Facebook Twitter
నడక

నడక

- డా. సి భవానీదేవి

సులభకి ఇప్పటికీ నమ్మబుద్ధి కావడంలేదు. టైపు యాంత్రికంగా చేస్తున్నదికానీ మనసు ఆ పని మీద లగ్నం కావటంలేదు. మాటిమాటికీ కుమార్ నవ్వు మొహం కళ్ళ ముందు కదులుతోంది.

    తీక్షణంగా ఉండే ఆ చూపు, నవ్వే పెదవులు, అందమైన మీసకట్టు ఒక్కక్షణం ఉలిక్కిపడింది సులభ. ఏమిటివ్వాళ తన మనసు ఇలా వశం తప్పుతున్నది!

    ఒక పురుషుడి పట్ల ఆకర్షణ పెంచుకోటానికి సులభ పెళ్ళిగాని కన్య కాదు. ఇద్దరు బిడ్డల తల్లి! భర్తను కోల్పోయిన అభాగిని! కళ్యాణ్ సడన్ గా హార్ట్ ఎటాక్ తో మరణించటం వల్ల అతను పనిచేసే బ్యాంక్ లోనే ఆమెకి ఉద్యోగమిచ్చారు. సులభను చూస్తే ఇద్దరు పిల్లల తల్లిలా అనిపించదు. పచ్చగా, సన్నగా, హుందాగా తీర్చినట్లుండే సులభ వ్యక్తిత్వాన్ని బ్యాంక్ స్టాఫ్ అంతా గౌరవిస్తారు. వాళ్ళంతా కళ్యాణ్ స్నేహితులే! అందుకే ఆమెకే సహాయం కావాలన్నా చేస్తారు.

    ఆ ముందురోజు సాయంత్రం ఇంటికి వచ్చిన కుమార్ మాటలు ఆమె హృదయంలో మళ్ళీ మళ్ళీ అలజడిని రేకెత్తిస్తున్నాయి. ఆ మాటలు ఆమెను అల్లకల్లోలం చేసే సమస్యల వలయంలోకి నెడుతున్నాయోమో అన్నంతగా డిస్ట్రబ్ అవుతోంది సులభ.

    "నువ్వొప్పుకుంటే నిన్ను పెళ్ళిచేసుకుంటాను సులభా!" ఆప్యాయంగా అడిగాడు కుమార్.

    ఆ గొంతులో జాలి లేదు. అనురాగం, అభిమానం ధ్వనిస్తున్నాయి.

    'నన్నా!' దిగ్బ్రాంతికి లోనయింది సులభ.

    ఇతనిలో తనపట్ల ఇలాంటి ఉద్దేశ్యం ఉందా! నమ్మలేక పోతోందామె. ఎందుకంటే కుమార్ కళ్యాణ్ కి ప్రాణ స్నేహితుడు. అటువంటి వ్యక్తి ఇప్పుడిలా అడగటం ఆమెను అప్రతిభురాల్ని చేస్తోంది. 

    "సులభా! నేనీ నిర్ణయం తీసుకోవటానికి ముందు బాగా ఆలోచించాను. ఆ కారణాలన్నీ నీతో చెప్పకుండా దాచలేను. మనం చాలాకాలంగా కుటుంబ స్నేహితులం. నా గురించి నీకూ, నీ గురించి నాకూ పూర్తిగా తెలుసు. నా భార్య చనిపోయేనాటికి వికాస్ కి తొమ్మిదేళ్ళే గదా! ఇంకా వయసులోనే ఉన్నాననీ, నన్ను మళ్ళీ పెళ్ళిచేసుకోమని అంతా వత్తిడి చేశారు. నీకు తెలుసో లేదో గానీ కళ్యాణ్ కూడా ఒకటి రెండు సంబంధాల గురించి చెప్పాడు. నేను మళ్ళీ పెళ్ళి చేసుకుంటానన్న వార్త వింటూనే వికాస్ గదిలో తలుపులు బిడాయించుకుని మూడు రోజులు నిద్రాహారాలు మాని ఏడుస్తూ కూర్చున్నాడు. నా కొడుకును బయటికి రప్పించడానికి నేను వాడికి చాలా వాగ్దానాలను చేయాల్సి వచ్చింది. తర్వాత కాలంలో నాకు రెండో పెళ్ళి ప్రస్తావన ఎవరు తెచ్చినా, వికాస్ తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. తల్లి లేని కొడుకన్న మమకారంతో వాడికి అవసరానికి మించిన స్వేచ్చ ఇచ్చాను. నాకు డబ్బుకు లోటు లేదు. వాడిని వ్యాపకం కోసం బిజినెస్ లో పెడదామన్నా, ఉద్యోగంలో పెడదామన్నా వినే స్థితి దాటిపోయాడు. సరైన పెంపకం లేక, తల్లి ప్రేమ కరువై ఇలా చెడు స్నేహాలకు అలవాటుపడ్డాడు..."

