొలగించుకుని... మైథునానికి గుర్తుగా, గమ్మత్తుగా ఈ లోకం ఒడిలోకి జారిపడ్డావు ప్రియతమా... తొలకరి జల్లులు, నును వెచ్చని మంచు మత్తు స్పర్శలు నిన్ను లాలించాయి. పూజించాయి. పూలవానలు దోసిళ్లతో నిన్ను ముంచెత్తాయి. నీవు ప్రకృతి కన్నెవి. విరిబోణివి. సప్త స్వర గమకాల ప్రకృతి సంగీత సంగమానివి. లే లేత పొత్తిళ్ల నుంచి.. బుడిబుడి అడుగుల బోసి నవ్వుల నుంచి పాపవై, విరిసిన శ్రీ చంద్రికవై గతాన్ని తెంచుకుని... భవిష్యత్తును పుంజుకుని వర్తమానం వైపు పరుగెత్తావు. కాలం నీకు వయసును అరువిచ్చింది. సహజత్వం నీకు అందాల్ని అమర్చింది. యవ్వనం పొంగై, లేలేత సొగసై అమాయకత్వపు శరీరానికి ఆకృతి నిచ్చింది. నీ ప్రతి కదలిక ఓ అచ్చతెలుగు వాక్యమై గారాలు పోయింది. నీ చూపుల విరి కాంతుల్లో కోటి ప్రభాతాలు విచ్చుకున్నాయి. నక్షత్రాలు సైతం నీ లే నవ్వులో తలమునకలయ్యాయి. అసలు... ప్రకృతిలోని ప్రతి సుందరాకృతి నీ మేనిపై విరిగి తమకంతో స్వాంతన పొందలేక తపించింది.
      అప్పుడిక క్షణాలు కాలాన్ని ఔపోసన పట్టేశాయి. ఏ గంధర్వడో పురుషుడై నిన్ను సమీపించాడు. పంచేంద్రియాలు మనసు బంధాన్ని పూర్తిగా తెంచుకున్నాయి. తేలియాడే నీ కాంక్షా నురగల మధ్య కడలి కూడా బద్దలైంది. నీ తనువు, మనసు వ్రక్కలై మూర్ఛనులు పోయింది. కన్నీళ్లు గతాన్ని, వర్తమానాన్ని స్మరిస్తూనే ఉన్నాయి. భవిష్యత్తును శపిస్తూనే ఉన్నాయి. కాలం జ్ఞాపకాల పీడకల కాదు. ఓ అన్వేషణా శకలం మాత్రమే.. తపస్సు ఇంకా ముగియలేదు. వెదుకులాట కన్నులపై తేలియాడుతూనే ఉంది. అసలు ప్రకృతే ఓ వింత చర్యల ఢముకర నాదం. నీకు నీవు కాదు... నీ లాంటి వాళ్లెందరికో... ఓ స్వాప్నిక చర్యవు మాత్రమే...
       రుజువులు, వాస్తవాలు అమానుషం. నిన్ను నీవు కంచెగా కాదు. ప్రాకృతిక వైభవంగా మలచుకోవాలి. ఎందుకంటే... వెదుకులాట వెన్నంటే చర్య. కాలం మధ్య నిలబడి విరబోసిన సౌందర్య కురుల్లో  చారికలు చెక్కిలపై తలవంచకూడదు. ఎందుకంటే... మా వెదుకులాట ముగియలేదు. అసలు మొదటి అక్షరం కూడా రాయలేదు... ఓం కారం పురుడు పోసుకోలేదు.
      ఇంకా గడ్డిపూల తివాచీ మీద నీ అడుగుల గుర్తుల్ని ఏరుకుంటున్నాం. ఊగే పూలకొమ్మ నుంచి ఏ చివురుల్లోనో నీ జ్ఞాపకమై పలకరిస్తుందిని ఆశగా ఎదురు చూస్తున్నాం. ఓ ప్రాకృతిక సౌందర్యమా... నీవు ఎప్పటికీ అభౌతిక రూపానివే... ఆది, అంతం లేని మానవీయ స్పర్శవే... మనసు పొరల్లో దాగిన లయాత్మక నాదానివే... నా... దానివే...వే... వే...

                 అంతం కాని అన్వేషణలోంచి కొన్ని క్షణాలకు అక్షరాల ఆకృతులు మాత్రమే


                                                                ... ఇవి...