Facebook Twitter
నాకున్నది ఒక చక్కని బొమ్మ

నాకున్నది ఒక చక్కని బొమ్మ

ఎపిసోడ్ - 7

- వసుంధర

ఈ మధ్య వాడు నాతో అట్టే అడ్డం లేదు. వాడు పెద్దవాడై పోతున్నాడట. ఆడపిల్లలతో ఆడకూడదుట. వాడలా అన్నాడని నాకేం బాధ కలగలేదు. అల్లరి వెధవ-వాడితో నాకాటలేమిటీ?

    "సుధాకర్ కి నీ బొమ్మ అమ్ముతావే?" అన్నాడు వాడు.

    "నేను అమ్మను" అన్నాను.

    "వాడు చాలా డబ్బు ఇస్తాట్ట" అన్నాడు కిష్టిగాడు.

    "ఎంతిచ్చినా సరే అమ్మనంటే అమ్మను."

    "వెయ్యి రూపాయలిస్తాట్ట. తెలుసా? వెయ్యి రూపాయలంటే మాటలుకాదు. వాడి దగ్గరుందీ- అలాంటి బొమ్మలు ఇరవైదాకా రావచ్చుట" అన్నాడు కిష్టిగాడు.

    "అమ్మా- నాది అమెరికా బొమ్మ. నా బొమ్మ నా దగ్గరే వుంటుంది" అన్నాను.

    ఎవరైనా నాకు కారు కొనిపెట్టినా సరే నా బొమ్మను అమ్మకూడదనిపించింది. అదంటే నాకు ప్రాణం. కొంత మంది లేనివాళ్ళు డబ్బుకోసం కన్నబిడ్డల్నే అమ్ముకుంటారుట. నా బొమ్మనే నేను వదులుకో లేకుండా వున్నాను. పాపం వాళ్ళకెలా వుంటుందో ననిపించింది. ఈ ప్రపంచంలో ఎవ్వరికీ డబ్బు ఇబ్బంది వుండకూడదు. అందరి దగ్గరా సమంగా వున్నా లేకపోయినా ఎవ్వరూ డబ్బు కోసం ఇష్టంలేని పనులు చేయకూడదు. నేను పెద్దయ్యాక అందుకేం చేయాలో ఆలోచిస్తాను.

    కిష్టిగాడు ఆ రోజు వెళ్ళిపోయాడా! అదంతటితో అయిపోలేదు. మర్నాడు సుధాకర్ వచ్చి నన్ను బ్రతిమాలుకుని వెళ్ళాడు. నేను ఒప్పుకో లేదు. అప్పటికీ ఈ వ్యవహారం పూర్తికాలేదు.

    ఇంకో రెండ్రోజులాగి సుధాకర్ అమ్మా, నాన్నా మా ఇంటికివచ్చారు. డాక్టరుగారు నాకైతే తెలియరుకానీ మా ఇంట్లో పెద్దాళ్ళకందరికీ తెలుసు. మా ఇంట్లో ఎవరికి వంట్లో బాగుండకపోయినా ఆయనే మందిస్తారుట.

    నాన్నగారు వాళ్ళకి బాగా మర్యాద చేశారు. అన్ని మర్యాదలూ అందుకుని ఆ డాక్టరుగారు అంటాడూ "నాకు ఒక్కడే కొడుకు, వాడి కోసం ఏం చెయ్యమన్నా చేస్తాను. ఎంత డబ్బు అయినా ఖర్చు పెడతాను. మీ అమ్మాయి దగ్గరున్న బొమ్మ వాడికి కావాలంటున్నాడు. దాని కోసం ఏడుస్తున్నాడు. దయచేసి మీరది నాకు ఇవ్వండి. వెయ్యి రూపాయలిస్తాను" అని.

    నా గుండెల్లో రాయి పడింది. వ్యవహారం పెద్దవాళ్ళ దాకా వెళ్ళిపోతుందని అనుకోలేదు. ఇప్పుడు నాన్నగారేమంటారో, నాకైతే ఆ మాటలు వినగానే కోపం వచ్చింది. కానీ నాన్నగారు మాత్రం డాక్టరుగారి మాటలు విన్నాక కూడా నవ్వుతూనే వున్నారు. ఆయన బొమ్మను అమ్మేస్తారో ఏమో!

