Facebook Twitter
కొత్త దనం

కొత్త దనం

శ్రీమతి శారదా అశోకవర్ధన్

నిత్యంలాగే ఉదయిస్తాడు సూర్యుడు ఆ రోజూ...
    రోజూలాగే వీస్తుంది గాలి ఆనాడూ...
    అయినా ఆనాటికో ప్రత్యేకత!
    కలుగుతుంది కొత్త పులకింత!!
    అవే పూవులు అవే రాయలు
    అదే చేదూ అదే తీపి
    అన్నివేళలా  చూస్తూనే వున్నా
    ఆరోజే వాటికేదో నూతనత్వం
    అందరిలో రెట్టింపు ఉత్సాహం;
    నిన్నటిని పాతచొక్కాలా వదిలేసి
    ఆనాటిని కొత్తబట్టల్లా వేసుకుని
    కొత్త చివుళ్ళలాంటి  ఉవ్విళ్ళూరించే
    పచ్చని ఆశల మోపులతో
    కోకిలమ్మ కంఠంలోని  కొత్తరాగాలవోలె పలికే
    క్రొంగొత్త భావాలతో
    హాలాహలాన్ని సయితం హారించుకున్న హరుడిలా
    ఆనాడే మనిషిచేదుని దిగమింగే ధీరుడౌతాడు
    మర్నాటికల్లా  షరామామూలే
    మత్తుదిగిపోయిన తాగుబోతులా
    భీరువుగా మిగిలిపోతాడు!
    అందుకే నాకనిపిస్తుంది
    'కొత్త' రోజుతోనో సంవత్సరంలోనో లేదని
    మనలోనే మనమనస్సుల్లోనో వుందని!!
    నిత్యంలాగే ఉదయిస్తాడు సూర్యుడు ఆ రోజూ...
    రోజూలాగే వీస్తుంది గాలి ఆనాడూ...
    అయినా ఆనాటికో ప్రత్యేకత
    కలుగుతుంది కొత్త పులకింత!
    అవే పూలూ అవే కాయలూ
    అదే చేదూ అదే తీపీ
    అన్నివేళలా చూస్తూనే వున్నా
    ఆ రోజే వాటికేదో నూతనత్వం
    అందరితో రెట్టింపు ఉత్సాహం!