Facebook Twitter
‘‘అజ్ఞాత కులశీలశ్య….” 34వ భాగం

                  

 

 

                                          ‘‘అజ్ఞాత కులశీలశ్య….” 34వ భాగం

క్రీ.శ. 1445.

 

                                   “గజపతుల తళ్లు”

 

  మాధవీలతా మంటపంలో కూర్చుని ఉన్నారు మాధవుడు, కాదంబరీ దేవి. వివాహమై రెండు సంవత్సరములు దాటినా, ఇంకా నవ దంపతుల వలెనే జీవన మాధుర్యాన్ని అనుభవిస్తున్నారు.

  చెలులు వచ్చి దీపాలంకరణ చేసి వెడలి పోయారు.

  సంధ్య కాంతులు మెల్లి మెల్లిగా శార్వరీ మిళితమవుతున్నాయి. చారల్లా కనిపిస్తున్న కెంజాయ సొగసులు సువర్ణ వర్ణంలో కలిసి పోయి మంటంపమంతా తీగలతో అల్లిన రంగవల్లులని తీర్చి దిద్దుతున్నాయి.

  మిశ్రమ కాంతుల పరావర్తనంలో కాదంబరీ దేవి వింత సొగసుతో వెలిగి పోతోంది.

 

  

  

                        

  అనుకోకుండా మాధవుని కంఠం ఒక చాటువుని పలికింది, కాదంబరిని చూస్తుంటే..

                    

                   “సీ. మకరధ్వజుని కొంప యొకచెంప కనుపింప

                                జీర కట్టినదయా చిగురు బోణి

                         యుభయకక్షములందు నురు దీర్ఘతరములౌ

                                నెరులు పెంచినదయా నీలవేణి

                         పసుపు తావులు గ్రమ్ము పైటచేలము లెస్స

                                ముసుగు వెట్టినదయా ముద్దుగుమ్మ

                         పూర్ణ చంద్రునిబోలె బొసగ సిందూరపు

                                బొట్టు పెట్టినదయా పొలతి నుదుట

  

                   తే.గీ.  యెమ్మె మీరగ నిత్తడి సొమ్ములలర

                            నోర చూపుల గుల్కు సింగార మొల్క

                            గల్కి ఏతెంచె మరుని రాచిల్క యనగ

                            వలపులకుచేటి యొక వడ్డెకుల వధూటి.”

 

  గంభీరమైన కంఠస్వరంతోమంద్ర స్తాయిలో సమ్మోహనంగా పాడుతున్న మాధవుని చూసి నును సిగ్గుల మొగ్గైంది కాదంబరి, పద్య అర్ధం కాకపోయినా భావం అర్ధమయింది.

  “ఒక వంక మన్మధునే సవాలు చేస్తూ, నాభి కిందికి పాదాలు తాకే చీర కట్టు, రెండు చేతుల ప్రక్క నుండి సాగిన దీర్ఘమైన, పిరుదులు దాటిన కేశ సంపద, నుదుటిన పూర్ణ చంద్రుని పోలిన సింధూరపు బొట్టు, పచ్చని కాంతులు వెదజల్లుతున్న మేలి ముసుగులోని ఓఢ్ర వనిత, సొగసు మీర సొమ్ములు పెట్టి మరుని రాచిలుక వలె సింగార మొలుకు తోంది.”

  వివరించాడు మాధవుడు.

  “అబ్బ.. ఎంత సొగసైన పద్యమో! ఇంత చక్కని భావంతో తెలుగులో మీరే చెప్పారా స్వామీ?” కాదంబరీ దేవి సంభ్రమంగా అంది.

  “నేనా.. ఏదో రాస్తాను కానీ.. ఇంతటి పద సంపద నాకెక్కడిది? ఇది కవి సార్వభౌముడు శ్రీనాధ మహాకవి ఓఢ్ర వనితని వర్ణిస్తూ చెప్పిన పద్యం. ఎంత హృద్యంగా ఉందో కదా? ఇందలి వర్ణన నీకు సరిగ్గా సరి పోయింది.”

