Facebook Twitter
ముద్దబంతి పూవులో

 ముద్దబంతి పూవులో

- భవానీదేవి

 

"నేనిప్పుడే పెళ్ళి చేసుకోను" సీరియస్ గా అంటున్న కొడుకుని అమయాకుడిలా చూసింది అన్నపూర్ణ.

    "చేసుకోమని ఎవరన్నారు? అనూని ఓసారి చూడు. ఆపై నీ అభిప్రాయాన్ని మేము కాదంటేగా!"

    "చేసుకోనప్పుడు చూడటం మాత్రం దేనికి?" పదునుగా వుంది మనోజ్ స్వరం.

    "చిన్నప్పటి నుంచీ అనూరాధని నీ భార్య అనుకున్నాంరా" బతిమిలాటగా అంది.

    "దానికి నేనా బాధ్యుడ్ని?" కోపంగా వుందతని స్వరం.

    "అంత కోపం ఎందుకురా! ఆడపిల్లగలవాళ్ళు ఇంకెన్నాళ్ళు ఆగుతారు చెప్పు? నువ్వోసారి చూసి..."

    ఇంక అమ్మ మాటలకి ఎదురుచెప్పలేకపోయాడు మనోజ్.

    "ఆ పల్లెటూరి బైతుని సాయంత్రం చూసి రాత్రి బస్ కి హైదరాబాద్ వెళ్ళాలి.. నా లీవ్ వేస్టవుతుంది" అల్టిమేటం జారీ చేసి అలా పొలాలకేసి నడక సాగించాడు.

    మనోజ్ మనసు కుతకుతా వుడికిపోతోంది. హైదరాబాద్ లో ఫ్రెండ్స్ తో హాయిగా కాలక్షేపం చేస్తున్న మనోజ్, 'తల్లికి బాగాలేదన్న' టెలిగ్రాం అందుకుని ఆదరా బాదరాగా వచ్చాడు. మామయ్య ఆడిన నాటకం తెలిసి అనురాధని చూడాలంటే మరింత కోపంగా వుంది.

    మెగా సిటీలో చుడీదార్లు, మిడ్డీలలో కళ్ళు జిగేల్ మనేలా కన్పడే అమ్మాయిల్లో ఒకర్ని ప్రేమించి, ప్రేమించటంలోని థ్రిల్ ని అనుభవించి తర్వాత పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు. 

    మేనకోడల్ని కోడలుగా చేసుకోవాలని అమ్మ తాపత్రయం. ఈ పల్లెటూరి గబ్బిలాయిని తను మాత్రం ఛస్తే చేసుకోడు. నామమాత్రంగా పెళ్ళిచూపులకి అటెండ్ అయి ఝూమ్మని రాత్రి బస్ కి హైదరాబాద్ వెళ్ళిపోతాడు.

    పంట చేల గట్ల మీద ఆలోచిస్తూ అడుగులేస్తున్నాడు మనోజ్. నీలి ఆకాశానికి కొంగల బారులు మేలిముసుగేస్తున్నాయి. విస్తరిస్తున్న అలలు చెరువు కౌగిట్లోంచి బయటకు రాలేక చెరువు అంచుల్ని ముద్దుపెట్టుకుని లయించి పోతున్నాయి.

    ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఆ అమ్మాయిని చురుగ్గా చూశాడు. 'అబ్బా' అనుకుంటూ నుదురు తడుముకున్నారిద్దరూ.

    తీవ్రంగా చూడబోయి చేతకాక 'సారీ' అంటూ ఆమె కళ్ళలోకి చూశాడు.

    నీలాలు మెరిసినట్టున్న ఆ కనుపాపల్లో తన నీడే కన్పించింది.

    అతని అవస్థ చూసి సన్నగా నవ్వింది. పారిజాతం పూలు రాల్చిన నిశ్శబ్ద వీణాస్వనం అది.

    ఇంత అందంగా ఆడపిల్లలు నవ్వగలరని అతనికి మొదటిసారిగా తెలిసింది.

    కింద రాలిన బంతిపూలను ఏరి ఒళ్ళో వేసుకుంటుంటే పొడుగాటి వాలుజడ ముందుకు వాలి చెవిలో ఏదో గుసగుసలు చెప్తున్నది కాబోలు. ఆమె పెదవులపై నునుసిగ్గు గంతులు వేస్తోంది.

