Facebook Twitter
నేనుమౌనంగా వెళ్ళిపోతాను- శైలజమిత్ర

నేను మౌనంగా వెళ్ళిపోతాను


- శైలజమిత్ర

 

ఎవరికీ ఏమి కాకుండా

ప్రతి ఇంటికి గడపలా

 

ముత్తైదువ నుదుటి సింధురంగా

మెరుస్తున్నా....

 

ఆ మెరుపుల్ని పరదాల వెనుక దాచి ఉంచి....

ఎవ్వరికి చెప్పకుండా వెళ్ళిపోతాను.

 

నిదురలో వచ్చే కలవరింతలా

కన్నీటిలో వచ్చే నిరాశాలా ...

కాలి అందెల చప్పుడు లేకుండా

కనురెప్పలు అలానే తెరిచి ఉంచి

 

మనసు అంచుల మీద

తడిబట్ట బరువుగా అరవేస్తే

ఆ వత్తిడి కూడా తెలియకుండా

నిదురలో నడిచినట్లు నడుచుకుంటూ వెళ్ళిపోతాను

ఒకానొకప్పుడు పాతికేళ్ళ కిందటి

గొంతెత్తి ఏడ్చిన స్వేచ్చను తలుచుకుంటూ...

ఎవరిని సలహా అడగకుండా

సుదూరంగా వెళ్ళిపోతాను..

 

అలానే వెళ్ళినప్పుడు....

నాకోసం కన్నీరు కార్చకపోయినా భరిస్తాను

నాఫై ప్రేమతో తలబాదుకోకున్నా సంతోషిస్తాను.

 

ఎందుకంటే.....ఒక

మనిషిని ప్రేమిస్తే...

అది చుట్టుకొని నీ వైపే అల్లుకుని నీతోనే ఉండిపోతుంది.....

ఒక మనసును ద్వేషి స్తే...

అదీ చుట్టుకొని నిన్ను అల్లుకొని.....

నిన్ను కూడా దహించివేస్తుంది....