Facebook Twitter
‘‘అజ్ఞాత కులశీలశ్య….” 32వ భాగం

     ‘‘అజ్ఞాత కులశీలశ్య….” 32వ భాగం

  పూరీ నగరం రథోత్సవమునకు ముస్తాబవుతోంది.

  కళింగంలోని వివిధ ప్రాంతాల నుండే కాక, దేశం నలు మూలల నుంచీ ప్రవాహంలా ప్రజలు వస్తూనే ఉన్నారు.

  ఆలయ నిర్వాహకులతో సమంగా మాధవుని బృందం కూడా భక్తుల సదుపాయాలకై కృషి చేస్తోంది.

  ఆలయంలోని వంటశాలలకు అదనంగా పెద్ద పెద్ద గాడి పొయ్యలు తవ్వించి, భోజన శాలలు కూడా, తాటాకు పందిళ్లలో ఏర్పాటు చేశారు.

  నంద గౌతమిలు సీతమ్మతో సహా, సూర్యోదయం అవుతూనే, స్నానం, అర్ఘ్య పాదాదులు ముగించుకుని వచ్చేస్తున్నారు. వంటలకు వారి వంతు సేవ అందించడానికి. అదే విధంగా వంటకాల మీద పట్టున్న భక్తులు చాలా మంది వచ్చి చేస్తున్నారు. అందరకీ అధికారి ఆలయ వంటశాల నిర్వాహకుడు.

  కటకం నుండి విడతలు విడతలుగా అరటాకులు వస్తూనే ఉన్నాయి బళ్ల మీద.

  రాకుమారి పద్మావతి, కాదంబరి దేవితో కూడా వచ్చి కూరలు తరగడం, పూల మాలలు కట్టడం వంటి సేవలు చేస్తున్నారు.

  రథయాత్ర ఆరంభమైన కొద్ది సేపటికి మహారాజు కపిలేంద్ర దేవుడు విచ్చేయనున్నారని వార్త వచ్చింది.

  ఉత్సవానికి వచ్చిన ప్రతీ ఒక్కరూ.. రెండు కళ్లూ చాలటం లేదని అనుకుంటున్న వారే! సంబరాలు హోరులు అంబరాన్నంటాయి.

  ఆషాడ శుక్ల విదియ రానే వచ్చింది.

  తెల్లవారక ముందే ఆలయం ముందున్న ప్రధాన రహదారి అంతా భక్తులతో నిండి పోయింది. ఎందరు వచ్చినా క్రమశిక్షణ మాత్రం తప్పదు. స్వామి రథయాత్రకి సానుకూల మయేటట్లుగానే నిలబడి ఉంటారందరూ.

 

                   

మూడు రధాల్లోనూ ముగ్గురు మూర్తులనీ ఆసనాల మీద కూర్చో పెట్టారు.


  “మనీమా! మనీమా!” అనే కేకల మధ్య పురుషోత్తమ దేవుడు రథం అధిరోహించాడు. ఒక్క క్షణం.. క్రిందటి సంవత్సరం జరిగిన ఉత్సవం, ఆ తరువాతి పరిణామాలు గుర్తుకొచ్చాయి.

  స్వామిని ఒక పరి పరికించాడు. జగన్నాధుని అవతారాలు కనుల ముందు నిలిచాయి. రథము మీద నీల మాధవుడు..


                            సీ.    హరి యవతారమె అరుదెంచె నిలకును

                                            అరి భంజనము లనె అరయ చేయ

                                    నీరము నుండి విసార రూపముననె

                                            నరభుజు సోమకు నరకగాను

                                    కరువము కూర్మమై గరిమన నిడుకొని

                                             సురులకు నమృతము సరిగ సరద

                                    పరగ పరశురామ, వర రామ రూపమై

                                             దరుమము నిలబెట్ట ధరణి యందు


                           ఆ.వె.  కరములు కనరాని కరణపు జన్ములై

                                     వరమొసగగ, రాజు బరువు గాను

                                     పురము పూరి యందు పురుల ప్రతిష్టింప

                                     తెరవు నీల ధవుడు యరదమెక్కె.

      (కరణము= కారణము, అరదము= రథము)


  కన్నులు మూసుకుని జగన్నాధుని మనసారా ప్రార్ధించి, బంగరు పిడి గల చీపురు అందుకుని శుభ్రం చేశాడు.

