Facebook Twitter
(తల్లి) ప్రేమంటే

|| (తల్లి) ప్రేమంటే ? ||



గుక్క పెట్టి ఏడ్చే బిడ్డను
అక్కున జేర్చుకొనే తల్లి కంట్లోని
నీటి పొర చెబుతుంది

వందమందిలో ఉన్నా
ఆకలితో అల్లాడే పసి పాపకు
చిరుగుల చీర కప్పి
స్తన్యమందిస్తూ
ఆ తల్లి మరిచే సిగ్గు చెబుతుంది

మండువేసవిలో
ఆటలకి పరుగులెత్తే
పిల్లడి జేబులో
తల్లి ఉంచే ఉల్లి చెబుతుంది

తడిసి వచ్చిన బిడ్డడి
తల తుడిచి గుండెలపై
తల్లి వ్రాసే విక్స్ వాసన చెబుతుంది

బిడ్డకు సూదిమందు వేస్తుంటే
బాధతో విలవిలలాడుతూ
ఆ తల్లి మూసుకొనే కన్ను చెబుతుంది

గడగడలాడించే చలిలో
బిడ్డ పాదాల వేళ్ళపై
కంబళి సరిచేసే
అమ్మ వేళ్ళ వణుకు చెబుతుంది

తల్లికి తలకొరివి పెట్టేందుకు
నిప్పుకట్టె పట్టుకొనే బిడ్డ చేయి
ఎక్కడ కాలుతుందో?
అని మూసిన కన్నుల చాటున
ఆందోళన పడే నిర్జీవ నేత్రాలను
అడిగితే  చెబుతుంది 


     
రచన - ఆర్.వి.యస్.యస్. శ్రీనివాస్
rvsssrinivas666@gmail.com