Facebook Twitter
వ్యక్తిత్వవాదం

వ్యక్తిత్వవాదం

 

 

"శకూ, ఏమయింది?? ఆర్ యూ ఓకే??" కళ్ళూ, ముఖమూ ఎర్రబడి ఏడుస్తున్నట్టుగా ఉన్న స్నేహితురాలిని చూస్తూ అడిగింది మంజుల.
" ఏమీ లేదు లే, మంజూ! ఐ యాం ఫైన్" అంది శకుంతల స్నేహితురాలిని చూస్తూ నవ్వడానికి ప్రయత్నిస్తూ.
" లేదు, నువ్వేదో దాస్తున్నావు. ఆనందం పంచుకుంటే పెరుగుతుంది, బాధ పంచుకుంటే తగ్గుతుంది. నీ కభ్యంతరం లేకపోతే,  నిన్ను వేధిస్తున్న విషయమేమిటో చెప్పు. నాకు వీలైతే సలహా చెప్తాను. లేదా కనీసం నీ బాధ తగ్గి మనసు తేలిక పడుతుంది" అంది మంజుల అంతకంటే బలవంత పెట్టడం ఇష్టం లేదు ఆమెకి.


" నాకూ, శంకర్ కీ" అంటూ ఆగిపోయింది శకుంతల. ఆమె కళ్ళ నిండా నీళ్ళు.
" ఏమయింది నీకూ, శంకర్ కీ? ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. హాయిగా మూడేళ్ళనించీ ఆనందంగా కాపురం చేస్తున్నారు." అంటూ చెప్తున్న స్నేహితురాలి మాటలకి అడ్డువస్తూ అంది శకుంతల.
" అలాగే అనుకున్నాను నేను కూడా. కానీ ఈ మధ్యన ఎందుకో అలా అనిపించడం లేదు" అంది బాధగా.
" ఈ మధ్యనా? అంటే?" అంది మంజుల.
" దాదాపుగా సంవత్సరం నించీ!" అంది శకుంతల.
"వాట్!! అవునా?? ఏమయింది" అంది మంజుల.
"ఇదీ,  అని చెప్పలేను మంజూ, ఏమిటో దేనిలోనూ మా ఇద్దరికీ కుదరడం లేదు. అలా అని రోజూ పోట్లాడుకుంటామని కాదు. ఇదీ అని చెప్పలేని భావన, కానీ మా మేరేజ్ వర్క్ అవుట్ మాత్రం కావడం లేదు. ప్రతి రోజూ నా మనసులో మెదులుతున్న భావాలు ఇవి.
" శంకర్ కేమైనా కొత్త అలవాట్లు" మొహమాటంగానే అడిగింది మంజుల.


" ఛా అలాంటివేమీ లేవు. తనూ ఎప్పటిలాగే ఉన్నాడు. నేనూ ఎప్పటిలాగే ఉన్నానని అంటాడు. అంటాడు. కానీ ఎంతో మంచి స్నేహంతో  మొదలైన మా బంధం అప్పటిలా కొనసాగడం లేదన్నది మాత్రం వాస్తవం. అప్పుడు ఎంతో బాగా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఒకరికోసం మరొకరికి సమయం లేనట్టుగా అయిపోయాము. ‘దేర్ ఈజ్ నతింగ్ ఇన్ కామన్ ఫర్ అస్.’ అంది శకుంతల బాధగా.
" అరే,అవునా? బిజీ వర్క్, స్త్రెస్. వీటివల్ల అలా అనిపిస్తోందేమో, పోనీ ఒక వారమో, పదిరోజులో పాటు శెలవు పెట్టి మీరిద్దరే ఎక్కడికైనా వెళ్ళి వస్తే! అంటే రోజువారీ జంఝాటాలన్నీ లేకుండా ఉంటే".. అని అర్దోక్తిలో ఆపింది మంజుల.
" లేదు మంజూ, అన్నీ ప్రయత్నించాం కానీ ఏమిటో తెలీదు.నాకు మరో దారి కనబడడం లేదు. ఒకే ఇంట్లో ఉంటూ ఇలా అపరిచితుల్లా ఉండడం చాలా బాధాకరం.” అంది శకుంతల.
" మరి ఎందుకు బాధపడుతున్నావు? ఏడుస్తున్నావు కూడా!!" అంది మంజుల బాధగా.ంత చదువుకుని, అన్నీ తెలిసికూడా. ఒక్క బంధాన్ని నిలబెట్టుకోలేకపోయామా? అని బాధగా ఉంది. మంచి స్నేహితుల్లా మొదలుపెట్టాము. అలా మొదలయిన మా బంధం ఇలాంటి స్థితి కి రావడం అనేది నేను అస్సలు ఊహించని విషయం. ఎక్కడ తేడా వచ్చిందా?  అని అనుకుంటూ ఉంటేనే బాధగా అనిపిస్తోంది. అంతే!" అంది శకుంతల.
                         