  శుభ్రం చేశాక అటూ ఇటూ చూశాడు, మాధవుని కోసం. ఇంక స్వామి వారి రధం దిగి కొద్ది దూరం నడచి తన అశ్వాన్నెక్కి వెళ్లి పోవాలి. మహరాజుగారు వస్తానన్నారు. ఎక్కడికి వచ్చెదరో, ఎప్పుడు వచ్చెదరో.

  చేతిలో చీపురు పట్టుకుని చూస్తున్నాడు పురుషోత్తముడు.

  అంతలో తాళాలు తప్పెట్లు వినిపించాయి. ఆలయ పాండాలు పాటలు పాడటం మొదలు పెట్టారు, రథం చుట్టూ మూగి.


తురగ వల్గన రగడ.

                       కదలు తాయి కదలుతాయి కదలి సాగు తాయి ముందు

                       కదలు తాయి  రథ చక్రాలు కదలి మెదలు తాయి ముందు

                       కదలి పోతు పాపములను కదము తొక్కి తోసి ముందు

                       కదలి కదలి జగము నేలు కంబమయ్య కలిసి ముందు.


  మాధవ మంత్రి, పాండాలను పక్కకి తప్పించి రథం దగ్గరికి వచ్చాడు. ఒక్క ఉదుట్న రథం మీదికి ఎక్కాడు. అతడి వెనుకే, మేలి ముసుగులో ఉన్న రాకుమారి పద్మావతీ దేవిని, చెయ్యి పట్టుకుని ఎక్కించాడు.

  పురుషోత్తమ దేవుని చేతిలో ఇంకా చీపురు అలాగే ఉంది.. రథం మీద ఉన్నఆలయ పూజారులు ఆ సమయంలో, హడావుడి చేస్తున్న పాండాలని క్రమశిక్షణలో పెట్టడంలో అటు తిరిగి కిందికి చూస్తున్నారు.

  అంతా నిమేష మాత్రంలో జరిగి పోయింది.

  మాధవుడు, చీపురు ఉన్న పురుషోత్తముని చేయి పట్టుకుని, వేరొక చేతిలో పద్మావతి చేతినుంచాడు.

  “ప్రభూ! ఇంత కాలానికి పద్మావతీ దేవికి తగిన వరుడు, మలినాలను శుభ్రం చేసే వాడు దొరికాడు. అది మీరే.. స్వామి వారి వద్ద శుభ్రం చేశారు.. చేతిలో చీపురు ఇంకా అచటనే ఉంది. మా సోదరి పద్మావతీ దేవిని స్వీకరించి వివాహమాడవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఈ జగన్నాధుని సాక్షిగా జరిగిన దానికి ఈమె ఏ మాత్రం బాధ్యురాలు కాదు. మిమ్ములనే తన పతిగా మనసా వాచా కర్మణా భావిస్తోంది.”

  పురుషోత్తమ దేవుడు ఊహించని సంఘటన ఇది.

  మాధవుడు పురుషోత్తముని చేతిలో ఉన్న పొరక కట్టని తీసుకున్నాడు.. దానిని, కింద నిలుచుని ఉన్న ఆలయ ఉద్యోగికి అందజేసి, ఆ చేతిలో, పద్మావతి వేరొక చేతినుంచాడు.

  రెండు కరములూ, తన విభుని చేతనుంచి, పద్మావతీ దేవి నును సిగ్గుతో.. మేలి ముసుగు లో నుండి ఓర కంట చూసింది.

  పద్మావతిని చూసి పన్నెండు మాసములు పైనే అయింది. అప్పటి కంటే కాస్త చిక్కింది.. చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లుంది. మనసు నిండా నింపుకున్న చెలి.. విధి విలాసంతో, దట్టమైన మబ్బుల చాటున దాగిన చందమామ వలె ఉంది అన్ని రోజులూ..

  జగన్నాధుని కృప.. మబ్బులు తొలగిన పున్నమి చంద్రునిలా కాంతులు వెదజల్లుతోంది తన చెలి..  ఆదిదేవుని కృపతో తన మనసునావరించి ఉన్న మబ్బులు కూడా తొలగి పోయాయి.  

