Facebook Twitter
స్వయంసిద్ధ

స్వయంసిద్ధ

 


సెల్ ఫోన్  మోగుతోంది.
ఎవరా? అని చూస్తే సత్యం మావయ్య దగ్గర్నుంచి.
“హలో మావయ్యా,చెప్పు  ఏమిటి విశేషం” అన్నాను
కొన్ని క్షణాల  పాటు మౌనం,
నేను మళ్ళీ మాట్లాడే లోపలే  “మీ అత్తయ్య,ఇల్లు వదిలి వెళ్ళిపోయింది రూపా,”
ఒక్క క్షణం  నా మెదడు మొద్దు బారిపోయింది
“మావయ్యా! ఏం మాట్లాడుతున్నావు,వదిలేసి వెళ్ళడం…. నువ్వు చెప్పేది ఏమి అర్ధం కావటం లేదు, ఎక్కడికి వెళ్ళింది?ఎందుకు వెళ్ళిపోయింది? కాస్త అర్థమయ్యేలా చెప్పు”
“ఇంక ఇంతకంటే  వివరంగా ఏమి చెప్పలేను రూపా!”,ఆయన గొంతు వణికింది.


“సరే మావయ్యా,నేను ఇప్పుడే మీ ఇంటికి వస్తున్నాను”
అని ఫోన్ పెట్టేసి,మావయ్య ఇంటికి బయలుదేరాను. అత్తయ్య గురించి ఆలోచిస్తూనే డ్రైవ్ చేస్తున్నాను. ఎందుకిలా జరిగిందా అని.
అత్తయ్య అందరి లా కాదు తనకంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్త్విత్వం గల స్త్రీ.బంధువులందరూ కూడా సత్యం పెళ్ళాం ఎక్కువగా మాట్లాడదు,పొగరు అహంభావి అనుకునే వారు. కాని  చాల మందికి తెలియని విషయం ఆవిడ ఒక విజ్ఞాన ఖని అని.అత్తయ్య చదవని పుస్తకం లేదు.ఆవిడకి ఇష్టమైన పుస్తకం భగవద్గీత. ఆవిడ ఎన్నో సార్లు చదువుతుండగా  చూసాను. “అత్తయ్యా నీకు బోర్ కొట్టదా అస్తమాటు ఇదే చదువుతావు?”అని అడిగేదాన్ని.


దానికి అత్తయ్య ఒక్కటే మాట అంది  “ఆ శ్రీకృష్ణ భగవానుడు  మనకు ఇచ్చిన అపురూపమైన కానుక గీత. మన దేహం ఒక మెషిన్ అయితే గీత దాని మాన్యువల్,ఆ భాగాలను ఎలా ఉపయోగించు కోవాలో అన్నది ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి. అందుకే గీత  మనకి మార్గనిర్దేశకం. మనకే కాదు ప్రపంచదేశాలు కూడా అది నిజమే నమ్ముతున్నారు” అని అంది స్త్రీల సమానత్వం జీవితంలో, స్వేఛ్చ ,  తోటి మనిషికి సాయపడటం. సాటి మనుషులను అర్ధం చేసుకోవడము తరచూ వీటి గురించే మాట్లాడేది..
“పెళ్లి, పిల్లలు చీరలు నగలు, నోములు పేరంటాలు, ఒకప్పుడు ఇవన్నీ స్త్రీ ముఖ్యావసరాలే, కాని ఇప్పుడు కాలం మారింది! స్త్రీలు అన్ని రంగాలలో ముందంజ వేస్తున్నారు. ముఖ్యంగా అట్టడుగు వర్గాల వాళ్ళకోసం, అణచి వేయబడే వాళ్ళకోసం, ఎన్నో కష్ట నష్టాల గూర్చి ఎంతో శ్రమ పడుతున్నారు. అలాంటి వాళ్ళ కోసము మన వంతు  సాయం చెయ్యలేమా, కొంచెము కూడా మానవత్వం చూపలేమా?అని అనిపిస్తుంది. అందుకు ముఖ్యకారణం అలసత్వం. దేనికి ముందుకు రాక పోవడం. మన చేతులు  మనమే ముడుచుకొని ఉండటం. 


