Facebook Twitter
" ఏడు రోజులు " 21వ భాగం

" ఏడు రోజులు " 21వ భాగం

 

 

 

రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి

 

 ఉదయం ఏడూ గంటలు కావొస్తోంది. భానుడి లేత కిరణాలు ముంబాయి నగరానని మృదువుగా తడుముతున్నాయి. పొద్దస్తమానం రద్దీగా వుండే రోడ్డు ఉదయంవేళ కాబట్టి అరకొర వాహనాలతో బోసిగా కనబడుతోంది.
    
    ఆ రోడ్డుకు ఒకపక్కగా వున్న కుప్పతొట్టిలో దగ్గరగా ఒదిగిపడుకుని వుంది గౌసియాబేగం. పైకి లేవాలంటేనే ఆమెకు భయంగా వుంది. తన కోసం ఆ దరిదాపుల్లోనే రాజేష్ మాటువేసుకుని వున్నాడేమో అన్న అనుమానం ఆమెను బలంగా పీడిస్తోంది.
    
    వున్నట్టుండి గాలిదుమారం క్రమంగా ఆరంభమైంది. కుప్పతొట్టిలోని చెత్తాచెదారం గాలి విసురుకు పైకిలేచి గౌసియాపై చెల్లాచెదురుగా పడసాగింది. బిక్కుబిక్కుమంటూ పడుకునివున్న ఆమె మరింత దగ్గరగా ముడుచుకుని, బిగ్గరగా కళ్ళు మూసుకుంది.
    
    అదే సమయంలో ఎవరో స్త్రీ బుట్టతో చెత్తతీసుకువచ్చి తొట్టిలోకి ఎత్తిపోసింది ఆ చెత్తలో అగ్గికణికలు కొన్ని వున్నందున, అవి గౌసియా శరీరంపై వచ్చి పడగానే...ఒక్కసరిగా ఉలిక్కిపడి... "మా" కెవ్వున అరుస్తూ లేచి కూర్చుంది.
    
    చెత్త పోస్తున్న స్త్రీ కూడా ఉలికిపాటుగా గౌసియాను చూస్తూ అలాగే బుట్టను వదిలేసింది.
    
    ఆమెను బిక్కచచ్చినట్టుగా చూస్తూ, అలాగే కూర్చుండిపోయిన గౌసియాబేగం జుబ్బా ఒకవైపు క్రమంగా కాలిపోతోంది.
    
    "ఎ...ఎవర్నువ్వు?" కసిరింపుగా అడిగింది ఆమె.
    
    నిలువెత్తున చెత్తపడివున్న గౌసియా అదేమీ పట్టించుకోకుండా ఆమెను అలాగే చూస్తోంది.
    
    "ఎ జన్మలో ఏం పాపం చేసిందో? చిన్న వయసులో మతితప్పి తిరుగుతోంది" అనుకుంటూ వెనుతిరిగి వెళ్ళిపోయిందామె.
    
    "మంచి ఆలోచన! నన్ను అందరూ పిచ్చిది అనుకోవాలి" వెళ్ళిపోతున్న ఆమెనే చూస్తూ అనుకుంటూ, మెల్లగా కుప్పతొట్టి లోంచి కిందికిదిగి, ఎటువైపు వెళ్ళాలా అన్నట్టుగా అటూఇటూ చూసింది.
    
    ఎడంగా ఒక సందు కనబడింది. ఆ దారెంబడి క్రిస్టియన్ సన్యాసినులు గుంపులుగా వెళ్తూ కనబడుతున్నారు. అటువైపు వెళ్ళడం ఉచితం అనుకుంటూ నెమ్మదిగా అటువైపు నడిచింది గౌసియా.
    
    వుండుండీ వెళ్తున్న జనాలు ఎవ్వరూ ఆమెను పట్టించుకోవడంలేదు. గౌసియా మాత్రం అందర్నీ పరికించి చూస్తోంది తనకోసం రాజేష్ వాళ్ళు ఎవరైనా వస్తారేమోనన్న భయం ఆమెను ఇంకా వదిలిపెట్టనేలేదు.
    
    నిన్న ఎప్పుడో అరబ్బుషేకు తినిపించిన తిండి మళ్ళీ తిననేలేదు. కడుపులో ప్రేవులు ఆకలికోసం గోలచేస్తున్నాయి.    
    
