Facebook Twitter
నాకున్నది ఒక చక్కని బొమ్మ

నాకున్నది ఒక చక్కని బొమ్మ

ఎపిసోడ్ - 8

- వసుంధర


   
మర్నాడు నేనే లేచేసరికే రత్తమ్మ వచ్చి తనపని తను చేసుకునిపోతోంది. నేను దాని దగ్గరకు వెళ్ళి మొత్తం జరిగిందంతా చెప్పేసి "అసలు తప్పు అంతా నాది. నా గురించి నువ్వు తిట్లు తిన్నావు. నన్నూ, అమ్మనూ క్షమించవూ?" అన్నాను.

    కాసేపు అది నావంక వెర్రిమొహం వేసుకుని చూసింది. తర్వాత్ చేస్తున్న పని వదిలిపెట్టి అమ్మ దగ్గరకు పరుగెత్తింది.

    "మీ అమ్మాయిగారమ్మా, మా దొడ్డ మనసమ్మా! అలాంటి తల్లి గొప్ప చదువులు చదివి దేశాన్నేలితే- ఇందిరమ్మలా మాలాంటోళ్ళనో కంట కనిపెట్టి కాపాడుతుందమ్మా! అలాంటి బిడ్డను కన్నందుకు నీ జన్మ ధన్యమయిందమ్మా" అంటూ నన్ను పొగిడేయ సాగింది.

    అమ్మ జరిగింది విని ఏమనాలో తెలియక "నిన్న అయిందేదో అయిపోయింది. ఏమీ అనుకోకేం?" అంది.   

    "అదేంటమ్మా! పొరపాట్లన్నాక ఎవరికైనా వస్తాయి. మీరు నన్ను ఎన్నోసార్లు ఆదరించారు. ఒక్క రోజులో అన్నీ మరిచిపోతాననుకున్నారా అమ్మా?" అంది రత్తమ్మ.

    నేను శంకరం గురించి ఆలోచిస్తున్నాను.

    నిన్న రావడానికి ప్రయత్నిస్తానని చెప్పాడు. రాలేదు. ఈ రోజైనా వస్తాడో, రాడో? వాడెలాగున్నాసరే గౌరవిస్తానని అమ్మ నాకు మాట ఇచ్చింది.

    "పెద్ద వాళ్ళం. మనం దానికి చెప్పాల్సింది ఎలాగూలేదు. కనీసం దాని నుండి నేర్చుకుందాం!" అని నాన్నగారు అమ్మకు చెప్పారు.

    అయితే ఆరోజు శంకరం బడికి రాలేదు. ఆరోజే కాదు వరుసగా ఆ వారమంతా రాలేదు.

    నా దగ్గర సబ్బు తీసుకుని శంకరం నా ఇంటికి రావడం సంగతి అటుంచి బడికి కూడా రావడం మానేశాడు. వాడి ఇంటికి వెళ్ళి  కనుక్కుందామా అంటే నాకు ఒక్కటే భయం.

    వాడు నన్ను అక్కడ ఏ మయిన నీళ్ళయినా తాగమంటే ? అప్పడందులోని సూక్ష్మజీవులు నాకు రోగం తెప్పిస్తే?

    మరుసటి వారం శంకరం బడికి వచ్చాడు.

    "ఇన్నాళ్ళూ ఏమైపోయావు?" అనడిగాను.

    వాడు నా చేతిలో చిన్న కాగితం పొట్లం పెట్టి "ఇది నువ్వు నాకిచ్చిన సబ్బు. నేను దీన్ని వాడలేదు" అన్నాడు.

    "ఏం ?" అన్నాను.

    "సరిగ్గా ఆరోజు మధ్యాహ్నమే మా అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. డబ్బు ఖర్చు పెట్టకపోతే బ్రతకదుట. వెయ్యి రూపాయలు కావాలట.

    "మరయితే ఎలా ?"

    "ఏమో మరి అమ్మ చచ్చిపోతుందని నాకు బెంగగా వుంది. అమ్మ కోసం తమ్ముడు కూడా బెంగట్టుకుని చిక్కిపోయాడు. నీకు తెలుసుగా వాడెంత బాగుంటాడో" అన్నాడు శంకరం.

    "అవునవును చాలా బాగుంటాడు" అన్నాను వాణ్ని సంతోష పెట్టడానికి.