    "చూడండి డాక్టరుగారూ! మాకూ ఒక్కగానొక్క అమ్మాయి. దానికోసమని వాళ్ళ బాబాయి ప్రత్యేకంగా అమెరికా నుండి పుట్టినరోజు బహుమతిగా తెచ్చి ఇచ్చాడు. మాకు మీ అంత డబ్బులేదు. కానీ కన్నకూతురు పుట్టిన రోజు బహుమతులు మాత్రం అమ్ముకోను. మీరేమీ అనుకోకండి. నా తమ్ముడు ఇలాంటి బొమ్మ ఇంకోటి సంపాదించే అవకాశముందేమో చూడమంటాను" అన్నారు నాన్నగారు చాలా శాంతంగా.

    డాక్టరుగారు వెళ్ళిపోయారు. నేను వెంటనే నాన్నగారి దగ్గరకు వెళ్ళిపోయి కాళ్ళు పట్టుకుని "నాన్నగారండీ మీరింత మంచివారని ఎప్పుడూ అనుకోలేదండీ!" అన్నాను. ఆయన నన్ను దగ్గరకు తీసుకుని "ఆ బొమ్మను అమ్ముకోవడమంటే నిన్ను అమ్ముకోవడమే కదమ్మా!" అన్నారు. నాకు కళ్ళనీళ్ళొస్తే ఒత్తుకున్నాను. అవి ఆనంద బాష్పాలేమోమరి ! 

    అమ్మ కూడా నాన్నగారిని మెచ్చుకుని "చాలా బాగా అన్నారండీ! లేకపోతే ఆయన డబ్బుంది కదా అని మన పిల్ల బొమ్మ అడుగుతాడా ?" అంది.

    "అసలిదంతా నీవల్లే వచ్చింది. 'ఆ బొమ్మను ఎవరికయినా అమ్మేసినా బాగుండును' అన్నావు. అంతే కిష్టిగాడు వచ్చేశాడు. సుధాకర్ వచ్చాడు. ఆ తర్వాత డాక్టరుగారు వచ్చారు. నా బొమ్మ ఇంట్లో వుండడం నీకిష్టం లేదు. అందుకే ఇలా జరిగింది" అన్నాను.

    "ఇంకెప్పుడూ నీ బొమ్మను ఏమీ అనను, సరేనా?" అంది అమ్మ.

    నిజంగానే ఆ తర్వాత అమ్మ నన్నూ, నా బొమ్మనూ ఏమీ అనలేదు. అమ్మ బుద్దిగా వుంటే నేను మాత్రం బుద్దిగా వుండనా మరి ! నేను కూడా అమ్మ చేత చెప్పించుకోకుండానే అన్ని పనులూ చేస్తూ అప్పుడు బొమ్మతో ఆడుకునేదాన్ని.

    బొమ్మ మూలంగా నా సెలవులిట్టే అయిపోయాయి. సెలవులు అయిపోయినందుకు ఈసారి నాకట్టే విచారంగా లేదు. నా బొమ్మ గురించి క్లాసులో అందరికీ చెప్పుకోవాలని చాలా ఆత్రుతగా వుంది.

    స్కూలు తియ్యగానే మొదటిరోజు నేనూ, కిష్టిగాడూ కలిసే స్కూలుకు వెళ్ళాం. వాడు నాతో బొమ్మ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేనేదో అనబోతే "బొమ్మ గురించి చిన్న చిన్న పిల్లలకు చెప్పుకో! నాకు చెప్పొద్దు, చిరాకు!" అనేశాడు.

    స్కూలుకు వెళ్ళాక వాడు నన్నింకా ఏడ్పించాడు.

