Facebook Twitter
" ఏడు రోజులు " 23వ భాగం

" ఏడు రోజులు " 23వ భాగం

 

 

 

రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి

 

 తన ప్రయత్నాన్ని విరమించుకుంటూ దగ్గరగా ఒదిగి నిలబడి నవీన్ నే చూడసాగింది గౌసియా.
    
    ప్రార్ధన పూర్తయ్యేవరకూ అతడు ఎక్కడా చూళ్ళేదు. ఎంతో ఏకాగ్రతగా ప్రభువును స్మరించుకున్నాడు. ప్రార్ధన పూర్తయ్యాక సైతం అతడు ఎవ్వరితో మాట్లాడలేదు. ఎవ్వర్నీ పట్టించుకోకుండా నిశ్శబ్దంగా బయటికి నడిచాడు.
    
    'అతడు అతడేనా?' అతడ్నే చూస్తూ ఆశ్చర్యంగా అనుకుంది గౌసియా.
    
    "ఏం గౌసియా? ఎవర్ని అలా చూస్తున్నావు?" అడిగింది పక్కనే వున్న సన్యాసిని.
    
    అప్పటికి తను చెప్పాలనుకున్న విషయం గుర్తుకురాగానే హడావిడి పడుతూ, "అతడే... అతడే" నవీన్ వైపు చూపించింది గౌసియా.
    
    "ఎవరు?" వెళ్ళిపోతున్న జనాల్లోకి చూసింది సన్యాసిని.
    
    "అదిగో... అతడు" ఆత్రంగా చూపించింది గౌసియా.
    
    "ఎవరు గౌసియా?" ఆమెకు అర్ధం కావడంలేదు.
    
    "అదిగో తెల్లచొక్కా వేసుకున్నాడే... అతడే నన్ను మోసం చేయాలనుకున్నవాళ్ళలో ఒకడు"
    
    "అట్లాగా... ఎవరూ... ఎవరూ?" ఆమెలో కూడా ఆత్రం పెరిగింది.
    
    నవీన్ జనాల్లో కలిసి వెళ్ళిపోతున్నాడు. అందరూ తెల్లచొక్కాలే ధరించి వున్నందున అతడ్ని గుర్తించడం సన్యాసినికి సాధ్యపడడం లేదు.
    
    "అతడే..." గౌసియా నవీన్ వైపు కళ్ళింత చేసి చూస్తోంది.
    
    "ఎక్కడా?" ఆమె కంగారుపడిపోతూ జనాల్లోకి చూస్తోంది.
    
    అప్పటికి బయటికి నడిచాడు నవీన్. గౌసియా కూడా బయటికి నడవబోయింది వెళ్తున్న జనాలు ఆమెను త్వరగా బయటకు వెళ్ళనివ్వలేదు. జనాలు తొక్కిసలాటలా కాకుండా ఒక క్రమపద్దతిలో బయటకు వెళ్తున్నారు అయినప్పటికీ వాళ్ళందర్నీ దాటుకుని బయటికి వెళ్ళేసరికి కొద్దిసమయం పట్టింది. తీరా బయటకు వెళ్ళేసరికి నవీన్ కనబడలేదు.
    
    "యా అల్లా..." అనుకుంటూ జనాల్లోకి కలియచూసింది గౌసియా.
    
    "అతడు ఎక్కడా?" వెనకే వచ్చిన సన్యాసిని అడిగింది.
    
    "కనబడ్డంలేదు..." కంగారుగా అని, "ఆ... అదిగో... అక్కడ..."
    
    అటుతిరిగి గేటుదగ్గర నిల్చునివున్న ఓ వ్యక్తివైపు చూపించింది గౌసియా.
    
    "నాకు అర్ధంకావడంలేదు వెళ్దాంరా" అంటూ గౌసియా చేయి పట్టుకుని ముందుకు నడిచింది సన్యాసిని.
    
    "ఇదిగో ఇతడే" సమీపంగా వెళ్ళగానే చూపించింది గౌసియా.
    
    అదేక్షణంలో అతడు ఇటుతిరిగాడు. అతడు నవీన్ కాదు.
    
