Facebook Twitter
‘‘అజ్ఞాత కులశీలశ్య….” 33వ భాగం


‘‘అజ్ఞాత కులశీలశ్య….” 33వ భాగం

 


   పూరీ పట్టణం కన్నుల పండువగా అలంకరించారు.
   స్వామి వారి రథయాత్ర అయాక కొన్ని రోజులు అక్కడే ఉంటారు భక్తులు. ఆలయంలో భోజనాలు ఏర్పాటు చేస్తారు.
   రథయాత్ర అయిన మరునాడు..
   మహారాజుగారి విడిదిలో సమావేశ మయ్యారు, ప్రధాన మంత్రి, పురుషోత్తమ దేవుడు, మాధవుడు.
   నందుడుని కూడా పిలువనంపాడు పురుషోత్తముడు.
   అటువంటి సమావేశానికి రావడం అదే ప్రధమం నందుడికి. అయినా ఏ మాత్రం తడబడకుండా వచ్చి, అభివాదం చేసి నిలుచున్నాడు. అందరినీ ఆశీనులు కమ్మని ఆనతి ఇచ్చి ప్రారంభించాడు కపిలేంద్ర వర్మ.
   “మనకి, మన రాజ్యానికి శుభ సమయం ఆసన్నమయింది. దండయాత్రలు, రాజ్యాన్ని సుస్థిర పరచుకోవడం, అంతర్ బహిర్శత్రువుల నణచడం.. వాటన్నిటి మధ్య, మానసికోల్లాసం కలిగే ఆశ కనపడుతోంది. అదే.. కుమార పురుషోత్తముని వివాహం. మన మిత్ర రాజ్యముల ప్రభువులందరికీ ఆహ్వానం పంపించాలి.”
   “అవును ప్రభూ. ఇంత వరకూ కనీ వినీ ఎరుగని విధంగా చెయ్యాలి.” ప్రధాన మంత్రి అన్నాడు.
   “కాంచీ పుర రాజునకు వర్తమానం పంప వలెను కదా!” మాధవుడు సన్నగా అన్నాడు.
   “ఏ మక్కర లేదు. వారి రాజ్యంతోనే, రాకుమారి పరి గ్రహణం కూడా ఐపోయింది. ఇంక వారికేమాత్రం సంబంధం లేదు.” పురుషోత్తముడు.. పౌరుషంగా అన్నాడు.
   “అవుననుకోండి. రాకుమారి పద్మావతీ దేవి కూడా ఆ విధంగానే సెల విచ్చారు. కంచి రాజుగారు వారి రాజ్యానికి వెళ్లినప్పుడు అడిగాను.. రాకుమారి కూడా వెడలెద రేమోనని..”
   “ఏమని సెలవిచ్చారు మాధవా?”
   “ఇంక కాంచీపురం వెళ్లనని..”
   పురుషోత్తముని మోము మరింత ప్రసన్నంగా అయింది.
   “తన తండ్రిగారు చేసిన పని రాకుమారికి సుతరామూ నచ్చలేదు.” మాధవుడు సెలవిచ్చాడు.
   “ఇన్ని రోజులూ పద్మావతీ దేవి ఎక్కడున్నారు? మీ బంధువులింటనా?”
   “మా గృహమునందే ఉన్నారు రాకుమారా! మా ఇంటి ఆడపడుచు వలెనే చూసుకున్నాము.” నందుడు చటుక్కున అనేశాడు.. మాధవుడు వారించే లోపుగానే.
   మాధవుడు తల కొద్దిగా వంచాడు, ఏమనాలో తోచక.
   మహరాజు కపిలేంద్ర దేవుడు వినోదంగా చూస్తున్నారు.
   పురుషోత్తముడు తన ఆసనం మీదినుంచి లేచి వచ్చి, మాధవుడిని ఆలింగనం చేసుకున్నాడు.
   “ధన్యవాదములు మిత్రమా! నీ వంటి మిత్రుడున్న వారికి నిత్యం మహదానందమే. నిన్ను ఎంతగానో బాధించి ఉంటాను. ఏమనుకోకుమీ!”
   మాధవుని మోము సంతోషంతో వెలిగి పోయింది.
   వెంటనే అందుకున్నాడు..