ఇలా అన్నానని తెలిసి’ఎవరో అడిగారు నన్ను  అదేంటి  శారదా? మన ఆడవాళ్ళకుండే బాధ్యతలు,బంధనాలు,ఇబ్బందులు అన్నితెలిసే మాట్లాడుతున్నావా?’  అంటే దానికి నా జవాబు అవును మనకి ఎన్నో ఇబ్బందులు,బంధనాలు,భాద్యతలు ఉన్నాయి. కాని వాటిని అధిగమించి మన కంటూ ఒక స్పేస్ (చోటు) ని సృష్టించుకోవాలి.అప్పుడు ఇలాంటివన్నీసాధ్యపడుతాయి.అందుకు ఇంట్లో వాళ్ళ సహకారం కూడా కావాలి. కాని మనందరికీ ఆ సహకారమే లోపిస్తోంది” అనేది.


ఇంత విప్లవాత్మక భావాలున్న అత్తయ్య పనిమనిషి సాయం లేకుండానే ఇంట్లో పన్లన్నీచేసుకొనేది. ఇప్పటి దృష్ట్యా చూస్తే వాళ్లది పెద్ద ఫ్యామిలీ . అయితేనే అన్ని పనులు అలసట లేకుండా చిరునవ్వుతో చేసుకుపోయేది. విసుగన్నది ఏ కోశానా కనిపించేది కాదు. ఈవిడ ఒక్క రోజు ఇంట్లో లేక పోతే అందరూ ఎలా ఉంటారబ్బాఅనుకొన్నా? ఆ ముచ్చటా జరిగింది. ఒకసారి అత్తయ్య వాళ్ళ పుట్టింట్లో ఏదో శుభకార్యం ఉంటే వెళ్ళింది. ఇక చూసుకో ఇల్లు ఒక కిష్కింధకాండ అయిపో యింది. వెంటనే వచ్చెయ్యమని మావయ్య ఫోన్ల మీద ఫోన్లు పాపం  …అత్తయ్య తిరుగు టపాలో   పరుగులు పెట్టుకుంటూ వచ్చేసింది. అప్పుడు అత్తయ్యతో  కోపంగా అన్నాను“నువ్వే నేర్పుతున్నావు వీళ్ళకి ఈ సోమరితనం అంతా”అని. అప్పుడు అత్తయ్య మొహం లో ఒక చిత్రమైన నవ్వు కనిపించింది. నాకు అర్ధం కాలేదు.మావయ్య వాళ్ళ ఇల్లు రావడం తో నా ఆలోచనలకి బ్రేక్ పడింది.


నేను వెళ్లేసరికి  మావయ్య ఎవరి తోనో ఫోన్ మాట్లాడుతున్నాడు.మావయ్య కొడుకు నితీష్  ఇంకో పక్కన సెల్  ఫోన్ లో మాట్లాడుతున్నాడు.
నితీష్ భార్య,నీనా సింధీ అమ్మాయి . నా రాకను గమనించి కూర్చోమని సైగ చేసింది.
అక్కడ  వాతావరణం, చాలా గంభీరంగా ఉంది .మావయ్య వంద ఏళ్ళు వార్ధక్యం పై బడ్డట్టు ఉన్నాడు.
నేను కిందటి సారిచూసినప్పుడుఎంతో హుషారుగా ఉన్నాడు. వారం లో ఎంత తేడా! మావయ్య గురించి ఆలోచిస్తున్న నేను, నితీష్   పలకరింపు తో,తేరుకొని అటువైపు చూసాను.


నా కళ్ళలో కనిపించిన ప్రశ్నలని చూసి నితీష్ “అమ్మ అన్ని బంధనాలు తెంచుకొని వెళ్ళిపోయింది రూపా!”,అనిఅన్నాడు. “మిగతా చోట్ల వింటున్నాము.తల్లితండ్రులను ఆశ్రమం లో చేర్చిన  పిల్లలు అని,  కాని మా ఇంట్లో వింత ఏమిటంటే  మా అమ్మే తనంత తానుగా ఆశ్రమ జీవితానికి వెళ్ళిపోయింది.”
“దానికి కారణం నేను చెబుతాను” అంది నీనా ఇంగ్లీష్ లో. “ఆంటీ, హైలీ ఇండిపెండెంట్,ఇన్ని రోజులు తన స్వాభిమానాన్ని బహిర్గతం చెయ్యలేదు.కాని ఇప్పడు ఆ సమయం వచ్చింది.తను ఎలా ఉండాలని కోరుకుందో ఆ జీవితం లోకి వెళ్ళిపోయారు.  రూపా” అని అంది.

