Facebook Twitter
దేశ వంచితులు

          దేశ వంచితులు            

    


          రమ తల మీదుగా కప్పుకున్న రజ్జాయిలో కుళ్లి కుళ్లి యేడుస్తోంది . ఒక్కగానొక్క  కొడుకు కమల్ అనాలోచితంగా అన్న మాటలు  రమకి సూటిగా తగిలి పిడికెడంత గుండెని వెయ్యి ముక్కలు చేసేయి .
         ఆ మాటలు అంటున్నప్పుడు తల్లి అంత బాధపడుతుందని వూహించి వుండడు కమల్ . అసలు ఆ విషయం చర్చకు వచ్చినపుడు కూడా రమ అనుకోలేదు సంభాషణ అటుతిరిగి యిటుతిరిగీ తన గుండెల్లో గునపాలు గుచ్చుతుందని .
        తన మాటలు తల్లిని అంత బాధపెడతాయని తెలిస్తే ఆ చర్చని మధ్యలోనే ముగించెవాడే కమల్ .
        సాయంత్రం యెర్రబడ్డ కళ్లతో తిరుగుతున్న తల్లి ని చూసి సున్నిత మనస్కురాలు అనుకున్నాడు కాని  తన అనాలోచిత వ్యాఖ్యలు తల్లి గుండెలను చీల్చేయని తెలుసుకోలేకపోయేడు .


       ముప్పైఅయిదు సంవత్సరాలుగా ఒకే ప్రాణంగా బతుకుతున్న  తన భర్తకి కూడా తెలియకుండా  గుండెల్లోనే సమాధి చేసిన రహస్యం , యిన్నేళ్ల తరవాత  తనను అల్లకల్లోల పరుస్తుందని వూహించలేక పోయింది రమ .
          ముప్పైఅయిదేళ్ల కిందట పురిటిగదిలో కేరు కేరు మంటూ యేడుస్తూ వేలకత్తులతో తన కడుపు చీల్చుకొని పుట్టిన బిడ్డ కొద్ది నిముషాలలో తెల్లని బట్టలో చుట్టి శ్మశానానికి తరలిస్తూ వుంటే నమ్మలేని తల్లి పేగు బిడ్డని తనచేతులలో కి తీసుకొని అణువణువు తడిమి బిడ్డలో ప్రాణం పోయాలనే తపనకు అడ్డు పడిన  అమ్మానాన్నలను అనుమానంగా చూసింది .


       తొమ్మిదినెలలు తనలో పెరిగి మురిపించినది బాబా  ?  పాపా ? , తెలుసుకోవాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు . ఒక రోజు బాగా విసిగిపోయిన తల్లి ' బతికి తల్లితంద్రులను విడదీసే దెయ్యంపిల్ల గురించి ఆలోచించకు , వచ్చేయేటికి మంచి బిడ్డని యెత్తుకుందువులే '
     దెయ్యంపిల్ల అనేమాటకి చాలా రోజుల తరవాత అర్ధం తెలిసింది . అమ్మా నాన్నలకి గోల్కొండ చూపించడానికి తీసుకు వెళితే అక్కడ అడుక్కుంటున్న  ' హిజరా ' ని చూసి  " పాపపుణ్యాలు లెక్కవేస్తూ వూరుకొనుంటే నీ కడుపున పుట్టిన దెయ్యంపిల్ల బతుకూ యిలాగేవుండును " . అన్న అమ్మ మాటలకు వులిక్కి పడింది రమ . అడుక్కోడానికి అలా వేషం వేసుకుంటారని భావిస్తున్న రమకి అది పుట్టుకతో వచ్చేలోపమా ?  అని మొదటిసారిగా అనిపించింది . తన కడుపున అలాంటి శిశువు జన్మించడం నామోషీగా అనిపించి ఆ విషయాన్ని శాశ్వతంగా తనలో సమాధి చేసేసింది .


      దేశం కాని దేశంలో యెప్పుడో మరచిపోయిన విషయం యివాళ చర్చకు వస్తుందని రమ కలలో కూడా అనుకోలేదు .
       నాలుగు రోజులుగా వాకింగు కూడా మానేసి బెదురుగా తిరుగుతున్న రమ నుంచి విషయం తెలుసుకోవాలని కమల్ దంపతులు నిర్ణయించుకున్నారు .
     మౌనంగా భోజనం చేస్తున్న రమని చూసి నిట్టూర్చేడు కమల్ , డైనింగ్ టేబుల్ దగ్గర యింత నిశ్శబ్దమా ? ఎప్పుడూ  లేదు . అందరి వంతు తనే మాట్లాడే రమ మౌనంగా భోజనం చెయ్యడం అంటే అదో పెద్ద వింతే  మరి . స్వరూప భర్త సౌజ్ఞ అందుకొని " వంట్లో బావుండటం లేదా ? అత్తయ్యా " అంది .