    "మరి ఇప్పుడుమాత్రం నన్ను చేసుకుంటే..." మధ్యలోనే అడిగింది సులభ సందేహం వెలిబుచ్చుతూ.

    ఇప్పుడు వాడికి ఇల్లుపట్టడం లేదు. ఆమధ్య నేను వూళ్ళో లేనప్పుడు వరసగా పదిరోజులు ఇంటికే రాలేదుట. అడిగితే 'నాయిష్టం' అన్నాడు. 'నా జీవితం నాది... వాడి జీవితం వాడి'దని నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు.

    అతని గొంతులో కొడుకు మీద కోపంకన్నా తనపట్ల వాడికి ప్రేమ లేదన్న బాధ ధ్వనిస్తోంది.

    "మరి ఈ పెళ్ళి వల్ల... వికాస్..." సులభ ఆర్దోక్తిగా ఆగింది.

    "వికాస్ శ్రేయస్సు కోరి... నాకు మనశ్శాంతి కోసమే ఈ పెళ్ళి... నా భార్య మరణించి ఇంత కాలమైనా నేను పెళ్ళి చేసుకోవాలని మనస్పూర్తిగా అనుకోలేదు. అలాగని నీ పరిస్థితిని అడ్వాంటేజ్ గా తీసుకున్నానని మాత్రం భావించవద్దు. నీకు అభ్యంతరాలేవీ లేకపోతేనే... బాగా ఆలోచించు... నీ సహనం, పిల్లల పట్ల నువ్వు చూపించే ప్రేమ... వికాస్ లో నేను కోరుకున్న మార్పును తీసుకొస్తాయనే నా నమ్మకం! నువ్వే ఒక నిర్ణయం తీసుకో! పెళ్ళి అయినాక నువ్వు ఉద్యోగం మానేస్తే నాకభ్యంతరం లేదు. ఆర్ధికంగా అయితే ఆ అవసరం ఉండదు. ఆ ఉద్యోగం వల్ల కళ్యాణ్ జ్ఞాపకాలు నిన్ను బాధిస్తాయనే ఇలా అంటున్నాను. లేదా ముందు లాంగ్ లీవ్ అప్లయ్ చేసి తర్వాత ఆలోచించి నిర్ణయం తీసుకో!" అంటూ వెళ్ళిపోయాడు కళ్యాణ్.

    అతని మాటలకు సులభ మనస్సు ఉక్కిరి బిక్కిరయింది. ఎటూ నిర్ణయించుకోలేకపోతోంది. తనను గురించి లోకం ఏమనుకుంటుంది? మరుక్షణంలో తల విదిలించి ఆ ఆలోచనను దూరంగా నెట్టివేసింది.

    కళ్యాణ్ కట్నకానుకల కోసం మానసికంగా హింసించాడేగానీ భర్తగా మమతానురాగాలను ఏనాడూ పంచలేదు. అతని ఉమ్మడి కుటుంబంలో.... హక్కుల్ని మర్చిపోయి బాధ్యతల్ని మౌనంగా భరించింది తాను. అయినా ఆ విషయాన్ని కళ్యాణ్ ఏనాడూ గుర్తించలేదు.