    "నిన్ననే అమ్మ బతికే ఉపాయం తెలిసింది" అంటూ శంకరం ఏడ్చేశాడు.

    వాడేడుస్తూంటే నాకు చాలా జాలేసింది. ఉపాయం తెలుసుగా ఇంక ఏడ్వడ మెందుకూ ?" అన్నాను.

    "ఆ ఉపాయమేమిటో తెలుసా? తమ్ముడిని అప్పలస్వామికి అమ్మేయడం" అన్నాడు శంకరం. వాడి ఏడుపు ఇంకా ఎక్కువయింది.

    "అదేమిటి?" అన్నాను ఆశ్చర్యంగా.

    "తమ్ముడిని తనకిచ్చేస్తే వెయ్యి రూపాయలిస్తానన్నాడు అప్పలస్వామి. ఆ తర్వాత తమ్ముడు మా ఇంట్లో వుండడు.వాడు లేకపోతే నేను బతకలేను. కానీ అమ్మను బతికించుకోవడం కోసం వాడిని అమ్మేయాలి" అన్నాడు శంకరం.

    వాడి మాటలు పూర్తయ్యేసరికి నాకూ ఏడుపు వచ్చేసింది. "పోనీ ఆ అప్పలస్వామి వాడిని బాగా చూసుకుంటాడా?" అన్నాను. ఏడుపు ఆపుకుందుకు ప్రయత్నిస్తూ.

    "వాడి గురించి ఎవ్వరూ మంచిగా చెప్పుకోరు. వాడు కన్నో, చెయ్యో, కాలో పాడుచేసి ఎక్కువ డబ్బుకి చిన్న పిల్లల్ని ముష్టివాళ్ళకి అమ్మేస్తాడంటారు" అన్నాడు శంకరం. వాడికి మళ్ళీ ఏడుపు వచ్చేసింది.

    నాకు వళ్ళంతా వణికిపోయింది. "అమ్మ బాబోయ్!" అన్నాను. ఆ అప్పలస్వామి ఎవరో కానీ న చేతులూ, కాళ్ళూ విరిచేస్తున్నట్లు అనిపించింది.

    "అయితే అమ్మేశారా?" అన్నాను.

    "లేదు. రేపు అప్పలస్వామి డబ్బు తీసుకుని వస్తాట్ట" అన్నాడు శంకరం.

    "అయితే మా నాన్నగారిని అడుగుతాను. నువ్వు తొందర పడకు. ఆయన సాయం చేస్తారు" అన్నాను.

    శంకరం నమ్మలేదు. సాయంత్రం వాడిని మా ఇంటికి తీసుకు వెళ్ళాను.

    అమ్మకు విషయమంతా వివరించి చెప్పాను.

    "మనమేమైనా జమీందార్లమా ? మనకేమైనా ఎస్టేట్లున్నాయా? అడ్డమైన వాళ్ళకీ వెయ్యేసి రూపాయలిస్తూ కూర్చోవడం వున్న వాళ్ళక్కూడా ఇష్టంలేని పని. అసలు నువ్వు బాగా బరితెగించి పోయావు. నీ ఆగడాలరికట్టాలి!" అంటూ కసిరింది.

    నా బాధ మామ్మకు చెప్పుకున్నాను. మామ్మ కూడా నన్ను తిట్టింది. మామ్మ శంకరాన్ని కూడా తిట్టింది.

    "నేను చెప్పానా ?" అన్నట్లు నా వంక చూశాడు శంకరం.

    "మా వాళ్ళు తిట్టారని నీకు బాధగా వుందా ?" అన్నాను.

    "ఇలాంటివి నా కలవాటే ! ఎలాగూ మీ ఇంటికి వచ్చానుగా బొమ్మను చూసి వెళ్ళిపోతాను" అన్నాడు శంకరం.

    వాడికి నా బొమ్మ చూపించాను. అన్నీ వివరంగా చెప్పాను. ఆ బొమ్మతో నేనెలా ఆడుకుంటానో చెప్పాను. వాడు అన్నీ విన్నాడు. బొమ్మ వాడికి చాలా నచ్చింది.

    కానీ నా బొమ్మకు అన్నీ జరుగుతున్నాయి. శంకరం తమ్ముడికి ఏం జరగడం లేదు.