                                 “సీ.  హరికృప యరయగ యనయము, తొలగెగ
                                                అరటములు వెరగు పరచుచునవి
                                       అరమరికలవెగ హరణమయె నటుల
                                                యరులు హితులయిరి యనగి పెనగి
                                       కరములు కలియను, గడువులు తెలియగ
                                                కరిముఖు యనుమతి కలిగియిపుడు
                                       వరములు నొసగగ పరిపరి విధముల
                                                 ముదమలరగ కన మురిపమునను

                               ఆ.వె    పదిలముగ మనమరగెదము, కటకమునె
                                          సిరి హరి యిరువురు మిసిమిని కురియ
                                          సురలు నభము నిలిచి సురతమున కనగ
                                          పరిణయము జరుగును పరవశముగ.”

            (అరటములు= కష్టములు, అనగి పెనగి= కలసి మెలసి)

   ఉత్సాహంలో పద్యం పాడేశాడే కానీ.. మహరాజుగారేమంటారో అని సంకోచంగా చూశాడు మాధవుడు.
   కపిలేంద్ర దేవులు చిరునవ్వుతో చూశారు.
   “మాధవ మంత్రి మంచి కవి యని మాకు తెలియదే..”
   “శ్రీనాధ మహాకవి ఏకలవ్య శిష్యుడు తండ్రీ. చక్కని కవిత్వం అల్లడమే కాదు, అద్భుతంగా గానం చేస్తారు కూడా..” పురుషోత్తముడు కించిత్ గర్వంగా చెప్పాడు.
   “మనం వ్యవధి చిక్కినప్పుడు సాహిత్య సమావేశాలు కూడా చెయ్యాలి. వీనిలో ఉన్న ఉల్లాసము ఎక్కడా ఉండదు.” మహారాజు నిట్టూర్చి అన్నాడు. అతడికి రాజ్యాన్ని సుస్థిర పరచుకోవడంలోనే సమయం గడిచి పోతోంది. ఇతరములేవీ మనసునకెక్కుట లేదు. పురుషోత్తముని వివాహ వార్త కాస్తంత ఆటవిడుపు.
   “ఒక చిన్న సర్దుబాటు మాధవా.. చివరి పాదంలో ‘పరిణయములు జరుగు పరవశముగ’ అని దిద్దాలి.” సాభిప్రాయంగా జనకుని చూస్తూ అన్నాడు పురుషోత్తముడు.
   మాధవుని బుగ్గలెర్రవడ్డాయి.
   “ఇదేమి కొత్త వార్త కుమారా?”
   “సోదరి కాదంబరీ దేవిని మాధవ మంత్రికి ఇచ్చి పరిణయం జరిపించాలని మా కోరిక మహరాజా. మాధవుడు, సోదరి కూడా సుముఖులేనని మాకు తోచుచున్నది. చిన్నతనం నుండీ నాకు తెలిసినవాడు.. మన ఎదుటనే మసలుతాడు. ఎవరో తెలియని వారికి ఇచ్చి దూర దేశాలకి పంపే కంటే ఇది మంచిదని మాకు తోచుచున్నది.” పురుషోత్తముని కేసి ఉలిక్కి పడి చూశారు, మాధవుడు, నందుడు.
   రాకుమారి తన కోడలా? నందుడు ఆశ్చర్యంగా చూశాడు.
   పురుషోత్తమునికి తన మనసే విధంగా తెలిసింది? అంతలా బయట పడిపోయాడా తను.. మాధవునికి కూడా ఆశ్చర్యమే..
   మహారాజు మాత్రం ఆలోచనలో పడ్డారు.
   మరీ పూటకూళ్ల వాని కొడుక్కి రాకుమారినిచ్చి..
   నందుడు మహారాజు ఆంతర్యం గ్రహించాడు.
   అటు చూస్తే మాధవుని బుగ్గలు మందారాలే అయ్యాయి. రాకుమారిని అతడు అభిమానిస్తున్నాడని తెలుస్తూనే ఉంది.
   మాధవుడు తన ఇంటికి వచ్చిన కొత్తలో ఒక హస్త సాముద్రికుడు చెప్పిన మాట గుర్తుకొచ్చింది నందునికి.

