Facebook Twitter
భూల్ భులయ్యా..

 

భూల్ భులయ్యా...

 

 

'యేటండీ! ఇట్టా పడుకుంటే యెట్టా వేరేవోళ్ళ బెర్త్ మీద? లెగండి లెగండి...మా సామాన్లు మేము సర్దుకోవద్దా యేటి? ' కరుకైన గొంతు.

బెర్త్ పై అలా ఒరిగి మాగన్నుగా నిద్రపోతున్న మనస్విని ఒక్క దెబ్బతో లేచి కూచుంది. అసలే వేసవి కాలం. లక్నో నుంచీ హైదరాబాద్ కు స్లీపర్ క్లాస్ లో ప్రయాణం. ఏ. సీ. లో దొరకలేదు రిజర్వేషన్.విధిలేదు మరి..ఆఫీస్ కు సంబంధించి - ఓ వర్క్ షాప్ అటెండ్ అయి తిరుగు ప్రయాణమైంది స్లీపర్ కోచ్ లోతను ! ఒకటే వుక్కపోత.యేదో ముందు స్టేషన్ లోదొరికిన లంచ్ తో కడుపు నింపుకుని, అలసటగా అలా కాసేపు మాగన్నుగా పడుకుందో లేదో, యీవిడెవరో ఇలా బెదరగొట్టేసింది! అంధ్రా బార్దర్లోకి వచ్చేశామన్న మాట! విధిలేక లేచిపోయింది. ఆ వచ్చినావిడ ఇద్దరు చిన్న పిల్లల తల్లి. పాపకు సంవత్సరం ఉంటుందేమో! కొడుకుకు మూడు నాలుగేళ్ళుంటాయి. రైలు ఓ రెండు మూడు నిముషాలాగి బైలుదేరింది. స్టేషన్ యేదో చూడనూ లేదు. ఆ వచ్చినావిడ తన సామాను సర్దుకోవటానికీ ఒక యుద్ధమే చేసింది. ' యీ సామాన్లెవరివండీ. .ఇట్టా కిందంతా పరిచి పెట్టీసుకుంటే, మేమెక్కడెట్టుకోవాలండయ్యా? ' అని అరవటం మొదలెట్టింది. యెదురు సీట్లోఉన్నఒకతను 'యేంటమ్మానీ గొడవ..ఉండు..తీస్తాంగానీ కొంచెమాగు..నువ్వు వచ్చిన వెంటనే తీసి రెడిగా పెట్టాలా మేమంతా? ఒకటే హడావిడి పడిపోతున్నావ్? ఇప్పుడొచ్చి ఇంత గలభా చేస్తున్నావ్? లక్నో నుంచి వస్తున్నాం మేమంతా! ' అన్నాడు కాస్త గట్టిగానే..

ఆవిడేమీ వూరుకునే రకంలా లేదు. ' మీరెక్కణ్ణుంచొస్తే నాకేటండి. మీ అందరికి మల్లే నేనూ రైల్లో బెర్త్ రెజర్వ్ చేసుకున్నానండీ..ఆయ్..తొరగా నాక్కాస్త చోటిస్తే, సర్దుకుని మా బుడ్డోడికి వణ్ణం పెట్టుకుంతనండీ..పిల్లల తల్లనైనా వుండదేటండి మీకు? ఒంటిగా ఆడొల్లుంటే, ఇట్టాగే మాట్టాడతారండీ అందరూనూ! మావోడు రావయ్యా మగడా అంటే, ఓ యేదో కొంపలంటుకునే పన్లున్నట్టు, నన్నొక్కదాన్నీ రైలెక్కించేశాడండి! ఆడుండి ఇట్టాంటివన్ని జూసుకోవాలిగదండీ? యేతంతారండీ? ' సపోర్ట్ కోసమన్నట్టు మనస్వినికేసి చూసిందావిడ - మనస్వినినంతకు ముందు కసురుకున్న సంగతి ఆమెకు గుర్తులేదనుకుందేమో మరి! మనస్విని యేమీ మాట్లాడకండా, కిటికీలోంచీ బైటకు చూస్తూ కూచుంది!

