Facebook Twitter
" ఏడు రోజులు " 20వ భాగం

" ఏడు రోజులు " 20వ భాగం

 

 

 

రచన: తంగెళ్ల శ్రీదేవిరెడ్డి

 

 

సమయం రాత్రి పదిగంటలు!
    
    హైద్రాబాద్ లో గౌసియా వాళ్ళ వీధి భయంకరంగా వుంది. హిందూ, ముస్లింలు ఒకర్ని ఒకరు కొట్టుకుంటున్నారు. కత్తిపోట్లు జరుగుతున్నాయి అరుపులతో కేకలతో ఆ ప్రాంతం ఒకవైపు దద్దరిల్లిపోతుంటే, మరోవైపు నెత్తుటి చినుకులు ఆ నేలను తడిపేస్తున్నాయి.
    
    కొందరు ఇళ్ళల్లో చేరి గడియలు వేసుకున్నారు. మరికొందరు ఇళ్ళు వదిలి పారిపోతున్నారు.
    
    తలుపుల్ని విరగ్గొట్టి లోపల వున్నవాళ్ళను బయటికి లాగి స్త్రీలు, పసిపిల్లలు.... తేడా లేకుండా చితకబాదడం, విచక్షణారహితంగా ప్రవర్తిస్తుండటం, వస్తువుల్ని ధ్వంసం చేయడం అంతా ఒక యుద్దభూమిని తలపించే వాతావరణం!
    
    వున్నట్టుండి సైరన్ మోతలతో సర్రున దూసుకువచ్చాయి పోలీసు వ్యాన్లు తుపాకీలు పట్టుకుని అప్రమత్తులౌతూ....వ్యాన్లు ఆగీ ఆగకుండానే కిందికి దూకారు పోలీసులు.
    
    పోలీసుల్ని గమనించి కూడా ఎవ్వరూ చెదిరిపోలేదు ఎవ్వరూ బెదిరిపోలేదు.
    
    "ఆగండి" మైకులోంచి ఐదారుసార్లు హెచ్చరికగా చెప్పారు పోలీసులు కాని వాళ్ళను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు అక్కడ!
    
    పోలీసులు ఇక ఆలస్యం చేయలేదు నీళ్ళ పైపుల్ని ఎక్కుపెట్టి, నీళ్ళని ఎగజిమ్ముతూ, జనాల్ని చెదరగొట్టే ప్రయత్నం చేసారు.
    
    కొంతవరకు జనాలు చెదిరిపోయారు. మిగతా వాళ్ళు మాత్రం తొణకడంలేదు, బెణకడంలేదు లాభం లేదనుకున్న పోలీసులు మరి కాసేపటికి గాలిలోకి కాల్పులు జరిపారు ఊహు.... అయినప్పటికీ విధ్వంసకారులు చెక్కుచెదరలేదు.
    
    పోలీసులు ఈసారి లాఠీఛార్జీ జరిపారు. ఆ ప్రయత్నంలో కొందరు విధ్వంసకారులు పోలీసుల్నే ఎగబడికొట్టారు. దీంతో పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తమౌతూ నేరుగా కాల్పులు జరిపేందుకు తుపాకుల్ని ఎక్కుపెట్టింది.
    
    "ఆగండీ లేదంటే సూటిగా కాలుపు జరుపుతాం ప్రాణాలు పోతాయి" ఒకటి రెండుసార్లు హెచ్చరించారు పోలీసులు.
    
    అప్పటికి విధ్వంసకాఉర్లు పూర్తిగా చెదిరిపోయారు ఆ ప్రాంతం అంతా యుద్ధం తర్వాతి భయంకర నిశ్శబ్దంతో నిండిపోయింది. ఒకవైపు తిరగబడుతున్న వస్తువులు, మరోవైపు చెల్లాచెదురుగా పడివున్న చెప్పులు... కర్రలు... వస్తువులు... అక్కడక్కడా పడివున్న కొన్ని శరీరాలు చోసోతుమ్తే బలహీనుల గుండె ఆగిపోతుందేమో అన్నట్టుగావుంది పరిస్థితి.
    
    పోలీసులు అంతా కలియజూస్తున్నారు.
    
    "సర్...." అంటూ నెమ్మదిగా ఒక ఇంటి చాటునుండి వచ్చారు కొందరు ముస్లీం యువకులు.

    "మా సాయిబును హిందువుల కుర్రాడు అకారణంగా చంపేసాడు. చనిపోయిన సాయిబు బాధ్యతలుగల వ్యక్తి ఇప్పుడా కుటుంబానికి దిక్కు ఎవ్వరూలేరు ఇందుకు మీరేం చేస్తారో మీ ఇష్టం" రాగానే పొట్టిగా లావుగా వున్న ఒక వ్యక్తి చెప్పాడు.
    
    అదే సమయంలో మరో ఇంటి చాటు నుండి వచ్చింది, బాలస్వామి అతడి అనుచరబృందం.
    
    "మా కుర్రాడు వాళ్ళ సాయిబును అందరూ చూస్తుండగా కత్తితో పొడిచి చంపేసిన మాట నిజమే! కాని అందుకు కారణం వుంది. చనిపోయిన సాయిబు తన పెద్దకూతురు గౌసియాను అరబ్బుషేకుకు మూడు లక్షల రూపాయలకు అమ్ముకున్నాడు. ఇది తెల్సి మానవత్వం వున్న మనిషిగా, మనసులేని ఆ మనిషిని చంపేసాడు. మతంతో సంబంధంలేని ఆ మనిషిని చంపేసాడు. మతంతో సంబంధంలేని ఈ హత్య, మతకలహాలకి దారితీయడం నిజంగా దురదృష్టకరం" అన్నాడు బాలస్వామి.
    