    "అమ్మా..." తెలుగులో ఉచ్చరించుకుంటూ బాధగా కడుపు పట్టుకోబోయి కాలుతున్న జుబ్బాను అప్పుడు చూసుకుంది గౌసియా.
    
    వెంటనే కాలుతున్నచోటున గుడ్డను నులుముకుని, రోడ్డుదాటి సందువైపు నడిచింది అక్కడ ఓ వేపచెట్టుకింద స్కూల్ బ్యాగులు తగిలించుకుని నిలబడివున్నారు ఐదారుగురు స్కూల్ పిల్లలు వాళ్ళు గౌసియాను చూడగానే "ఏ....ఏ .... హే.....హే.." అని వెక్కిరిస్తూ వెంబడించసాగారు.
    
    "ఏయ్" వెళ్ళేదల్లా నిల్చుని గదమాయించింది గౌసియా ఆమె గదమాయింపు ఆ పిల్లలకు ఆటవిడుపులా అయ్యింది.
    
    "హూహూ... హేహే..." ఈసారి అదోలా కావాలని నవ్వుతూ, గెంతులు వేస్తూ గౌసియాను చుట్టుముట్టారు.
    
    "నా దగ్గరకి వస్తే కొడతాను" అంటూనే చెయ్యెత్తింది గౌసియా.
    
    పిల్లలు వెంటనే దూరంగా పరుగెట్టి, అక్కడ కుప్పగా పోసివున్న కంకరరాళ్ళను తీసుకుని గౌసియామీదకు విసరసాగారు.
    
    గౌసియా ఎందుకైనా మంచిది అన్నట్టుగా అక్కడ్నుంచి ముందుకు పరుగుతీసింది ఆ పిల్లలు తరమసాగారు.
    
    వేగంగా పరుగెట్టుకువెళ్ళిన గౌసియా తనకు తెలియకుండానే అక్కడున్న చర్చిలోకి దూసుకుపోయింది.
    
    సన్యాసినులు అంతా వరుసలుగా నిల్చుని పవిత్రస్మరణ చేసుకుంటున్నారు వెళ్ళి వాళ్ళ మధ్యగా నిల్చోవాలనుకుని, అంతలోనే తనను ఒకసారి పరికించి చూసుకుని, అడుగుల్ని వెనక్కి వేసింది గౌసియా.
    
    ఆమె చర్చి లోపలికి వెళ్ళడంతో పిల్లలు ఆక్కడ్నుంచి వెళ్ళిపోయారు. అయినప్పటికీ ఆ పిల్లలు అక్కడెక్కడో వుండివుంటారన్న భయంతో గుండెలమీద చేయి వేసుకుని, మెల్లగా అడుగులో అడుగువేస్తూ బయటికి నడిచింది గౌసియా కానీ ఆమెకు అక్కడ్నుంచి వెళ్ళాలనిపించలేదు. అక్కడి వాతావరణం ప్రశాంతతని కలిగిస్తుంటే అక్కడే ఒకపక్కగా కూర్చుండిపోయింది.
    
    కాసేపటి తర్వాత సన్యాసినులు ఒక్కొక్కరూ బయటికి రాసాగారు. కొందరు అక్కడక్కడా గుంపులుగా నిలబడిపోతున్నాడు మరికొందరు వెళ్ళిపోతున్నారు.
    
    "నేను ఎట్లాగయినా హైద్రాబాదు వెళ్ళాలి. వీళ్ళల్లో ఎవ్వరైనా సహాయం చేస్తే బాగుణ్ను" అనుకుంటూ ఒక గుంపు దగ్గరికి వెళ్ళింది గౌసియా.
    
    వాళ్ళు గౌసియాను చూడగానే పిచ్చిది అన్నట్టుగా భయంగా దూరం జరిగారు.
    
    "నేను పిచ్చిదాన్నికాదు" వెంటనే చెప్పుకుంది గౌసియా.
    
    వాళ్ళు కనుబొమలు ముడిచి అర్ధంకానట్టుగా చూశారు.
    
    "నేను హైద్రాబాద్ వెళ్ళాలి నన్ను రైలు ఎక్కించండి" అభ్యర్ధనగా అడిగింది.
    
    వాళ్ళు గౌసియాను అలాగే చూస్తున్నారు.
    