 
“ఆ !ఆ! అలాగే, నేను మాట్లాడి మీకు ఏ సంగతి చెబుతాను,నమస్కారం’ అని ఫోన్ పెట్టేసి నా వైపుకి తిరిగి,నా కళ్ళలోని ప్రశ్నలు చూసి“రా,రా ఇది గో చూసావా,ఈ వయసు లో నన్ను మీ అత్తయ్య వది లేసి వెళ్ళిపోయింది”. అంటూ నన్ను పట్టుకొని బావురుమన్నాడు.వెంటనే నేను ఆయన చెయ్యి పట్టుకొని సోఫా లో కూర్చో బెట్టి లోపలకు వెళ్లి మంచి  నీళ్ళు తెచ్చి ఇచ్చాను. ఆయన కొంచెం తేరుకున్నాక“మావయ్యా,అసలు సంగతి ఏంటి,అని” అడిగాను


“నేను నోటి తో ఏది చెప్పలేను, ఇదిగో,  అత్తయ్య  రాసిన ఉత్తరం, చదువు”అంటూ,తన జేబులోంచి తీసి ఇచ్చాడు.
ఆ ఉత్తరం అందుకొని గబగబా చదివి మడిచి నా బాగ్ లోకి తోసేసాను.
“సరే మావయ్యా,!ముందు భోజనం చెయ్యి  రా”అంటూ, ఒక రకంగా ఆయనను బలవంతంగానే డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకొని వెళ్ళాను.
ఇంటికి ఫోన్ చేసి,శ్రీకాంత్ కి చెప్పి ఈ పూట నేను ఇంటికి రాను. ఇంట్లో కొంచెము మేనేజ్ చెయ్యి అని చెప్పాను. అవతలనుంచి  శ్రీకాంత్, “ఓకే ఓకే, నా సాయం ఏమన్నా కావాలంటే చెప్పు,మనం కలిసి చేద్దాము”అని అన్నాడు.
“అలాగే  శ్రీకాంత్ తప్పకుండా,ఇదిగో ఇప్పుడు నేను, నితీష్,నీనా మాట్లాడుకొని  అవసరం అయితే నీకు చెబుతాను”అని ఫోన్ పెట్టేసాను.
ఇంతలో మావయ్య పైకి తన రూమ్ లోకి  వెళ్ళడం చూసి, “అసలు ఏమైంది వాళ్ళిద్దరి మధ్య, ఎందుకు శారద అత్తయ్య ఇంతటి కఠోర నిర్ణయం తీసుకున్నారు ,అదీ ఈ వయసు లో” అన్నాను నితీష్ తో అంతవరకు  ఏ మాట్లాడని నితిన్ “  అమ్మ బాగా  ఆలోచించే  తీసుకుంది ఈ నిర్ణయం రూపా!అన్నాడు. నీకు నాన్న సంగతి  తెలుసు కదా! ఆయన ఇలాంటి మనిషి అంటే ఎవరూ నమ్మరు. బయట ప్రపంచం లో ఆయనకు బోలెడంత పరపతి, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. నిజానికి, నా దృష్టిలో నాన్న  ఒక సాంప్రదాయ ముసుగు వేసుకున్న మూర్ఖుడు. ఇన్నేళ్ళు అమ్మ ఆయన మూర్ఖత్వానికి బలి అయిపోయినా గాని, పల్లెత్తు మాట మాట్లాడ లేదు. అది ఆవిడ సంస్కారం.  కాకపొతే ఎప్పుడో అప్పుడు  అగ్నిపర్వతం బద్దలవక తప్పదు అదే జరిగింది .ఇది నాన్న కలలో కూడా  ఊహించని పరిణామం, ఈ వయసులో,దాన్ని ఆయన తట్టుకో లేకపోతున్నాడు”.అనిఆవేశంగా అన్నాడు.ఆ మాటలో నితిన్ కి తండ్రి అంటే ఎంత కోపము ఉందో అర్దమవుతోంది.


