Facebook Twitter
" ఏడు రోజులు " 22వ భాగం

" ఏడు రోజులు " 22వ భాగం

 

 

 

రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి

 

 భవానీశంకర్ అపనమ్మకంగా చూస్తూ నిల్చుని వున్నాడు. ఫాదర్ తోడురాగా చిరునవ్వుతో భవానీశంకర్ దగ్గరికి నడిచింది గౌసియా.
    
    "గౌ... సి...యా?" ఆమె రాకను అతడు నమ్మలేకపోతున్నాడు.
    
    "శం... క...ర్... ఈ ఫాదర్ దేవుడు. నన్ను నీకోసం తీసుకువచ్చాడు" ముంచుకొస్తున్న దుఃఖాన్ని బలవంతాన బిగువ పట్టుకుంటూ అందామె.
    
    ఫాదర్ వైపు చూశాడు భవానీశంకర్ ఫాదర్ చిరునవ్వుతోనే అతడ్ని పలకరించదువు. భవానీశంకర్ ఫాదర్ చిరునవ్వుతోనే అతడ్ని పలకరించాడు. భవానీశంకర్ ఫాదర్ కి చేతులు జోడించాడు. ఆ సమయంలో భవానీశంకర్ కళ్ళల్లో కృతజ్ఞతాపూర్వకమైన వెలుగు.
    
    "ఫాదర్! మా ఇద్దర్నీ కలిపారు. ఇక మా కుటుంబాలనుండి గానీ, మా మతాలనుండి కానీ మాకు ఎలాంటి కష్టం రాకుండా మీరే కాపాడాలి" ఫాదర్ చేతుల్ని పట్టుకుంది గౌసియా.
    
    "మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు" అన్నాడు ఫాదర్.
    
    "ఎందుకైనా మంచిది మేం ఈ సమాజానికి దూరంగా బతుకుతాం" అన్నాడు భవానీశంకర్.
    
    "మేం ఏ మతానికీ సంబంధించిన వాళ్ళంకాదు. మేం కేవలం భారతీయులం! కాబట్టి అటు హిందువులుగానీ, ఇటు ముస్లింలుగాని మమ్మల్ని ఏదైనా చెయ్యవచ్చు" భయంగా అన్నాడు భవానీశంకర్.
    
    "అవును ఫాదర్! మతాల్ని వదిలేసుకుని భారతీయులుగా బతకాలి అనుకుంటున్నాం కాబట్టి, ఏ మఠం వాళ్ళకైనా మాపై కోపం రావొచ్చు" అంది గౌసియా.
    
    సరిగ్గా అదే సమయంలో అటువైపునుండి హిందువులు, ఇటువైపునుండి ముస్లింలు భయపెడుతూ అరుస్తూ... కర్రలు పట్టుకుని పరుగెట్టుకు రాసాగారు.
    
    గౌసియా, భవానీశంకర్ ఆ ఇరువర్గాల్ని చూడగానే ఒకరిచేతుల్ని ఒకరు బిగ్గరగా పట్టుకుని భయంగా బిగుసుకుపోతూ ఒక పక్కకు జరిగారు.
    
    ఫాదర్ మాత్రం భయపడలేదు "ఆగండి" ఇరువర్గాలకి చేతులు చూపిస్తూ గట్టిగా అరిచాడు.
    
    ఎవ్వరూ ఫాదర్ ని లెక్కచేయలేదు. కట్టలు తెగుతున్న కసి, ద్వేషాలతో ఒకర్ని ఒకరు కొట్టుకోవడం ఆరంభించారు. కాసేపటిక్రితం ప్రశాంతంగా వున్న వాతావరణం ఒక్కసారిగా హాహాకారాలతో... అరుపులతో... రణభూమిలా మారిపోగానే, ఆ పరిస్థితిని తట్టుకోలేక ఆ ప్రేమికులు ఇద్దరూ అక్కడ్నుంచి తప్పించుకునే ఉద్దేశ్యంతో నెమ్మదిగా అడుగులు వెనక్కి వేయసాగారు.
    