    గులాబీ రంగు లంగా, జాకెట్టు, నల్ల ఓణీలో రోజా పూవులా వుంది. ముద్దబంతి పూవులా ఒద్దికగా వున్న అలాంటి అమ్మాయిలు సిటీలో కన్పించరు. డబ్బాలా పైనుంచి కింది దాకా చుడీదార్లు దిగేసుకుని బస్సుల కోసం పరుగెత్తే సిటీ అమ్మాయిలు గుర్తొచ్చారు.

    పల్లెటూరి జీవన విధానానికి అలవాటుపడిన ఈ అమ్మాయిలో ముగ్ధత్వం, సుకుమారత, సౌందర్యం సమపాళ్ళలో వుండటం మనసుకు ఆహ్లాదాన్నిస్తోంది.

    బంతిపూలు ఏరటంలో సాయం చేసి ఆమె కొంగులో పోశాడు.

    చిలిపిగా కళ్ళల్లోకి చూసి నవ్వి పరుగు పరుగున వెళ్ళిపోయిందామ్మాయి.

    గాలి అలల మీద తేలివస్తున్న పాంజేబుల సవ్వడి మధుర సంగీతంలా వుందతనికి.

    ఇక పెళ్ళిచూపులకు వెళ్ళాలనే లేదు. మరోసారి ఆ ముద్దబంతి పూవును ఈ పల్లెలో వెదికి పట్టుకోవాలి.

    తల్లి మందలింపుతో తప్పనిసరయి మేనమామ ఇంటికి వెళ్ళాడు.

    వరండాలో ఉంచిన నీళ్ళతో కాళ్ళు కడుక్కొని లోపలికెళ్తుంటే కర్టెన్ చాటు నుంచి వినిపించిన పాంజేబుల సవ్వడికి మనసులో ఏదో తటిల్లత మెరిసినట్టయింది. అటూ ఇటూ చూశాడు. ఎవ్వరూ కన్పించలేదు.

    పెళ్ళి చూపులంటేనే కోపంగా వుంది. ఈ అనురాధ తన మేనమామకు పుట్టడమెందుకు? పుట్టింది పో... తననే భర్తగా అనుకోవడమెందుకు? ఖర్మ కాకపోతే...

    కోపంగా తల దించుకుని కూర్చున్న కొడుకుని మందలించింది అన్నపూర్ణ.

    "కాస్త తలెత్తి చూడరా పిచ్చి సన్నాసి..."

    "అనూ! నువ్వు కూడా! బావని చిన్నప్పుడు చూసివుంటావు" అమ్మ మళ్ళీ అంటోంది.

    తనకిలాంటి ఇరకాటాన్ని కల్పించిన అనురాధని తీక్షణంగా చూద్దామని తలెత్తాడు మనోజ్.

    కళ్ళముందు వంద మెరుపులు... ముద్దబంతిపూలు వర్షంలా కురుస్తున్నాయి. తెల్ల ఓణి, నీలిరంగు లంగా, జాకెట్టూ ధరించిన అనూ... ఆకాశదీపంలా వుంది. పొద్దుటి నుంచి తన మనసు నిలవనీయని ఆ పువ్వు ఆమె పెదవులపై ఇంకా మెరుస్తూనే వుంది.

    నాగుపాము పడగమీద మణిలాగా పొడుగాటి వాలుజడలో బంగారు వన్నె ముద్దబంతి పువ్వు ఫక్కున నవ్వింది.

    "పిల్ల నచ్చినట్టేనా..?"

    అన్నపూర్ణ మాటలకు మనోజ్ మనసులో విద్యుత్తరంగాలు. పక్క గదిలోకి పారిపోయిన పాంజేబుల సవ్వడి.

    మరో నెల రోజుల వరకూ ముహూర్తం కోసం ఆగటం ఎంతో కష్టంగా వుంది మనోజ్ కి.

    'విరహము కూడా సుఖమే కదా! నిరతము చింతన మధురము గాదా' అని పాడుకుంటూ రోజులు గడిపాడు.

    పెళ్ళి తతంగమంతా ట్రాన్స్ లో వున్నట్టు ముగించాడు.

    అతి ఆసక్తిగా, ఆనందంగా ఎదురుచూసే తొలిరేయి... తెల్లచీరలో దగ్గరికొచ్చిన అనూని మాట్లాడనీయలేదు మరి...

    "ఒరేయ్... నేనురా... వదులు..." మామయ్య మాటలకు సిగ్గుపడి వదిలేశాడు.

    "మనూ! అనురాధ తల్లిలేని పిల్ల. దానికి ఏ లోటూ తెలీకుండా పెంచాను. నీతో పెళ్ళి కావాలని, నీకోసం ఎన్ని దేవుళ్ళకు మొక్కుకుందో... దానికి నోరు లేదు గానీ... ఆ మూగతనమే లేకపోతే నా తల్లి సంగీత సరస్వతి కదూ..." ఆయన గొంతు రుద్ధమయింది.