“అయితే ఆంటీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినట్లు,” అని నీనా అంది
“నా అంచనా ప్రకారం అమ్మ ఎక్కడికి వెళ్లి ఉంటదో నాకు తెలుసు.అమ్మ బెస్ట్ ఫ్రెండ్  సుధా ఆంటీ ఒక ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు.అమ్మ ,అక్కడికే  వెళ్లి ఉంటుంది”.అని అంటూ ఆవిడకి ఫోన్ ట్రై చేస్తున్నాడు.
నేను అక్కడ పుస్తకాల షెల్ఫ్ లో  ఉన్న  స్నేహ హస్తాలు అనే  సంకలనం చేతిలోకి తీసుకున్నాను .ఆ పుస్తకం  అత్తయ్య నన్ను చదవమని ఇస్తూ  “సుధ చాలా  మహా గొప్పమనిషి ఎన్నో కష్టాలకు ఓర్చి, ఆత్మవిశ్వాసంతో నిలబడి, ఎంతో మందికి సహాయపడుతోంది. ఎన్నో విద్యాసంస్థలు. ప్రతిఫలాపేక్ష లేకుండా నడుపుతోంది.అందులో ముఖ్యంగా కొన్ని బాలికల కోసం ఉన్నాయి.అలాగే వారి కుటుంబ సభ్యుల సాయంతో ఒక ఆశ్రమం కూడా నడుపుతోంది..అని తన స్నేహితురాలు గురుంచి ఎంతోగొప్పగా చెప్పుకునేది.


అవును నితిన్ అనుకునేది కరెక్టే అత్తయ్య అక్కడికే వెళ్లి ఉంటుంది అని అనుకున్నాను
“ఆంటీ, ఫోన్ తీయటం లేదు.”
“బహుశా బిజీ గా ఉన్నారేమో?”
ఇంతలో నితిన్ ఫోన్ రింగ్ అయ్యింది. “ఆంటీ దగ్గర్నుంచే”అని అంటూ,నెమ్మదిగా మాట్లాడసాగాడు.నేను, నీనా నితిన్ వైపు ఉత్కంఠ తో  చూస్తున్నాము.
దాదాపు ఒక ఇరవయి నిముషాలు మాట్లాడిన తరువాత, “ఆంటీఎలాగు రేపు ఆదివారం కాబట్టి నేను, వస్తాను మీ దగ్గరకి” అని చెప్పి ఫోన్ పెట్టేసాదు.
“అమ్మయ్య ఒక దిగులు తీరింది. అమ్మ  ఎక్కడ ఉందో తెలిసి పోయింది” అనుకుంటూ  నితిన్,నా వైపు నీనా వైపు చూసాడు. ఇదంతా పై నుంచి మావయ్య విన్నాడు. వెంటనే నేను ఇంటికి ఫోన్ చేసి శ్రీకాంత్ కివివరంగా అన్నీచెప్పాను. దానికివెంటనే స్పందిస్తూ  “అలాగే,శారద పిన్ని అంటే నాకు చాలా ఇష్టం, అబిమానంకూడా. పిల్లలని నేను చూసుకుంటాను నువ్వు వెళ్లి రా” అని చెప్పాడు.


ఆమరునాడు మేం ముగ్గురం  బయలుదేరుతుండగా మావయ్య“నేనూ వస్తాను నితిన్” అంటూ వాడిపోయిన మొహంతో మౌనంగా కారులోకూచున్నాడు. కారు బయలుదేరింది. నేను  బ్యాగు లోంచి అత్తయ్య,మావయ్యకి రాసిన ఉత్తరం తీసి మళ్ళీ మొదటినుంచి చదవడం మొదలుపెట్టాను.అక్షరాల వెంట కళ్ళు పరుగులు తీసాయి.