మత్తేభము.   మణి మాణిక్యముయే కదా యనుచు నా మారాజులే చెప్పియున్
                   యణగిన్ యుండడు గాద యీతడవి యే హారీత కార్యాలనీ
                   యణువంతైనను యోర్చుకోడు తన శౌర్యాంజస్సునే యడ్డుకున్
                   ఫణిరాజై తన భోగముం బలిమి కాపాడున్ తనే యాపదన్.

   ఆ సాముద్రికుడు, మాధవుడు ఏ కపటమైన కార్యాలనీ సాగనియ్యడని, తన శౌర్యాన్ని అడ్డుకుంటే అది ఎవరైనా ఓర్చుకోడనీ, నాగరాజు వలే తన భోగభాగ్యాలనీ, బలాన్నీ కాపాడుకుంటాడనీ చెప్పాడు. అతడుడు పెరుగుతుండగా అయిన, అవుతున్న అనుభవాలన్నీ ఆ మాటలు నిజమేనని చెపుతున్నాయి.
   రాకుమారునితో స్నేహం, అతి పిన్న వయసులోనే మంత్రిపదవి లభ్యం..
  ఈ లక్షణాలన్నీ మాధవుడు క్షత్రియ కుమారుడేనని చెపుతున్నాయి. ముఖ్యంగా ఆ మొహంలో ఉట్టిపడే రాచకళ..
   మహరాజుకు, ఈ పేద బ్రాహ్మని కొడుక్కి కుమార్తె నిచ్చి వివాహం చేయుటకు మనసొప్పుతుందా? పురుషోత్తముడు మిత్రుని మీద నున్న అభిమానంతో ఈ ప్రతిపాదన తెచ్చి ఉంటాడు.
   తను నిజం చెప్పాలా? మాధవుని ఆంతర్యమేమిటో.. నందుడు ఎటూ తేల్చుకొనలేకున్నాడు. అతడి సందిగ్ధ స్థితిని మహరాజు గ్రహించాడు.
   “నంద మహాపాత్రులు ఏమో చెప్పాలనుకుంటున్నారు.. కుల సమస్యా?”
   అంటే.. మహారాజు సుముఖంగా ఉన్నారా? మాధవుడు ఉలిక్కి పడ్డాడు.
   ఇంక నందునికి తప్పలేదు..
   “మహారాజా! మాధవుడు మా కన్నబిడ్డ కాదు. శ్రీకృష్ణుడు నందునింట పెరిగినట్లే మాధవుడు మా ఇంట పెరిగాడు. ఎచట నుండి వచ్చాడో.. ఏ కులమో మాకు తెలియదు. కానీ శీల వంతుడు. అతడికి సాటి అతడే. అతడు ‘అజ్ఞాత కులశీలుడు’. వంగ దేశ సరిహద్దులలో ఉన్న మా అమ్మగారి ఇంటికి అతనికి సుమారు పది సంవత్సరముల వయసులో వచ్చాడు. మాకు పిల్లలు లేనందున మేము తెచ్చుకుని పెంచుకున్నాము. మా బిడ్డడే..”
   చెప్పేశాడు నందుడు. మాధవుడు ఏమనుకొనెనో.. తనకి నచ్చినా నచ్చక పోయినా ఇంక వేరే దారి లేదు. మహరాజుకి వాస్తవం వెల్లడించ వలసిందే.
   అక్కడ ఉన్న ముగ్గురూ ఏమి మాట్లాడాలో తెలియక కాసేపు అలా ఉండి పోయారు. అప్పుడే గుర్తుకొచ్చింది పురుషోత్తమునికి, కవి సార్వభౌముడు శ్రీనాధుడు మాధవుని చూడగానే, వంగదేశపు యువకునిలా ఉన్నాడే అన్న మాట.
   ఇతడు వంగదేశపు రాకుమారుడా?
   అచ్చటనున్న వారందరూ మాధవునే చూస్తున్నారు.. ఏం చెప్తాడా అని..
   మాధవుడు లేచాడు..
   “మహారాజుగారు మన్నించాలి. నేనెవరో.. నా పుట్టుక ఏదో.. ఎప్పుడో ఒకప్పుడు వివరించవలసిన ఆవశ్యకత వస్తుందని అనుకోలేదు. మా బంధువులలో.. లేదా.. మాకు సాటి అయిన సంబంధం వస్తే ఆ అవసరం వచ్చేది కాదేమో! నంద మహాపాత్రుని కుమారునిగా నడిచి పోయేది. ఇప్పుడు రాకుమారి ప్రసక్తి వచ్చింది కనుక అంతా వెలికి తీయవలసి వస్తోంది.” నిజమే అన్నట్లు తలూపారు మహారాజు.