    "ప్రభూ! ఏమిటీ విపరీతం?" ఫాదర్ కూడా పరిస్థితిని తట్టుకోలేకపోతున్నాడు.
    
    "ఫాదర్! వచ్చేయండి" తాము వెళ్తూనే మెల్లగా చెప్పింది గౌసియా ఫాదర్ వెనక్కి తిరిగి చూశాడు.
    
    సరిగ్గా అదే క్షణంలో ఐదారుగురు వ్యక్తులు ఒక్కుమ్మడిగా వచ్చి ఫాదర్ ను విచాక్షణారహితంగా కత్తులతో పొడవసాగారు.
    
    "ఫాదర్" గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంది గౌసియా. సమీపంగా కూర్హ్సుని బైబిలు పుస్తకాలు చదువుకుంటున్న కొందరు సన్యాసినులు ఒక్కసారిగా గౌసియావైపు అర్ధంకానట్లుగా చూశారు.
    
    భయంగా చుట్టూచూసింది గౌసియా.
    
    ఫాదర్ లేడూ, భవానీశంకర్ లేడూ, అస్సలు ఏ గొడవా లేదు. అంతా నిర్మలమైన వాతావరణం నెలకొని వుంది.    
    "కలవచ్చింది" సన్యాసినులవైపు చూస్తూ భయంగా చెప్పింది గౌసియా ఆమె ఇప్పుడు భయపడింది కలగురించి కాదు, వాళ్ళ పఠనానికి భంగం కలిగించినందుకు, వాళ్ళు తనను కోప్పడతారేమోనని మాత్రమే!
    
    గౌసియాకు చేరువగా కూర్చునివున్న ఒక సన్యాసిని ఆమెను చూస్తూ చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వును గమనించిన గౌసియా తన గుండెలపై చేయివేసుకుని.... "హమ్మయ్య! వీళ్ళను నాపై కోపం రాలేదు" అనుకుంది మనసులో.
    
    "గౌసియా" అందరిమధ్యా కూర్చునివున్నా ఒక సన్యాసిని పిల్చింది.
    
    "ఆ..." పలికింది గౌసియా.
    
    "లేచివెళ్ళి స్నానంచేసి తయారవ్వు మళ్ళీ చర్చికి వెళ్దాం" చెప్పిందామె.
    
    "సరే" అని లేచి నిల్చుంటూ ఎదురుగా వున్న గోడగడియారం వైపు చూసింది గౌసియా గడియారాన్ని చూసిన వెంబడే సమయం తెల్సుకోవడం ఆమెవల్లకాదు. అందుకే అలవాటుగా గడియారం వైపు కొన్నిక్షణాలపాటు చూసి, గీతల్ని లెక్కించుకుని, సమయం సాయంత్రం ఐదుగంటలు కావస్తోందని తెల్సుకున్నాక.... నెమ్మదిగా బాత్ రూమ్ వైపు నడిచింది.
    
    ఆమె స్నానం చేసి వచ్చేసరికి చర్చికి వెళ్ళేందుకు సన్యాసినులు సిద్దమౌతున్నారు.
    
    "బైబిలు తీసుకో" ఒక సన్యాసిని డైరీ లాంటి పుస్తకాన్ని గౌసియాకు అందివ్వబోయింది.
    
    "నాకు చదువురాదు" చెప్పింది గౌసియా. కిసుక్కున నవ్వింది సన్యాసిని. నవ్వుతూనే..." చదువుకున్న అమ్మాయిలాగా కనబడుతున్నావే" అంది.
    
    "చదువుకుంటాను" ఆమె నవ్వినందుకు గానూ ఇబ్బందిగా ముఖంపెట్టింది గౌసియా.
    