    మేస్టారు క్లాసుకు రావడం కాస్త ఆలస్యమయింది. అంతే కిష్టిగాడు మాస్టారు కూర్చునే కుర్చీ దగ్గరకు వెళ్ళి నిలబడి "ఈ క్లాసులో అన్నపూర్ణ అనే అమ్మాయికి అమెరికా నుండి వాళ్ళ బాబాయి ఓ బొమ్మ తెచ్చాడు. ఆ బొమ్మకు లేతగులాబీ రంగు వళ్ళు. రెండడుగుల పొడుగుంటుంది" అంటూ మొత్తం బొమ్మ గురించి అన్నీ చెప్పేసి "పాపం అన్నపూర్ణ ఈ విశేషం అందరికీ చెప్పాలని తొందర పడిపోతోంది. ఒక్కొక్కరికే, ఒక్కొక్కరికే ఒక్కొక్కరికే చెబుతూ కూర్చుంటే ఎప్పటికి అవను? అందుకని దాని తరపున నేను మీకు అందరికీ ఒక్కసారే చెప్పేస్తున్నాను. ఇంక మీరు దాని బోరు భరించనక్కర్లేదు" అన్నాడు.

    వెంటనే అంతా నవ్వేశారు.

    కిష్టిగాడు నా ప్లానంతా పాడు చేసేశాడు. నా కలలన్నీ నాశనం చేసేశాడు. విన్న వాళ్ళంతా నా బొమ్మ గురించి మరిచిపోయి వాడి మాటలు చెప్పుకుని నవ్వుకోసాగారు. నేనేమైనా అందామనుకునేలోగా మేస్టారు క్లాసులోకి వచ్చేశారు.

    ఇంటర్వల్ దాకా నాకు ఎవ్వరితోటీ మాట్లాడ్డానికి వీలు కాలేదు. ఈలోగా నేను ఆలోచించి వుంచుకున్నాను. అందరికీ నా బొమ్మను చూస్తే అసూయే! దాన్ని చూసి అంత అసూయ పడితే బొమ్మకు బోలెడు దిష్టితగుల్తుంది. దానికి దిష్టి తీద్దామంటే అమ్మ ఇప్పు ఇవ్వదు.

    బొమ్మను చూసి అసూయపడకుండా సంతోషించే వాడు శంకరం ఒక్కడే అవుతాడు. నేను శంకరం కోసం క్లాసంతా చూశాను. వాడు ఎప్పటిలాగానే వున్నాడు.

    ఇంటర్వల్ అవగానే నేను శంకరం దగ్గరకు వెళ్ళాను. వాడు నాతో మాట్లాడ్డానికి ఉత్సాహం చూపించలేదు.

    "ఏం శంకరం బొమ్మ గురించి చెప్పి బోరుకొడతానని భయంగా వుందా ?" అనడిగాను.

    "అదేం కాదు" అంటూ వాడు తడబడ్డాడు.

    "అమెరికా బొమ్మ వచ్చాక నిన్ను పిలుస్తానని చెప్పానుగా ఈ రోజు వస్తావా?" అనడిగాను.

    "రాను" అన్నాడు శంకరం.

    "ఏం?" అన్నాను ఆశ్చర్యంగా.

    "నేను దాచుకున్న సబ్బుముక్క కాకెత్తుకు పోయింది. అమ్మ మళ్ళీ సబ్బు ముక్కలు తేలేదు. ఎవ్వరూ ఇవ్వడం లేదంది. సబ్బుల ధర పెరిగిపోతోందిట. అందుకని పాత సబ్బు సన్నగా అయిపోగానే కొత్త సబ్బుకు అంటించేస్తున్నారుట" అన్నాడు శంకరం.

    "అయ్యో పాపం!" అన్నాను. కానీ ఇప్పుడెలా ?

    అప్పుడు నాకు గుర్తు వచ్చింది. అరిగిపోయిన రెండు సబ్బు ముక్కలు నేను బొమ్మ కోసం దాచుకున్నాను. అందులో ఒకటి పోనీ శంకరానికి ఇస్తే ?

    అప్పుడు శంకరం సంతోషిస్తాడు. దాంతో శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకుని మా ఇంటికి వస్తాడు. బొమ్మ చూస్తాడు.