     " బావుందే " యెంత నార్మల్ గా అందామన్నా రమ గొంతులో సంశయం ధ్వనించింది .
     " మీలొ ఏదో మార్పు కనిపిస్తోంది , అలసటగా కనిపిస్తున్నారు , యిన్నాళ్లు మామగారిని వొంటరిగా వదలి వుండలేదేమో కదా ? యిండియా వెళ్లి పోదామనిపిస్తోందా?,
నిద్ర పట్టడం లేదా ? " చాలా కేరింగ్ గా అడిగింది స్వరూప .
    " అబ్బే అదేమీ లేదు "
     "యేమీ లేదా ? మరి మూడు రోజులుగా ఆ మౌనం , శుభా గాడితో ఆటలు పాటలు లేవు , నీ కిష్ట మైన వాకింగ్ కుడా మనేశావు ఏం జరిగిందో చెప్పక పొతే మాకేలా తెలుస్తుంది " కమల్ తల్లిని పరిశీలనగా చూస్తూ అన్నాడు .
       " వారంరోజుల కిందట వాకింగుకి శుభా గాడితో  వెళ్లానా ? అక్కడికి వీడి వయసు అబ్బాయిని తీసుకొని ఒక స్వీడన్ దేశస్థుడు వచ్చాడు . ఆ పిల్లాడిని వాళ్లు పెంచుకుంటున్నారని పిల్లల పెంపకం గురించి అతని భార్యకి సలహాలు కావాలని చెప్పేడు . మరునాడు మరో మగాడిని తెచ్చి వాళ్లావిడగా పరిచయం చేసేడు . వాళ్లడిగినవాటికి సమాధానాలు చెప్పేను గాని వాళ్లిద్దరిని భార్యాభర్తలు గా అంగీకరించలేకపోయేను . ఎంత తొందరగా అక్కడనుంచి బయటపడదామా ? అని యెదురు చూసేను . వాళ్లు వెడుతూ మళ్లా యిక్కడే కలుద్దామని ఈ సారి నన్ను వాళ్లింటికి తీసుకు వెళతామని అన్నారు . అందుకే వాకింగుకి వెళ్లడం మానీసేను " అంది రమ .

 

        " ఈ దేశం లో యిలాంటివి మామూలే అమ్మా "
      " మామూలేంటిరా వాళ్లు ప్రకృతికి విరుద్దంగా నడుస్తూ వుంటే మీకెవరికి చీమ కుట్టినట్టు కూడా లేదు , యిలాంటివి సమాజంపై యెంతటి ప్రభావం చూపిస్తాయో మీకెమైనా అవగాహన వుందా?, వీళ్లలాగే అంతా ఆడ ఆడ , మొగమొగ పెళ్లిళ్లు కాపరాలు అంటూ వుంటే మానవ జాతి అంతరించి పోదూ , వాళ్లు పెంచుకున్న పిల్లలని సమాజం అంగీకరిస్తుందా ? వాళ్ల భవిష్యత్తు అంతా జవాబు లేని ప్రశ్నలే , ప్రశ్నలతో మొదలు పెట్టిన బతుకు భవిష్యత్తు లో పెద్ద ప్రశ్నగా మారదూ ? , మన దేశంలో పెళ్లిళ్ల లో డబ్బులు దండుకోడానికి వచ్చేవాళ్లలా కుడాలేరు , మాములుగా మగవాళ్ళ లాగే వున్నారు , ఆ పెంచుకోనేదేదో శుభ్రమైన పెళ్లి అంటే నా వుద్దేశ్యం శుభ్రంగా యిద్దరు ఆడవాళ్ళని  పెళ్లి చేసుకొనే చెయ్యొచ్చు కదా అని " . దుఃఖం తో  సన్నగా వణుకుతున్న గొంతు తో అంది రమ .