   “మరొక్కసారి మన్నించమని అడుగుతున్నాను.. నన్ను అజ్ఞాత కులశీలునిగానే ఉండిపొమ్మని నా కన్నతల్లి ఆదేశించింది. ఆవిడ మాట నేను జవదాటలేను. అయినా నేనిప్పుడు అజ్ఞాతకులశీలుడిని కాను. ఆ జగన్నాధుడు నాకు ఆత్మీయులైన తల్లిదండ్రులనొసగాడు. నేను గౌతమీ నందమహాపాత్రుల కుమారుడనే. ఏకన్నియని చేపట్టినా వారి పుత్రునిగానే.. నా ఈ అర్హతలతోనే పదవినిచ్చినా, పడతినిచ్చినా స్వీకరిస్తాను. వ్యక్తిగత సంస్కారం ఇదైతే.. నా విద్యల గురించి, నా తెలివితేటల గురించి రాకుమారునికి బాగుగా తెలుసు.. ఇంతకంటే నేను చేప్పగలిగినదేమీ లేదు. మీరే శిక్ష విధించినా ఆనందమే.”
   అభివాదం చేసి కూర్చున్నాడు మాధవుడు.
   నందుడు తన కుమారుని అనిర్వచనీయమైన భావంతో చూశాడు.  గర్వం, ప్రేమ, ఆప్యాయతలతో మనసంతా నిండి పోయింది. పెదవుల చాటున తన సంతోషాన్ని దాచి వేశాడు.
   కపిలేంద్రుడు నిర్ణయం తీసుకోవలసిన సమయం ఆసన్న మయింది. మాధవుడు, బ్రాహ్మణుడైనా, క్షత్రియుడైనా మహారాజుకి అల్లుడు కావలసిన అర్హత సంపాదించుకున్నాడు. ముఖ్యంగా పద్మావతీ దేవి విషయంలో అతను చూపించిన చొరవ ఎంతో ఎన్న దగింది.
   ఇంక పూటకూళ్ల ఇల్లా.. అక్కడ రాకుమారి ఉండగలదా అనేదే ప్రశ్న. సౌకర్యాలన్నింటినీ తనే ఏర్పాటు చేస్తాడు. మాధవుని ప్రతీక్షగా కొత్తగా జయించిన రాజ్యానికి పంపే యోచన ఉండనే ఉంది.
   క్షత్రియకన్య కోడలుగా రావడానికి నందుడు అంగీకరిస్తే..
   అదే అడుగుతే నందుడు చిరునవ్వు నవ్వాడు.
   “మహరాజా! కులం గోత్రం తెలియని పిల్లవాడిని మా కన్న బిడ్డవలే సాకాము. మాకేం అభ్యంతరం ఉంటుంది. మహలక్ష్మి మా ఇంటికి వస్తానంటే అంతకంటే కావలసినదేముంది?”
   పురుషోత్తముడు లేచి వచ్చి మాధవుని భుజం తట్టి కరచాలనం చేశాడు.
   “రాణీగారినీ, రాకుమారినీ సంప్రదించి వివాహ ప్రయత్నాలు చేద్దాము. రెండు వివాహాలూ ఒకే సారి.. వారం రోజుల లోగా చెయ్యాలి. ఆ తదుపరి, దక్షిణాన చక్కబెట్ట వలసిన కార్యాలున్నాయి.”
   కోటలో పెళ్లి సంబరాలు.. కపిలేంద్ర దేవుడు అడిగిన వెంటనే కాదంబరీ దేవి సిగ్గుల మొగ్గై తల ఊపింది. కాదంబరి తల్లికి, అమ్మాయి ఉన్న ఊర్లోనే ఉంటుందని ఆనందం..
   ఏ ఆటంకం లేకుండా కళ్యాణాలకి ముహుర్తాలు పెట్టేశారు.
   కటకంలో ఉన్న అన్ని వనాల్లోనుండీ, రంగు రంగుల పూలు కోటకి బళ్లలో వస్తున్నాయి. నగరంలోని ఆడవారందరూ అలంకరణలో వారి ప్రతిభ చూపిస్తున్నారు.
   పెళ్లికొడుకును, పెళ్లి కూతురిని చెయ్యడం.. ఇరు జంటలకూ కోటలోనే జరుగుతున్నాయి.
   అయిదు రోజుల పెళ్లి శాస్త్రోక్తంగా ఆట పాటలతో జరుగుతోంది.
   నందుని అన్నా,వదిన.. బంధువులు అందరూ కోటలోనే తమ విడిది గృహంలో ఉండి పెళ్లి వేడుకలలో పాలు పంచుకుంటున్నారు.
   ఊయల సంబరం, బంతి ఆటలు.. కోటంతా కోలాహలమే.
    