    పెళ్ళి చేయగానే పుట్టింటివాళ్ళు తనను పరాయిదాన్ని చేశారు. భర్త అంతగా హింసించినా పట్టించుకోని సమాజం తన రెండో పెళ్ళి గురించి పట్టించుకున్నా తను మాత్రం కేర్ చేయదు... అంతే.... ఆమె ఆలోచనలకు ఒక ఆలంబన దొరికింది.

    ఇద్దరు పిల్లల్ని దగ్గరకు పిలిచింది.

    "ఇంక మీ ఇద్దరికీ ఏలోటూ రానివ్వను" ఇద్దర్నీ గాఢంగా హృదయానికి హత్తుకొంది.

    అమ్మ ఎందుకీ వేళ వింతగా ప్రవర్తిస్తున్నదో అర్ధంకాని పదిహేనేళ్ళ కొడుకు అవినాష్, పదమూడేళ్ళ కూతురు రేఖ చూస్తుండిపోయారు తల్లికేసి. తల్లి అంతగా ఆనందపడటానికి కారణం మరో పదిహేను రోజులకు వాళ్లకు అర్ధమయింది.

    సులభ కుమార్ ని యాదగిరిగుట్టలో పెళ్ళి చేసుకుందన్న వార్త బంధుజనాలలో కార్చిచ్చులా వ్యాపించింది. విన్న వాళ్లంతా దిగ్భ్రమ చెందారు. ఆమె తన బ్యాంక్ ఉద్యోగానికి రిజైన్ చేసిందన్న వార్త చర్చనీయాంశంగా మారింది. స్వయానా సులభ తండ్రే ఈ వివాహాన్ని వ్యతిరేకించాడు. 

    భ్రష్టురాలా! మన వంశంలో ఇంటా వంటా లేని అప్రాచ్యపు పనిచేశావు. నువ్వు చచ్చావనుకొంటాను. ఇంక ఈ ఇంటి గడప తొక్కొద్దు" శాసించాడు గడపలోనే.

    కళ్ళొత్తుకుంటూ నిలబడిపోయిన తల్లి మనసు చేసిన పనిని వ్యతిరేకించకపోయినా కూతుర్ని మాత్రం ఆదరించలేకపోయింది... సంఘం, భర్త అంటే వున్న భయం వల్ల.

    "కనీసం సంవత్సరీకం అయ్యేదాకన్నా ఆగాల్సింది" తమ్ముడు లోలోపలే గొణుక్కుంటుంటే వినలేక బరువెక్కిన హృదయంతో పుట్టింటికి శాశ్వతంగా వీడ్కొలిచ్చి వచ్చేసింది సులభ.

    ఒక పదిహేను రోజుల్లోనే సులభ ఆర్ధిక పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. అద్దె ఇల్లు ఖాళీచేసి కుమార్ ఇంటికి పిల్లలతో సహా మారిపోయింది.

    పెద్దఇల్లు... ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ఒక గది. వంటమనిషి వంటచేసి డైనింగ్ టేబుల్ మీద సర్దేసి వెళ్ళిపోతుంది. పనిమనిషి, డ్రైవర్... ఇంటి ముందు ఖాళీస్థలంలో రకరకాల పూలమొక్కలు, లాన్ ఉన్నాయి. పని చాలా తగ్గిపోయి చాలా విశ్రాంతిగా హాయిగా అనిపిస్తోంది సులభకు. ఇరుకుగదిలోంచి ,విశాల మైదానంలోకి వచ్చినట్లు అన్పిస్తున్నది.

    కుమార్ కొడుకు వికాస్ కి మాత్రం తండ్రి చేసిన పని అసలు నచ్చలేదని అతని వైఖరే చెబుతుంది. గ్రాడ్యుయేట్ అయినా గమ్యం నిర్ణయించుకోలేని అతడు సులభనుగానీ, పిల్లల్నిగానీ పలకరించలేదు. సులభే పలకరిస్తే ముభావంగా ఊ...ఆఁ లతో సరిపెట్టి వెళ్ళిపోయి ఎక్కువ టైము బయటే గడుపుతున్నాడు.