ప్రియమైన శ్రీవారికి,నమస్కరించి రాయునది. పెళ్ళైన ఇన్నేళ్ళలో నేను తీసుకొన్న స్వంత నిర్ణయం ఇది. కొత్త పెళ్లి కూతురుగ అత్తవారింట్లో కాలు పెట్టింది.మొదలు ఇప్పటి వరకు ఎప్పుడూ మీ మాటకు ఎదురు చెప్పలేదు. అంతకు మించి మిమల్ని ఏది అడిగింది లేదు. నా వ్యక్తి గత స్వేచ్ఛను నేనే  అణిచేసుకుని మీతో,జీవితంతో కూడా రాజీ పడిపోయాను. కానీ ఇప్పుడు ఈ జీవిత చరమాంకం లో నాకు ఇష్టమైనట్లుగా,స్వేచ్ఛగా ఉండాలని ఉంది. అది మీకు బాధని,కోపాన్నికలిగించవచ్చు.అందుకు నన్ను క్షమించండి. నితిన్ ఒక ఇంటి వాడు అయ్యాడు. మీపనులు చూసుకోవడానికి నౌకర్లు ఉన్నారు.మీరు,మీ బిజినెస్ తో ఎప్పుడూ బిజీనే . మనకు డబ్బుకు లోటు లేదు. ఇప్పుడు ఇంక ఈ శేష జీవితాన్నినలుగురికి ఉపయోగ పడేలా జీవించాలని ఉంది. మీకు తెలుసు నేను ఎక్కడికి వెళతానో. సెలవు ……..ఇట్లుశారద


అత్తయ్య మనసు నాకు అర్దమయింది. ఒక్కసారి గతం లోకి వెళ్ళింది నా మనసు
సత్యం మావయ్య పెళ్లి జరిగింది. మేమందరం వెళ్ళాము .కొత్త పెళ్ళికూతురు గా అత్త్తవారింట్లో అడుగు పెట్టిన అత్తయ్య సన్నగా ,నాజుకుగా ,కళ్ళలోఅభిమానం,ప్రేమ ఇంకా  ఏదో తెలియని భావం,అప్పట్లో దాని అర్ధం తెలియదు,అవి దయ,కరుణ అని పెద్దయ్యాక తెలుసుకున్నాను.నేను మా పిన్ని కొడుకు మురళి  కొత్త అత్తయ్య తో పరిచయం పెంచుకున్నాము. చదువు వల్ల కలిగే లాభాలు. చదువుకుంటే ఎంత గొప్ప వాళ్ళగ మారచ్చో లాంటి విషయాలు కూడా మాకు అర్థమయ్యే తీరులో చెప్పేది. “నువ్వే మా టీచర్ అయ్యింటే చాల బాగుండేది అత్తయ్యా” అనే దానిని.అది విని మెత్తగా నవ్వి,”ఇప్పుడు మాత్రం ఏమైంది మీ టీచర్నే అనుకో” అనేది.


అప్పటి నుంచి అత్తయ్య అంటే ఇష్టం కన్నా భక్తి,అలాంటి అత్తయ్య చాల కష్టాలు పడింది.కష్టాలు అంటే భౌతికం కాదు మానసికంగా,చిన్న చిన్న విషయాలే, ఉదాహరణకు కాఫీ ఇస్తే ఇందులో  ఏదో తక్కువైంది అనేవారు,అమ్మమ్మ,మావయ్య,“ఏది తక్కువైందో చెప్పండి రేపటి నుంచి ఆ ప్రకారమే ఇస్తాను” అనేది,అలాగే  వంట దగ్గర “ఈ కూర కారం లేదు ఈ పచ్చడి లో ఉప్పు లేదు,అన్నం బాగా బిరుసుగా ఉంది” ఇంచుమించుగా ఇలాంటివే.  సరే,ముందు రోజు వన్ని గుర్తుంచుకొని మరుసటి రోజు వాళ్ళు చెప్పినట్లు చేస్తే, “అబ్బే అన్నం మరి ముద్ద  అయిపొయింది,కూరలో కారం ఎక్కువ,పచ్చడిలో ఉప్పు ఎక్కువ అనిదేప్పేవారు”. వాళ్ళని  ఎలా అర్ధం చేసుకోవాలోతెలిసేదికాదు. ఓ పక్కకు వెళ్లి కళ్ళ నీళ్ళు పెట్టుకునేది. అమ్మమ్మ వాళ్ళు డబ్బు గల వాళ్ళే. కానీ, ఇంటి పని అంతా కోడలే చెయ్యాలనే ఒక రకమైన మూర్ఖత్వం. అత్తయ్య చేసే ప్రతి పనిని,సాధించడమే ధ్యేయంగా పెట్టుకునేది అమ్మమ్మ. ఇంకా మావయ్యకైతేఅయ్యో!,తన భార్య తనను నమ్ముకొని వచ్చింది.ప్రేమగా,గౌరవంగా చూసుకోవాలి అని అస్సలు తోచేది కాదు. దానికితోడూ అన్ని తనకే తెలుసన్న అహంకారం. అన్నట్లు చెప్పడం మరచాను అత్తయ్య డిగ్రి చేసింది,సంగీతం,సాహిత్యం రెంటిలోనూ బాగా ప్రవేశముంది.