కాసేపట్లో, ఆవిడ, సామాను యెలాగో సర్దుకోవటం, ఆ చిన్నపిల్లకు అలాగే పైటకిందనుంచీ పాలు తాగిస్తూనే, తను తెచ్చుకున్న టిఫిన్ బాక్స్ విప్పింది. అప్పటికి యేడున్నరవుతూందేమో!

తనోవైపు ఆ బాక్స్ లొ వున్న పులిహోర లాంటిదేదో తింటూనే, తన కొడుకుకూ తినిపించే ప్రయత్నం చేస్తోంది తన పక్క సీటావిడ. కానీ, వాడు తినటానికి మొండి చేస్తున్నాడు. వాళ్ళమ్మ నోట్లో పెట్టబోతుంటే, మొహం తిప్పేసుకుని చిన్నగా ఓ సారీ, పెద్దగా ఓ సారి, యేడుపు మొహంతో ఓ సారీ..ఆఖరున ఆరున్నొక్క రాగంలో. ' బిరియానీ ' అనే అంటున్నాడు. ఆవిడేమో, అట్లా బిరియానీ అని వాడన్నప్పుడల్లా, కసురుకుంటూనే వుంది. యీలోగా ఆమె దగ్గర పాలు తాగుతున్న చంటిపిల్ల సోలిపోతుంటే, బెర్త్ మీద ఓ పాత చీరెలాంటిది వేసి పడుకోబెట్టి, పనిలో పనిగా వాడికి రెండు తగిలించింది.

మనస్వినికి జాలేసింది ఆ చిన్న కుర్రాడిమీద! బట్టలు మురికిగా వున్నా, చామన చాయా, పెద్ద కళ్ళతో చూడటానికి బాగానే ఉన్నాడు వాడు. చెప్పొద్దూ, ఆవిడా, పీలగా ఉన్నా, కళ్ళూ ముక్కూ బాగానే ఉన్నాయి. కాస్త రంగూ ఉంది. ఆ పిల్లాడికి తల్లి కళ్ళూ, తండ్రి చాయా వచ్చాయేమో! తను తెచ్చుకున్న తెలుగు నవల చదువుకుంటున్నట్టే వుంటూ, మధ్యలో యీవిడ కెసి అప్పుడప్పుడూ చూస్తూంది మనస్విని.

ఆవిడేమో, మరో డబ్బాలోని పెరుగన్నం తను తింటూ కొడుకుకు తినిపించే ప్రయత్నం చేసింది. అమ్మ తన మాట వినకపోయేసరికి, వాడు ఆమె చేతినో తోపు తోశాడు. చేతిలోని పెరుగన్నం బెర్త్ మీద పడింది. ఇక చూడాలి ఆమె ఆక్రోశం! తిట్లకు లకించుకుంది. యెడ పెడా వీపుమీద బాగానే బాదేసింది. వాడి యేడుపుతో కంపార్ట్ మెంటంతా ప్రతిధ్వనిస్తోంది.మనస్విని రైల్లో ఆవిడెక్కినప్పటినుంచీ, వాళ్ళనే గమనిస్తున్నదే తప్ప, తక్కిన వాళ్ళవైపు చూడటమే లేదు. కారణం ఆ పిల్లవాడి కళ్ళల్లొ ఉన్న స్పార్క్. ' యెందుకమ్మా అలా కొడతావు? అ బిరియానీ యేదో కొనివ్వొచ్చుగా? ' అంది జాలిగా వాడికేసి చూస్తూ..' ఆ...మీకేటండి అంతారలాగే ..నలభై రూపాయలు.మీరిత్తారేటి?' విసురుగా అనేసింది - చెంప మీద ఫెళ్ళున కొట్టినట్టే! అలాగే 'ఊరుకోరా యెదవ నాయాలా?' అంటూ మళ్ళీ నాలుగు తగిలించింది వాడి వీపు మీద!