  కాదంబరీ దేవి బుగ్గలు ఎర్ర మందారాలే అయ్యాయి.

  “నేను ఓఢ్ర వనితని ఐతే.. తమరు వంగ యువకులా?” మేల మాడింది కాదంబరి.

  నిమేష మాత్రం మాధవుని కంటి చూపులో తీక్ష్ణత కనిపించింది.

  “నేను కూడా ఓఢ్ర యువకుడినే కదా!” సర్దుకుని సమాధాన మిచ్చాడు మాధవుడు.

  వివాహమయ్యాక, మాధవుని నివాసం కోటలో, మహాపాత్రుల కోసం కట్టించిన కొత్త మందిరంలోనికి మారిపోయింది.

  నందుడు, గౌతమీ, సీతమ్మ తమ వసతి గృహాన్ని వేరే వారికి అప్పగించి కోటలోని మాధవుని గృహానికి మారి పోయారు. కోటలోని వంటశాలలో సలహాలిమ్మని పురుషోత్తముడు కోరితే ప్రతీ రోజూ వంటవారికి ఏమేం చెయ్యాలో ఎలా చెయ్యాలో చెప్తున్నారు.. వారి విద్యని మరచి పోకుండా.. రాజుగారి ఉద్యోగుల వలెనే వారికి కూడా భృతి అందుతోంది.

  మాధవుని కుటుంబం వరకూ కాలం ప్రశాంతంగానే సాగి పోతోంది.

  

  దేశంలో మాత్రం చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

  ఆ రోజు..

  సాయం సంధ్యా సమయం..

  కపిలేంద్ర వర్మ మాధవమంత్రిని పిలువనంపాడు.

  “మంత్రి వర్యా! ఈ దండయాత్రలో మీరు కూడా మా వెంట వస్తున్నారు మీరు. చాలా సుదీర్ఘ యాత్ర ఇది. సముద్ర తరంగాల వలే ఒకదాని తరవాత ఒకటి జరిపి.. కృష్ణా గోదావరీ తీరాలన్నింటినీ మన వశం చేసుకోవాలని యోచిస్తున్నాము. రాజమండ్రి రెడ్డి రాజ్యం మన దయింది. కొండవీడు, అద్దంకి, పాకనాడు, విజయనగరం.. తెలంగాణలో ఓరుగల్లు మీద మన పతాకం ఎగర వలెనని వాంఛిస్తున్నాము.”

  “అటులనే మహారాజా! మరి ఇచ్చట కోట రక్షణ..”

  “పురషోత్తముడు చూసుకొన గలడు. ఈ మారు మీ ప్రతిభని, ప్రజ్ఞా పాటవాలని మాకు అందజేయండి.”

  “తమ ఆజ్ఞ ప్రభూ!” మాధవుడు ఇంటికి వెళ్లి వార్త అందించాడు.

  “హూ.. గజపతుల తళ్లు మళ్లీ మొదలయ్యాయన్న మాట.” నందుడు విచారంగా అన్నాడు.

  “అంటే..” గౌతమి అడిగింది.

  “వరుస దండయాత్రలు. తమ రాజ్యం సుస్థిరం అయితే సరి పోదు. రాజ్య విస్థరణ కావాలి. సువిశాల సార్వభామాధికారం కావాలి. ఎంత జన నష్టం కలిగినా ఫరవాలేదు. అదే మన రాజుల ఆశయం. తెరలు తెరలుగా అలలు వస్తున్నట్లు దండయాత్రలు సాగించాలి..”

  “యుద్ధానికి వెళ్లక తప్పదా?” కాదంబరి కళ్లనిండా నీళ్లతో అడిగింది.