  శివుని కోసం తపస్సు చేసిన పార్వతీదేవి పట్టుదల పద్మావతి లో కూడా ఉంది. అదే ఆవిడ సౌందర్యాన్ని పది రెట్లు పెంచింది. ఆవిడని ఆవరించి ఉన్న తేజము రథము లోనికి ఒక వింత వెలుగును తీసుకుని వచ్చింది. జగన్నాధుని మూర్తి కూడా చిరునవ్వుతో పరికిస్తున్నట్లు అనిపిస్తోంది. పాండాలు తక్కువ ధ్వనిలో తమ భజనలు సాగిస్తున్నారు.

  పురుషోత్తముడు మారు మాటాడక, ప్రసన్న వదనంతో.. పద్మావతీ దేవిని పట్టుకుని, స్వామికి నమస్కారం చేశాడు. తేరు వద్దకి కొందరు ఆడవారిని కూడా తీసుకుని వచ్చాడు మాధవుడు, పద్మావతికి సహాయముగా! అందరూ కిందినుంచి చూస్తున్నారు.


                              సీ.  హృదియందు నందరు ముదముతో నలరగా

                                            ముదితలందరు కూడి మురియ గాను

                                    కదిలెడి రథమందు పదిలముగ నిలిచి

                                            పెదవి చాటున నవ్వు పొదలి పుచ్చ

                                    మది నిలిచిన యతివదె నోర కన్నుల

                                            కాంచ నతడి కుడి కన్నదరగ

                                    అదిరి పడిన రాజు ఆ మీసముం దిప్ప

                                            అతివ బుగ్గలవియే యరుణిమవగ


                             ఆ.వె.  చెదరిన తన మదిన చింత తీరగనంత

                                      మాధవుడు హితునికి వందనమిడె

                                      ముదమున పురుషోత్తము కరచాలనమిడ

                                      మిత్రులిదియె కూడి మిసిమి పంచె.


  మాధవుడు ఆనందం పట్టలేక, కిందికి దిగి, పండాలతో సమానంగా తను కూడా నాట్యం చేయ సాగాడు.

  “మహరాజుగారు వస్తున్నారు.. పక్కకి జరగండి..” రాజ భటులు త్రోవ చేయగా, కొద్ది దూరంలో కపిలేంద్ర దేవుడు, రాణులతో కూడి రథములో వచ్చి దిగి, నడిచి స్వామివారి తేరు వద్దకు వచ్చాడు.

  నడచి వస్తున్న మహరాజు సాక్షాత్తు ఆది విష్ణువు వలెనే ఉన్నాడు. జగన్నాథ రథయాత్రకి మ్రోగిస్తున్న దుందుభిలు రాజుకు కూడా స్వాగతం పలుకుతున్నాయి.


         సీ.  కపిలుని కనులను కరుణయె కురవగ

                       అరుణ కిరణములె హలను మెరవ

              కపిల ప్రభువు విజయ పథమున నరగ

                       జయ నరడలవె మొరయ నచటనె

              కలిసి జనులు కరములు కలిపి భజన

                       సలుపుచు నడువగ సదమలముగ

              అవని పులకరము లవి యనుభవములె

                       అలవి నెరుగక నిహమును పరము


       ఆ.వె.    జినుని రథ విహరణ మనుసరణముననె

                  చనగ సహజ సహితమున హలధరు

                  సకల జనులు రథమును కదిలి నడుపగ

                  నగరి నడుమనె వెలసెగ సరకము.


(కపిలుడు= విష్ణువు, హల= భూమి, కపిల ప్రభువు= కపిలేంద్రవర్మ, అరడ= దుందుభి, మొరయు = మోగ, జినుడు= జగన్నాధుడు, విహరణము= విహారము, సహజ= సోదరి, హలధరుడు= బలరాముడు, సరకము= స్వర్గము)


  రాణీవాసపు స్త్రీలలో కాదంబరీ దేవి కూడా ఉంది. ఆమె మోము ఆనందంతో వెలిగి పోతోంది. పద్మావతితో తన సోదరుని పరిణయము.. సోదరులందరిలో పురుషోత్తమ దేవునివద్దే కాదంబరికి చనువు యెక్కువ. అతను దండయాత్రలకి ఎక్కుగా వెళ్లక పోవడం, కోటలోనే ఉండి రాజధాని రక్షణ చూడడం ప్రధాన కారణమైతే, స్వభావ సిద్ధంగా ఆప్యాయతని పంచడం ఇంకొక కారణం.    