   --------------------


నాలుగేళ్ళ క్రితం..
కాచిగుడా, బెంగుళూరు ల మధ్యన ప్రయాణించే కాచిగుడా ఎక్స్ ప్రెస్ లో కూర్చుని ఉంది శకుంతల. ఏ.సీ టూ టయర్ కోచ్ లో కింది బెర్త్ ఆమెది. కూర్చుని పుస్తకం చదువుకుంటోంది ఆమె. ‘ఇంక బయలుదేరాలి ట్రెయిన్ ‘అనుకుంటూ ఉంది ఆమె. అంతలో గబ గబా వచ్చాడు ఒకతను. జీన్స్ పైన కుర్తా వేసుకున్నాడు. నీట్ గా షేప్ చేసుకున్న గడ్డం. చేతిలో ఐ పాడ్,వాటర్ బాటిల్. భుజానికి బాక్ పాక్. పరిగెడుతూ వచ్చినట్టున్నాడు. కూర్చుని మంచినీళ్ళు తాగి చుట్టూ చూశాడు. వెంటనే ట్రెయిన్ మొదలయింది. " ఓ నైస్!!" అన్నాడు.
శకుంతల అప్పుడు గమనించింది అతన్ని. తన వయసే ఉంటుందేమో అతనికి. ప్రపంచంతో తనకి సంబంధం లేనట్టుగా, ఆనందం అంతా తన సొత్తయినట్టుగా ఉన్నాడు. చేతిలోని ఐ పాడ్ లో ఏదో చదువుకుంటున్న్నాడు, మధ్య మధ్యలో ఫోన్ లు మాట్లాడుకుంటున్నాడు. అతను ఫోన్ లో చెప్పిన మాట వింటే ఆశ్చర్యం వేసింది ఆమెకి.
" యెస్. ఐ మేడ్ ఇట్, ట్రెయిన్ ఆఖరి నిమిషంలో ఎక్కితే ఆ ఆనందమే వేరు" అన్నాడు.
" అంటే కావాలనే ఎక్కారా?” మనసులో అనుకుంటున్నాననుకుంటూనే పైకే అనేసింది అప్రయత్నంగా.