  “తప్పదు దేవీ! మీ తండ్రిగారు, అన్నదమ్ములు అందరూ రణ సన్నిద్ధులైనప్పుడు నేను పిరికి వాడి వలే ఉండలేను కదా! పైగా రాజాజ్ఞ మీరడం అసంభవం.”

  “జయాపజయాలు..”

  “దైవాధీనాలే.. కానీ ప్రయత్న లోపం లేకుండా పోరాడితే విజయం తధ్యం. ఇప్పుడు గజపతుల కాలం నడుస్తోంది. ఎక్కడికి వెళ్లినా విజయం వరిస్తోంది. మీరు అనవసరంగా ఆందోళన పడవద్దు రాకుమారీ!” మాధవుడు ఓదార్చాడు.

  మాధవునికి దక్షిణ ప్రాంతాలకి వెళ్లడం మనసులో ఇష్టంగానే ఉంది. శ్రీనాధ మహాకవిని ఇంకొక్క మారు చూడగలుగుతే.. ఎందుకో వారంటే అమితమైన ఆరాధన మాధవునికి.

  రెడ్డిరాజుల రాజ్యాలన్నీ గజపతులు ఆక్రమించుకుంటుంటే శ్రీనాధులవారు ఎక్కడుంటున్నారో? శ్రీశైలం లోనే ఉన్నారో.. ఏమయ్యారో?

  మాధవుని మనసంతా కలతగా ఉంది. వారిని చూసి ఏమైనా చెయ్య గలుగుతే.. వారి చిరుగుల శాలువానే మెదలుతోంది కన్నుల ముందు.

  “స్వామీ!” కాదంబరి పిలుపుకి కన్నులు తెరిచాడు మాధవుడు.

  “ఎప్పుడు బయలు దేరుతారు?” స్థిరమైన కంఠస్వరంతోనే అడిగింది కాదంబరి. మొదట్లో ఉన్న సందేహం, భయం లేవు. అనుమతిస్తే తనుకూడా వచ్చి యుద్ధంలో పాల్గొనే దైర్యం.. కనిపిస్తోంది.

  “ఏమిటో దేవీ! ఈ యుద్ధాలు ఎందుకో అర్ధం లేవనిపిస్తోంది. ఎంత ప్రాణ నష్టం.. ఈ ఖర్చులన్నీ సర్దుకోవడానికి సుంకాలు పెంచడం.. ఎక్కడా అంతులేదు. సంగీత సాహిత్యాలు ఆస్వాదిస్తూ విశ్రాంతిగా కాలం గడపగలరా ప్రజలెన్నటికైనా అనిపిస్తోంది.” విచారంగా అన్నాడు.

       

             “తే.గీ.  సృష్టి మొదలైన దాదినె సృకము బట్టి

                       కక్ష కార్పణ్య ములతోను కలసి కూడి

                       సూక్ష్మ జీవుల మొదలుగా సురభి యంత

                       పోరు సలుపుటకే నిల పొడమి రేమొ!”

(సృకము= బాణము)

 

  “నిజమే ప్రభూ! మంచీ చెడూ కలిసే ఉంటాయెప్పుడూ. ఎవరూ తప్పించలేరు. ఊరికే కూర్చుని, ఎవరి జీవనం వారు సాగిస్తున్నా.. ఎదుటి వారు ఊరుకోరు కదా!”

  కాదంబరి ఊరడించడానికి ప్రయత్నించింది.

  మాధవుడు మాత్రం రాజుల రాజ్యకాంక్షని సమర్ధించలేక పోయాడు.

  గంగ నుండి కావేరి వరకూ సామ్రాజ్యాన్ని స్థాపించాలనే కోరికే లేకపోతే.. కపిలేంద్ర వర్మ హాయిగా ఉండి, తన ప్రజలకి సుఖ సంతోషాలనిచ్చే వాడు కదూ!

