గుండె గుండెలో నిలుస్తా
- శారద అశోకవర్ధన్

వెలుగూ! నీకంత కాంతి
ఎలా కలిగిందో చెబుతావా ?
నాకూ కాస్త పంచి పెడితే
నాలో నింపుకుని
చీకట్లో నికృష్ట జీవితాన్ని గడుపుతూన్న
నిరుపేదల గుడిసెలకు పంపుతాను
వారి కళ్ళూ మెరిసేలాగా వారికో
దారి చూపిస్తాను.
చీకటి గొంగళీ కింద రహస్య క్రీడలు జరిపే
ముసుగు మనుష్యుల గుండెల్లో ప్రవేశిస్తాను
నా కళ్ళు తెరిపిస్తాను వెలుతురిని
చూస్తాను.
పేరు ప్రతిష్టలను డబ్బుతో కొనే పెద్ద మనుష్యులూ
సొంత లాభం కోసం వెర్రివాణ్ణి పెద్దవాణ్ణి చేసి
వెనకగా నవ్వుకునే దుర్మార్గులూ, దేశం పేరిట
పొట్ట నింపుకోవడమే కాదు
దేశాన్నే మింగేసే బకాసురులు
తరతరాలు గుర్తుంచుకునేలా గుణపాఠం నేర్పిస్తాను
వెలుగూ! నీ కాంతి కొంత నాకిచ్చావంటే
మూలమూలల ప్రవేశించి, వాకిట్లో, ఇంట్లో గుండెల్లో
అంతరాంతరాల్లో దాక్కున్న చీకటిని
కూకటి వేళ్ళతో పెకలించి తరిమి తరిమి కొడతాను
గుండె గుండెల్లో నేనే వెలుగై నిలుస్తాను.



