Facebook Twitter
" ఏడు రోజులు " 24వ భాగం

" ఏడు రోజులు " 24వ భాగం

 

 

 

రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి

 

 

గౌసియా అందించిన వివరాల ప్రకారం మొదట హైదరాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి అట్నుంచి గౌసియా వాళ్ళ సంబంధిత పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి డి.జి.పి యే స్వయంగా మాట్లాడాడు. అక్కడి సబ్ ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలీస్ చెప్పిన మాటలు డి.జి.పిని మొదట కలవరపెట్టాయి.
    
    డి.జి.పిద్వారా విషయం తెలుసుకున్న ఫాదర్ కూడా కలవరపడి పోతూ "ఓ గాడ్! ఈ విషయాన్ని వెంటనే అమ్మాయికి చెప్పడం అంత మంచిదికాదు" అన్నాడు.
    
    "జాగ్రత్తపడాల్సింది అమ్మాయి గురించే కాదు, దేశం గురించి కూడా! అరబ్బుషేకు హత్య గురించి ఏ పేపర్లూ పెద్దగా రాయలేదు. ముందు ఆలోచనగా గౌసియా తండ్రి హత్య గురించి కూడా పెద్దగా రాయలేదు. కాని రేపు ఈ వార్తలు మెయిన్ ఎడిషన్ లో రాబోతున్నాయి. అంటే దేశం మొత్తం మీద మతకల్లోలాలు తలెత్తినా ఎత్తవచ్చు" అన్నాడు డి.జి.పి.
    
    "కన్నతండ్రి విషయంలో అమ్మాయి విముఖతగా వుంది. సో... తండ్రి హత్య గురించి తెలిస్తే కాసేపు బాధపడి వూరుకుంటుందేమో కాని తన ప్రియుడు కనిపించకుండా వెళ్ళిపోయాడంటే మాత్రం ఆ పిల్ల తట్టుకోలేదు" అన్నాడు ఫాదర్.
    
    "ఆ అబ్బాయి నిజంగా పారిపోతే పొరపాటు చేసినవాడే అవుతాడు. ఎందుకంటే ఆ అబ్బాయి గౌసియా తండ్రిని ఎందుకు హత్య చేశాడు అన్న విషయాన్ని పేపర్లు స్పష్టంగా ప్రచురించలేదు. కాని అబ్బాయి అదే విషయాన్ని పోలీసులకు రిపోర్ట్ ఇచ్చి వుంటే ఎంత బాగుండేది? ఇప్పుడు ఆ హత్య ఎందుకు జరిగింది అన్న విషయం గురించి కరెక్టు సమాచారం లేదంటున్నారు. అయినా ఇప్పుడు అంతా తేటతెల్లమైపోయిద్న్హి. కాని ఆ అబ్బాయే ఎక్కడవున్నాడో ఏమో పాపం" అన్నాడు డి.జి.పి.
    
    "నేనూ అదే బాధపడుతున్నాను" అన్నాడు ఫాదర్.
    
    "అసలు ఆ అబ్బాయి బతికే వున్నాడా లేదా అనేది నాకు అనుమానంగా వుంది. ఉదయం పేపర్లో ఓ చోట చిన్నగా వచ్చిన వార్తను చదివినప్పుడు ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోలేదు. కాని ఇప్పుడు అమ్మాయి అంతా చెప్పాక అక్కడకి ఫోన్ చేసి అక్కడి పరిస్థితి తెలుసుకున్నాక ఈ సంఘటన ఎంత తీవ్రమైనదో అర్ధమౌతోంది" అని డి.జి.పి అనగానే.
    
    "మీరు ఆ వార్తను కనీసం చదివారు. నేను అసలు చదవలేదు. ఇలాంటి విధ్వంసాల గురించి చదివితే ఒకటి రెండు రోజుల వరకు నాకు మనశ్శాంతి వుండదు. అందుకే దాదాపుగా నేను అట్లాంటి వార్తలు చదవను" అన్నాడు ఫాదర్.
    
    డి.జి.పి మరేదో అనబోయాడు. అప్పుడే ఒక కానిస్టేబుల్ లోపలికి వచ్చాడు.
    
    "సర్! ఆ అమ్మాయి మాకేం అర్ధం కావడంలేదు" చెప్పాడు.
    
    "నేను వస్తాను" అంటూ లేచి వెంటనే డి.జి.పి గదిలోంచి బయటకు వచ్చాడు ఫాదర్.
    
    బయట ఒకపక్కగా చెయిర్ లో ఒదిగి కూర్చుని వుంది గౌసియా.
    
    "గౌసియా..." ప్రేమగా పిలుస్తూ దగ్గరగా వెళ్ళాడు ఫాదర్.
    