    వికాస్ పద్ధతి నచ్చకపోయినా కాలక్రమంలో తనే తెల్సుకుంటాడని వూరుకున్నాడు కుమార్. సులభకు కూడా అలాగే నచ్చజెప్పాడు.

    క్రమక్రమంగా వికాస్ అవినాష్, రేఖలతో మాట కలపడం మొదలుపెట్టాడు. ప్రత్యేకించి రేఖను చూస్తుంటే అతనికి కొత్తప్రపంచం పరిచయమైనట్లుగా  అన్పిస్తుంది. ఆ అమ్మాయి మాత్రం అతనికి పరాయిగా అనిపించటం లేదు. సులభను తల్లి స్థానంలో చూడలేకపోతున్నా రేఖ అతనికి ఓ ఆకర్షణగా మారింది. ఫలితంగా వికాస్ కొంత టైమ్ ఇంటిపట్టునే ఉండటం మొదలుపెట్టాడు. ఈ మార్పు సులభ, కుమార్ ల భయాలను తగ్గిస్తూ కొత్త ఆశల్ని కల్పిస్తున్నది.

    కాలం రెక్కలు కట్టుకొని ఎగురుతున్నది. రేఖలో కాలం తెచ్చిన మార్పులు వింత అందాల్ని ఒలకబోస్తున్నాయి. రేఖ పట్ల వికాస్ ప్రవర్తనలో కూడా కొత్తదనం కనిపిస్తోంది. అతని చూపుల్లో పదును పెరిగింది. ఆ చూపులు రేఖ శరీరాన్ని అణువణువూ తడిమి చూస్తున్నాయి.

    తల్లి ప్రేమ, సోదరి ప్రేమ తెలియని వికాస్ మనసులో స్త్రీ పట్ల కాంక్షాదృష్టి మాత్రమే వుండటం రేఖకి ఇబ్బందిగా ఉంది.

    రేఖకి విషయం అర్ధమవుతూనే భయవిహ్వల అయింది. వికాస్ ఏకారణం లేకుండా తన భుజంపై చేయి వేయటం రేఖకు నచ్చటం లేదు. అతనికెలా చెప్పాలో కూడా తెలియటం లేదు.

    రేఖ పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించినా, కొత్త విషయాలేవైనా ఆ అమ్మాయికి నేర్పాల్సి వచ్చినా రకరకాల వంకలతో వికాస్ తరచుగా తాకటం భయం కల్గిస్తోంది. రేఖకి వికాస్ ప్రవర్తనను ఎలా అభ్యంతరపెట్టాలో తెలీడం లేదు. అతను తకుతున్నప్పుడు తన శరీరంలో విచిత్ర ప్రకంపనలు ఉతపన్నమౌతూ తోచనీయకుండా చేస్తున్నాయి. ఇలా ఎందుకు జరుగుతోందో రేఖకి తెలీడంలేదు. ఏంచేయాలో అసలు అర్ధంకావడం లేదు.

    వికాస్ కి రేఖ ఇబ్బందిగా ఫీలవడం తెలుస్తూనే ఉంది. అయినా తెలీనట్లే ప్రవర్తిస్తున్నాడు. రేఖ అభ్యంతరపెట్టడానికి కూడా వీలులేని విధంగా ప్రవర్తిస్తున్నాడు. అతన్ని ఎలా వారించాలో, అలా నిశ్శబ్దంగా ఉండొచ్చో లేదో కూడా రేఖకు తెలీడంలేదు. తల్లి ఈ రెండో పెళ్ళి చేసుకోవటం ద్వారా తండ్రి స్థానంలో కుమార్ అందిస్తున్న మెరుగైన ఆర్ధిక సౌకర్యాలు మనసుకు నచ్చుతున్నాయి. కుమార్ అందించే తండ్రి ప్రేమకు ఆనందంగానే వుంది కానీ వికాస్ ప్రవర్తన మాత్రం రేఖకో వింత సమస్యగా మారింది.