         " నే చెప్పలే మా అమ్మ వూరికూరికే భయ పడుతుందని , నువ్వు వెళ్లి నీ కొడుకు దగ్గర రెస్ట్ తీసుకొ ,  నేను మా అమ్మని కొంచం ఎడ్యుకేట్ చేసి వస్తా " . స్వరుపతో అని రమ వైపు తిరిగి
          " అమ్మా ఈ సమాజం లో తాగుబోతులు , తిరుగుబోతులు , దొంగలు , మహిళల పై అత్యాచారం చేసే మానవ మృగాలు వుండగా జరుగని నష్టం ప్రపంచ జనాభాలో ఒక శాతం కూడాలేని వీళ్ల వల్ల జరుగుతుందా ? .  తెలిసి అన్నావో తెలీకే అన్నావో గాని మానసిక రోగులని అది నిజంగా నిజం , వాళ్ళు మానసిక రోగులే .  వాళ్ళకీ తెలుసు తమలో జరుగుతున్న సంఘర్షణ ప్రకృతికి విరుద్దమని , దానిని అణిచి వుంచడానికి చెయ్యగలిగిన ప్రయత్నాలన్నీ చేస్తారు .ఎప్పుడైతే ఆ సంఘర్షణ అగ్నిపర్వతమై బద్దలౌతుందో అప్పుడు వాళ్లు యిలాంటి నిర్ణయం తీసుకొడం జరుగు తుంది . ఇలాంటి ప్రకృతి విరుధ్ద మైన పెళ్ళిళ్ళలో పిల్లలు పుట్టరు , కాని వారికి పిల్లలని పెంచి పెద్ద చెయ్యాలనే కోరిక వుంటుంది , వాళ్లు అడాప్షన్ సెంటర్ నుంచి పిల్లలని తెచ్చుకుంటారు . అనాధ పిల్లలని పెంచుకొని వొక రకంగా వీళ్లు సమాజానికి సేవ చేస్తున్నట్లే కదా ? అన్నాడు కమల్  .


        " యిది సమాజం మీద యెంత చెడు ప్రభావం చూపుతుందో......... ? వీళ్లని చూసి అందరూ యిలాగే చేస్తే " .
      " అందరూ అలా చెయ్యరమ్మా కొందరే యిలాంటి వాళ్లు వుంటారు ".
     " మగాడు  తల్లెంటిరా ? "
     " అమ్మ తనాన్ని లింగభేదం తో కాకుండా మనసు తో చూస్తే నీకు అర్ధం అవుతుంది , యిక మనదేశంలోని హిజరాలు అని పిలువబడే వాళ్లు కూడా నాలాగ , నీలాగ అమ్మ కడుపులోంచి పుట్టినవాళ్లే కాని ఆకాశం మీంచి వూడిపడరమ్మా " .
    " వీళ్లని యిలా దేశం మీద వదిలేసే బదులు పురిట్లోనే గొంతునులిమి చంపేస్తే దేశానికి సగం దరిద్రం తీరుతుంది " కొడుకు తర్కం తో యేకీభవించలేని రమ అంది .


    " దేశదరిద్రం వీళ్లని చంపితే తీరదమ్మా ,  దేశ సంపదను పందికొక్కుల్లా తినేస్తున్న అవినీతిపరులను చంపాలి . వీళ్లవల్ల సమాజానికి కీడు అనుకుంటున్న నీఆలోచలని చంపాలి . వికలాంగుల కోటా వీరికందకుండా చేస్తున్న అధికారులని చంపాలి , సంఘవిద్రోహులకు , అతి తెలివిగా దేశ ఆర్ధిక వ్యవస్థకి గండి కొట్టి తమ ఖజానా నింపుకుంటున్నవారిని , వారికి అండగా నిలిచి రాజ్యాంగాన్ని తిరగరాయగలిగే ప్రభుద్దులను చంపాలి , వీరి శక్తి సామర్ధ్యాలని వుపయోగించుకో లేకపోయిన  మన దౌర్భాగ్యపు ఆలోచనలను చంపాలి ,  జంతువుల హక్కుల కోసం పోరాడు తున్న వారు వీరు జంతువులు కారు కాబట్టి వీరిని పట్టించు కోలేదు . మా పోరాటం కేవలం మహిళలకే అన్నాయి మహిళా సంఘాలు . తరతరాలుగా వంచింపబడుతున్న జాతి యేది అంటే ఈ మూడో జాతే . కన్న తల్లితంద్రులే మీరు మాకు బరువు అని వదిలేస్తే వారినియే సంఘాలు మాత్రం వుధ్దస్తాయి . శారీరిక , మానసిక యెదుగుదల లేక పుట్టిన పిల్లలను అక్కున చేర్చుకోగలిగే సహనం గల అమ్మ యిలాంటి బిడ్డ పుట్టేడని తెలియగానే గుట్టు చప్పుడు కాకుండా వదిలించుకుంటోంది అంటే అది ఆ అమ్మ తప్పా ? , లేకపోతే తమ పుట్టుకలోని లోపం యేమిటో  తెలియని ఆ పురిటి గుడ్డుది తప్పా , లేక పోతే మనలో మనకు తెలియకుండా పాతుకు పోయిన మూఢనమ్మకందా ?  చెప్పమ్మా చెప్పు . " కమల్ గొంతులో ఆవేదన తొంగి చూసింది .


