Facebook Twitter
అమ్మా! నన్ను క్షమించొద్దు

   అమ్మా! నన్ను క్షమించొద్దు

 

- డా.సి.భవానీదేవి

కిచెన్ సర్దుకుంటున్న సునీత మోహన్ ని పిలిచింది.

    "మోహన్! కొంచెం హెల్ప్ చేయవూ ప్లీజ్" సునీత అలా అడిగితే కాదనలేడు మోహన్.

    ఎంత డాక్టరయినా భార్య ముందు భర్తే గదా! కొత్తగా ఇల్లు మారి వారం అయినా ఇద్దరికీ డ్యూటీలతోనే సరిపోవడంతో ఇల్లు సర్దుకునే టైం లేదు. ఫ్రిజ్ కనెక్షన్ ఆన్ చేశాడు.

    "రేపు కూరలు తెప్పిస్తాను సునీతా! ఇంక చాల్లే ఆకలేస్తోంది వడ్డించు" అంటూ చేయి కడుక్కున్నాడు మోహన్.

    ఇంతలో పక్కింటావిడ గొంతు వినిపించింది మళ్ళీ.

    "రాధా! కొంచెం కంచాలు పెట్టమ్మా! అన్నం తిందాం" కూతురితో అంటోంది.

    ఈ వారం రోజులుగా ఆవిడ మాటలు వింటూనే ఉంది సునీత. గరిటెలు గిన్నెల చప్పుడు. భోజనాలు చేస్తున్నట్టున్నారు.

    "రాధా! నాన్నగార్కి పక్కవేయి. మంచినీళ్ళు దగ్గరపెట్టు. అన్నట్లు టాబ్లెట్లు వేయడం మర్చిపోకు" పక్కింటావిడ గొంతు వింటూనే సునీత మోహన్ లు భోజనం ముగించారు. పక్కింట్లో లైటు ఆరిపోయింది. అంతా పడుకున్నట్లున్నారు.

    సునీత ఇంట్లో ఉన్న టైంలో పక్కింటావిడ గొంతు విన్పిస్తూనే ఉండడం సునీత దినచర్యలో భాగం అయింది. ఆవిడ పేరు జానకమ్మని పనిమనిషి చెప్పింది. ఓసారి వెళ్లి ఆవిడ్ని పరిచయం చేసుకుందామనుకునేలోపు అర్జంట్ ఫోన్ కాల్. అమ్మకి బాగాలేదు, వెంటనే రమ్మని. ఆదరాబాదరాగా ఇద్దరూ లీవ్ లెటర్స్ పడేసి నెల్లూరు వెళ్లారు.

    పక్సవాతంతో మంచంలో పడుకున్న అమ్మని చూసి ఏడ్చేసింది సునీత. మోహన్ కి భార్యని ఓదార్చడం కష్టమైంది. పదిరోజులున్నారు. అమ్మకి కొంత నయం అన్పించాక తిరుగు ప్రయాణమైంది సునీత.

    అమ్మ సునీత చెయ్యి పట్టుకుని వదల్లేదు. భయంగా వుందని దగ్గరుండమని బతిమాలింది. కళ్ళనీళ్ళు పెట్టుకుంది. తననింత దాన్ని చేసిన అమ్మకి అవసానకాలంలో దగ్గర ఉండడానికి టైం లేదు సునీతకు.

    "సెలవు లేదమ్మా! మళ్ళీ వస్తాను" తల్లికి నచ్చచెప్పి బయలుదేరిందేగాని మనసంతా అమ్మ దగ్గరే వుంది.

    మళ్ళీ రొటీన్. ఇద్దరూ ఉద్యోగం చేసే జీవితంలో అమ్మకే స్థానం లేదు. పక్కింటివాళ్ల గురించి చెప్పేదేముంది. కొత్త ఇంట్లోకి వచ్చాక కొత్త పరిసరాలు, పరిచయాలు. అంటీ ముట్టని సిటీ జీవితం.

    ఆరోజు ఉదయం నిద్ర లేస్తూనే జానకమ్మగారి గొంతు విన్పిస్తోంది. ఆవిడ "రాధా! ఇదివ్వు అదివ్వు" అంటుంటే సునీతకి అమ్మ మళ్ళీ గుర్తొస్తోంది.

    "రాధా! దేవుకి పూజకు పూలు కోసుకురమ్మన్నాను తెచ్చావా? ఆ... ఇలా పెట్టు. ఈలోగా ఆ కూర కాస్త తరిగిపెట్టు" జానకమ్మగారి గొంతు ఖంగుమంటోంది.

    ఆ రోజంతా హడావుడి. కొలీగ్స్ లో ఎవరిదో పెళ్ళి. సాయంత్రం ఎలాగైనా జానకమ్మగారిని కలవాలి అనుకుంది. బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ టాలీ కావడానికి లేటయింది. ఇంటికి వచ్చేసరికి ఎనిమిదయింది. మోహన్ కి క్లినిక్ లో లేటై తొమ్మిదింటికి వచ్చాడు. భోజనాలై అలసిపోయి బెడ్ మీద వాలిపోయి దుప్పటి కప్పుకుంది సునీత.