    "మదర్?" సన్యాసిన్ ఐ వైపు ప్రశ్నగా చూశాడు అతడు.
    
    "ఆ... ఆ... ఇతడుకాదు" పొరపాటుకు తడబడింది గౌసియా.
    
    "మరి అతడెక్కడా?" అడిగింది సన్యాసిని.
    
    "కనబడ్డంలేదు వెళ్ళిపోయినట్టున్నాడు" జనాల్లోకి చూస్తూ అంది గౌసియా.
    
    "సరే" అని, "సారీ మిస్టర్" తమవైపే అర్ధం కానట్టుగా చూస్తున్న ఇందాకటి వ్యక్తికి చెప్పి, గౌసియా చేయి పట్టుకుని వెనక్కి నడుస్తూ, "నువ్వు అనవసరంగా పొరబడుతున్నావు" అంది సన్యాసిని.
    
    తను ఖచ్చితంగా పోరాబదలేదు. ఇలాగని తనను ఇప్పుడు నిరూపించుకోలేదు.
    
    గౌసియా అందుకే మౌనంగా వుండిపోయింది.
    
    ఆశ్రమానికి వెళ్ళాక విషయం అందరికీ తెల్సిపోయింది.
    
    "నేను నిజంగా అతడ్ని చూసాను" ఖచ్చితంగా అంది గౌసియా ఆమెను ఎవ్వరూ నమ్మలేదు ఆమె ఇక ఎక్కువసేపు ఎవ్వర్నీ నమ్మించే ప్రయత్నం చేయలేదు కూడా.
    
    ఫాదర్ కోసం ఎదురుచూస్తూ బయటి వరండా మెట్లమీదకు వెళ్ళికూర్చుంది.
    
            *    *    *
    
    ఫాదర్ పోలీస్ స్టేషన్ లో కూర్చుని ఇన్స్ పెక్టరుతో సీరియస్ గా మాట్లాడుతున్నారు.
    
    "అమ్మాయి కేసు, దేశంమొత్తం మీద సంచలనం సృష్టించబోతోంది" అన్నాడు ఇన్స్ పెక్టర్.
    
    "ఒక చదువురాని పిల్ల... అందునా ఒక అమాయకురాలు... ఇంత సాహసం చేసింది అంటే ఇది సామాన్యమైన విషయంకాహ్డు కదా?" అన్నాడు ఫాదర్.
    
    "అప్పట్లో ఎయిర్ హోస్టెస్ అమృతా అహ్లూవాలియా ద్వారా రక్షింపబడిన అమీనా సంఘటన కనీవినీ ఎరుగని సంచలనమైంది. అలాంటిది ఇప్పుడు ఏకంగా తనను కొనుగోలు చేసినవాడ్ని అమ్ముడుపోయిన అమ్మాయే చంపడమంటే నాట్ పాసిబుల్. కానీ సాధ్యమైంది. సో... అమ్మాయిని వెంటనే చూడాలనిపిస్తోంది వెళ్దాం పదండి" తొందరపడ్డాడు ఇన్స్ పెక్టర్.
    
    "ఓకే" అంటూ లేచి నిల్చున్నాడు ఫాదర్.
    
    కాసేపట్లో పోలీసుజీపు మరియా ఆశ్రమం ముందు ఆగింది. గౌసియాతోపాతూగా వరండాలో కూర్చునివున్న సన్యాసినులు అందరూ ఒక్కసరిగా తిరిగిచూశారు.
    
    ఫాదర్ తోపాటుగా పోలీసులు కిందికి దిగారు. వాళ్ళను చూడగానే గౌసియా భయంగా లేచి నిలబడింది.
    
    "ఈ అమ్మాయే మన గౌసియాబేగం" దగ్గరగా రాగానే గౌసియాను పోలీసులకు చూపించాడు ఫాదర్.
    
    "సలాం.... వాలేకుం" అలవాటుగా తల వంచి చెప్పింది గౌసియా.
    
    ఆమె సలాంను స్వీకరిస్తున్నట్టుగా చిరునవ్వుతో గౌసియా భుజాన్ని తట్టాడు ఇన్స్ పెక్టర్.
    
