నా కంటే బాగా తెలుసా నీకు?
శ్రీమతి శారదా అశోకవర్ధన్

నీతులు చెబుతున్నావా మనిషీ నాకు?
నా కంటే బాగా తెలుసా నీకు?
ఆకలేస్తే విసిరి పారేసిన
ఎంగిలాకులు నాకి
కడుపు నింపుకుంటాను కానీ
అన్యాయం పొట్టలుకొట్టి
పొట్టనింపుకునే
పాడు పనులు చెయ్యను.
ప్రేమతో పాలుపోసి
చేరదీసిన వానికి
ప్రాణం పోయినా
విశ్వాసంతో సేవ చేస్తాను కానీ
స్వార్ధం కోసం
కసాయి వాడిలా
పచ్చినెత్తురు త్రాగే
పరమ కిరాతకుణ్ణి కాలేను
నీతులు చెబుతున్నావా మనిషీ! నాకు
నా కంటే బాగా తెలుసా నీకు?
నాటికి నేటికీ ఒకే విధంగా
ప్రపంచమంతా మారినా
ఇసుమంతైనా మారకుండా
మా జాతిని నిలబెట్టుకున్నాము
మా గౌరవం కాపాడుకున్నాము.
అడుగడుగునా రంగులుమార్చే నీవు
నాగరికత పేరిట
నీ దేశ సభ్యతను మంటగలిపి
పర సంప్రదాయాలతో
ఐకమత్యాన్ని వీడి
ఆత్మవంచన చేసుకుంటూన్న నీవు
నీతులు చెబుతున్నావా నాకు
నాకంటే బాగా తెలుసా నీకు?
ఒక కుక్క మొరిగితే.
పది కుక్కలూ మొరుగుతాయి.
ఒక కుక్కని కొడితే
పది కుక్కలూ మీదపడి
రక్కుతాయి.
ఏదీ మీలో ఈ సహజీవనం?
ఏదీ మీలో ఈ ఐకమత్యం?
పేరు తెచ్చే మచ్చలేని జీవితాలు మావి.
ఇప్పుడు చెప్పు__
నీతులు చెప్పే మనిషీ!
నాకంటే బాగా తెలుసా నీకు?



