Facebook Twitter
ఎవడి గోల వాడిది

ఎవడి గోల వాడిది

కండ్లకుంట శరత్ చంద్ర

"ఛీ ఛీ....ఈ భావకవిత్వాలతో జనాన్ని నిద్ర పుచ్ఛుతున్నారు" భావకవులను ద్వేషిస్తూ,
రింగులు రింగులుగా పొగ ఊదేస్తూ ఆవేశంగా విప్లవగీతాలు రాసిపారేస్తున్నాడు.....ఓ కవి!
"విప్లవానికి నిర్వచనం తెలీదు-విప్లవ కవిత్వం రాస్తారట.... హ్హ హ్హ హ్హ హ్హ!" 
విప్లవ కవుల్ని ఈసడిస్తూ, కలల్ని భోంచేస్తూ.
సుశుప్తావస్టలో భావగీతాలు గీకిపారేస్తున్నాడు ఇంకో కవి!
మందు కొడుతూ దిగంబర కవిత్వం రాసి 
"వాస్తవాన్ని నగ్నంగా నిలబెడుతున్నా"నంటాడొక మందు జీవి!
పెళ్ళాన్ని విరగబాదుతూ, స్త్రీవాద కవిత్వం రాసి, 'స్త్రీలు ఉద్యమించా'లంటాడొక  స్త్రీవాద  కవి! 
ఏ.సీ. గదిలో జీడిపప్పు తింటూ, "పెద్దల మాట చెల్లదులే -పేదల మాటే నెగ్గునులే..."
అంటూ అఠాణ రాగంలో పాడేందుకు అభ్యుదయ గీతం రాసి...
స్వంతకారులో స్టూడియోకి బయలుదేరాడు సినీ కవి!
"రాముడు అన్నం తిన్నాడు,నిద్రపోయాడు!" అనే వాక్యాల్ని 
"తిన్నాడు రాముడు అన్నం,పోయాడు నిద్ర!"అనే వాక్య నిర్మాణం తో వ్రాసి
కవిత్వమంటే అదేనని నమ్మేసి పబ్లిషర్లను వెతుక్కుంటున్నాడు ...ఆ అమాయక ఆశాజీవి!
వొంటినిండా బంగారునగలు దిగేసుకుని,పట్టుచీర కట్టుకుని భక్తుల భారీ విరాళాలు స్వీకరిస్తూ...
"అశాశ్వతమైన వాటిపై మోజు తగ్గించుకొండి "అని తత్వబొధలు  చేస్తూంది...ఓ ఆధ్యాత్మిక మాత!
'మా మతమే గొప్ప!మీ మతం..అబ్బ- యాక్..థూ!'
ప్రతి మతంలోనూ దాగున్న కోట్లాది కుహనావేత్తల భాష!
సత్యాన్ని అందరూ తొక్కేస్తే -
అది పాతాళ కుహరాల్లొకి జారి 
లావాతో కలిసి ప్రవహిస్తోందనీ-
క్రోధావేశాలతో జ్వలిస్తోందనీ...
సత్యాన్వేశాకులకు తెలీదు...!!!