    "నేను నిన్ను వెక్కిరించలేదు గౌసియా. నువ్వు ఆమాట అనగానే నాకు ఎందుకో నవ్వొచ్చింది" గౌసియా భుజంపై చేయి వేసిందామె.
    
    గౌసియా చిరునవ్వుతో చూసింది.
    
    "ఈ కాలంలో కూడా చదువురాని వాళ్ళు వున్నారంటే నాకు ఆశ్చర్యంగా వుంది. నువ్వు తప్పకుండా చదువుకోవాలి"
    
    "మీరు నాకు అక్షరాలు నేర్పిస్తారా?" 
    
    "తప్పకుండా"
    
    "ఈ రాత్రికే నాకు అక్షరాలు రాసివ్వండి దిద్దుకుంటాను"
    
    "ఇక్కడ్నుంచి వెళ్ళాక కూడా చదువును నిర్లక్ష్యం చేయొద్దు నీవు బాగా చదువు నేర్చుకుని నీ స్వంత దస్తూరితో మాకు ఉత్తరం రాయాలి. సరేనా?"
    
    "సరే..."
    
    "నీవు ప్రభువును నమ్ముకుంటే నీకు త్వరగా చదువు అబ్బుతుంది. నాకు మొదట్లో ఇంగ్లీష్ మాట్లాడ్డం రాకపోయేది కానీ.... "ప్రభూ! ఐ వాంట్ ఇంగ్లీష్" అని ప్రభువును మనస్ఫూర్తిగా నమ్మి ప్రతినిత్యం ధ్యానించుకున్నాక, విచిత్రం! కేవలం రెండు నెలల్లో ఇంగ్లీష్ మాట్లాడాలనుకున్న నా ప్రయత్నం గెలిచింది."
    
    "అవునా?" ఆశ్చర్యపోయింది గౌసియా.
    
    అదే సమయంలో అందరికీ పెద్దగా వ్యవహరించే మదర్ అందర్నీ ఉద్దేశిస్తూ "ప్రార్ధనకు వేళవుతోంది" అని గుర్తుచేసి, "గౌసియా..." పిలిచింది.
    
    "మదర్?" అంటూ ఆమెకు దగ్గరగా వెళ్ళింది గౌసియా.
    
    "చర్చికి వెళ్దాంరా" గౌసియా చేయి పట్టుకుందామె.
    
    ఆమె చాలా పెద్దావిడ. ఆ వయసు లోనూ ఆమె అన్నివిధాలా చలాకిగా వుంది. ఆమెతోపాటుగా ఇంకొందరు పెద్దవాళ్ళు వున్నారు. వాళ్ళు కూడా చలాకీగా వుంటున్నారు.
    
    గౌసియా వచ్చింది ఉదయమే అయినప్పటికీ, ఆ పెద్దవాళ్ళతోపాటుగా మిగతా సన్యాసినులు అందరూ ఆమెతో ఎంతో దగ్గరితనంగా మెలుగుతున్నారు ఆ ఆశ్రమం చాలాచిన్నది సన్యాసినులు మొత్తం యాభై మంది కంటే ఎక్కువలేరు. వాళ్ళల్లో అందరూ గౌసియాకు బాగా నచ్చారు. అదే మాటను మదర్ తో అంది గౌసియా.
    
    "మీరంతా చాలా స్నేహంగా మెలుగుతున్నారు. మీరు నాకు బాగా నచ్చారు"
    
    "ఎంత బాగా నచ్చాం?" గౌసియా చేయిని అలాగే పట్టుకుని ముందుకు నడుస్తూ అడిగింది మదర్.
    
    "చాలా బాగా! కానీ... మీరు నాకేం అర్ధం కావడంలేదు. ఎందుకంటే నాకు తెల్సి నంతవరకు మీలాంటి వాళ్ళంతా పెళ్ళిళ్ళు చేసుకోకుండా దేవుడిసేవకు అంకితమైపోతారు. కానీ మీవాళ్ళు ఒక్కొక్కరు ఒక్కోలా కనబడుతున్నారు" అమాయకంగా అంది గౌసియా.
    