    నా బొమ్మ నాదగ్గరే ఎన్నేళ్ళున్నా ఇలాగే వుంటుంది. కానీ శంకరం తమ్ముడు ఏదో ఒకరోజున పెరిగి పెద్దవాడౌతాడు. నాన్నగారంతటి వాడౌతాడు. ఈలోగా అప్పలస్వామి వాడినేం చేస్తాడో ?

    "శంకరం నీ తమ్ముడు మీ ఇంట్లో వుండాలి. వుంటాడు!" అన్నాను.

    "ఎలా ?" అన్నాడు వాడు నమ్మలేనట్లు.

    "నాతో పద" అన్నాను.

    నేను బొమ్మతో సహా శంకరాన్ని తీసుకుని డాక్టరు వద్దకు వెళ్ళాను. నేను వెళ్ళేసరికి డాక్టరుగారు ఇంట్లోనే ఉన్నాడు. ఆయన నన్ను వెంటనే గుర్తు పట్టలేదు. నేనే ఆయనకు గుర్తు చేశాను.

    డాక్టరుగారు కోప్పడలేదు. ఆప్యాయంగానే పలకరించి "ఏం కావాలమ్మా!" అన్నాడాయన.

    "వెయ్యి రూపాయలిస్తే ఈ బొమ్మను మీకిచ్చేస్తానండి" అన్నాను.

    ఆయన ముందు ఆశ్చర్యపడి డబ్బుకోసం బొమ్మను అమ్ముకునే దుర్గతి పట్టిందా పాపం మీకు? మీ నాన్న తనే రాలేకపోయాడా ? ముఖం చల్లక నిన్ను పంపించాడా ?" అన్నాడాయన.

    "మా నాన్నగారికి తెలియదండి. మీరు కూడా ఆయనకు చెప్పవద్దండి" అన్నాను.

    డాక్టరుగారు ఇంకా ఆశ్చర్యపోయాడు. ఆయనకు నేను అన్నీ చెప్పాను.

    "నువ్వు చెప్పేదంతా నిజమా ?" అన్నాడాయన.

    "వీడేనండి శంకరం. వీడి అమ్మకే జబ్బు చేసింది" అన్నాను.

    "అలాగా" అని "ఎక్కడుందిరా మీ అమ్మ?" అంటూ డాక్టరుగారు వాడిని వివరాలడిగి అప్పటికప్పుడు ధర్మాసుపత్రికి ఫోన్ చేశాడు. ఏమేమిటో మాట్లాడాడు.

    నేనాయన వంక ఆత్రుతగా చూస్తున్నాను.

    "ఆ బొమ్మలాగియ్యి" అన్నాడు డాక్టరుగారు. నేనాయనకు అందించేశాను.

    "ఇంక నువ్వు వెళ్ళొచ్చు. వీడి అమ్మను నేను బతికిస్తాను. ఇప్పుడే వీడితో బయలుదేరి వీడింటికి వెడతాను" అన్నాడు డాక్టరుగారు.

    "అన్నపూర్ణా! నా కోసం నువ్వు నీ బొమ్మను అమ్మేస్తున్నావా ?" అన్నాడు శంకరం బాధగా.

    "అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం" అని నేను ఇంటికి వెళ్ళిపోయాను. బొమ్మలేక ఇల్లంతా చిన్నబోయినట్లయింది.

    బొమ్ముంటే నాకు ఎన్ని పనులో !

    నేను కాళీగా వుండడం చూసి అమ్మ "ఏమే, నీ బొమ్మ బజ్జుందా? నువ్వు కాళీగా కనపడుతున్నావు?" అంది.

    "ఊఁ" అన్నాను. అంతకంటే ఇంకేం చెప్పను.

    నా బొమ్మకు ప్రాణంలేకపోవచ్చు. కానీ అది నాకు బాగా అలవాటైపోయింది. ఏదో మూల నుండి నన్ను పిలుస్తున్నట్లే అనిపిస్తోంది.

    అప్పుడు నాకు శంకరం గుర్తుకువచ్చాడు. వాడి తమ్ముడిని అమ్మేసుకుంటే వాడికింకా ఎక్కువ ఏడుపొచ్చేదేమో!