    తననేదో వంకతో నిమురుతున్న వికాస్ చేతుల్ని చాలాసార్లు విసిరికొట్టాలనిపిస్తుంది. కానీ అమ్మ ఏమన్నా అంటుందేమోననీ, కుమార్ లో ఏ విపరీతార్ధాలు చోటు చేసుకుంటాయేమోనన్న సంకోచంతో రేఖ భయపడుతోంది. ఆ అమ్మాయి మౌనం వికాస్ ని మరింత రెచ్చగొడుతోంది. వికసిస్తున్న ఆ పసి యవ్వన రేఖలు అతనిలో మృగాన్ని నిద్రలేపుతున్నాయి. స్నేహితులతో కలిసి దొంగతనంగా చూసిన బ్లూఫిల్మ్ లు కళ్ళ ముందు వికృతంగా నాట్యమాడుతున్నాయి.

    వికాస్ స్పర్శ ఏదో ప్రమాదాన్ని సూచిస్తోంది. అకస్మాత్తుగా ఇద్దరి కళ్ళు ఎప్పుడైనా కలిసినప్పుడు వికాస్ కళ్ళల్లో కనిపించే కోరికల జీరలు చెప్పకుండానే తెలుస్తున్నాయి.

    సినిమాల్లో విలన్ హీరోయిన్ కేసి ఇలాగే చూడటం గుర్తొచ్చిన రేఖ భయంతో వణికిపోతున్నది.

    మెల్లమెల్లగా వాస్తవంకేసి వెలుగు ప్రసరిస్తున్న వికాస్ నిజస్వరూపం బయటపడే రోజు వచ్చేసింది.

    ఆ సాయంత్రం మంచి సినిమా వుందని భార్య, పిల్లలతో సినిమాకు బయలుదేరాడు కుమార్. ఎప్పుడూ రానని తిరస్కరించే వికాస్ మాట్లాడకుండా బయలుదేరటం ఆశ్చర్యమే!

    సినిమాహాల్లో వికాస్ అన్నా, చెల్లెళ్ళ మధ్య కావాలని కూర్చున్నాడు. అవినాష్ పక్కన కుమార్, సులభలు కూర్చున్నారు. సినిమా జరుగుతున్నప్పుడు వికాస్ ప్రవర్తన రేఖకు దుఃఖాన్నీ, కోపాన్నీ కలిగించింది. పారిపోయే మార్గం కూడా లేదు. వికాస్ కుసంస్కారం పడగవిప్పి బుసలు కొట్టిన ఆక్షణాల నుంచి తనను ఎలా కాపాడుకోవాలో తెలీక రేఖ కుంగిపోయింది.

    "రేఖ! నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసా!" చెవిలో గుసగుసలాడాడు వికాస్!

    అతని చేయి రేఖ చేతిని నిమురుతోంది.

    రేఖ తలదించుకొనే ఉంది. రెండు సీట్లకు అవతల కూర్చున్న తల్లికి వాళ్ల మాటలేవీ వినపడవని తెలుసు. అందరి దృష్టీ పూర్తిగా సినిమా మీద నిమగ్నమై ఉంది. తెరపై బొమ్మలు అలుక్కుపోతున్నట్లున్నాయి. రేఖ కళ్ళనిండా నీళ్ళు... తన పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో తెలీడం లేదు.

    సినిమాలో విలన్ హీరోయిన్ ని మానభంగం చేయటానికి విశ్వప్రయత్నం చేస్తుంటే దర్శకుడు భీభత్స రసాన్ని యథాశక్తి చిత్రీకరించాడు. హీరోయిన్ కేకలు రేఖ గళంలో కొట్టుకుంటున్నాయి.

    తన వంటిమీద పాకే వికాస్ చేతుల్ని నెట్టేయటానికి ఆమె చేసే ప్రయత్నం విఫలమౌతున్నది. ఇంటర్వెల్ కాబోలు... హఠాత్తుగా లైట్లు వెలిగాయి. అతను ఉలిక్కిపడి చేతులు వెనక్కి లాగేసుకున్నాడు... నిటారుగా అయ్యాడు. అప్పుడు ఎవరైనా అతడ్ని చూస్తే అలాంటివాడని నమ్మరు. తన తల్లి కూడా నమ్మదు.