    స్తబ్దుగా నేలను చూస్తూ కూర్చునివున్న గౌసియా కనీసం తలతిప్పి చూళ్ళేకపోయింది.
    
    "గౌసియా" ఆమె పక్క చెయిర్ లో కూర్చున్నాడు ఫాదర్.
    
    "నాకెందుకో భయంగా వుంది ఫాదర్" ఏడుపు ముఖంతో ఫాదర్ వైపు చూసింది గౌసియా.
    
    "ఎందుకు భయపడుతున్నావు?" అడిగాడు ఫాదర్.
    
    "నేను ఇప్పట్లో హైదరాబాదు వెళ్ళలేనేమో అనిపిస్తోంది. ఎందుకంటే వీళ్ళు నా గురించి ఏదేదో మాట్లాడుతున్నారు. నేను కొద్దికొద్దిగా విన్నాను" పక్కన నిల్చునివున్నా కానిస్టేబుల్స్ వైపు చూపిస్తూ అంది గౌసియా.
    
    "మేము ఏం మాట్లాడాం?" అన్నట్లుగా చూశారు కానిస్టేబుల్స్.
    
    "గౌసియాకు ఏం జరిగిందని మీరేం మాట్లాడుకున్నారు? తను రేపో ఎల్లుండో హైదరాబాద్ వెళ్తుంది. ఆమెను అనవసరంగా భయపెట్టవద్దు" కానిస్టేబుల్స్ తో అన్నాడు ఫాదర్.
    
    "మేము అసలు ఆమె గురించే మాట్లాడలేదు. మా మాటలు మేము మాట్లాడుకున్నాం. తను పొరపాటు పడితే మేమేం చెయ్యాలి?" ఆశ్చర్యపోతూ అన్నాడు ఒక కానిస్టేబుల్.
    
    "లేదు ఫాదర్! వీళ్ళు నా గురించే మాట్లాడారు నేను విన్నాను హైదరాబాద్ లో కూడా అల్లర్లు జరిగాయటకదా. ఎవరికో ఏదో జరిగిందటకదా!" భయంగా అంది గౌసియా.
    
    "నోనో! ఎవ్వరికీ ఏం జరగలేదు" గౌసియా భుజంపై చేయివేశాడు ఫాదర్.
    
    "మీరు ఏదో దాచిపెడుతున్నారు. నిజం గానే ఎవ్వరికో ఏదో జరిగింది" ఏడవసాగింది గౌసియా.
    
    "ఎవ్వరికీ ఏమీ కాలేదమ్మా అందరూ క్షేమంగా వున్నారు" చిన్నగా నవ్వుతూ అన్నాడు ఫాదర్.
    
    "అయితే రేపే నన్ను హైదరాబాదు తీసుకెల్లండి" అంది గౌసియా.
    
    "వెళ్దాం కాని కొద్దిగా ఆలస్యంగా! ఎందుకంటే నువ్వు హత్యకేసులో వున్నావు. ఈ కేసులో నీకు శిక్షపడదు. కాని కొన్ని రోజులు ఇక్కడే పోలీసులు నిన్ను అదుపులోకి తీసుకుంటారు" నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు ఫాదర్.
    
    "వద్దు... నేను రేపే వెళ్తాను" మొండిగా అంది గౌసియా.
    
    "సరేలే నీ ఇష్టం" అని కాసేపాగి, "ఇప్పుడే వస్తాను ఇక్కడే కూర్చో" చెప్తూనే లేచి తిరిగి లోపలికి నడిచాడు ఫాదర్.

    'నా భవానీ శంకర్ కు ఏం కాకూడదు' మనసులో కోరుకుంటూ అక్కడే కూర్చుండి పోయిందామె.
    
    "పాపా" కాసేపటి తర్వాత ఒక కానిస్టేబుల్ పిలుస్తూ వచ్చాడు.
    
    ఏంటన్నట్లుగా చూసింది గౌసియా.
    
    "స్టేషన్ కు వెళ్దాం రామ్మా" అన్నాడు.
    
    "ఫాదర్!" లోపలివైపు చూసింది.
    
    "నేను తర్వాత వస్తానమ్మా"
    
    "వద్దు ఫాదర్! మీరు లేకుండా నేను వెళ్లను" అంది గౌసియా.

    "నాకు కొద్దిగా పని వుందమ్మా! ఆ పని అయ్యాక వెంటనే వస్తాను" అన్నాడు ఫాదర్.

    "తొందరగా రావాలి" అంది గౌసియా.

    "వస్తాను"

    గౌసియా ఇంకేం మాట్లాడలేదు. కానిస్టేబుల్ వెంట బయటకు నడిచింది.