    ప్రాణంలేని నా బొమ్మ వాడి అమ్మ ప్రాణాలు కాపాడుతోంది. అందుకు నేను సంతోషించాలి. నా బొమ్మ సంగతి నేను ఇంట్లో ఎవరికీ చెప్పలేదు.

    మర్నాడు స్కూలుకు వెళ్ళాను. డల్ గా వున్నాను. శంకరం బడికి రాలేదు. నేను ఇంకెవ్వరితోనూ మాట్లాడలేదు.

    ఎప్పుడూ అల్లరిచేసే కిష్టిగాడు కూడా నా దగ్గరకు ప్రేమగా వచ్చి "ఏమిటే అమ్ములూ అదోలా వున్నావు? వంట్లో బాగోలేదా?" అనడిగాడు.

    "బాగానే వుందిరా!" అని వూరుకున్నాను.

    ఆ రోజు పాఠాలేమీ సరిగ్గా ఎక్కలేదు. ఇంటికి వెళ్ళాక కూడా నాకలాగే వుంది.

    "ఏమే ఆ శంకరంగాడి తమ్ముడి కోసం బెంగెట్టుకున్నావా? అడ్డమైన వాళ్ళ గురించీ ఆలోచిస్తే మనం బతకలేం" అంది అమ్మ. మామ్మ కూడా అలాంటిదే ఏదో చెప్పింది.

    నాన్నగారు ఆఫీసు నుండి వచ్చిన అరగంటకి మా ఇంటికి డాక్టరుగారు భార్య వచ్చారు. వాళ్ళబ్బాయి సుధాకర్ కూడా వచ్చాడు. వాడి చేతిలో నా బొమ్మ వున్నది.

    నాకు తెలిసిపోయింది. వాళ్ళు నాన్నగార్ని వేళాకోళం చేయడానికి వచ్చారు. నా పని అయిపోయింది.

    "ఒకప్పుడు ఈ బొమ్మను మీ ఇంట్లోంచి కొందా మనుకున్నాను. కానీ ఈ రోజు ఈ బొమ్మను మీ అమ్మాయికి బహుమతిగా ఇద్దామని వచ్చాను" అన్నాడు డాక్టరుగారు. 

    "ఈ బొమ్మ మీ కెక్కడిది?" అన్నారు నాన్నగారు.

    "ఈ బొమ్మ మీ అమ్మాయిదే!" అంటూ డాక్టరుగారు నిన్న జరిగిందంతా ఆయనకు చెప్పి "మీ పాప చాలా గొప్పది! ఎప్పుడూ డబ్బుకోసం తప్ప వైద్యం చేసి ఎరుగని నా మనసునే మార్చేసింది. అసలు నిన్న మీ పాప దగ్గర్నుంచి బొమ్మ తీసుకోకూడదనుకున్నాను. కానీ ఇంత గొప్ప మనసున్న పాపకు ఏదైనా బహుమతిగా ఇవ్వాలనిపించింది. ఈ బొమ్మకు మించి తనకు నేనివ్వగలదేమీ లేదు. అందుకే తన దగ్గర తీసుకున్నాను. మీ పాపను పిలుస్తారా?" అన్నాడు.

    "అమ్మలూ!" అన్నారు నాన్నగారు.

    నేను నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ అక్కడకు వెళ్ళాను.

    డాక్టరుగారు సుధాకర్ చేత నాకా బొమ్మను ఇప్పించారు.

    "చూడు పాపా! శంకరం తల్లి నా నర్సింగ్ హోంలో వుంది. తప్పక బ్రతుకుతుంది. చేతనైనంతలో కొందరైనా లేనివాళ్ళకి సాయం చేయకపోతే ఈ జీవితానికి అర్ధంలేదని తెలుసుకున్నాను. ఈ రోజు నుండి నువ్వూ, మా సుధాకర్ స్నేహంగా వుండాలి. రోజూ ఓ గంటసేపైనా కలుసుకుని మాట్లాడుకోవాలి" అన్నాడు ఆయన. ఆయనింకా ఏమో అన్నాడు కానీ నాకు అర్ధం కాలేదు.

    వాళ్ళు వెళ్ళిపోయాక నాన్నగారు "బొమ్మను ఆ డాక్టరుకు అమ్మేశావా? ఏం అదంటే నీకు విసుగు పుట్టిందా?" అన్నారు.

