Facebook Twitter
అడగాలని వుంది

అడగాలని వుంది

                                                                                                              శ్రీమతి శారద అశోకవర్ధన్

సృష్టికర్త ఎప్పుడైనా కనిపిస్తే
    ఏమయ్యా బ్రహ్మయ్యా!

    నన్నెందుకు మనిషిగా పుట్టించావని
    కసితీరా అడగాలనివుంది

    ఉసిగొలిపే మనసెందుకు
    ఊరకనే ఇచ్చావని నిలదీసి
    పోట్లాడాలని వుంది!

    మట్టిగా వెసుంటే
    తాలిమినీ ఒరిమినీ
    నానిండా నింపుకుని
    నవదాన్యాలూ పండించి
    ఆకలి కడుపుల నింపేదాన్ని
    ఆనందాన్ని పొందే దాన్ని!

    చెట్టుగా పుట్టుంటే
    పచ్చగా ఎదిగెదిగే
    పూలూ కాయలూ పూస్తూ కాస్తూ
    పదుగురికీ పనికొచ్చే దాన్ని
    కల్పవృక్షమై నిలిచేదాన్ని.

    రాయీ రప్పగ పడివుంటే
    బండగా బతికే దాన్ని
    ఎండావానా నీడగ నిలిచేదాన్ని
    రచ్చబండనై వెలిగే దాన్ని!

    సుత్తినే నేనవుతే
    గట్టిగా చేయెత్తి కొట్టి
    ఇనుమూ జనుమూ ఏదైనా
    నిమిషంలో వంచేదాన్ని
    అహర్నిశలూ శ్రమించీ
    ' శహభాష్' అనిపించుకునేదాన్ని!

    కత్తినే నేనవుతే
    కాశిలా లేచొచ్చి
    దుష్టశక్తుల నరికే దాన్ని
    దుండగాల నా పేదాన్ని
    శిష్టరక్షణ చేసే దాన్ని!

    పశువుగానైనా పుట్టుంటే
    పాలూ పెరుగూ పంచేదాన్ని
    గోపాలునీతో జోడీగా
    గంగిగోవుగా పూజింపబడే దాన్ని

    కనీసం గొడ్డుగావైనా  పుట్టుంటే
    హలాన్ని పట్టుకు పొలాన్ని దున్ని
    ఫలాన్ని చూసి హర్షించేదాన్ని
    పనికొచ్చే పని చేస్తున్నానని తృప్తిపడే దాన్ని!

    చివరకు చీమాదోమా
    చిలుకా ఎలుకా ఏదైనా సరే పుట్టుంటే
    ఈర్ష్యాసూయలు ఏవీ లేక
    ఐకమత్యంతో బతికేదాన్ని
    సమభావాన్ని పంచేదాన్ని!

    అనవసరంగా మనిషిగపుట్టి
    మసుకుతోడు మమతలు పెంచి
    స్వార్ధం నిండిన ఈ లోకంలో
    మనలేక పోతున్నాను
    మాధనంతో మసి అవుతున్నాను.

    అందుకే సృష్టికర్త ఎప్పుడైనా ఎక్కడైనా కనిపిస్తే
    ఏమయ్యా బ్రహ్మయ్యా!

    నన్నెందుకు మనిషిగా పుట్టించావని
    కసితీరా అడగాలని వుంది
   
    ఉసిగొలిపే మన సెందుకు
    ఊరకనే ఇచ్చావని
    నిలదీసి పోట్లాడాలని వుంది.