    శంకరానికి బొమ్మ చూపించాలని నాకెందుకంత ఇదిగా వుందో నాకే తెలియదు. కానీ కిష్టిగాడంటే ఎంత అసహ్యమో శంకరం అంటే అంత ఇష్టం నాకు !

    కిష్టిగాడు ఎంత వేళాకోళం చేసినా నాతోపాటు ఆ రోజు నా క్లాస్ మేట్సు ఇద్దరబ్బాయిలూ, నలుగురమ్మాయిలూ వచ్చి ఆ బొమ్మ చూసి వెళ్ళారు. వాళ్ళు బొమ్మను చూసి ఆశ్చర్యపడ్డారు. మెచ్చుకున్నారు. అయినా నాకు సంతోషం మరీ ఎక్కువగా కలగలేదు. పాపం- శంకరం చూడలేదే అనిపించింది.

    అంతా వెళ్ళిపోయాక సబ్బు ముక్కల కోసం చూశాను. అవి కనబడలేదు, వెతికి వెతికి ఆఖరికి అమ్మను అడిగాను.

    ముందు అమ్మకు అర్ధం కాలేదు. తర్వాత "అవా? పాపం మన పనిమనిషి రత్తమ్మకు ఇచ్చానే!" అంది.

    నాకు చాలా కోపం వచ్చింది. అమ్మ నన్నడక్కుండా నా వస్తువులు ఎందుకు తీయాలి? అలాగని నేను నిలదీస్తే నా ఇష్టం పొమ్మంది అమ్మ. నాకు చాలా కోపం వచ్చింది. అమ్మకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నాను. మా ఇంట్లో ముందు మామ్మ స్నానం చేస్తుంది. తర్వాత అమ్మ, ఆ తర్వాత నేను, నా స్నానం అయి భోం చేసి బడికి వెళ్ళాక ఆ తర్వాతనే నాన్నగారు స్నానం చేస్తారు. అమ్మ నా సబ్బు నాతో చెప్పకుండా తీసింది కాబట్టి ఇంట్లో సబ్బు అమ్మకు చెప్పకుండా తీసుకుని వెళ్ళి బడిలో శంకరానికి ఇవ్వాలను కున్నాను.

    సబ్బుతీసి రెండు రోజులే అయింది. ఇంకా కొత్తగా వుంది. నా స్నానం కాగానే దాన్ని జాగ్రత్తగా కాగితంలో చుట్టబెట్టి నా స్కూలు బ్యాగులో వేసుకున్నాను.

    ఈ రోజు కూడా ఇంటర్వల్ దాకా శంకరంతో మాట్లాడడం కుదరలేదు. అప్పుడు వాడికి సబ్బు ఇచ్చాను.

    "పెద్ద సబ్బు ఇది, ఇంత పెద్ద సబ్బుతో నేనెప్పుడూ వళ్ళు రుద్దుకోలేదు" అన్నాడు శంకరం.

    "అందుకే ఈ రోజే నువ్వు తప్పక రావాలి" అన్నాను బ్రతిమాలుతున్నట్లుగా.

    "ఈ సబ్బు నీకెలా వచ్చింది" అని అడిగాడు శంకరం.

    "ఎలా రావడమేమిటి? ఇది నాదే. మా ఇంట్లో నాకు వేరే సబ్బు వుంటుందని అబద్ధం చెప్పాను. 

    "మరిప్పుడు నీకు ఎలా?" అన్నాడు శంకరం.

    "నా కోసం నెలకు రెండు సబ్బులు తెస్తారు. నాకు ఇంకొకటుందిలే! ఎలాగో గడుపుకుంటాను. నా సంగతి నీకెందుకు? ఇది అచ్చంగా నీకే" అన్నాను.

    "చాలా థాంక్స్ అన్నపూర్ణా!" అన్నాడు శంకరం.

    నాకు ఎంత గర్వం కలిగిందో చెప్పలేను. ఒక పేదవాడికి నేను సబ్బు ఇచ్చి సాయపడ్డాను. అందుకు వాడు నాకు థాంక్స్ చెప్పాడు.