                       సీ.       పేరంటమును సేయ పెండ్లి సంబరములో
                                       తూగుటుయ్యల యందు తోడు గాను
                                  పిల్లలు పాపలు వెను వెంట యుండగా
                                      వధువు వరుడు నూగె బాగు గాను
                                  ముద్దు ముచ్చట్లతో మురిపించగా నంత
                                      ముత్తైదువలు కూడి మోద మంద
                                  పూలదండల బరువు తలల దించంగ
                                       యొద్దికనిరువురూ యూగె నంత

                      ఆ.వె    పెద్ద ముత్తయిదువ పేర్మితో వచ్చెగా
                                 అక్షతలను వేయ యలసి యున్న
                                 చేతులు కలిపేను చెలిమి నుండుడనుచు
                                 రంజనముగ నెపుడు రాజిలగను.

   కపిలేంద్ర దేవుని కుమారులందరూ వారి భార్యలతో వచ్చారు, వారికి నిర్వహించమని ఇచ్చిన రాజ్యాల నుంచి.. మహారాజు, తన రాణులందరితో కలిసి వైభవంగా కళ్యాణాలు జరిపిస్తున్నారు.
   కంచిరాజుకి వర్తమానం పంపించారు.. కానీ అస్వస్థత కారణంగా రాలేనని తిరుగు వర్తమానం పంపాడతడు.
   నంద, గౌతమిలు తమ అదృష్టంగా భావించి కుమారుని, కుమార్తెల వివాహాలు జరిపించారు. సముద్రం నుంచి నీటిని గ్రహించినా, ఆ నీటిని ఆకాశం వేరెక్కడో వెదజల్లుతుంది.. అదే న్యాయం అక్కడ కూడా జరిగింది. మాధవుడు, పద్మావతి పుట్టిన దెవరికో.. కానీ ఆనందం కలిగించేది వేరొకరికి. మాధవుడు ఒంటరిగా ఉన్నప్పుడు, నక్షత్రాలతో ఊసులాడాడు.. తన యోగక్షేమాల గురించి అమ్మకి చెప్పమని.
   తనని రక్షించి ప్రాణాలు కోల్పోయిన అమ్మ ఎప్పుడూ కనురెప్పల మాటునే ఉంటుంది మాధవునికి.


                                         -----------------

......మంథా భానుమతి