ఈ దెబ్బతో మనస్విని దిమ్మ తిరిగిపోయింది. నిశ్శబ్దంగా, తన మానాన తాను కిటికీలోంచీ బైటికి చూస్తుండిపోయింది - తనకెందుకీ గొడవ అనుకుంటూ, మనసులోనే చెంపదెబ్బలు వేసుకుని! ఇంతసేపూ కూర్చుని కూర్చుని కాళ్ళు, తిమ్మిరెక్కినట్టుంటే, అలా లేచి డోర్ దగ్గర నిలబడదామని అటుకెసి వెళ్ళింది మనస్విని. అలాగే బాత్ రూం కీ వెళ్ళొచ్చేసరికి, తనపక్కనున్నఆ పిల్లల తల్లి, అటువేపు కింద బెర్త్లో ఉన్న ఇదివరకటి మధ్య వయసాయన్ని ఒప్పించుకున్నట్టుంది- మనస్విని బెర్త్ పైనున్న తన మధ్య బెర్త్ లోకి అతను మారి, యెదుటి కింది బెర్త్ లో పిల్లలతో తాను పడుకునేందుకు ! ఎదుటి బెర్త్ పైన తన పాత చీర పరచి, పిల్లని పడుకోబెట్టేసిందప్పుడే! మనస్వినినడిగితే, ఒప్పుకోదనుకుందో యేమో! ఆమాత్రం యెవరైనా సాయం చేస్తారు కదా ! పైగా పిల్లల తల్లాయె కూడా! అప్పటికే కంపార్త్ మెంట్ లో అందరూ యెవరి కుటుంబాలతో వాళ్ళు రాత్రి భోజనాలు కానిచ్చేశారు. తొమ్మిదవుతుండగా, మధ్య బెర్త్ లో పడుకుంటున్నతనూ వచ్చేసరికి, మనస్వినీ బెడ్ షీట్ సరిజేసుకుంది. ఇందాక స్టేషన్లో కొన్న రెండరటిపళ్లు అన్యమనస్కంగానే తిని, ఏర్ పిల్లో సరిజేసుకుని ,షాల్ తీసి కప్పుకుని బెర్త్ పై వాలిపోయింది.