    నా గర్వమంతా సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి అణగారిపోయింది. ఇంట్లో చాలా గొడవగా వుంది.

    నేనింటికి వచ్చినా అమ్మగానీ, మామ్మగానీ నా గురించి పట్టించుకోలేదు. వాళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటున్నారు.

    జరిగిందేమిటో నాకు తెలియడానికి ఎంతో సేపు పట్టలేదు.

    నాన్నగారు స్నానం చేయాలనుకునే సరికి సబ్బు కనిపించలేదుట. ఆయన సబ్బు లేకుండానే స్నానం చేశారుట. కానీ చాలా కోప్పడిపోయారుట. ఇంట్లో ఎంత వెతికినా సబ్బు కనిపించలేదుట. ఆఖరికి అనుమానం రత్తమ్మమీదికి పోయిందట. ఎంత అడిగినా అది ఒప్పుకోడంలేదుట. 

    "అది ఒప్పుకుంటేనే పనిలో వుంచుకుంటాను. లేకపోతే పనిలోంచి తీసేస్తాను, నేనేకాదు ఇంకెవ్వరూ దాన్ని పనిలో పెట్టుకోనీకుండా చేస్తాను" అందిట అమ్మ.

    "నేను నిజంగా తప్పు చెయ్యలేదు. చెయ్యని తప్పు ఎలా ఒప్పుకుంటానమ్మా" అని ఏడ్చిందిట రత్తమ్మ.

    "పాపం! అది తియ్యలేదేమోనే!" అందిట మామ్మ.

    అంతే! అమ్మ మామ్మ దెబ్బలాడుకోవడం ప్రారంభించారుట.

    "దాని ఎదురుగానే మీరలాగ అంటే నా మాటకు విలువేముంటుంది? ఈ రోజు సబ్బు అయింది, ఇంకో రోజు నగలు కావచ్చు" అందిట అమ్మ.

    "నగలైతే  అప్పుడు చూసుకోవచ్చు చిన్న సబ్బుముక్క కోసం ఇంత మంచి పనిమనిషిని మానిపిస్తే ఆ తర్వాత నిజంగా దొంగబుద్దులున్నదే వస్తుంది" అందిట మామ్మ.

    అప్పట్నించీ ఆ ఇద్దరూ దెబ్బలాడు కుంటూనే వున్నారుట. ఇదంతా నాకు మామ్మ చెప్పింది.

    "నువ్వే రైటు మామ్మ! ఆ సబ్బు నేనే తీశాను" అంటూ నేను మామ్మకు జరిగిందంతా చెప్పాను. వెంటనే మామ్మ అమ్మను కేకేసింది. తిట్టింది. ఆ తిట్లన్నీ అమ్మ నన్ను తిట్టింది.

    "నన్ను తిడతావేం?" అన్నాను.

    "అంత పెద్ద సబ్బు బిళ్ళను ఎవరికో దానం చేస్తావా? ఇది ఇల్లనుకున్నావా, ధర్మసత్ర మనుకున్నావా?" అంది అమ్మ.

    "నేనేం చెయ్యను? చిన్న సబ్బు ముక్కే ఇవ్వాలనుకున్నాను. అదేమో నువ్వు నాకు చెప్పకుండా ఎవరికో దానం చేశావు మరి!" అన్నాను మామ్మ వెనకాల నుంచుని. మామ్మ వెనకాల నుంచున్నప్పుడు నాకు చాలా ధైర్యంగా వుంటుంది. అప్పుడు అమ్మ నన్నేమీ చెయ్యలేదు. 

    చివరికే మనుకుందో "సరేలే, ఇలా జరిగిందని రత్తమ్మకు మాత్రం చెప్పకు" అంది అమ్మ.

    అయితే బాబాయి మాటలు నాకు పూర్తిగా గుర్తున్నాయి. మనుషులు అంతా ఒక్కటేనన్నాడు బాబాయి. అమ్మ రత్తమ్మను అన్యాయంగా అనుమానించింది. అవమానించింది. తొందరపడ్డం అమ్మ తప్పు.

                 

   (సశేషం)