  ఓడించిన రాజ్యం నుండి కన్నియని తెచ్చుకోవడం.. వివాహమాడ్డం. అందరు రాజులదీ అదే వ్యవహారం.

  మాధవుని మనసులోని అల్ల కల్లోలాలెలా ఉన్నా, వారం రోజుల లోగా దక్షిణ దిశగా కదిలాయి గజపతుల సైన్యాలు.

  రెడ్డిరాజ్యం పతనమయ్యాక, విజయనగరం దేవరాయల రాజ్యంలోని భాగమయిన రాజమండ్రీ.. అతని కుమారుడు మల్లిఖార్జునయ్య హయాంలో బలహీనమై పోయింది. కపిలేంద్రుని పుత్రుడైన హంవీర కుమారుడు రాజమండ్రీని జయించి కళింగంలో కలిపేశాడు. దానికి, రఘునాధ నరేంద్ర మహా పాత్రుని పరీక్షగా నియమించారు.

  కోరుకొండ దాటి గోదావరి తీరం చేరారు, మాధవుని తో కళింగ సైన్యం. మహారాజు స్వయంగా సైన్యాన్ని నడిపిస్తుంటే ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండ వలసిందే కదా!.

  గోదావరి తీరం చేర బోతుండగానే, మాధవునికి, తాము కాంచీ పురానికి వెళ్లినప్పటి విశేషాలన్నీ వరుసగా జ్ఞప్తికి వచ్చాయి.

  గోదావరీ తీరం వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు.. కపిలేంద్ర దేవుని సైన్యం. కానీ.. ఈ మారు మిత్రుడు పురుషోత్తముడు లేడు.

  విశ్రాంతికని ఆగిన ఘడియలోపే.. డేరాల వద్ద కోలాహలం..

  అనేక అశ్వాలు వస్తున్నట్లు, గిట్టల చప్పుళ్లు.

  బైట కావలి ఉన్న వారే కాకుండా.. డేరాల లోనుంచి సైనికులందరూ అప్రమత్తులై బైటికొచ్చేశారు.. కత్తులు చేతులతో తిప్పుతూ.

  మాధవుడు, మహారాజు మాత్రం చిరునవ్వుతో చూస్తున్నారు.

  ముందుగా వస్తున్న గుర్రం మీద, రఘునాధ మహా పాత్రుడు.. అల్లంత దూరం నుంచే గుర్రం దిగి, నడిచి కపిలేంద్ర దేవుని దగ్గరికి వచ్చాడు.

  “ప్రభూ! నాకు ముందుగా కబురు పంపి ఉంటే మీకు సర్వ సదుపాయాలూ చెయ్యక పోయే వాడినా!” అలుకగా అన్నాడు.

   “మేము ఎవరికీ చెప్ప దలచుకోలేదు రఘునాధా! కృష్ణా తీరం వరకూ సాగుదామని అనుకుంటున్నాము. ఇక్కడ పాలన అంతా బాగా నడుస్తోందా?” కపిలేంద్రుడు అడిగాడు.

  “చాలా బాగా నడుస్తోంది ప్రభూ. పంటలు బాగా పండుతున్నాయి. ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. గోదావరి అద్దరిని, ఒక గ్రామానికి, కపిలేశ్వర పురం అని పేరు పెట్టుకున్నారు.” రఘునాధుడు చిరునవ్వుతో అన్నాడు.

                         

 

  “కృష్ణా తీరంలో కూడా ఒక కపిలేశ్వరపురం రావాలి ప్రభూ.” మాధవుడు అన్నాడు.

  “అదే కదా మన ప్రయత్నం. ఇంక విశ్రాంతి తీసుకుందాము. రేపు సూర్యోదయాత్పూర్వమే బయలు దేరాలి.” కపిలేంద్రుడు సెలవు ఇచ్చాడు.