 

సంగీతం పాడుకుంటూ ఉంటే నువ్వు వీధెక్కి కచేరీలు చెయ్యక్కర లేదు,అనేవారు,పోనీ మనసులో వచ్చిన భావాలు పేపరు మీద పెట్టుకుంటూ ఉంటే ఏంటి  కధలు రాస్తావేంటి ఖర్మ,ఇంకా నా పేరు ఆ ఫలానా రచయిత్రి మొగుడుగా అంటారు. అందు చేత నువ్వు ఎట్టి పరిస్థితి లో రాయొద్దని అనేవారు. ఇలా అత్తయ్య ,ఆశలు,ఇష్టాలు కోరికలు అన్నీ మడతపెట్టి మనసు పొరలలో దాచేసుకుంది. కాని కొడుకు పెళ్లి విషయం లో మాత్రం పట్టు పట్టి అతని ప్రేమను గెలిపించింది.ఆ కోపం ఇంకా మావయ్య మనసులో ఉంది అంటుంది నీనా. మళ్ళీ  తనే “She is a great lady రూపా!,పరాయి బాష,సంస్కృతి నుంచి వచ్చిన నన్ను కన్న తల్లిలా, నితిన్ కంటే నన్నే  ప్రేమగా ఆదరంగా చూసుకుంటుంది”. అని అత్తయ్యను  తెగ అభిమానిస్తుంది. ఆలోచనలలో పడి కొట్టుకుపోతున్న నాకు, సుధా ఆంటీ నడిపే ‘వసుధైక కుటుంబం” బోర్డు కనబడగానే “ఇదే అయుంటుంది నితిన్”అని అన్నాను.అక్కడకి మొదటిసారి రావడం మా అందరికి . అంతకు ముందే ఫోన్ లో ఆంటీ కి చెప్పడం తో ఆవిడ కూడా వచ్చారు. అక్కడ ఆశ్రమం లో ఉండే  ఒక అమ్మాయి మా అందరికి మంచి నీళ్ళు,కాఫీ ఇచ్చింది. కాఫీ చాల రుచిగ ఉంది.అప్పుడు సుధా ఆంటీ’ అన్నారు“సిటికీ దూరంగా ఉండటం వల్ల పాలు అందడం లేట్అవుతుందని అందరూ కలిపి ఒక నిర్ణయానికి వచ్చారు. ఆశ్రమం లో గోవుల సంరక్షణ చేపట్టారు అది ఒక వ్యాయామం,తద్వారా చక్కటి పాలు పెరుగు అందుతున్నాయి. అందరికి చక్కటి ఆరోగ్యం కూడా”అని చెప్పారు.

కొంచెము  లోపలకి వెళ్ళాము పెద్ద ఆశ్రమం, చల్లగా చెట్లు,కళ్ళకి ఇంపుగా రంగురంగుల పూవులు, పక్కనే గుడి .అంతా ప్రశాంత వాతావరణం.రెగ్యులర్ డాక్టర్ చెకప్ జరుగుతుంది.అక్కడ పనిచేసే వాళ్ళకి కూడా క్వార్టర్స్ ఉన్నాయి. టీవీ లు ఉన్నాయి. అవి టైమింగ్ ప్రకారం పెడతారు.రేడియో ని మైకు ద్వార అరేంజ్   చేసి  భక్తి రంజనితో మొదలుపెట్టి  వార్తలు,చక్కటిసంగీతం,భావ గీతాలుతో పాటు  నాటికలు కూడా వినిపిస్తారు అని అక్కడే ఉండే ఒక యువతి మాకు చెప్పింది. కొంచెము ముందుకు వెళ్లేసరికి అక్కడ పెద్ద వరండాలో అత్తయ్య  మధ్యలో కూర్చొని ఉంది చుట్టూరా ఒక ఇరవయి మంది అత్తయ్య చెప్పేది వింటున్నారు.


