Facebook Twitter
’అమ్మ’తనం అమ్మకానికి

’అమ్మ’తనం అమ్మకానికి

              -కనకదుర్గ-

 

సృష్టికి మూలం స్త్రీ,
ఒకపుడు ఇంటికే
పరిమితమయిన స్త్రీ
ఈనాడు చదువుల్లో
అన్ని రంగాల్లోనూ స్త్రీ
అంతరిక్షంలోకి అడుగు
పెట్టింది ఈనాటి స్త్రీ
ఎన్నో విజయాలను
చవి చూసింది స్త్రీ
కానీ ఇంకా....
బాలికలకు చదువుకోవాలని
మంచి ఉద్యోగాలు చేయాలని
కోరికలున్నా,
పాచిపనులకు, ఇంట్లో
తోబుట్టువులను చూసుకుంటూ,
చిన్న వయసులోనే పెళ్ళి
చేస్తే ఆడుకునే వయసులో
తల్లవుతుంటే గర్భంలో
పెరుగుతున్నది
ఆడ శిశువని తెలిస్తే
నిర్ధాక్షిణ్యంగా గర్భంలోనే
శిశు హత్య చేసినా
తల్లి మౌనంగా వుండాలి,
వయసుకి మించిన భారాన్ని
మోస్తూ,
అనారోగ్యాల పాలవుతూ,
బీదరికం బారినుండి
బయట పడాలంటే
శరీరంలో ఇతర భాగాలు
అమ్ముకున్నట్టే
తన గర్భకోశాన్నే అద్దెకిచ్చి
అందులో పెరిగే బిడ్డతో
మమకారం పెంచుకోకుండా,
’సర్రోగేట్ మామ్,’ పేరుతో
మాతృత్వాన్ని పురుషుడు,
వ్యాపారాత్మకంగా మార్చి
అవహేళన చేస్తున్నా,
పెళ్ళయ్యేవరకు భధ్రంగా
దాచుకున్న శీలం, పరువు,
మర్యాద అర్ధాలు అన్నీ
తమ అవసరాలను బట్టి,
మారిపోతున్నా,
భర్తతోనే బిడ్డను కనాలి
అనేవారు,
కానీ డబ్భుకోసం తన
గర్భాన్ని అద్దెకిచ్చి,
తన కడుపులో పెరిగే
బిడ్డ కాలితో తన్నినా,
తిరుగుతున్నా సంతోషించకూడదు,
అన్నీ భావాలను మర్చిపోవాలి,
 తన రక్తం పంచుకుని
నవ మాసాలు
తనలో భాగం అయ్యి
పెరిగిన శిశువుని
తన చేతులతోనే
బిడ్డలను
కనలేని వారి చేతిలో
పెట్టేసి భర్త డబ్బు తీసుకుని
ఆనందపడ్తుంటే చనుబాలు
గడ్డకట్టి నొప్పిపెట్టకుండా
డాక్టర్ మందులిస్తే
తీసుకొని, ఇంటికెళ్ళి
తన పిల్లలను చూసుకుంటూ
ఇంటిపనిలో పడిపోవాలి,
మళ్ళీ కొన్ని నెలల తర్వాత
ఇంకో భేరం వస్తే మళ్ళీ
ఆ కడుపు కోతకు
తయారు కావాలి,
ఇది ఒక దేశంలోనే కాదు
అన్నీ దేశాలకు పాకుతూ
స్త్రీని ఒక వస్తువుగా
చేసి చూపిస్తుంటే మౌనంగా
చూస్తూ వుండిపోతున్నది
నేటి స్త్రీ!