    "నేను పిచ్చిదాన్ని కాదు నన్ను నమ్మండి" అంటూ తనమీది చెత్తాచెదారాన్ని వెంటనే దులుపుకోసాగింది గౌసియా.
    
    ఆ చెత్త వాళ్ళమీదికి ఎగరడంతో వాళ్ళు ఆమెను అలాగే చూస్తూ దూరం జరిగారు.
    
    "నాపేరు గౌసియాబేగం నన్ను ముగ్గురు కుర్రాళ్ళు ఇక్కడికి బలవంతంగా తీసుకువచ్చారు. నేను వాళ్ళను తప్పించుకుని వచ్చాను" అన్న నిజాన్ని చెప్పలేకపోయింది గౌసియా.
    
    అంతలో చర్చి ఫాదర్ వచ్చారు అక్కడికి.
    
    "ఫాదర్... ఈ అమ్మాయీ...." ఒక సన్యాసిని గౌసియావైపు చూపించింది.
    
    ఫాదర్ గౌసియావైపు పరిశీలనగా చూసాడు.
    
    "నాపేరు గౌసియాబేగం.... నన్ను ముగ్గురు కుర్రాళ్ళు ఇక్కడికి తీసుకువచ్చారు. వాళ్ళు చెడ్డవాళ్ళు వాళ్ళను తప్పించుకుని వచ్చేసాను నన్ను హైద్రాబాద్ పంపించండి" ఫాదర్ తో తిరిగి తనగురించి చెప్పుకుంటూ చేతులు జోడించింది గౌసియాబేగం.
    
    "తప్పించుకుని ఎన్నిరోజులయ్యింది?" అడిగాడు ఫాదర్.
    
    "రాత్రే... తప్పించుకుని అక్కడ చెత్తకుండీలో దాక్కున్నాను"
    
    "ఐ సీ" అంటూ గౌసియాను ఒకసారి ఆపాదమస్తకం పరిశీలించి, "హైద్రాబాద్ లో మీ నాన్నగారి చిరునామా ఏంటి?" అడిగాడు ఫాదర్.
    
    "వద్దు మా అబ్బా దగ్గరికి పంపించొద్దు మా అబ్బా దుర్మార్గుడు" భయంగా అంది గౌసియా.
    
    ఫాదర్ ఐదారుక్షణాలు గౌసియావైపు చిత్రంగా చూసి ఆ తర్వాత సన్యాసి నులవైపు చూస్తూ... "ఈ అమ్మాయిని...మీవెంట తీసుకెళ్ళండి" చెప్పాడు.
    
    'సరే' అన్నట్టుగా తలాడించారు సన్యాసినులు.
    
    "నేను మధ్యాహ్న సమయానికి వస్తాను" సన్యాసినులకే చెప్పి వెళ్ళిపోయాడు ఫాదర్.
    
    సన్యాసినుల వెంట మరియా ఆశ్రమానికి వెళ్ళింది గౌసియా.
    
    అక్కడ గౌసియాకు వాళ్ళు కొత్తబట్టలు ఇచ్చారు స్నానంచేసి వాటిని ధరించివచ్చింది గౌసియా. తర్వాత వాళ్ళతో పాటుగా అల్పాహారం తీసుకుంది. అప్పుడు కడుపు చల్లబడడంతో క్రైస్తవ సన్యాసినులు ఆమెకంటికి దేవతల్లా కనబడ్డారు.
    
    "శుక్రియా" ఎద లోతుల్లోంచి చెప్పుకుంది.
    
    "ఫరవాలేదు.... కూర్చో" ఒక సన్యాసిని గౌసియా చేయి పట్టుకుంది.
    
    కూర్చుంది గౌసియా. సన్యాసిని గౌసియా ముఖంలోకి సూటిగా చూస్తూ.... "నీవు నిజాయితీగా వున్నది వున్నట్టుగా చెప్పాలి. మేం నీకు తప్పకుండా సహాయం చేస్తాం. ఆ ప్రభువు కూడా నీపై తన చల్లని చూపు నిలుపుతాడు" అంది.
    
    వింటూ తలాడించింది గౌసియా.
    
    "ఊ... చెప్పు? నీవు ఎవరు? ఎక్కడ్నుంచి వచ్చావు.... ఎలా వచ్చావు?" అడిగిందామె.
    