" ఓ! మీరు విన్నారా? అవును. నాకు చిన్నప్పటినించీ ఆఖరినిమిషంలో కదలడానికి సిధ్ధంగా ఉన్న రైలు ఎక్కడం అంటే చాలా ఇష్టం. ట్రైన్ బయలుదేరడానికి అరగంట ముందే స్టేషన్ కి వచ్చి కూర్చోవడం లాంటివి చాదస్తం లా అనిపిస్తాయి నాకు. ఇలాంటి ఇష్టాలు నాకు చాలా ఉన్నాయి లెండి. ముఖ్యంగా ఏ బంధనాలు లేకుండా జీవితాన్ని నాకు నచ్చిన రీతిలో జీవించడం అంటే నా కు చాలా ఇష్టం." అన్నాడు నవ్వుతూ.
" సారీ, వినాలని వినలేదు" అంది శకుంతల.
" పరవాలేదు. నా జీవితం ఒక తెరిచిన పుస్తకం. మక్కికి మక్కీగా అనువదించాను కదూ! . మై లైఫ్ ఈజ్ ఏన్ ఓపెన్ బుక్!  “ అని నా భావన అన్నాడు నవ్వుతూ. 
ఆతర్వాత ఇద్దరూ కబుర్లలో పడ్డారు. అతని సమక్షంలో కాలం ఎలా గడిచిందో తెలియలేదు అనుకుంది. రెండు పేజీలకి మించి పుస్తకం కదలలేదు ఆమెకి. ఇద్దరూ నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ కాలాన్ని అనాయాసంగా కరిగించారు.


" వెరీనైస్ మీటింగ్ యూ. మనం మళ్ళీ కలవాలి “ అంది శకుంతల దిగేముందు అతనితో."
" ఓ యస్, తప్పకుండా. మీతో గడిపితే సమయమే తెలియలేదు నాకు. ఐ మస్ట్ బీ ఆనెస్ట్ విత్ యూ" అన్నాడు. ఇద్దరూ ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు.
ప్రత్యేకంగా ఫోన్ చేసి కలవలేదు కాని, ఆ తర్వాత కూడా అతను చాలా సార్లు గుర్తొచ్చాడు ఆమెకి. ఒకనాటి సాయంత్రం అతనే ఫోన్ చేశాడు. ఇంచుమించుగా అవే భావాలు అతనూ వ్యక్తపరిచేసరికి ఆమెకి ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగింది. అలా పెరిగిన పరిచయం ప్రేమగా మారడానికి ఎక్కువ రోజులు పట్టలేదు.
" నన్ను నన్నుగా చూసి ఇష్టపడేవాడిని మాత్రమే నేను ఎప్పుడూ కోరుకున్నాను. స్త్రీల పట్ల శంకర్ కున్న ఉన్నతమైన అభిప్రాయాలు, వారి వ్యక్తిత్వానికిచ్చేవిలువా నన్నెంతో ఆకట్టుకున్నాయి” అని చాలాసార్లు మంజుల తో చెప్పింది శకుంతల. 


మరొక ఆరునెలల తర్వాత తమ బంధానికో సంబంధాన్నివ్వాలని అనుకున్నారు శంకర్, శకుంతల. చాలా సింపుల్ గా ముఖ్యమైన బంధుమిత్రుల మధ్యన వారి పెళ్ళి జరిగి మూడేళ్ళు కావస్తోంది. 
మొదట్లో ఇద్దరూ చాలా బాగా ఉండేవారు. రాను రాను ఏదో తెలియని దూరం పెరిగినట్టసాగింది. పుస్తకాలు చదువుకుంటూ అతనూ, ఇంటి పనీ, ఆఫీసు పనీ చేసుకుంటూ తనూ ఇలా ఒకరికోసం ఒకరికి సమయం లేనంతగా అయిపోయింది. మొదట్లో గొప్పగా కనిపించిన రెండో వాళ్ళ అభిప్రాయాలు ఇప్పుడంత గొప్పగా కనిపించడం లేదు, అనిపించడం లేదు.
మన జీవితాన్ని కేవలం మన కిష్టమైనట్టుగా జీవించాలి అని అతను చెప్పే మాటలని మొదట్లో ఎంతో ఇష్టపడిన శకుంతల ఇప్పుడు అతనన్నింటికీ అలాగే మాట్లాడుతుంటే మెచ్చేది కాదు. 
అలాగే ఆమె చెప్పిన విషయాలు కూడా. నువ్వు చెప్పిన మాటలు విని నువ్వెంతో ధైర్యవంతురాలివనుకున్నాను. ఇలా ఆఫీసు లో అరగంట లేటయిత నన్ను తోడు రమ్మనడం కరెక్ట్ కాదు. నేను బొమ్మ వేసుకుంటున్నాను అనేవాడు ఫోన్లో. ఇలా చిన్న విషయాలనించి మొదలైన అభిప్రాయ భేధాలు ఇద్దరిమధ్యా పెరుగుతున్న దూరాన్ని మరింత పెంచాయి.

