వినాయకునికో విన్నపం
- శారద అశోకవర్ధన్

శ్రీ పార్వతీపుత్ర లోకత్రయ స్తోత్ర
ఏరీతి వర్ణింతు నీగుజ్జు రూపంబు
నీచిన్ని తొండంబు నీ మందహాసంబు
నిను దర్శించి హర్షించి సంప్రీతి మ్రొక్కంగ
టెంకాయ అరటి పండ్లు పాలు తేనే.
నేతిగారెలు, బూరెలు, బంగారు పళ్ళెంబునందుంచి
నీకు నైవేద్యమున్ బెట్ట.
మది ఉబలాటపడుచుండ
అది ఏమి ఖర్మమో, ఎంత ప్రయత్నించినా
ఏదియున్ చెయ్యలేని నిస్సహాయ స్థితి
నన్నావరించె
చిల్లరెంత కుమ్మరించినా టెంకాయ రాదు
అరటి పండ్లసలె రావు, పాల పాకెట్లు రాకున్న
పాలుండవూ, జలశాఖ వారి దయ లేకున్న
నీళ్ళైన వుండవూ,
తేనెలోనా కల్తీ, నూనెలోనా కల్తీ,
నేనెట్లు నీకిత్తు స్వామీ,
నేతిగారెలున్ చేతమన్న
చచ్చిన జంతువు కొవ్వు కలిసిన నెయ్యి
పిండి కలిపి విక్రయించిన వెన్న
నేనెట్లు నీకిత్తు స్వామీ.
బంగారు పళ్ళెంబు అటులుండ
బంగారు ఉద్దరిణె అయిన తేలేని స్థితి
పరమేశ్వరా ఓ విఘ్నేశ్వరా
నాయందు దయవుంచి, ఈ విఘ్నాలు
తొలగించి, నన్ను మన్నించి
దొంగ వ్యాపారస్తుల పీకలన్ నొక్కి
వారిని శిక్షించుమా మమ్ము రక్షించుమా.
మీ అమ్మ పేరిట అన్నపూర్ణ అనబడే
ఈ భరత ఖండాన, నెయ్యి లేకున్నాగానీ
కష్టమేమీ లేదు నష్టమసలే లేదు
బంగారమూ లేకున్న బాధలేదు
కానీ పట్టెడన్నము లేక పసివారు పస్తుండ
చెత్త కుండీలలోని ఎంగిలాకుల కొరకు కుక్కలతో కుస్తీలు పడుచుండ
చూడలేకున్నాను ఆ బాధ బాపలేకున్నాను
నామీద దయవుంచి నన్ను మన్నించి
నీ చల్లని చూపులన్ మామీద ప్రసరించి
మమ్ము కాపాడవా
మమ్ము రక్షించవా,
ఉన్నదానిలో నినుగొల్చి ప్రార్ధించు భక్తాళికిన్
కొంగు బంగారమై కంటికిన్ రెప్పవై సద్భుద్దియు
విద్యయు నొసంగి,
కడుపు నిండా కూడు, తలదాచ నొక గూడు
ప్రసాదించి పోషింపు మంటిన్, కృపన్ గావు
మంటిన్, మహాత్మా, ఈశపుత్రా, పార్వతీ
తనయ ఇవే వందనముల్ శ్రీ గణేశా
నమస్తే, నమస్తే, నమస్తే నమః