    కొన్నిక్షణాల మౌనం తర్వాత తన గురించి అంతా విపులంగా చెప్పుకుంది గౌసియా.
    
    ఆమె గురించి అంతా విన్నాక చుట్టూ మూగిన సన్యాసినులు ఆమెవైపు అపనమ్మకంగా చూశారు. ఆ తర్వాత జాలితల్చారు.
    
    "నీవు భయపడవద్దు. ఆ ప్రభువు నిన్ను తప్పక రక్షిస్తాడు" అంది ఒక సన్యాసిని ధైర్యం చెబుతున్నట్టుగా.
    
    "నీవు భవానిశంకర్ దగ్గరికి వెళ్ళాలీ అనుకుంటే వెళ్ళవచ్చు లేదా మాకుమల్లే ఇక్కడే వుండిపోవాలీ అనుకుంటే వుండిపోవచ్చు" మరొక సన్యాసిని అంది.
    
    "నేను భవానీశంకర్ దగ్గరకే వెళ్ళిపోతాను" అంది గౌసియా.
    
    "అలాగే" అంది ఇంకో సన్యాసిని.
    
    మధ్యాహ్నం ఒంటిగంట కావొస్తుందనగా ఫాదర్ వచ్చాడు సన్యాసినుల ద్వారా గౌసియా గురించి పూర్తిగా తెల్సుకున్నాడు. ఆరోజు దినపత్రికల్లో అరబ్బుషేక్ హత్య గురించిన సమాచారం.... "హోటల్ హిందుస్థానీలో అరబ్బుషేక్ హత్య... హంతకులెవ్వరు?" అని వచ్చింది. ఆ హత్య చేసింది "గౌసియానే కావొచ్చు" అని అనుమానపడుతూ పేపర్ లో వచ్చిన అరబ్బు షేక్ తాలూకు ఫోటో చూపిస్తూ అడిగాడు ఫాదర్.
    
    "ఇదిగో... నువ్వు చంపేసింది ఇతడేనా?"
    
    రక్తపుమడుగులో పడివున్న అరబ్బుషేక్ ఫోటోను చూడగానే, కళ్ళింత చేసి...."వీడే.... వీడే" గట్టిగా అంది గౌసియా.
    
    "మంచిపని చేశావు" అన్నాడు ఫాదర్.
    
    "అంటే నేను ఆ హత్య చేసినందుకు నాకు శిక్ష పడదా? నన్ను పోలీసులు పట్టుకుపోరా!" గౌసియాలో పనిపిల్ల అమాయకత్వం.
    
    "పోలీసులు తీసుకువెళ్తారు. కానీ శిక్షపడదు" చెప్పాడు ఫాదర్.
    
    "అదెలా?" అడిగింది గౌసియా.
    
    "అంతా నీకు తర్వాత తెల్సివస్తుంది" అన్నాడు ఫాదర్.
    
    ఆ విషయం గురించి ఆమె ఇంకేం మాట్లాడలేదు. కాసేపు మౌనంగా వుండి ఆ తర్వాత "నన్ను భవానీశంకర్ దగ్గరికైనా పంపించండి. లేదంటే నా దగ్గరికైనా భవానీశంకర్ ను తీసుకురండి" తల వంచుకుని చెప్పింది.
    
    "ఆ ప్రభువు దయవల్ల నీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఆ ప్రభువుకు నీపై జాలి కలిగింది కాబట్టే మా దగ్గరకు తీసుకువచ్చాడు" ప్రశాంతంగా అన్నాడు ఫాదర్.
    
    "అంటే... నేనూ భవానీశంకర్ తప్పకుండా కల్సుకుంటాం అన్నమాట" ఆనందం గానూ ఆశగానూ అంది గౌసియా.
    
    'అవును' అన్నట్టుగా తలాడించాడు ఫాదర్.
    
    "నాకు అంతకన్నా కావల్సింది లేదు. శుక్రియా బాబా" సలాం వాలేకుం అన్నట్టుగా చేత్తో నమస్కరిస్తూ అంది గౌసియా.
    
    ఫాదర్ చిన్నగా నవ్వి "నన్ను ఫాదర్ అనాలి" చెప్పాడు ఫాదర్.
    
    "సరే... సరే..." తలాడించింది గౌసియా.

...... ఇంకా వుంది .........