    అర్దరాత్రి తలుపులు ఎవరో బాదుతుంటే హఠాత్తుగా మెలకువ వచ్చి ఇద్దరూ లేచారు. తలుపులు తీస్తే ఎదురుగా పక్కింటి పెద్దాయన. గాభరాగా "డాక్టర్, ప్లీజ్ ఓసారి త్వరగా రండి. జానకికి స్పృహ లేదు"

    మోహన్ వెంట పరుగున పక్కింటికి వెళ్లింది సునీత. ఆవిడకి ఇంజెక్షన్ ఇచ్చాడు మోహన్. "ఫర్వాలేదు భయపడకండి. హై టెంపరేచర్ లో ఇది మామూలే" బి.పి. చూస్తూ అన్నాడు.

    ఆవిడకి అరవై ఏళ్ళుంటాయి. నెరిసిన జుట్టు, విశాలమైన నుదుట మీద కాసంత బొట్టు, మట్టి గాజులు, జరీ చీర అంతా అమ్మలానే వుంది. ఇల్లంతా కలియజూసింది సునీత. పాత ఫర్నిచర్, పాత తరం ఫోటోలు, పిల్లల ఫోటోలు, రెండు జంటల కలర్ ఫోటోలు లేటెస్ట్ వి. వీళ్ల పిల్లలివి కాబోలు.

    ఆవిడ మంచం పక్కనే కుర్చీ మీద కూర్చుంది సునీత. జానకమ్మగార్ని తాను చూసుకుంటాననీ, పెద్దాయనని కాస్త రిలాక్స్ అవమని చెప్పింది. ఆయన వెళ్లి పక్కగదిలో పడుకున్నాడు. మోహన్ కూడా ఇంటికి వెళ్ళాడు.

    జానకమ్మగార్ని అలా చూస్తుంటే మళ్ళీ అమ్మ గుర్తొస్తున్నది. అమ్మ కూడా ఇలాగే ఉంటుంది. ఇలాగే అనారోగ్యంతో బాధపడ్తోంది. చిన్నప్పుడు తనకి చికెన్ పాక్స్ వస్తే నెలరోజులు తన మంచం పక్కనే నిద్రాహారాలు మాని సేవలు చేసిన అమ్మ, తన చదువుకోసం నాన్న ఇంట్లోకి ఇచ్చిన డబ్బుల్లో పొదుపుచేసి ఫీజులు కట్టి చదివించిన అమ్మ, "నేను చదువుకోలేదమ్మా! మీరైనా చదువుకోండి" అంటూ ప్రోత్సహించిన అమ్మ, తన పెళ్ళయిన రోజు కళ్ళనిండా కన్నీటితో అంపకాలు పెట్టిన అమ్మ. అమ్మ గురించి ఎంత ఆలోచించినా అమ్మ తన కోసం తపించిన జ్ఞాపకాలే అన్నీ... తను చేసిన సహాయం, సేవ ఒకటైనా గుర్తు రావటంలేదు.

    "అమ్మకేదైనా అయితే" ఆ ఆలోచనకే దుఃఖం ముంచుకొచ్చింది సునీతకు.

    బలవంతంగా నిగ్రహించుకొని కన్నీళ్ళు తుడుచుకుంటోంది మాటిమాటిగా.

    జానకమ్మగారు అస్పష్టంగా "రాధా!" అని పిలిచారు.

    సునీత పెద్దాయన దగ్గరికెళ్ళి "రాధని పిలుస్తారా!" అడిగింది.

    ఆయన కళ్లనిండా నీళ్ళు. టీవీ పక్కన ఆడపిల్ల బొమ్మని చూపించి కళ్ళు తుడుచుకున్నారు. ఆ బొమ్మ తీక్షణంగా తన హృదయం లోతుల్లోకి చూస్తున్నట్లనిపించింది సునీతకి. చూపులు మరల్చుకుని ప్రశ్నార్ధకంగా ఆయనకేసి చూసింది.

    "అవునమ్మా! రాధ మా అమ్మాయి. సాఫ్ట్ వేర్ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని అమెరికాకి వెళ్లిపోయింది. కూతుర్ని వదిలి వుండలేని ప్రేమతో జానకి ఇలా మారిపోయింది. చీటికీ మాటికీ రాధని పిలుస్తూ మాట్లాడుతూ కూతురు ఇంకా ఇక్కడ ఉన్నట్లే పిచ్చి భ్రమ. చాలా ఖర్చు ప్రయాణం. అల్లుడు రాధని ఎక్కువగా పంపడు. కొడుకు కోడలు ఉద్యోగస్తులే. మాతో వుండలేరు. పోయినసారి రాధ వచ్చేముందు 'అమ్మా నీ కోసం ఏం తెమ్మంటావు' అని అడిగింది. 'నీలాంటి ఆడపిల్ల బొమ్మకావాలి' అంది జానకి. ఆ బొమ్మే ఇది" ముగించాడాయన.

    సునీతకి ఇప్పుడా బొమ్మలో రాధకాదు, తనే కనబడుతోంది. మెల్లగా లేచి జానకమ్మ దుప్పటి సరిచేసి బయటికి నడిచింది.

    "అమ్మా నన్ను క్షమించొద్దు" చెమ్మగిల్లిన మనసుతో అనుకుంది సునీత. నెల్లూరులో కదల్లేని తల్లికి కన్నపేగు కదిలినట్లయింది.