    చాటుగా కళ్ళు తుడుచుకుని కొంత రిలీఫ్ ఫీలయింది. ఇంటికొచ్చేదాకా రేఖ ఆ హింసను మానసికంగా, శారీరకంగా అనుభవిస్తూనే ఉంది.

    వికాస్ తనకి అన్నస్థానంలో ఉన్నాడు. ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు? అవినాష్ చిన్నన్న అయితే వికాస్ పెద్దన్నయ్య కాలేడా! ఎవ్వరూ లేనప్పుడు అసహజంగా, కాముకంగా వుండే అతని చేష్టలు ఇతరులముందు కృత్రికమైన రంగుల్ని పులుముకొని సోదర ప్రేమగా కృతకంగా వ్యక్తంచేయటం చూస్తే రేఖకి అసహ్యంగా ఉంది.

    ఈ మధ్య ఏ చప్పుడైనా బెదిరిపోతోంది. తెలీని బెంగగా ఉంది. రాత్రిళ్లు నిద్రపట్టడం లేదు. వికాస్ గొంతు వినబడితేనే ఎలర్జీగా ఉంది. ఎక్కడికైనా వెళ్ళి దాక్కోవాలనిపిస్తుంది.


            * * *


    రోజూ వికాస్ ఇంటికి వచ్చే టైము దాటిపోయింది. ఆ వేళకు ఆ ఇంటికి వచ్చిన వార్తకు సులభకు కాళ్లూ చేతులూ ఆడటం లేదు. కుమార్ కుప్పకూలి పోయాడు. స్కూటర్ మీద వస్తున్న వికాస్ కి యాక్సిడెంటయింది. కాళ్లు విరిగిపోయాయి. ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు.

    "కష్టం వచ్చినప్పుడే మనిషి ఆత్మస్థైర్యం పెంచుకోవాలి. మీరలా బెంబేలు పడితే ఎలా? పదండి హాస్పిటల్ కి పోదాం! వికాస్ ఏం బాధపడుతున్నాడో!" భర్తకి ధైర్యం చెప్పి సులభ తన మనసును కూడదీసుకుంది. దడదడలాడుతూ హాస్పిటల్ కు బయలుదేరారు అంతా.

    అతను వికాసా! చూడటానికే రేఖకి భయమేసింది. ఒళ్లంతా రక్తసిక్తంగా గాయాలతో కదలలేకుండా పడివున్నాడు. కళ్ళు మూసుకొని మూలుగుతున్నాడు. రేఖ ఇంక చూడలేక తల తిప్పుకుంది.

    డాక్టర్లు...నర్సులు...స్ట్రెచర్స్... అంతా హడావుడి. నాలుగురోజులు వళ్లు తెలీకుండా వున్నాడు వికాస్.

    ఐదవరోజు వికాస్ కి స్పృహ తెలుస్తోంది. మెల్లగా మాటలు వినిపిస్తున్నాయి. కళ్ళు మాత్రం తెరిపిళ్ళు పడటం లేదు. ఆ గొంతు... రేఖది.

    "ప్లీజ్...మమ్మీ! పెద్దన్నయ్యకి ఏంకాకూడదు. నాకు భయమేస్తుంది" రేఖ ఏడుస్తోంది. ఆ పసి హృదయంలో వికాస్ తనపట్ల ప్రవర్తించిన క్రూరత్వం గురించిన పగ ఇసుమంతైనా లేదు... వికాస్ కోలుకోవాలనీ, అతనికేం కాకూడదనీ నిర్మలమైన మనసుతో కోరుకుంటోంది.

    వళ్లంతా కట్లతో మూలిగే వికాస్ ని చూడలేకపోతోంది రేఖ. అవినాష్ పరిస్థితి కూడా దాదాపు అంతే! ఆ నాలుగురోజులూ అతని బెడ్ దగ్గర్నుంచి వాళ్ళు కదలలేదని వాళ్ళ మాటల్ని బట్టి వికాస్ కి అర్ధమయింది. చిన్నగా మూలిగాడు...