    తర్వాత అందరూ కలిసి డాబామీదకు వెళ్ళారు. అప్పుడు సమయం రాత్రి ఏడుగంటలు కావస్తోంది. వాతావరణం చల్లగా హాయిగా వుంది. వెళ్ళి డాబామీద ఖాళీ ప్రదేశంలో వేసివున్న కుర్చీల్లో కూర్చున్నారు పోలీసులు, ఫాదర్, గౌసియా ఒకపక్కగా నిలబడి పోయింది.
    
    ఇన్స్ పెక్టర్ గౌసియాతో అన్ని విషయాల్ని ఓపికగానూ, క్షుణ్ణంగానూ మాట్లాడసాగాడు. ఆమె వున్నది వున్నట్టుగా చెప్పుకుపోసాగింది.
    
    "అమ్మాయిని ఈ రాత్రికే డి.జి.పి దగ్గరకు తీసుకెళ్దాం" గౌసియాతో మాట్లాడక ఫాదర్ తో అన్నాడు ఇన్స్ పెక్టర్.
    
    "రేపు ఉదయాన్నే తీసుకువెళ్దాం ఇప్పుడు చీకటయ్యింది కదా" అన్నాడు ఫాదర్.
    
    "నో నో జాప్యం చేయడానికి ఇది సాధారణ విషయం కాదు. ఇలాంటి విషయాల్లో అర్దరాత్రి పన్నెండయినా సరే, వెళ్ళాల్సిన చోటుకు మేము వెళ్ళితీరుతాం! ఆడామగా తేడా కూడా మాకు లేదు" అన్నాడు ఇన్స్ పెక్టర్.
    
    "సరే  అట్లాగే కానివ్వండి" అన్నాడు ఫాదర్.
    
    "ఆ...అమ్మాయీ! నిన్ను మోసం చేయాలనుకున్నారే ఆ కుర్రాళ్ళు వుండే చోటుకు మమ్మల్ని తీసుకెళ్ళగలవా?" అడిగాడు ఇన్స్ పెక్టర్.
    
    "తీసుకువెళ్ళలేను. కాకపోతే అక్కడ ఒక దేవత గుడి వుంటుంది. వీధి కూడా పాడుబదినట్టుగా వుంది" చెప్పింది గౌసియా.
    
    "సరే సరే వాళ్ళను తరువాత చూసుకుందాం" అన్నాడు ఇన్స్ పెక్టర్.
    
    "ఈ సాయంత్రం వాళ్ళల్లో ఒకడు చర్చికి వచ్చాడు. నేను కళ్ళారా చూశాను. కాని అంతలోనే అతడు వెళ్ళిపోయాడు నేను ఈ విషయాన్ని చెప్తే కూడా నన్ను ఎవ్వరూ నమ్మలేదు ఫాదర్ కు చెబుదామన్నా ఫాదర్ ఈ సాయంత్రం చర్చికి రాలేదు" చెప్పింది గౌసియా.
    
    "ఈ సాయంకాలం నుండి ఫాదర్ మా దగ్గరేవున్నారు" ఫాదర్ ను చిరునవ్వుగా చూస్తూ చెప్పాడు ఇన్స్ పెక్టర్.
    
    తర్వాత గౌసియాను డి.జి.పి దగ్గరకు తీసుకెళ్ళారు. ఫాదర్ వెంటే' వున్నాడు అక్కడికి వెళ్ళాక పత్రికల వాళ్లకి, టీవీవాళ్ళకి సమాచారం పంపడం, వాళ్ళు వెనువెంటనే రావడం, న్యూస్ కవర్ చేసుకోవడం గౌసియాకు అంతా కలలోలా తోచింది. అరబ్బుషేకులకు స్థావరం కల్పించిన హిందుస్థానీ హోటల్ మీదకు అప్పటికప్పుడు పోలీసులు దాడిచేయడం, హత్య అనంతరం కొందరు పారిపోగా మిగిలిన వాళ్ళు కొందర్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం, హోటల్ యాజమాన్యాన్ని కూడా అదుపులోకి తీసుకోవడం అంతా ఆ రాత్రికి రాత్రే జరిగిపోయాయి.

 

...... ఇంకా వుంది .........