అప్పుడు సుధా ఆంటీ అన్నారు నితిన్ తో “మీరు వస్తున్నట్లు చెప్పలేదు నేను. అది ఇప్పుడు సంసార బంధాలనుంచి విముక్త అయి,  మానవసేవ చేయాలనే దృఢ సంకల్పంతో వచ్చింది. ఇప్పుడు ఈ ఆశ్రమన్ని అదే చూసుకుంటుంది.మీ గురించి దాని మనసులో ఏముందో తెలియదు.మీరే వెళ్లి పలకరించండి.చూద్దాము.”అని అన్నారు. నితిన్ దగ్గరకు వెళ్లి అత్తయ్యని చుట్టేసాడు. అప్పుడు  “వెఱ్రినాన్నా! అమ్మ ఎక్కడున్నా నీకు అమ్మే,నిన్ను విడిచి ఎక్కడకి పోలేదు ఇక్కడే ఉంటున్నాను.నీకు తెలుసు కదా నా ఆశయం.దానిని సాకారం చేసుకుంటున్నాను.” అని అత్తయ్యఅంది . నన్ను,నీనాని దగ్గరకు పిలిచి ‘ఏంటి అందరూ రెండు రోజుల్లో ఇలా తోటకూర కాడల్లా వేలాడిపోయారు.హుషారుగాఉండాలి,శుభ్రంగా తిని చురుకుగా పనులు చేయాలి,అని అంటూ నావైపు తిరిగి శ్రీకాంత్,పిల్లలు అందరు బావున్నారా” అని అడిగింది.” ఆ ఆ అని తల ఊపాను” నీనా అయితే అత్తయ్య కొంగు పట్టుకొని వెనక వెనకే ఉంది


ఇంతలో సుధా ఆంటీ వచ్చి శారదా “ఒక సారి ఇలారా!, మన వసుధైక కుటుంబం లోకి మరో కొత్త మెంబెర్ వచ్చారు వివరాలు అన్నీ తీసుకోవాలి”  అని పిలిచారు.సుధా ఆంటి,శారద అత్తయ్య ఇద్దరూ ఆఫీస్ రూమ్ లోకి వెళ్లారు. వాళ్ళ వెనకాలే నేను, నీనా చెయ్యి పట్టుకొని .వెళ్ళాను. మా కంటే ముందరే అక్కడకి వెళ్ళాడు నితిన్. మేమందరం బయటే ఉన్నాము ఆఫీస్ రూమ్ లో మావయ్యను చూసి,శిలలా నించుండి పోయిన అత్తయ్యతో సుధా ఆంటీ అన్నారు, “శారదా!, సత్యం గారికి  ఈ ప్రశాంత వాతావరణం నచ్చిందిట.ఇక నుంచి ఆయనకూడా ఇక్కడే ఉంటారుట”అని అంటుంటే అత్తయ్య మావయ్య వైపు నమ్మలేనట్లుగా ఆశ్చర్యంగా,ఇది నిజామా అన్నట్లు గా చూసింది.

కాని మావయ్య చూపులో మాత్రం  తప్పిపోయిన పిల్లవాడు తల్లిని చూసినప్పుడు కలిగే ఆనందం కనిపించింది.నీనా కూడా నిర్ఘాంతపోయింది. ఈ హటాత్తు నిర్ణయానికి, నితిన్ పరిస్థితి, నాది అయితే  ఒక్కటే .చేష్టలు దక్కి ఉండిపోయాము. ఇంతలో మావయ్య నితిన్ పిలిచి అతని భుజం చుట్టూ చేతులు వేసి యేవో డాక్సుమెంట్స్ తీసుకుని రమ్మనమని చెపుతున్నాడు. .అప్పుడు నాకు ఒక్కటే అనిపించింది.


మావయ్యని  ఇన్ని రోజులు అత్తయ్య  ఛాయ లా అంటి పెట్టుకొని ఉంది. అప్పుడు ఆయనకి ఆమె యొక్క విలువ తెలియలేదు.ఎప్పుడయితే అత్తయ్య ఇంటినుండి బయటకు వచ్చిందో అప్పుడు  ఆయనకి అర్దమయింది  తను పోగొట్టుకున్నదేమిటో   .అందుకనే ఆమె నిర్ణయాన్ని అర్ధం చేసుకొని  ఈ జీవిత చరమాంకంలో ఆమెతో కలిసి నడవాలని నిశ్చయించుకున్నాడు.*

 

 

రచన:- మణి వడ్లమాని