కళ్ళు మూసుకుని, ఆలోచనల్లో పడింది మనస్విని. లక్నో అసలు రాముని తమ్ముడు లక్ష్మణుడు కట్టించిన ప్రదేశ0. అప్పట్లొ దీని పేరు లక్ష్మన్ పురా ! పోను పోనూ, లక్నోగా మారింది. చరిత్రలోనూ ఇలాగే పేర్లు మారిపోతుంటాయా! రూమీ దర్వాజా, బ్రిటిష్ రెసిడెన్సీ, అక్కడ 1857 నాటి సిపాయిల తిరుగుబాటుకు సంబంధిన బరువైన జ్ఞాపకాలూ, ఇవన్నీ చూసుకుని చివర్లో భూల్ భులయ్యాకి వెళ్ళారంతా! దీన్నే బడా ఇమాంబారా అనికూడా పిలుస్తా రు. 18వ శతాబ్దంలో, కరువు రక్కసి కాటేసినప్పుడు, అవధ్ రాజు అసఫుద్దౌలా యీ నిర్మాణం చేయించాడు. ఆ కరువు సమయంలో ప్రజలకు పని కల్పించి, జీతమిచ్చి, తద్వారా, వాళ్ళను ఆదుకునేందుకు రాజు ఉదయం పనివాళ్ళు కట్టి వెళ్ళిన భాగాలనన్నిటినీ, రాత్రి వేరే పనివాళ్ళను పెట్టి కూల్చేయించేవాడట! అలా దాదాపు పది సంవత్సరాలు ప్లాన్ చేసి చేసి, పనివాళ్ళకు కూలీ గిట్టుబాటయ్యేలా సంవత్సరాల తరబడీ, కరువు ముగిసేవరకూ కట్టించినదీ కట్టడం ! మొగల్ శిల్ప శైలిలో, కట్టడం విశాల మధ్య భాగంలో, అసఫుద్దౌలా సమాధి కూడా వుంది. అంటే, రాజులు తాము బతికి వున్నప్పుడే తమకోసం కూడా సమాధులు ముందే కట్టించుకునే పద్ధతి అప్పుడుండేదట మరి! 15, 16 మీటర్ల యెత్తైన ఆ సీలింగ్ కు యెలాంటి ఆధార స్థంభాలూ లేకపోవటం నిజంగా ఆశ్చర్యమే! అప్పటి నిర్మాణ కౌశలానికి జోహారులంటూనే, భూల్ భులయ్యా లోకి ప్రవేశించారందరూ! అక్కడక్కడ, స్థానిక యువకులు అల్లరిగా మాట్లాడుకుంటూ యాత్రికులను తప్పు దారికూడా పట్టిస్తారని ముందు జాగ్రత్తగా స్థానికులు చెప్పినా వీళ్ళు వినిపించుకోనందుకు, తగిన బుద్ధొచ్చిందందరికీ! నాలుగైదుసార్లు తప్పిపోయి, మళ్ళీ, గైడ్లతో వచ్చిన వేరే టూరిష్టుల సాయంతో యెలాగో బైటికొచ్చారందరూ! యెప్పుడో చిన్నప్పుడు చదివిన లెక్కలూ, చరిత్ర పాఠాల్లాగే ఇప్పుడీ యీ భూల్ భులయ్యా కూడా మనసులో హత్తుకుపోయింది! భ్రాంతి కలిగించేదే ఐనా, యేదో ఆకర్షణ ! ఇవన్నీ గుర్తు చేసుకుని, మళ్ళీ, రేపు ఇంటికి చేరుకోగానే చేయాల్సిన పనులు గుర్తు చేసుకుంటూ, కుడివైపు ఒత్తిగిలి, ఆ పిల్లలతల్లి యేంచేస్తుందోననుకుంటూ అటుకేసి చూసింది మనస్విని.

ఆవిడైతే, చిన్నటి గుర్రు కూడా పెడుతూ నిద్ర పోతూంది, అటు తిరిగి పడుకుని! పిల్లాణ్ణి కాళ్ళ దగ్గర పడుకోబెట్టుకుందేమో కానీ, వాడు, లేచి ఆ ఇరుకు జాగాలోనే దిగులుగా కూర్చుని అటూ ఇటూ చూస్తున్నాడు. వాడిని చూస్తే జాలయింది. ఐనా, ఆ తల్లేంటి, బొత్తిగా కొడుకును పట్టించుకోకుండా, హాయిగా మైమరచి నిద్ర పోతూంది. వాడు దిగి యెటైనా వెళ్తేనో? మనస్వినికి వాడెందుకలా అటూ ఇటూ చూస్తున్నాడబ్బా అని అనుమానమొచ్చింది. తానిందాకటినుంచీ వినలేదు కానీ, యేదో స్టేషన్లో ఆగి వుంది రైలు. తలుపు కూడా తీసే వున్నట్టుంది. యెవరో

దిగినట్టున్నారు కూడా! దూరంగా, బిరియానీ బిరియానీ అని యెవరో అమ్మడం వినిపించిందింతలో! అయ్యో పాపం, యీ పిల్లాడు బిరియానీ కోసం కూర్చున్నాడో యేమో! పోనీ, వీడికో పాకెట్ కొని పెడితేనో?

తన ఆలోచనకు తనకే నవ్వొచ్చింది. ఆ తల్లేమో, ఆదమరచి, వీణ్ణిలా వదిలేసి నిద్రపోతుంటే, తానేమో వాడికే అత్తో లేదూ, యే పెద్దమ్మో ఐనట్టు, వాడికి బిరియానీ కొనిపెడదామనుకోవటం!