    ధైర్యం చేసి "మనదేశంలో ప్రాణమున్న పసిపాపలు తిండి, గుడ్డలేక అలమటిస్తూంటే నాకుబొమ్మలెందుకు? ఆ బొమ్మకు ఖర్చులెందుకు? ఇంక ఈ బొమ్మ గురించి నేనేమీ ఖర్చుచేయను. దీనికి పెట్టే ఖర్చుతో ఏ పేదవాళ్ళకైనా సాయపడతాను" అన్నాను.

    "బయల్దేరింది పెద్ద సంఘ సేవకురాలు! మరి అలాంటప్పుడా బొమ్మను మళ్ళీ ఎందుకు డాక్టరుగారి దగ్గర తీసుకున్నావు?" అనడిగారు నాన్నగారు.

    "ఏమో శంకరంలాంటి వాళ్ళ కింకెవరికైనా సాయపడ్డానికి పనికి వస్తుందేమోనని" అన్నాను. అన్నాక భయంగా మూలమూలగా పోతున్నాను.

    అప్పుడు నాలుగడుగుల్లో అమ్మ వచ్చి నన్ను కలుసుకుంది.

    నా బుగ్గలు పుణికింది. ఆప్యాయంగా నా తల నిమిరింది. తన ఒడిలో నన్ను కూర్చో బెట్టుకుంది.

    "వున్నట్లుండి నన్నూపుతూ, తనూగుతూ పాట ప్రారంభించింది.

    నాకున్నది ఒక చక్కని బొమ్మ దానికి నేను అమ్మ

    అది అబ్బాయా అమ్మాయా అని అడుగకూడదు

    గౌను తొడిగినా అమ్మాయే అది పాంటు వేసినా అమ్మాయే"

    అమ్మ ఈ పాట నా గురించే పాడిందని అర్ధమైపోయింది నాకు. "అమ్మా!" అని ఏడ్చేశాను.

    "పిచ్చి పిల్లా ఏడుస్తా వెందుకూ?" అంది అమ్మ.

    కొంచెం సేపట్లో నా ఏడుపు ఆగిపోయింది.

    "అమ్మా! బొమ్మ గురించి నేనేమీ అడగను. నా ఖర్చులు కూడా తగ్గించుకుంటాను. పాపం! ఆ శంకరానికి మంచి బట్టలు కుట్టించండి. వాడు బాగా చదువుకుందుకు సాయం చేయండి. అప్పుడు వాడు గొప్పవాడు అవుతాడు. వాళ్ళ వాళ్ళని పైకి తీసుకొస్తాడు" అన్నాను.

    అప్పుడు నాన్నగారు వచ్చి అమ్మ ఒడిలోంచి నన్ను తీసుకుని ఎత్తుకున్నారు. "మనమెలా వుంటున్నామన్నది కాదు ముఖ్యం. మన చుట్టూ వాళ్ళెలా వుంటున్నారని పట్టించుకోవాలి. కాస్త కలిగిన ప్రతిఒక్కడూ తన పక్క నుండే లేనివాడిని ఆదుకుంటే దేశంలో పేదరికం తొలగిపోడానికి మనం నాయకులమీదే ఆధారపడక్కరలేదు" అని "నీ కోరిక తప్పక నెరవేరుస్తానమ్మా- నీ పేరు నీకు బాగా కుదిరింది. మీ అమ్మ, నా అమ్మ దేశంలో ఒక్కొక్క అమ్మ మాత్రమే! కానీ దేశంలో అమ్మలందరూ నీలో వున్నారు. నువ్వు ఒక్క అమ్మవు కాదు. అందుకేనేమో మాకు నువ్వు పుట్టినప్పుడే నిన్ను అమ్మలూ అని పిలవాలనిపించింది" అన్నారు.

    అవును. నా పేరు అమ్మలు.

    నా బొమ్మకు నేను అమ్మను. కానీ ఇంకా ఎందరో అమ్మలు నాలో వున్నారు.

    'నా పేరు అమ్మలు' అంటూ కథ ప్రారంభించాను.

    నా కథ ఎప్పుడూ ఇలాగే నడుస్తూ వుండాలన్నది నా కోరిక.

       
      

***      (సమాప్తం)    ***