 

" అంతే మంజూ! పెద్ద విషయాలా?  అంటే కాదు, కానీ ఒక్క విషయం మాత్రం నిజం. తెంచుకునేంత పెద్ద కారణాలు లేవు, పెంచుకుందామనేంత గొప్ప బంధమూ లేదు అని చెప్పాలి. చేదైనా ఇది మాత్రం నిజం" అంది శకుంతల గతంలోంచి వర్తమానంలోకి వస్తూ.
"ఐతే ఇప్పుడేమిటి దారి?" అంది  మంజుల ఆదుర్దాగా.
“ఏమీ లేదు. ఇలా కలిసి ఉండడం కంటే విడిగా ఉండడం లేదా విడిపోవడం మంచిదనిపిస్తోంది.” అంది
" వాట్! ఆలోచించే మాట్లాడుతున్నావా?" అంది మంజుల.
" అవును, వినడానికి బాధగా ఉన్నా వాస్తవం ఇది". సర్దుకుపోవడం అనేది నా మనసుకు నచ్చనిది. రాజీ పడలేని మనస్థత్వం అతనిది. మమ్మల్ని కలిపినవీ అవే, ఇప్పుడు కలిసుండనీకుండా అడ్డుపడుతున్నవీ అవే. పరస్పర అంగీకారంతో విడిపోదామని అనుకుంటున్నాం, కానీ జీవితాంతం ఫ్రెండ్స్ గా మాత్రం ఖచ్చితంగా ఉంటాం" అంది.
ఆశ్చర్యంగా వింది మంజుల.


"కనీసం నువ్వైనా ఇంకొక అవకాశం ఇవ్వచ్చు కదా!" అంది మంజుల.
" ఇవ్వాలా? నేను మాత్రమే ఇవ్వాలా? ఎవరికి? నాకా, అతనికా? చెప్పు మంజు. ఇద్దరు వ్యక్తులను కలిపే ఏ బంధమైనా ఆ ఇద్దరి మీదా ఆధారపడి ఉంటుంది కదా! అలాంటప్పుడు నేను మాత్రమే ఎవరికైనా ఇంకో అవకాశాన్ని ఎందుకివ్వాలి? చెప్పు!" అంది శకుంతల ఆవేశంగా.
ఒక క్షణం సేపు మాట్లాడలేదు మంజుల. ఆ తర్వాత అంది " అయితే డిసైడ్ చేసేసుకున్నారన్నమాట" అంది.
“దాదాపుగా!! “అంది శకుంతల.
ఆ తర్వాత వ్యవహారాలన్నీ చక చకా జరిగాయి సినిమాలో రీళ్ళలాగ. ఇది జరిగిన కొన్నాళ్ళకి ఒకరోజు ఆఫీసుకు వస్తూనే
"ఆలీమోనీ/మనోవర్తి వద్దన్నావా? ఎందుకు? హీ ఈజ్ వెరీ రిచ్, నిన్ను సపోర్ట్ చేసినంత మాత్రాన అతని ఆస్థి రవ్వంత కూడా కరగదు తెల్సా! సిరి రా మోకాలొడ్డడమంటే ఇదే" అంది మంజుల చిరుకోపంతో స్నేహితురాలిని చూస్తూ. 