    మనోజ్ కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నది.

    "ఏమిటి మామయ్యా... మీరనేది?... అనూ...మూగదా!"

    "అవును బాబూ! నీకు తెలీదా?" ఈసారి నివ్వెరపోవడం ఆయన వంతయింది.

    "మరి నాకు ముందే ఎందుకు చెప్పలేదు?" మేనల్లుడి గొంతులో తీవ్రతకు తెల్లబోయాడాయన.

    "నేను చెప్పేది కాస్త సావధానంగా విను మనోజ్. పద్నాలుగేళ్ళ వయసప్పుడు రోగ రూపంలో గొంతుకు వెనక్కి తీసుకున్నాడు దేవుడు. అదృష్టమో... దురదృష్టమో... చెవులు మాత్రం సరిగ్గానే పనిచేస్తాయి. కమ్మని కంఠస్వరంతో ఎన్నెన్ని పాటలు పాడేది చిట్టి తల్లి! అయినా అమ్మకి అన్నీ తెలుసు... నీకు చెప్పేవుంటుందనుకున్నాను" అనునయించబోయాడు.

    "అనుకుంటే సరా! తండ్రిగా ఈ విషయాన్ని నాతో ముందుగానే చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? మూగదాన్ని నా మెడకు తగిలించి నా గొంతు కోస్తారా?" ఆగ్రహంగా అంగలు వేస్తూ వెళ్ళిపోయిన అల్లుణ్ణి ఆపలేక చతికిలపడ్డాడాయన.

    పాంజేబుల సవ్వడి తడబడుతోంది. ఇప్పుడు ఆ సవ్వడి కర్ణకఠోరంగా అన్పిస్తుంటే వినలేక గేటు దాటాడు మనోజ్.

    ఇంటికి వచ్చేశాడు. తల్లితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

    కిటికీలోంచి బయటికి చూస్తే పుచ్చపువ్వు లాంటి వెన్నెల. మల్లెలు ఒళ్ళు విరుచుకుంటున్నాయి. మనసు మండిపోతోంది.

    ఎంత మోసం! అనురాధ మాత్రం ఎంత నంగనాచి... తాను మూగదాన్నని సైగలతోనైనా చెప్పొచ్చుగదా! దెయ్యంలా మిడిగుడ్లేకుని చూడకపోతే... పిడికిలి బిగించి గోడకు కొట్టాడు... షిట్!

    రిజర్వేషన్ కాన్సిల్ చేసుకుని మర్నాడే వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్న కొడుక్కి ఎన్నో విధాల నచ్చజెప్పింది అన్నపూర్ణ.

    "అనూ... చాలా మంచిపిల్లరా! నువ్వంటే ఎంత ప్రేమో! ఎన్ని జన్మలెత్తినా అలాంటి భార్య దొరకదురా.. పెళ్ళికి ముందు అది మూగదని తెలిస్తే... ఈ పెళ్ళికి ఒప్పుకోవని నేనే అసలు విషయాన్ని దాచాను.. దానికంత శిక్ష వేయకురా... కావాలంటే నాకు వెయ్యి ఏ శిక్షయినా.." కన్నీళ్ళతో ప్రాధేయపడిందా తల్లి.

    "అమ్మా! అయ్యిందేదో అయ్యింది. ఆ మూగ మొద్దును అంగీకరించలేను. ఇంక నన్ను మాటలతో వేధించకు" అంటూ గది తలుపులేసుకున్న కొడుకు ప్రవర్తనకు కుమిలిపోయింది అన్నపూర్ణ.

    తెల్లవారుఝామున జీతగాడు తెచ్చిన వార్తకు తల్లీ కొడుకులిద్దరూ కొయ్యబారిపోయారు.

    అనురాధ నిద్రమాత్రలు మింగేసింది. ఆస్పత్రిలో చావుబ్రతుకుల మధ్య వుంది.

    ఎర్రని ముఖమల్ గుడ్డలో చుట్టిన నాలుగైదు డైరీలు, ఓ లేఖ ప్యాకెట్ గా అతని చేతికొచ్చాయి.

    ఆ వార్త ఇచ్చిన జీతగాడు కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు.

    చిరాకుగా ఆ ప్యాకింగు విప్పాడు మనోజ్. ఏం రాసిందో మహాతల్లి. ఆత్మకథేమో! మూగది కదూ. రాతలెక్కువ.