    "ఈ అమ్మాయి ఎక్కువసేపు ఇక్కడ వుంటే నిజాన్ని ఎట్లాగయినా తెలుసుకుంటుంది. ఈ కానిస్టేబుల్స్ కాసేపు వూరుకోండయ్యా అంటే విన్పించుకునేట్టులేరు. తను ముందే మానసికంగా బలహీనురాలు. అందుకే స్టేషన్ కు పంపిస్తున్నాం" వెళ్తున్న గౌసియానే చూస్తూ పక్కన నిల్చునివున్న ఒక పత్రికా విలేకరితో అన్నాడు ఫాదర్.

    "ఈరోజు కాకపోయినా రేపైనా నిజం తెలుస్తుందిగా ఫాదర్?" అన్నాడు విలేకరి.

    "నిజం తెల్సినా భరించుకునేలా రేపటివరకు అమ్మాయిని ప్రిపేర్ చేస్తాం" అన్నాడు ఫాదర్.

    అప్పటికి కానిస్టేబుల్ తో కలిసి బయటకి నడిచింది గౌసియా. వెనకే మరో కానిస్టేబుల్ వచ్చాడు. ఇద్దరితో కలిసి పోలీసుజీపులో స్టేషన్ కి బయలుదేరిందామె. మధ్యలోకి వెళ్లాక వెనకసీట్లో కూర్చుని వున్న కానిస్టేబుల్ అడిగాడు.

    "అమ్మాయీ! నీవు ప్రేమలో పడ్డావా?"

    "అ...వు...ను" కొద్దిగా ఇబ్బందిపడింది గౌసియా.

    "ఆ కుర్రాడు ఏం చేస్తుంటాడు?"

    "చదువుకుంటున్నాడు"

    "ఏంటో ఈ కాలం పిల్లలకు ఇంత వయసు వచ్చిందో లేదో అప్పుడే తహతాహలు మొదలౌతాయి" తనలో తానే గొణుక్కున్నాడు కానిస్టేబుల్.

    జీపు పోలీస్ స్టేషన్ ముందు ఆగింది. కానిస్టేబుల్స్ తో పాటుగా జీపుదిగి స్టేషన్ లోపలికి నడిచింది గౌసియా.

    "నీకేం భయంలేదు. ధైర్యంగా వుండు" డ్రైవ్ చేసిన కానిస్టేబుల్ ఆమె భుజాన్ని తడుతూనే గట్టిగా నొక్కాడు.

    ఆమె అతడిని పెద్దగా పట్టించుకోలేదు. వెళ్లి అక్కడ కుర్చీలో ఒక పక్కగా కూర్చుంది.

    "నీకేం అవసరం వచ్చినా నాతో చెప్పు" ఆమె వీపు నిమిరాడు అతడు.

    "సరే" తలాడించిందామె.

    "బాత్ రూమ్ వస్తోందా?" తనే అడిగాడు.

    "ఉహూ" తల అడ్డంగా వూపింది.

    "వస్తే వెళ్లు" చెప్పాడు.

    "..."

    "కాసేపైతే ఫాదర్ తో పాటుగా అందరూ వస్తారు. అంతా అల్లరిగా వుంటుంది. బాత్ రూమ్ కి ఇప్పుడే వెళ్లు" చెప్పాడు.

    "వద్దు" అందామె.

    "సరే నీ ఇష్టం" అంటూ బయటకి నడిచాడు అతడు.

    "ఏమంటోందిరా?" మెల్లగా అడిగాడు అక్కడున్న కానిస్టేబుల్.

    "వేస్టు క్యాండిడేటు" చెప్తూ వెళ్లి అతడి పక్కన కూర్చున్నాడు ఇతడు.

    "ఇదే వేరే కేసైతే ట్రైచేసి చూసేవాళ్లం. కాని ఇప్పుడు జాగ్రత్తగా వుండాల్రోయ్. లేదంటే మన కొంపలు మునుగుతాయి" మొదటి కానిస్టేబుల్ అన్నాడు.

    అంతలోనే గౌసియా డోర్ దాకా వచ్చి "సార్" పిల్చింది. ఇద్దరూ ఆమెవైపు చూశారు.

    "బాత్ రూమ్" అందామె.

    "వస్తాను పదా" అంటూ రెండవ కానిస్టేబుల్ లేచి ఆమెవైపు వెళ్లాడు.

    "మీ ఇద్దరి పేరేంటి?" అడిగింది గౌసియా.

    "నా పేరు కృష్ణ. అతడి పేరు వెంకట్" చెప్పాడు.

...... ఇంకా వుంది .........