" మంజూ నువ్వు కూడా ఇలానే అంటున్నావా?" అంది శకుంతల రవ్వంత బాధతో.
" కాక, ఎలా అనమంటావు? నువ్వేమీ అతన్ని కష్టపెట్టడం లేదు కదా. చట్టపరంగా నీకు రావాల్సింది తీసుకుంటే తప్పేమిటి చెప్పు?" అంది.
" చట్టపరంగానా? ఎలా?" అంది.
" అదేమిటి భార్యకీ, పిల్లలకీ రక్షణ కల్పించేవాడే భర్త. ఏదైనా కారణం వల్ల విడిపోవలసి వస్తే వాళ్ళని జీవితాంతం ఆదుకుని పోషించవలసిన బాధ్యత అతనిదే కదా!" అంది మంజుల.
" కరక్టే మంజూ!.. అది ఒకప్పుడు భర్త మీదే ఆధారపడి జీవితాన్ని గడిపే ఆడవాళ్ళకి నూటీకి నూరుపాళ్ళూ వర్తిస్తుంది.కానీ సర్వ స్వతంత్రులమంటూ చెప్పుకునే మనలాంటివారికి వర్తిస్తుందా? నువ్వే చెప్పు. స్త్రీ స్వేచ్చ, సమానత్వం, మేము ఎందులోనూ మగవారికి తీసిపోము అంటూ నినాదాలు చేసే మనమే ఇలాంటివి ఆశించవచ్చా?


 నా సంగతే చూడు. అమ్మా, నాన్నలు లేరు. నానా సంపాదనని ఆశించేవారు కానీ, దానిమీద ఆధారపడినవారు కానీ ఎవరున్నారు? ఒక వేళ ఉన్నా,  వాళ్ళు నా బాధ్యత అవుతారు కానీ శంకర్ కేం సంబంధం ఉంటుంది దీంట్లో? పిల్లలూ లేరు, తండ్రిగా వారి బాధ్యత వహించడానికి. అలాంటప్పుడు నేను అతన్నుంచి ఏదైనా ఎలా ఆశించగలను?
 ఇవన్నీ పక్కన పెడితే మొదటినించీ స్థిరమైన భావాలతో పెరిగాను, వ్యక్తి స్వేచ్చను, ముఖ్యంగా స్త్రీ స్వేచ్హను ప్రేమించే నేను నా వ్యక్తిత్వాన్ని పక్కకు పెట్టి అతనిదగ్గరనుంచి ఎదైనా ఆశిస్తానని ఎలా అనుకున్నావు? మనకిష్టమైనప్పుడు స్త్రీవాదపు మాటలు చెప్పి, లేనప్పుడు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ వారిమీద ఆధారపడి ఉండడం నా వల్ల కాదు.
ప్రేమ పేరుతో అబ్బాయిలని మోసపుచ్చి తమ అవసరాలు గడుపుకుంటున్న అమ్మాయిల గురించి వింటున్నాము, పెళ్ళి చేసుకుని ఆ తర్వాత వారిని సాధించి విడాకుల పేరిట లక్షలూ, కోట్లూ గుంజుతున్న యువతుల గురించి చదువుతున్నాం. గృహ హింస లాంటి చట్టాల్ని తమ స్వార్ధం కోసం వాడుకుంటున్న వీర వనితలెందరో నీకూ తెలుసు.


ఇవన్నీ చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఇది  కాదు, అవకాశ వాదం అని. మనిషెప్పుడూ అవకాశ వాదే కాదనను కానీ నేను మాత్రం అలా కాలేను. నా ఉద్యోగం, నా వ్యాపకాలు, నా స్నేహితులూ నాకున్నంతకాలం నాకేమీ ఎదురులేదు. అన్నట్టు నా స్నేహితుల్లో శంకర్ కూడా ఉంటాడు సుమా!  ఇది స్త్రీవాదం కాదు మంజూ, వ్యక్తిత్వవాదం.అంది నవ్వుతూ.

 

రచన:- సుభద్ర వేదుల