  

  “కొండవీడులో అంతః కలహాలతో పరిపాలన అస్తవ్యస్తం అయిపోయింది. అర్ధం పర్ధం లేని పన్నులతో ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. అంతే కాదు.. ఈ ప్రాంతమంతా విజయనగరం రాయల అధీనంలోనే ఉంది. దేవరాయల కుమారుడు మల్లికార్జునయ్య ఏలుబడిలోనే..  ఇదే మంచి తరుణం. మనం స్వాధీనం పరచు కోవడానికి.” కృష్ణాతీరం చేరుతూనే కపిలేంద్రుడు అన్నాడు.

  కృష్ణాతీరం వద్ద శ్రీనాధులవారి సమాచారం సేకరించడానికి ప్రయత్నించాడు మాధవుడు.

  కృష్ణాతీరం అంతా తిరుగుతూ ఉండే వేగులు రహస్యంగా రాజుల సమాచారాలు సేకరిస్తారు. కానీ.. ఒక కవి గురించి వారి కెందుకు?

  “కొండవీడు, విజయనగరం అనతి కాలం లోనే స్వాధీన పరచుకుంటున్నారు కదా! మల్లిఖారుజనయ్య, తన తండ్రి దేవరాయలు వలే సమర్ధుడు కాదు. అప్పుడు శ్రీశైలం ప్రాంతం కూడా కటకం ప్రభువుల సామ్రాజ్యంలోనికే వస్తుంది. ఆ తరువాత మీరు చెప్పిన వ్యక్తిని పట్టుకోవచ్చును మంత్రీ!”

  “పట్టుకోమనటం లేదు. క్షేమ సమాచారాలు మాత్రం తెలుసుకొమ్మంటున్నాం.” మాధవుడు వివరించాడు.

  “అటులనే ప్రభూ! త్వరలో తెలుసుకుంటాము.” చారులలో ప్రధాని సెలవిచ్చాడు.

  కానీ.. ఆ మరునాడే జరిగిందది..

  సుల్తాన్ నసీరుద్దీన్ అబ్దుల్ ముజాఫర్ మొహమద్ షా.. వంగ దేశాధిపతి, కటకం మీదికి దండెత్తి వస్తున్నాడని.. అత్యంత వేగంగా పరుగు పెట్టే అశ్వాల నధిరోహించిన వేగులు వర్తమానం తీసుకుని వచ్చారు.

  హంవీరుడు బహమనీ సుల్తానుల నెదుర్కొనడానికి వెళ్లాడు, ఇతర సోదరులతో కలిసి.

  కొండవీడు, విజయనగరం ఎప్పుడైనా కలుపు కోవచ్చును. కొద్ది మాసములు ఆగినా ఏం మార్పుండదు.

  ముందుగా వంగ సుల్తాను ఆక్రమణని ఆపాలి.

  సైన్యాన్ని వెనుకకు మరలమని ఆదేశమిచ్చాడు మహరాజు.

  “వంగదేశం మీదికి దండయాత్రా ప్రభూ!”

  “అవును మాధవా! వంగ కళింగ దేశాలని ఏకం చెయ్యాలి. వంగదేశంలో హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాలి. గణేశుల పాలన తదుపరి గజపతులు ఏలాలి. మత మార్పిడులని ఆపాలి. మీరు కూడా మాతో వస్తున్నారు. గంగా తీరం వరకూ గజపతి సామ్రాజ్యం విస్తరించాలి. జానూపురం స్వాధీనమయ్యాక కుమార హంవీరుని కూడా మనతో కలవమని ఆదేశం పంపుతున్నాను.” కపిలేంద్రుడు ఆవేశంగా అన్నాడు.

  వంగ రాజ్యం..

  లోపలి అలజడి పైకి కనిపించకుండా బింకంగా అన్నాడు మాధవుడు..

  “తమ ఆజ్ఞ ప్రభూ! అటులనే వంగ సుల్తానుని ఓడిద్దాం.”

                                     ……………………

......మంథా భానుమతి