   రాజ్యం గురించే కాక, కుటుంబం గురించి కూడా పట్టించుకోవడం పురుషోత్తముని ప్రత్యేకత. క్లుప్తంగా చెప్పాలంటే.. రాజ్యంలో, కోటలో.. అందరి అభిమానాన్నీ చూరగొన్నాడు పురుషోత్తమ దేవుడు.

  తండ్రి రాకని గమనించిన పురుషోత్తముడు, రథం దిగి, పద్మావతి చేయి పట్టుకుని దింపి, మహరాజుకి పాదాభివందనం చేశాడు.

  మహారాజు, తనయుడ్ని లేపి ఆలింగనం చేసుకున్నాడు.

  “తండ్రీ! మీ అనుమతి లేకుండా..”

  చేయెత్తి ఆపేశాడు కుమారుడిని కపిలేంద్ర దేవుడు.

  “మాధవునికి నేను అనుమతిచ్చాకే, నీ వద్దకు ఆ సమయంలో తీసుకుని వచ్చాడు రాకుమారిని. పద్మావతీ దేవి మా కోడలుగా మన కోటలోనికి ప్రవేశించడానికి అన్ని విధాలా తగిన కన్య. త్వరలో వివాహం జరిపించే ఏర్పాట్లు చేద్దాము.”

  ఆ హడావుడిలో, గుంపులో.. ఏ విధంగా జరిగిందో కానీ, మాధవుడు, కాదంబరీ దేవీ పక్క పక్కకి వచ్చేసి నిలుచున్నారు. ఇరువురి మొహాలూ వేయి నక్షత్రాల కాంతితో వెలిగి పోతున్నాయి. ఇద్దరూ లక్ష్మీ నారాయణ స్వరూపాల్లా ఉన్నారు.

  తాను అనుకున్నది జరిగిందని.. సంవత్సరమంతా పడిన తపన మాయమయిందని మాధవుడు సంతోషంగా ఉన్నాడు.

  తనకి నచ్చిన చెలి సోదరునికి ఇల్లాలవుతోందని, ప్రతీరోజూ కలుసుకోవచ్చని కాదంబరీదేవి ఆనందంగా ఉంది.

  “నా మీద ఇంకొక బాధ్యత ఉన్నది తండ్రీ!” పురుషోత్తముడు మహారాజుతో అన్నాడు.

  “రథయాత్ర అయిన పిదప మాట్లాడుకుందాం. మీ బాధ్యత నాది కూడా.. తప్పక నెరవేరుద్దాము.” కపిలేంద్ర వర్మ.. రథం కదపడానికి సిద్ధ పడుతూ అన్నాడు.

  కోలాహలం మొదలయింది.

  మేళతాళాలతో జగన్నాధుని రథం కదిలింది.

  బలభద్ర, సుభద్రల రథాలు కూడా వెనువెంట కదిలాయి.

  రాచ కుటుంబ మంతా, కొద్ది దూరం నడచి, తమ తమ వాహనాల మీద వెళ్లి పోయారు వసతి గృహాలకి. సంధ్యా సమయానికి, గుండీచా ఆలయానికి చేరుకుంటారు.. అక్కడ తోట విడిదిలో జగన్నాధునికి జరుగబోయే పూజలను తిలకించడానికి.

 

  రాకుమారి పద్మావతీ దేవి ఆనందానికి అవధుల్లేవు. విడిదికి రాగానే సీతమ్మని పట్టుకుని గిరగిరా తిప్పేసింది. సీతమ్మ, ఆగమని చెప్పి, ఉప్పు మిరపకాయలు తీసుకుని వచ్చి దిష్టి తీసింది.

  గౌతమి దూరంగా నిలుచుని చూస్తోంది.. కన్నులు విప్పార్చి.

  ఇన్ని రోజులు తమ ఇంట్లో తమ బిడ్డగా ఉన్నది రాకుమారా? సంకోచంగా దూరంగా జరుగుతోంది గౌతమి.

  “అమ్మా! నేనెప్పుడు మీ కుమార్తెనే.. రాకుమారిని కాదు. మీరే నా వివాహం జరిపించాలి. చీరసారెలతో అత్తవారింటికి పంపాలి..” దగ్గరగా వచ్చి, గౌతమిని గట్టిగా కౌగలించుకుంది పద్మావతీ దేవి.

  “అంతకంటే అదృష్టమేముంటుంది తల్లీ..” గౌతమి ఆప్యాయంగా వీపు నిమిరింది.

                                      …………………….

......మంథా భానుమతి