    ఆదుర్దాగా రేఖ, సులభలు వికాస్ బెడ్ దగ్గరికి వచ్చారు.

    "వికాస్..." సులభ పిలిచింది.

    "అన్నయ్యా..." రేఖ ఏడుస్తోంది.

    వీళ్ళు తననెందుకు ఇంత ప్రేమిస్తున్నారు? తను చచ్చిపోతే వాళ్ళకు ఎన్నో రకాలుగా లాభం! ఆస్తి అంతా వాళ్ళ స్వంతం అయ్యేదికదా! ఈ ప్రేమకు... ఇంత ప్రేమకు... తను అర్హుడు కాడు. రేఖను తను ఎంతగా బాధపెట్టాడు? ఆప్యాయంగా చూసుకోవాల్సిన చెల్లెల్ని వికృతచేష్టలతో హింసించాడు. తనని చెడు మార్గంలో నడిపించిన స్నేహితులు తను ప్రాణాపాయ స్థితిలో వుంటే ఒక్కరూ బెడ్ పక్కన లేరే..?

    కుటుంబ సంబంధాలలో ప్రేమకింత విలువుందా! ఆ విలువే తనని ఇవాళ కాపాడుతోందా! రేఖనలా హింసించినందుకు తనకీ శాస్తి జరగాల్సిందే! కాళ్లు కదలటం లేదు... బహుశా విరిగిపోయి ఉంటాయి. అంతా బ్యాండేజ్ వేసేశారు... తనకీ శిక్ష కావాల్సిందే! అతని చెక్కిళ్ళు కన్నీటితో తడిసిపోతున్నాయి.  

    వికాస్ కన్నీటిని తుడిచింది సులభ. "ఎలా వుంది నాన్నా!" కుమార్ కొడుకుని పలకరించాడు. వికాస్ చేతిపై ఓదార్పుగా చేతిని వుంచింది రేఖ. ఆ స్పర్శ ఇప్పుడు అమ్మ మనసులా చల్లగా వుంది.

    "బాధపడకు బాబూ! నీకేం కాలేదు. కొద్దిరోజుల విశ్రాంతి తర్వాత మామూలుగా నడుస్తావు" సులభ అతని తలపై చేయివేసి నిమిరింది.

    "అవునన్నయ్యా! నీకేం కాలేదు. నిజం" అమాయకంగా అంటున్న రేఖ చేయి పట్టుకొని "నన్ను క్షమించు రేఖా! నేను ఇలా మీచేత సేవలు చేయించుకుంటూ... అవిటివాడిలా" అతని నోటి మీద మృదువుగా చేయి వుంచి వారించింది రేఖ.

    "అలా అనకు అన్నయ్యా! ఒక నెల రోజులు ఓపికపడితే... నీ నడక నీదే" రేఖ మాటలకు బలహీనంగా నవ్వాడు వికాస్.

    "ఈ నడక నాది కాదమ్మా! ఇకనుంచి మీదే!" వికాస్ గొంతు నిండా చెల్లెలి పట్ల కొండంత అభిమానం.

    "మంచిది బాబూ! నువ్వింక విశ్రాంతి తీసుకో!" దుప్పటి సరిచేసింది సులభ.

    "ఇంక పడుకో అన్నయ్యా" అంటూ అవినాష్ వచ్చి వికాస్ బెడ్ దగ్గర స్టూల్ పై కూర్చుని ప్రేమగా చేయి పట్టుకున్నాడు. ఆ స్పర్శలో స్నేహం ఉంది.

    వికాస్ కిప్పుడు నిజంగానే ప్రశాంతంగా ఉంది. సులభ అరచేతిని కళ్ళపై ఉంచుకుని కళ్ళు మూసుకున్నాడు. వెన్నెలంత చల్లగా వుంది అతని మనస్సు. ఆ మనస్సులో జీవితం పట్ల ఏవేవో కొత్త ఆశలు ఊపిరిపోసుకుంటున్నాయి.