Facebook Twitter
కార్నర్ సీటు

 కార్నర్ సీటు

    - రావి శాస్త్రి

 


  

పరిస్థితులను బట్టి మనిషి మనసులో చెలరేగే ఆలోచనల స్రవంతే 'కార్నర్ సీటు' కథ. సహజంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఎదుటివారి గురించి తనలో తను మాట్లాడుకునే ఆంతరంగిక సంభాషణే 'కార్నర్ సీటు'

కథ. చేయితిరిగిన రచయిత రావిశాస్త్రి తనదైన శైలిలో ఈ కథను అద్భుతంగా రాశారు.
      మేనల్లుడి పెళ్లికి బయలుదేరిన రాజు,  అతని ఎదురుగా కూర్చొన్న పచ్చకోటతనిని గురించి చేసే ఆలోచనలే ఈ కథ.  అందరిలాగే రాజు కూడా ట్రయిను ఎక్కగానే కార్నర్ సీటులో కూర్చోవాలనుకుంటాడు. కానీ ఒకడుగు వెనుకబడటంతో ఓ పచ్చకోటతను ఆ సీట్లో కూర్చొంటాడు. దాంతో రాజుకు చిరాకు వేస్తుంది. వళ్లు మండుతుంది. అతని మాసీమాయని పంచె, నెత్తి మీదున్న మరాఠీ టోపీ, లోతుకుపోయిన కళ్లు చూసి పరిపరి విధాలుగా మనసులో అతడిని తిట్టుకుంటాడు రాజు. ఆఖరకు 'మీరెక్కడ దిగుతారూ' అని అడుగుతాడు. కానీ అతను మాత్రం 'నా మానాన్న నన్ను కూర్చోనివ్వండి.' అని విసుక్కుంటాడు. తల మీదున్న టోపీ తీసి బల్లపై విసిరేస్తాడు.
     పచ్చకోటతని మీద రాజుకు కోపం మరీ ఎక్కువ అవుతుంది. 'దౌర్భాగ్య పు వెధవ, చెవల వెధవ' అని తిట్టుకుంటాడు, మండిపోతాడు.
        పచ్చకోటువాడు దగ్గితే. అతికి క్షయ ఉందనుకుంటాడు. టీ.సి. వస్తే చెప్పి దించేయాలి అనుకుంటాడు. ఒకవేళ అతను చస్తే భూభారం తగ్గుతుందని కూడా ఆలోచన చేస్తాడు. ఏదో స్టేషను వస్తే పచ్చకోటువాడు లేచి వెళ్తే, అతను తిరిగి రాకూడదనుకుంటాడు. వెనుక గుమ్మం దగ్గర నిలబడిన అతడిని చూసి, ఎందుకో ఈ దర్పం అని రాజు ఈర్ష్య చెందుతాడు. ఇంతలో ట్రయిన్ కదులుతుంది. పచ్చకోటు అతను ట్రయిన్ కిందపడి చనిపోతాడు. పదిగజాలు కూడా ట్రయిను కదలకుండానే ఆగిపోతుంది. పోలీసులు, టీసీలు, జనాలు అంతా హడావుడి. రాజూ మాత్రం దగ్గరకు వెళ్లడానికే భయపడతాడు. దూరం నుంచి అతని అరిపాదాలు మాత్రం చూస్తాడు. అప్పటి వరకు కార్నర్ సీటులో కూర్చోవాలన్న తన కోర్కెను కూడా మర్చిపోతాడు. ట్రయిన్ లో జనాలు పచ్చకోటతని టోపీిని తాకడానికి కూడా భయపడతారు.
       ట్రయిన్లో నుంచి ప్రకృతిని చూస్తున్న రాజు ఆ చనిపోయిన పచ్చకోటతను ఈ అందాలను చూడలేకపోయాడు కదా... అనుకుంటాడు. రాజు గుండె బరువెక్కుతుంది. మనసు విచారభరితమవుతుంది. కళ్లు చెమ్మగిల్లుతాయి. దిగులు కలుగుతుంది.
     రావి శాస్త్రి ఈ కథలో పాఠకులకు మరణమన్నా, చనిపోయిన వారన్నా, వాళ్ల వస్తువులన్నా బతికున్న వారికి ఎంత భయమో ప్రత్యక్షంగా వివరిస్తారు. కథ పూర్తయ్యే సరికి మన హృదయమూ బరువెక్కుతుంది. అప్రయత్నంగా గుండెల్లో కన్నీటి చెమ్మ ఊరుతుంది. బతుకుకు, చావుకు మధ్య ఉన్న విలువ తెలుస్తుంది. ఇక రావిశాస్త్రి గారి శైలి అక్షరాల వెంట పరుగులు తీయిస్తుంది. వర్ణనలు మనసుల్లో దృశ్యాలను ఆవిష్కరిస్తాయి. అందుకే 'కార్నర్ సీటు' కథ మాణిక్యమే.

                                     
   - డా. రవీంద్రబాబు.