    ఆలోచనల్ని విదిలించి లేఖలోని అక్షరాలు చదవసాగాడు గుండ్రని అక్షరాలు అందంగా... పొందికగా... అనూలా...

    నా బావా!

    ధైర్యంగా ఇలా అన్నందుకు క్షమించు... నీ హృదయంలో నాకు చోటులేదని తెల్సినా ఇలా అంటున్నానంటే చిన్నతనం నుంచీ నువ్వు నావాడివనే భావనతో పెరిగినందుకే. నా వూపిరి నీ పేరుగా ఆరాధించాను. జీవితం మూగబోయినా మనసు వీణమీద నీ పేరే పాడుకుంటూ, నీ భార్యనైనందుకు నా అంత అదృష్టవంతురాలు లేదని ఆనందించాను. నా మూగతనం ఇంత శాపాన్ని తెచ్చిపెట్టింది. నీకు తెలుసనుకున్నాను గానీ, నిన్ను మోసం చేయాలనుకోలేదు... ప్రేమించటం కన్నా ప్రేమించబడటంలోనే ఆనందం, అదృష్టం వుంది. నీకోసం పరచిన నా ఊహల, ఊసుల పల్లకీలు ఈ డైరీలు. నీకు నా చివరి కానుకలివి.

                    నీదాన్ని కాలేని
                       - అనూ

    ఉత్తరం తర్వాత ఆ డైరీల్లోని పేజీలు తిరగేస్తుంటే అతని మనసు పిండినట్టవుతోంది. అనూ మనసులో బాల్యం నుంచి తన కోసం అల్లుకున్న ప్రేమలతలు ఎలా చిగురించి పూలు పూచి ఫలించాయో... ఎంత పిచ్చి ప్రేమను గుడిలా చేసి తన రూపాన్ని అందులో ప్రతిష్ఠించిందో...

    ఇంత ప్రేమకు తాను అర్హుడా! కేవలం పైపై మెరుగుల కోసం, మూగ మువ్వలాంటి అనూని కాలదన్ని వెళ్ళిపోతున్న తనకి ఈ డైరీలు నిజమైన చూపును ప్రసాదించాయి. ఆమెవి రాలిన స్వప్నాలా?... కావు...కావటానికి వీల్లేదు. ఇతరుల చేత గాఢంగా ప్రేమించబడటానికి ఎంత అదృష్టం ఉండాలి. అవును తాను నిజంగానే అదృష్టవంతుడు. హాస్పిటల్ కి పరుగెత్తుతున్న కొడుకుకేసి విభ్రమంగా చూసింది తల్లి. 

    ఆ రాత్రి... మరోసారి కలలరాత్రిలా వచ్చింది.

    తెల్లచీరలో మల్లెపూవులా కన్పిస్తున్న అనూని చూస్తుంటే మనోజ్ కి గర్వంగా వుంది. 'తనకోసం ప్రాణాలైనా ఇచ్చే భార్య...!' నిజంగా అందరికీ లభించే అదృష్టం కాదు.

    వికసిస్తున్న ప్రేమసుమాల పరిమళాలు గది అంతా వ్యాపిస్తున్నాయి.

    ప్రేమగా ఆమె ముంగురులు సవరిస్తోంటే చిన్నగా నవ్వి పాల గ్లాసు అందించింది. ఆమె చేయి అందుకొని మంచం మీద కూర్చోబెట్టాడు. పాలగ్లాసు టేబుల్ పై వుంచి... "నన్ను క్షమించు అనూ!" అని చెప్పబోతున్న అతని పెదవులపై చేతిని వుంచి మృదువుగా ఆపి కళ్ళతో వద్దని వారించింది.

    ఆ చేతిని అలాగే పట్టుకొని ముద్దు పెట్టుకున్నాడు. గాజుల గలగలలు ఆమె మనోవీణలా రాగాలు పలికాయి. కాళ్ళ పాంజేబులు వలపు సందడులు చేశాయి.

    కిటికీలోంచి తొంగి చూస్తున్న ముద్దబంతి పువ్వు మీద వెన్నెల కిరణాలు వెల్లువలా కమ్ముకున్నాయి. తన్మయంగా ఆ పువ్వు వెన్నెల అందాల్లో మొహం దాచుకొని సరికొత్త వేణుగానాన్ని వినిపించింది. దూరంగా ఎక్కడో ఘంటసాల గళం విన్పిస్తోంది సుతిమెత్తగా!

    "ముద్దబంతి పూవులో మూగ కళ్ళ ఊసులో
    ఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులే"