Facebook Twitter
వెలుగులోకి

 వెలుగులోకి

- డా.సి. భవానీదేవి

"శరత్  చాలా మంచివాడు, యోగ్యుడు, మన గీతను ఆఫీసులో చాలా రోజులుగా చూస్తున్నాడుట. చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు".

    అరుణ పిన్ని మాటలు వింటూనే అందరి మొహాలు వెలవెలా బోయినై.

    ముందుగా పెద్దకోడలే తేరుకుంది. "ఇదెలా సాధ్యం! గీత స్వాతంత్ర్య భావాలున్న పిల్ల. అంత సాంప్రదాయకమైన ఇంట్లో ఇమడగలదా" ఆవిడ గొంతులో అయిష్టత స్పష్టంగా వినిపిస్తోంది.

    అరుణ పిన్ని ఇంకేదో చెప్పబోతున్నది. మళ్ళీ పెద్దకోడలే అంది.

    "ఇంతగా చెప్పటానికి ఆ పెళ్ళికొడుకులో ప్రత్యేకత ఏమిటో నాకర్ధంకావటం లేదు". పెద్దకోడలు మాటలు పూర్తవుతూనే గీత తల్లి జోక్యం చేసుకుంది.

    "అయినా ఆఫీసర్ అంటే సరిపోయిందా! ఆఫీసర్లని చేసుకున్న వాళ్ళు ఏం సుఖపడుతున్నారు. మంచా... చెడా! ఎప్పుడూ ఫైళ్ళూ. ఇన్ స్పెక్షన్లూ, బాధ్యతలూ... మా మేనత్త మనవరాలి మొగుడూ ఆఫీసరే! రోజూ రాత్రి పదకొండుగంటల దాకా ఇంటికే రాడు." తల్లి తనవంతు కర్తవ్యాన్ని తృప్తిగా నిర్వర్తించింది.

    "మునుపటిలా ఈ రోజుల్లో ఆఫీసర్ హోదాకి పెద్దగా గౌరవం లేదు. జీతాలు కూడా బిజినెస్ తో పోలిస్తే తక్కువే! దానికొచ్చే జీతం మీద ఆధారపడటం అతనికీ తప్పదు". గీత పెద్దన్నయ్య, ఆ ఇంటి పెద్దకొడుకు, తన జీవితానుభావాన్ని జోడించాడు.

    "పోయిన మంగళవారం అనుకుంటూ... అతను బార్ లోంచి బయటకు వస్తుంటే చూశాను". గీత చిన్నన్న, ఆ ఇంటి చిన్నకొడుకు, సాక్ష్యాలను కూడా వివరించాడు.

    తండ్రి కూడా ఏదో చెప్పబోతున్నట్లు గమనించింది గీత.

    "వాళ్ళ వంశం అంతా నాకు తెల్సు. వాళ్ళ తాత పుండరీకాక్షయ్య ఎప్పుడూ ఈ లావు కర్రతో భార్యని చితకబాదుతుండేవాడు". మూలనున్న కర్ర తెచ్చి మరీ చూపించాడాయన.

    బల్లమీద పుస్తకాలు సర్డుతున్న చెల్లెలు ఓసారి వెనక్కి తిరిగిచూసింది కర్రకేసి.

    "అదేంటి నాన్నా!  స్మపాదిస్తున్న భార్యని ఎవరైనా కొట్టుకుంటారేమిటి? అయినా మా ఫ్రెండ్ కి వాళ్ళు చుట్టాలేట. ఎమ్.ఏ. ఒక పేపర్ పూర్తికాలేదుట" గబగబ చెప్పేసి విసవిసా వెళ్ళిపోయింది చెల్లాయి.

    ఇంక అరుణ పిన్ని ఏం మాట్లాడుతుంది పాపం! ఆవిడకి గీత అంటే వల్లమాలిన అభిమానం. గీత పనిచేసే ఆఫీసులో ఆఫీసర్ అయిన శరత్ ఆవిడకు దూరపు బంధువు అవడంవల్ల అతని కోరిక మేరకు ఎలాగైనా వాళ్ళిద్దరినీ ఒ యింటివాళ్ళని చేయాలని తాపత్రయపడుతున్నది.

    శాయశక్తులా ప్రయత్నించి మొత్తానికి శరత్ తల్లితో సహా ఓసారి గీత వాళ్ళింటికి రావడానికి గీత తండ్రిని ఒప్పించి వెళ్ళింది అరుణ పిన్ని.

    గీత మనసు మనసులో లేదు. "ఏమిటి వీళ్ళందరి ఉద్దేశ్యం! జీవితాంతం ఇలాగే ఉండిపోవాలా? అనేక వసంతాలుగా ఊపిరి పోసుకున్న కోరికలు అణగారి పోవాల్సిందేనా! ఈ బందిఖానాలోంచి రెక్కలు విప్పుకొని స్వేచ్చగా ఎగిరిపోవాలనుంది. ఆ కోరిక మంచికే అవుతుందా! పాతికేళ్ళ గీత మనసు పరిపరి విధాల ఆలోచనల్లో పడింది. 

    చదువు పూర్తికాగానే ఉద్యోగం వచ్చిందన్న ఆనందం ఎంతోకాలం నిలవలేదు. మరబొమ్మలా ఆఫీసుకెళ్ళడం, డ్యూటీ చెయ్యటం, నెల మొదట తేదీ జీతం తెచ్చి తండ్రిచేతికి ఈయడం. పాకెట్ మనీ కూడా ఆయనిచ్చింది తీసుకోవడం, అలవాటుగా మారిపోయింది ఆమెనందరూ చిన్నపిల్లలా చూస్తారు. అంతా ఆమె మీద పెత్తనం చలాయిస్తారు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంట్లో చెప్పాలి. వాళ్ళు ఒప్పుకుంటేనే వెళ్ళాలి. ఉద్యోగరీత్యా వచ్చే జీతం కాకుండా డి.ఏ.లు, అడ్వాన్స్ లు కూడా అన్నీ ముందుగానే లెక్కలు తేల్చుకుని ఎదురుచూసే తండ్రిని చూస్తే ఒక్కోసారి కోపం వస్తుంది. ఒక్కోసారి గీతకి జాలేస్తుంది కూడా.

    చదువు పూర్తికాగానే ఉద్యోగం దొరకడం అదృష్టమే. ఉద్యోగం వల్ల జీవితం తృప్తికరంగా ఉంటుందని ఊహించి తెలిసీ, తెలియని మోజులతో, ఈ సాలెగూడులో ఇరుక్కుంది. కానీ ఉద్యోగం వచ్చిన కొద్దిరోజుల్లోనే ఆమెకి పూర్తిగా పరిస్థితి అర్ధమయింది. తన ఊహలు భ్రమలని! తండ్రి వట్టి కోపదారి, కొంచెం మంచి చీర కట్టుకున్నా, ఆఫీసునుంచి కొంచెం లేటయినా కేకలేస్తాడు. తల్లి అందరికీ చాకిరిచేసే యంత్రం మాత్రమే!

    పెద్దన్నయ్య పెళ్ళి అవుతున్నప్పుడు ఇంక తన పెళ్ళనే అనుకుంది గీత. డబ్బున్న కుటుంబంలోంచి బోలెడు కట్నం, వస్తువులతో ఆ ఇంట్లో అడుగుపెట్టిన పెద్దకోడలు అందరి దృష్టినీ మార్చేసింది. అందర్నీ గడగడలాడించే తండ్రి, పెద్దకోడలు మాటలు వింటే నాగస్వరం విన్న నాగులా అయిపోవడం ఆశ్చర్యమే! పెద్దొదిన తన మాటల్ని శాసనంలాగా మార్చేసింది. అన్నయ్యకు భార్య ఎంత చెప్తే అంత. ఆమె ఏం మంత్రం వేసిందో గానీ పెద్దన్నయ్య ఇంటి ఖర్చులకి నెలనెలా ఇచ్చే మొత్తాన్ని కూడా ఇవ్వడం మానేశాడు. ఇప్పుడా డబ్బు భార్య నగలకీ, అలంకారాలకీ, సినిమాలకీ, షికార్లకీ మాత్రమే ఉపయోగపడుతోంది.

    చిన్నన్నయ్య ప్రేమించి పెళ్ళి చేసుకున్న చిన్నొదిన పరిమిత స్వాభావి. త్వరగా బయటపడదు. ఆమె ఏ కట్నమూ తేలేదన్న విషయాన్ని పెద్దొదిన ఎప్పుడూ అందరికీ గుర్తు చేస్తుంటుంది. పైకి నవ్వేసినా లోలోపల చిన్నవదిన నొచ్చుకుంటున్నదని గీతకి తెలుసు. చిన్నన్నయ్యకి జీతం తక్కువ. అది వాళ్ళ ఖర్చులకే సరిపోతుంది.

    ఇంటి ఖర్చంతా తండ్రి పెన్షన్, గీత జీతంతోనే గడవాలి. గీత తండ్రి ఉద్యోగకాలంలో సాధించింది స్వంత ఇల్లు, పెన్షన్ లే! ఇప్పుడు ఇంక పెన్షన్ తో పాటు కూతురి జీతం ఆసరాగా ఇల్లు గడుపుతున్నాడాయన. సంపాదించే కూతురికి పెళ్ళిచేస్తే ఇల్లు గడిచేది ఎలా అనేది వాళ్ళ సమస్య.

    ఎంతోమంది పెళ్ళికొడుకుల గురించి ఎన్నో వివరాలతో సంబంధాలు వచ్చినా పొసగడం లేదని అనడం కన్నా తండ్రి పొసగనీయటం లేదనేది సరైన మాట.

    ఆ మధ్య ఎవరో దూరపు బంధువు ద్వారా ఒక సంబంధం తెలిసింది. వరుడు ఢిల్లీలో ఇంజనీర్. రూపసే కాదు మాటకారి అని తెలుస్తున్నది. ప్రస్తావన మొదలయిన తర్వాత అతను గీత ఆఫీసుకి ఫోన్స్ కూడా చేసేవాడు. కట్నం తీసుకోననీ చెప్పాడు. తీరా అతను వచ్చినపుడు తండ్రి తెగేసి చెప్పాడు.

    "చూడు నాయనా! నీవు చాలా సరదా మనిషిలా ఉన్నావు. అభ్యుదయ భావాలు కలవాడివి. మా గీత నీకు తగిన భార్య కాదు" అని! ఆ సంబంధం అలా చెడిపోయింది.

    గీతకు తల తిరిగిపోయింది. కన్నతండ్రే ఇలా ప్రవర్తించడం ఆమె జీర్ణించుకోలేకపోతోంది. ఎవరే సంబంధం చెప్పినా ఇంట్లో వాళ్ళంతా కలిసి ఐకమత్యంగా దాన్ని కాన్సిల్ చేసేదాకా నిద్రపోవటంలేదు. అరుణ పిన్ని చెప్పిన పెళ్ళికొడుకు శరత్ రోజూ గీతకు కన్పించే వ్యక్తే.

    అతను ఆమెకి ఆఫీసర్. స్నేహంగా చిరునవ్వుతో అందరి మన్ననలూ పొందే సహృదయుడు. గీత పట్ల మర్యాదగా ప్రవర్తించే అతని మనస్సులో ఇలాంటి భావన ఉందని ఆమెకే తెలీదు.

    అతను తమ ఇంటికి ఆరోజు వస్తున్నాడంటే గీతకి చాలా బెదురుగా ఉంది. ఇది సిగ్గువల్ల వచ్చే బెదురు కాదు. ఇంట్లోవాళ్ళు అతన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో! వీళ్ళంతా కాదంటే రేపు ఆఫీసులో అతను తనను ఎలా ట్రీట్ చేస్తాడోననే!

    అంతేనా! అంతకంటే అతని పట్ల ఆమెకెలాంటి ఆకర్షణ లేదా..? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పటానికి గీత నిరాకరిస్తుంది. ఎందుకంటే అటువంటి ఆకర్షణలకి దూరంగా ఉండాలని ఆ ఇంటి వాతావరణం ఎప్పుడూ ఆమెను శాసిస్తుంటుంది.

    చదువుకొని ఉద్యోగం చేస్తున్నా వ్యక్తిత్వంలేని మామూలు మధ్యతరగతి యువతి గీత. తన జీవిత భాగస్వామిని ఎంచుకోవటంలాంటి ముఖ్యమైన నిర్ణయాల్లో కూడా ప్రముఖ పాత్ర తీసుకోలేని అశక్తురాలు. సంపూర్ణ వ్యక్తిత్వం రూపొందించుకోలేకపోతే ఉద్యోగిని అయినా ఆర్ధికస్వాతంత్ర్యం కలలోని మాటే. అంతవరకూ ఆమె ఒక కీలుబొమ్మే గదా!

    గీతకు ఇవ్వాళ చాలా ఆవేదనగా ఉంది. తననెవరూ అర్ధం చేసుకోవడం లేదు. అంతా తన జీతాన్ని ప్రేమిస్తున్నారే గానీ, జీవితాన్ని కాదు!

    ఆత్మీయమైన స్నేహ హస్తం గీత చెక్కిళ్ళపై జారిపోతున్న కన్నీటిని తుడవడంతో ఈ లోకంలోకి వచ్చిందామె. ఎదురుగా చిన్న వదిన వాసంతి.

    "ఛీ! ఏంటిది? చిన్నపిల్లలా" వాసంతి మందలించింది ప్రేమగా.

    "స్త్రీకి పెళ్ళి అవసరం లేదంటావా వదినా...?" ప్రశ్నించింది గీత బేలగా... చిన్న వదిన్ని.

    "చాలా గంభీరమైన ప్రశ్న ఇది. పెళ్ళి కాకుండానే మానవసేవలోనే తరించిన మదర్ థెరిసా వంటి మహనీయమూర్తుల్ని చూశాం! మనం సాధారణ స్త్రీలం. మన మనస్సుకి నచ్చిని తోడుని ఎంచుకోవటంలో తృప్తి, ఆనందం ఉంటాయి" వాసంతి చెప్పింది మెల్లగా.

    మరి నేను పెళ్ళిచేసుకోవడం ఈ ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదెందుకు? మళ్ళీ ప్రశ్నించింది గీత.

    "మనిషి ఎప్పుడూ స్వార్ధపరుడే! నువ్వు పెళ్ళి చేసుకొని వెళ్ళిపోతే ఇంటి ఖర్చులు ఎవరు భరిస్తారు? తల్లితండ్రులైనా, అన్నదమ్ములైనా, ఎవ్వరూ స్వార్ధానికి అతీతులు కారు. గీతా! ఇందులో నీ తప్పేం లేదు" వాసంతి మాటల్లో కొత్త అర్ధాలు ఎన్నో తెలుస్తున్నాయి.

    "మరి నేను ఎల్లకాలం ఇలానే...." గీత మాటల్ని సగంలోనే ఆపింది వాసంతి.

    "అదే జరగకూడదని నా అభిప్రాయం. ఇంటి నిర్వహణలో ఆడపిల్లలు బాధ్యత తీసుకోకూడదని కాదు. మగపిల్లలు వదిలేసిన బాధ్యత పూర్తిగా ఆడపిల్లల నెత్తిన పడేసి హింసాయుతంగా అణచివేతతో పెళ్ళి అనే నీ హక్కుని కాలరాయడం నాకు బాధగా ఉంది. నువ్వు ఎవరి చేతుల్లోనూ కీలుబొమ్మవి కావు. వ్యక్తిగా ఎదిగిన స్త్రీ వివాహ విషయంలో తను కూడా కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకోవడం నేరం కాదు. ఆమె ఆలోచనలనూ, అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకొని వివాహం జరిపిస్తే విడాకుల కేసులు తగ్గుతాయి కూడా".

    "హియర్ హియర్" చిన్నన్నయ్య చప్పట్లు కొడుతూ రావటంతో ఇద్దరూ తలతిప్పి చూశారు.

    "ఏమిటీ! మీ వదిన నీకు కూడా లెక్చర్స్ ఇస్తోందా!" చిన్నన్నయ్య మాటలకు నవ్వేసింది గీత.

    "చాల్లెండి. అన్నగారయి ఉండీ గీత అమాయకత్వాన్ని మీరూ ఎక్స్ ప్లాయిట్ చేస్తున్నారు" చిరుకోపంగా అంది వాసంతి.

    "నేనా" తెల్లబోయాడు చిన్నన్నయ్య.

    "అవును! చెల్లెలి పెళ్ళి గురించి కనీసం మీరైనా ఆలోచించారా!" సూటిగా అడిగింది వాసంతి.

    నేనెందుకు ఆలోచించడం. నాన్నగారున్నారు. పైగా అది చదువుకుంది. ఉద్యోగిని" తప్పించుకోబోయాడు.

    "అలా చూస్తున్నారా! అలా పెంచారా! ఇంతకాలం ఆంక్షలు పెట్టి గడప దాటనీయకుండా పెంచారు. ఇప్పుడు తనే ఎలా చేసుకుంటుంది" తీవ్రంగా అంది వాసంతి.

    "నీ ట్రైనింగ్ లో పడిందిగా" నవ్వుతూనే వెళ్ళిపోయాడతను. అతనికి చెల్లెల్ని అర్ధం చేసుకొనే తీరిక, ఓపికా, లేవు మరి!

    "వాళ్ళొచ్చేశారు.." చెల్లాయి కేక! అంతా హడావుడి. శరత్, తల్లీ వచ్చారు. అతనికి తండ్రి లేడట. వాళ్ళకి కాఫీలు ఇవ్వమన్న చిన్నవదిన వాసంతి మాట కాదనలేక ఆపని ఎలాగో బెరుగ్గానే పూర్తిచేసింది గీత.

    శరత్ చాలా ఫ్రీగా అందరితో మాట్లాడుతూ మధ్యమధ్య గీతకేసి చూసి పలకరింపుగా నవ్వుతున్నాడు. వాళ్ళమ్మగారు గీత దగ్గర కూర్చుని ప్రేమగా పలకరించింది. ఆవిడ్ని చూస్తుంటే గీతకి "అమ్మ కూడా ఇలా ప్రేమగా ఉంటే బాగుండు" అన్పించింది.

    చిన్నొదిన ప్రోత్సాహంపై శరత్, గీతలకు ఏకాంతం కల్పించారు. గీతకు అతను కొత్త వ్యక్తి కాదు. ఐనా గుండె దడదడలాడుతోంది.

    "మీరు చాలా రిజర్వ్ డ్ గా ఉంటారు. ఆఫీసులోనూ అంతే" మెల్లగా అన్నాడు. 

    తలదించుకుని కూర్చుని ఉంది గీత.

    "సిగ్గా... లేక భయమా! అవసరం లేదు. మనం జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాం. ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటే మంచిది" అతను మధురంగా చెప్తుంటే తలూపింది గీత.

    "మరి అడగండి" అన్నాడు భరోసా ఇస్తున్నట్లు.

    "మీరు తాగుతారా?" భయంగా ఆమె అడిగిన తీరుకు నవ్వొచ్చిందతనికి. నవ్వేశాడు.

    "ఎవరు చెప్పారు" అడిగాడు.

    "చిన్నన్నయ్య" టీచరు ప్రశ్నకు జవాబు చెప్పే స్టూడెంట్ లాగా చెప్పింది.

    "అదా"! అర్ధమైనట్లు చూశాడు. ఆ రోజు బార్ లోంచి వస్తుంటే గీత వాళ్ళ చిన్నన్నయ్య ఎదురుపడటం గుర్తొచ్చింది.

    "ఆ బార్ లో మా స్నేహితుడుంటే కలవటానికి వెళ్ళానంతే! తాగడానికి కాదు!" చెప్పాడు. ఆమె కళ్ళల్లో అతనిపట్ల నమ్మకం కన్పించింది.

    శరత్ వాళ్ళు వెళ్ళినాక ఇంట్లో చాలా చర్చ జరిగింది. భోజనాలయినాక తండ్రి గీతని పిల్చి నిలదీశాడు.

    "ఆ! ఇప్పుడు చెప్పు! ఈ రోమియోతో నువ్వు ఆఫీస్ లో రోజూ కలుస్తావుగా! హోటళ్ళకీ, పార్కులకీ వెళుతుంటారా? ఇంకేం! ఇంట్లోంచి వెళ్ళిపోయి నీ పెళ్ళి నువ్వే చేసుకో"! అతను తండ్రిలా కాక జన్మ జన్మల శత్రువులా కనిపించాడు.

    ఆమె మనసులో ఓ మెరుపు మెరిసింది. కంపిస్తున్న తన అరచేతిని చిన్నవదిన అదిమి పట్టుకోవడం కొంత ధైర్యాన్ని ఇస్తోంది. ఆనాటినుండీ గీత ప్రతి ఒక్కరినీ ప్రత్యేకంగా చూస్తోంది. తనకిన్నాళ్ళూ తెలియని సంగతులెన్నో తెలుస్తున్నాయి. చిన్నొదిన అల్మారాలోని పుస్తకాలు చదువుతుంటే చీకటిపొరలు విడిపోతున్నాయి. ఆలోచనాలోచనాలు విప్పుకుంటున్నాయి.

    "ఎందుకంత పిరికితనం తనలో! అంతా తన మీద ఆధారపడినవాళ్ళే! అయినా అధికారం చెలాయిస్తున్నారు. తన కాళ్ళపై తాను నిలబడగలిగే ఉద్యోగం ఉన్నా పరాధీనంగా ఎందుకుంది. ఎంత విద్యావతీ, ఉద్యోగినీ అయినా స్త్రీ వ్యక్తిత్వాన్ని ఎదగనీయకుండా చిదిమివేయటంలో ఎందరి స్వార్ధం ఉంది! తన శక్తిని గుర్తించిననాడు ఆమెని ఎవరు అణచివేయగలరు". గీత హృదయంలో ద్వారాలు తెరుచుకున్నాయి. క్రమక్రమంగా ఆ ద్వారాలనుండి వెలుగు కిరణాలు ప్రసరిస్తున్నాయి.

    రోజూ ఆ టైముకు ఆఫీసునుంచి వచ్చే గీత ఆరోజు ఇంకా ఇల్లు చేరలేదు. పైగా ఒకటవ తేదీకూడా! తండ్రి ఆమె రాకకోసం ఎదురుచూస్తూ వరండాలో కూర్చున్నాడు. ఆయన చూపులు మాటిమాటికీ గేటుమీద వాలుతున్నాయి.

    వాకిట్లో కారాగింది. ఇంట్లో అందరి కళ్ళూ కారు మీదే!

    మెళ్ళో పూలదండలతో కారు దిగి వస్తున్న జంటని చూసి అవాక్కయిపోయారంతా! పాదాలకి నమస్కరిస్తున్న వధూవరులని ఆశీర్వదించలేకపోతున్నాడా తండ్రి.

    "మీ సమస్య నాకు తెలుసునాన్నా! నా జీవితాన్ని తీర్చిదిద్దుకునే హక్కు నాకుందని తెలుసుకున్నాను. నాదైన జీవితాన్ని ప్రారంభిస్తున్నాను. మీ కొడుకులతో బాటు కూతురిగా నా బాధ్యతను నేనెక్కడున్నా భరిస్తాను. మీ మనస్సు నొప్పిస్తే క్షమించండి" గీత మాటలకు తండ్రి కళ్ళు నిప్పులు కక్కాయి.

    చల్లని వెన్నెల కిరణాల లాంటి అక్షింతలు తలపై కురవటంతో తలెత్తి చూసిన గీతకి వాసంతి చిరునవ్వు, కొండంత అండగా అన్పించింది. వధూవరులకి కొత్తబట్టలు పెట్టి ఆదరాభిమానాలతో సాగనంపిన వాసంతి గీతలో భవిష్యత్తుకు కావలసినంత స్థైర్యాన్ని నింపింది.