    చిన్నగా ఓమారు నవ్వి... "మేం దేవుడి సేవకేకాదు, మానవసేవకు కూడా అంకితమైన వాళ్ళం. మా వాళ్ళల్లో కొందరు అమ్మాయిలు ప్రయివేటుగా చదువుకుంటున్నారు. అంటే... పరీక్షలు రాయడానికి మాత్రమే హాజరౌతారు అన్నమాట! మిగతా సమయాల్లో మేం మా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటాం. ఇలా కొందరు చదువుకుంటూ, మరికొందరు మానవసేవ నిమిత్తం వెళ్తున్నారు. అందుకే నీకు ఒక్కొక్కరు ఒక్కోలా కనబడుతున్నారు" అంది మదర్.
    
    "అలాగా" అని, "నాకు మీ అందరిపేర్లు తెల్సుకోవాలని వుంది. కానీ మీపేర్లు నాకు గుర్తేవుండవు" అంది గౌసియా.
    
    మళ్ళీ నవ్వింది మదర్ నవ్వి "వచ్చిన కొన్ని గంటల్లోనే మా గురించి బాగా తెల్సుకున్నావు. అంటే నువ్వు చురుకైనదానివి అన్నమాట. మరి మా పేర్లు ఎందుకు గుర్తుండలేదు" అడిగింది మదర్.
    
    తెలీదు అన్నట్టుగా చిన్నగా నవ్వింది. గౌసియా.
    
    "నీకేకాదు గౌసియా. చాలామంది హిందువులకు, క్రిస్టియన్ లకు, కష్టంగా వున్న ముస్లిం పేర్లు కూడా గుర్తుండవు" అంది మదర్.
    
    "అవునా?" తనేదో గొప్పనిజం తెల్సుకున్నట్లుగా అంది గౌసియా.
    
    వాళ్ళు అలాగే మాట్లాడుతూ పదిహేను నిముషాల్లో చర్చిదగ్గరకు చేరుకున్నారు. అక్కడికి వెళ్ళాక అందర్నీ ఒకసారి కలియజూసింది గౌసియా. అనుకోకుండా రాజేష్ వాళ్ళు అక్కడికి వస్తారేమోనన్న అనుమానం ఆమెను ఇంకా పీడిస్తోంది. కానీ వాళ్ళపట్ల ఆమెకు ఇప్పుడు మునుపటి భయంలేదు. కాకపోతే అందరికళ్ళూ కప్పి తనను వాళ్ళు ఎత్తుకు వెళ్తారేమోనన్న కొత్త భయం ఆమెలో చోటు చేసుకుంది.
    
    ఆమె భయాన్ని హెచ్చిస్తూ చర్చి ఆవరణ లోకి నవీన్ వచ్చాడు ఎవ్వర్నీ పట్టించుకోకుండా చర్చిలోపలికి నడిచాడు. అతడిగురించి మదర్ తో చెప్పాలనుకుని మదర్ వైపు చూసింది గౌసియా. మదర్ ఎవ్వరితోనో మాట్లాడుతోంది.
    
    అదే సమయంలో మరో సన్యాసిని వచ్చి గౌసియాను చర్చిలోపలకు తీసుకెళ్ళింది. లోపలికి వెళ్ళాక నవీన్ కోసం చూసింది గౌసియా. అతడు మగవాళ్ళ ముందు వరసలో భక్తిపూర్వకంగా తలవంచుకుని నిలబడివున్నాడు. కనీసం తనను తీసుకువచ్చిన సన్యాసినికైనా అతడ్ని చూపించాలనుకుంది గౌసియా కానీ అప్పటికి అందరూ ప్రార్ధన కోసం సంసిద్ధులు అవుతున్నారు.

...... ఇంకా వుంది .........