Facebook Twitter
సామాన్యుడి స్వగతం!

సామాన్యుడి స్వగతం!

                                                                                                                                         - శ్రీమతి శారద అశోకవర్ధన్

  

నిప్పుని చూస్తే భయంలేదు నాకు

నీరుని చూసినా భయంలేదు నాకు


నీచత్వపు నీడలన్నా

డొంక తిరుగుడు దారులన్నా

నీళ్లుకారిపోతాను

నిలువునా కంపించి పోతాను!


పామంటే భయంలేదు

విషమంటేనూ భయంలేదు

 

పాములా పాలుతాగి

పాలుపోసిన చేతినే కాటేసే మనిషంటే

గజగజ వొణికి పోతాను

తప్పక వారికి ఝడుస్తాను!


భాదంటే భయంలేదు

చావంటేనూ భయంలేదు


అసూయాతో ఉడికిపోతూ

ద్వేషంతో రగిలి పోతూ

అడుగడుగునా ఛస్తూ

అందంగా అభాండాలు వేసిచంపే

అల్పులంటే భయపడతాను

వారికి ఆమడ దూరంలో వుంటాను


కుళ్ళిపోతూన్న సమాజాన్ని చూసి

కుమిలి పోతుంటాను

కళ్లులేని ఈ లోకాన్ని చూసి

కన్నీరు కారుకుంటాను


అయితే,

మమతలెరిగిన మనసుకీ

మనసుతెలిసిన మనసుకీ

బానిసనై పోతాను

సర్వంమరచి సంతోషంగా

బంధానికి నిచ్చెనలు వేస్తాను.


ఎందుకో తెలుసా?

మనిషి నేను

మనసున్న మనిషిని నేను!


కానీ,

ఆకలి కడుపులోని నరాలను కాల్చేస్తున్నప్పుడు

ఆ భాధకి తట్టుకోలేక పసివారు రోడ్డుమీద

విసిరి పారేసిన ఎంగిలాకుల్లోని మెతుకులు గతికి

తృప్తి పడుతున్నప్పుడు,


ఈతి బాధల కోర్వలేక మరి వేరే దారిలేక

కాసుకోసం కామాంధుడి కౌగిట్లో కన్నె పిల్లలు నలిగి

బలై పోయినప్పుడు

అది చూసి నా హృదయం ముక్కలు ముక్కలైనప్పుడు,


నింగీ నేలా నీరూ నిప్పూ

ఒక్కటై నన్ను ఎదిరించినా

అవినీతి, అక్రమం, సమాజం కుళ్లూ, అసూయా

అన్నీకలసి నన్ను బెదిరించినా

లెక్క జెయ్యక లక్ష్యబెట్టక


నిద్రాణమై వున్న మానవత్వాన్ని

కొరడాతో కొట్టి మేల్కొలుపుతాను

ఉద్రేకంగా ప్రజ్వరిల్లుతూన్న

మారణ హోమాల మంటను

' ఉఫ్' మణి ఊపిరితో ఊది చల్లారుస్తాను.


నడుంకట్టి ప్రజల భుజం తట్టిలేపి

సిసలైన ప్రజాస్వామ్యాన్ని సృష్టిస్తాను.

సమతా మమతలను స్థాపిస్తాను.


ఎందుకో తెలుసా?

మనిషిని నేను

మనసున్న మనిషిని నేను!

సామాన్య మనిషిని నేను!