        " ఇలాంటి పిల్లలు యే వూరిలో పుడితే ఆ వూరికే అరిష్టం , యే తల్లి కడుపున పుడితే ఆ తల్లిని అమ్మవారికి బలియిచ్చెస్తారుట తెలుసా ? " నరనరానా జర్ణించుకు పోయిన మూఢనమ్మకం రమ నోటంట పలికింది .


     " పుట్టిన బిడ్డ గుడ్డివాడని తెలియగానే బ్రెయిలీని అతని తల్లి గొంతునులిమి చంపేసి వుంటే  ప్రపంచంలోని గుడ్డివారికి చదువుకొనే అవకాశం కలుగకపోను కదమ్మా ? . ఏ కాలంలో వున్నామమ్మా మనం , ' సంపన్న దేశాలకన్నా మన ఆర్ధిక వ్యవస్థ బలమైనది ' అని గుండెలు బాదుకుంటే రాదమ్మా ప్రగతి . ఇప్పటికైనా మనం కళ్లు తెరిచి యిలాంటి వారికి వృత్తి విద్యలలో శిక్షణ యిచ్చి మనదేశం మరచిపోయిన ఒక జాతికి  చేయూత నివ్వాలి . విద్యావకాశాలు కల్పిస్తే వారిలో యెందరో డాక్టర్లు , యింజనీర్లు అయి దేశ సేవ చేసేవారు " . పెద్దగా వినిపించిన వెక్కిళ్ల శబ్దానికి యీలోకం లోనికి వచ్చిన కమల్ నోటికి కొంగు అడ్డం పెట్టుకొని బెడ్రూము లోకి వెళ్లి తలుపేసుకున్న తల్లిని బిత్తరపోయి చూసేడు .


        ------                            ---------                   ----------
     

ఆరు నెలలు మనవడితో ఆడుకుంటానని వచ్చిన తల్లి తిరుగు ప్రయాణానికి సిధ్దపడుతూవుంటే యెలా వారించాలో తెలీక తికమక పడుతున్న కమల్ ని చూసి చల్లగా నవ్వింది రమ .
     " నీ మీద కోపం తో వెళ్లటం లేదు నాన్నా , చిన్నవాడవయినా నా కళ్లు తెరిపించి యెంతో యెత్తుకి యెదిగిపోయేవురా ? నాన్న రిటైర్ అయ్యాకా కాలక్షేపం కోసం గోసేవ చేసుకుంటూ పుణ్యం సంపాదించుకొని పునర్జన్మ లేకుండా చేసుకుందామనుకొన్న సంగతి నీకు తెలిసిందే కదా ? నిన్న నీ మాటలతో నా కళ్లు తెరచుకున్నాయి . యెవరో వచ్చి యేదో చెయ్యాలని  యెదురు చూసే బదులు , ఆ చేసేదానికి నేనే నాంది పలకాలి అని నిర్ణయించుకున్నానురా , నాన్న తో కూడా మాట్లాడేను , నాన్నకూడా సరే అన్నారు . మంచి పనికి ఆలస్యమెందుకని బయలుదేరుతున్నాను నాన్నా " అంటున్న రమని చుట్టుకుపోయి " నువ్వెంత మంచి దానవమ్మా , దేశం మరచిపోయిన జాతి కోసం నడుం బిగించిన నువ్వు చాలా గ్రేట్ , ఐ యాం ప్రౌడాఫ్ యూ అమ్మా , ఐ యాం ప్రౌడాఫ్ యూ " అంటూ వంగి తల్లికాళ్లు కళ్లకద్దుకున్నాడు కమల్ .


       కొడుకు తల పై చెయ్యి వేసి ఆశీర్వదించి పెట్టె సర్దుకోడంలో మునిగి పోయింది రమ .
   " నువ్వనుకుంటున్నంత గొప్పదానను కానురా నాన్నా , నీ దగ్గర నిజం వొప్పుకోలేని యీ పిచ్చి తల్లిని క్షమించు తండ్రీ " అని మనసులో అనుకుంటూ సామాను సర్దుకోడంలో మునిగిపోయింది .


 

రచన: కర్రా నాగలక్ష్మి