ఐనా, వాడి పట్టుదల చూస్తే ముచ్చటౌతూంది మనస్విని కి! మెల్లిగా లేచింది బెర్త్ లోంచీ! ఇంకెంతసేపీ స్టేషన్లో ఉంటుందో రైలు? తను డోర్ దగ్గరికెళ్ళి, ఆ బిరియానీ అమ్మేవాణ్ణి పట్టుకుని కొనేంతలో కదిలిపోతేనో? ట్రైచేసి చూద్దాం అనుకుంటూ, మెల్లిగా డోర్ వైపు అడుగులేస్తూనే వుంది-ఇంతలో రైలు కదిలే పోయింది. బైటే నిలబడున్నతనెవరో పరుగులు పెడుతూ రైలెక్కాడు. వుసూరనుకుంటూ మనస్విని బెర్త్ దగ్గరికొచ్చింది. పిల్లాడేడీ? లేడే! మనస్విని గతుక్కుమంది. తను అటుకేసి వెళ్ళడం చూసి వాడూ వెళ్ళాడా యేంటీ? ఐనా, తానేదో ఒకటి రెండు సార్లు వాడికేసి ప్రేమగా చూసినంత మాత్రాన, వాడట్లా తన వెనకే వస్తాడనేంటీ? మనసాగలేదు మనస్వినికి..అటువైపు డోర్ కేసి వెళ్ళాడేమో? కంగారుగా వెళ్తుంటే, మధ్యలోనే కనిపించాడు - అక్కడొకతను, యేదో తింటుంటే చూస్తూ నిలబడున్నాడు. భలే జాలేసింది.పాపం, ఆకలేస్తూందో యేమోనని! వాణ్ణి పిలిచింది 'రా, నేను కొనిపెడతా బిరియానీ నీకు ' అంటూ! బిరియానీ మాట వినబడగానే వాడు ఠక్కున మనస్వినికేసి చూసి, వెనకే వచ్చేశాడు. ఇంక వాళ్ళమ్మ కాళ్ళ దగ్గర కూర్చున్నాడే కానీ, చూపులన్నీ మనస్విని వైపే! తనకిదేమి కొత్త బంధం యేర్పడింది బాబూ అనిపించినా, పిల్లాడి మీద జాలి మరి ఆలోచించనివ్వలేదు.

మధ్యలో ఒకసారి ఆతల్లి, లేచి, పిల్లాణ్ణి, దగ్గరికి లాక్కుని, నిద్రలోనే అరటిపండొకటి సంచీలోనుంచీ తీసి, వొలిచి చేతిలోపెట్టి, తినమని చెబుతూ చెబుతూనే నిద్రలోకి జారుకుంది మళ్ళీ! పాపం, యెంత అలిసిపోయిందో యేమో! బహుశా యేదో పొలం పనులు చేసుకునే కుటుంబం లో ఇల్లాల్లాగే వుంది ఆవిడా కట్టూ బొట్టూ చూస్తుంటే! మనస్వినికి తన ఆలోచనలకు లోలోపల నవ్వొచ్చింది. రైలెక్కినప్పటినుంచీ, ఆవిడ వాలకం చూసి, యీవిడతో తనకెందుకులెమ్మనుకుంది కానీ, ఇప్పుడీ పిల్ల వెధవ వల్ల, తల్లి గురించీ ఆలోచిస్తూంది తను!

ఇంతలో బోగీ చివరినుంచీ కాబోలు, 'బిరియానీ' అన్న కేక వినబడింది. ఆ కేక వినగానే పిల్లాడు గబుక్కున బెర్త్ నుంచి దిగబోయాడు. మనస్విని ఇది గమనించింది..'ఒరే నాయనా..నువ్ దిగకు. నేను కొనిపెడతాలే బిరియానీ'..అని అక్కడే కూర్చోమని చెప్పి, తను లేచి, బిరియానీ అమ్మే అతనికోసం యెదురుచూస్తూ కూచుంది.థాంక్ గాడ్! వాడికి తను చెప్పేది అర్థమౌతోంది. . టైం పదిన్నరైవుంటుంది. మిగిలిపోయిన ఫుడ్ పాకెట్లు ఇలా లేట్ నైట్ లోనూ అమ్ముతుంటారు వీళ్ళు. రెండు నిముషాల్లో, బిరియానీ అమ్మే అతను వచ్చాడు. మనస్విని ముప్ఫై రూపాయలకు బిరియానీ పాకెట్ కొని, ఆశగా చూస్తున్న పిల్లాడి దగ్గర పెట్టింది పాకెట్ ఓపన్ చేసి! వాళ్ళమ్మ, అక్కడే టేబుల్ పై పెట్టేసిన నీళ్ళ బాటిల్ కూడా దగ్గర పెట్టింది! వాడు ఆబగా రెండు మూడు సార్లు చేతిలోకి తీసుకుని తిన్నాడో లేదొ, దగ్గు మొదలైంది వాడికి! వాడలా పొర పోయినట్టు దగ్గటం విని, ఆ తల్లి, కంగారుగా లేచింది నిద్రలోంచీ! పిల్లాడి దగ్గు ఆపేందుకు నీళ్ళు తీసి తాగించింది ముందు. తరువాత, వాడి దగ్గర బిరియానీ పాకెట్ చూసి ' ఓలమ్మో! యెట్ట వచ్చిందిరా బిరియానీ నీకు? అడుక్కున్నావా యెవర్నైనా? ' అని కసురుకుంటూ అడిగేసరికి, బిక్క మొహమేసుకుని వాడు మనస్వినికేసి చూపించాడు. అప్పుడావిడందుకుంది..'యేమమ్మో! వచ్చిన కాణ్ణించీ చూస్తున్నా? మేమేం బిచ్చపోల్లనుకుంతన్నవా యేంది? వాడేదొ బిర్యానీ బిర్యానీ అంతున్నడు, నాకాడ పైసల్లేవని కొనివ్వడం లేదని అనుకుంతున్నావేమో! మా కాడా బాగనే డబ్బులున్నయ్, మీకాడే కాదు. రాత్రిపూట తింటే పిల్లోనికి అరగదని కొనియ్యలేకానీ, నా కాడ, డబ్బుల్లేక కాదమ్మో తల్లీ! ఇట్టగే, పిల్లోన్ని బుట్టలొ యేసుకోని మాయచేసే వాళ్ళుంతారని యిన్నాగానీ, నీ అసుంటి డాబుసరోల్లూ ఇట్టాంటి పనిజేస్తారనుకోలే? నా పిల్లోని బాగనేజూసుకున్నవ్ గానీ, ఇంగ నిద్రపో మాతల్లే! ' అంటూ, ఆ బిరియానీ పాకెట్నీ ఉండ చుట్టి, కిటికీలోంచీ బైటికి విసిరేసింది. వాడి వీపుపై మరో నాలుగు వడ్డించింది. వాడేడుస్తూ వుండగానే అరటి పండు బలవంతంగా నోట్లో కుక్కి, కాళ్ళు వాడి చుట్టూ కదలనీకుండా వేసి, పడుకోబెట్టిందికాక, ఇంకా యేదేదో గొణుగుతూనే వుందావిడ ఉక్రోషంగా!

అయోమయంలో మనస్విని నోట మాట రాలేదు.!!! ఇంతకూ, పెళ్ళై ఇరవై యేళ్ళైనా, పిల్లల్లేని తనలో, యీ పిల్లాడి పట్ల కలిగిన యీ క్షణికానురాగం ఓ భూల్ భులయ్యానేనేమో! నిట్టూరుస్తూ, అటుతిరిగి పడుకుంది. చెక్కిళ్ళపై కన్నీటి చారికలు! !

( ఈ కథ నా సొంతం. దేనికీ అనువాదం కానీ, అనుసరణ కానీ కాదని హామీ ఇస్తున్నాను..)

 

కలం పేరు: పద్మిని-హర్ష

(డా. పుట్టపర్తి నాగపద్మిని.)