    నిజానికి అతడి మనసులో... సమయం దొరికింది కాబట్టి ముస్లింలను అందర్నీ చంపేయాలన్నంత కసివుంది.
    
    పోలీసులు ఇరువర్గాల్ని పరిశీలించి చూసారు. ఇరువురూ గొడవలో పాలుపంచుకోవడం వల్ల రేగిపోయి కనబడుతున్నారు.
    
    "హత్య చేసిన కుర్రాడు ఏడి?" అడిగేడు ఒక పోలీసు.
    
    "భవానీశంకర్! పారిపోయాడు" చెప్పాడు బాలస్వామి.
    
    అంతలోనే అక్కడ పడివున్న శరీరాలవద్దకు బిగ్గరగా రోదిస్తూ పరుగెట్టుకువచ్చారు హిందూ ముస్లింలు తమవాళ్ళ నిర్జీవ శరీరాల్ని చూసుకోగానే వాళ్ళ దుఃఖం మరింత పెరిగింది.
    
    "ఆ కుర్రాడి ఇల్లు ఏది?" అడిగాడు ఇంకోపోలీసు.
    
    "అదే" చూపించాడు బాలస్వామి.
    
    కొందరు పోలీసులు అక్కడికి నడిచారు లోపల మౌనంగా రోదిస్తూ కూర్చునివుంది లక్ష్మీదేవమ్మ అక్కడే లేవలేని స్థితిలో పడుకుని, తను కూడా ఏడుస్తున్నాడు గోపాలయ్య.
    
    పోలీసుల్ని చూడగానే అతడు లేచి కూర్చోబోయాడు కాని అతడికి చేతకాలేదు లక్ష్మీదేవమ్మ మాత్రం లేచి నిలబడి చేతులు జోడించింది. ఆమె కళ్ళ వెంబడి కన్నీళ్ళు ధారాపాతమౌతున్నాయి.
    
    "సారూ... మా కొడుకు కనబడ్డంలేదు. వాడు అసలు వున్నాడో లేక ఈ నా కొడుకులు చంపి ఎక్కడైనా పడవేసారో తెలీట్లేదు"
    
    "ఏయ్..." బయటే నిలబడివున్న యువకులు, లక్ష్మీదేవమ్మ మాటలు వినగానే సహించలేనట్టుగా ఒక్కుమ్మడిగా అరిచారు.
    
    వాళ్ళను వారిస్తున్నట్టుగా తన లాఠీని తలుపుకేసి బాదాడు ఒక పోలీసు.
    
    "అవున్సార్! వాడి విషయంలో మాకు అనుమానంగా వుంది. వాడు మాకు ఒక్క గానొక్కకొడుకు వాడు లేకపోతే మేము బతికి లాభంలేదు" గోపాలయ్య కళ్ళనీళ్ళు తుడ్చుకున్నాడు.
    
    "మీరు వాడి విషయంలో ఏమాత్రం జాప్యం చేయకుండా, వెంటనే ఏ సంగతి తేల్చెయ్యాలి" పోలీసుల వెనకగా నిలబడి వున్న బాలస్వామి అన్నాడు.
    
    "నీవు నోర్మూసుకోవయ్యా" మరో పోలీసు బాలస్వామిని వారిస్తుంటేనే, బయటనుండి వెహికల్స్ వస్తున్న శబ్దం వినబడింది.
    
    అందరూ అటుకేసి చూసారు ఓ రెండు అంబాసిడర్ కార్లు వచ్చి ఒకపక్కగా ఆగగానే, అందులోంచి ముస్లిం నాయకులు దిగారు. ఆ వెంటనే వచ్చిన మరో రెండు టాటా సుమోల్లోంచి హిందూ నాయకులు దిగారు. వారు ఇరువురూ చుట్టూ మూగిన జనాల్ని పరామర్శించసాగారు.
    
    పోలీసులు మాత్రం బయటకు వెళ్ళలేదు. ప్రశ్నలతో గోపాలయ్య దంపతుల్ని ఉక్కిరి బిక్కిరిచేయసాగారు.
    
    "అంటే.... మీ కొడుకు ముందుగానే ఆ అమ్మాయిని కాపాడే విషయమై మీతో చర్చించాడన్నమాట" వాళ్ళ సమాధానాల్ని అన్నీ విన్నాక అన్నాడు ఒక పోలీసు.
    
    "అవున్సారు" అంది లక్ష్మీదేవమ్మ.
    
    "అమ్మాయిని అమ్మే విషయం మీకు తెలియదు కానీ మీకొడుక్కి తెల్సింది. ఎలా తెల్సిందంటారు" అదే పోలీసు అడిగాడు.
    
    "తెలీదుసారూ" అంది లక్ష్మీదేవమ్మ.
    
    పోలీసులు ఇంకేం అడగలేదు బయటకి నడిచి.... అట్నుంచి సాయిబు ఇంటివైపు అడుగులు వేసారు పోలీసులు వెళ్ళేసరికి సాయిబు భార్య ఖతీజాబీ సొమ్మసిల్లిపడిపోయివుంది కొంచెం పెద్దగా కన్పిస్తున్న ముగ్గురు పిల్లలు తండ్రి శవంచుట్టూ కూర్చుని వున్నారు. బాగా ఏడ్చినందున వాళ్ళ కళ్ళు ఉబ్బిపోయివున్నాయి.
    
    చంటిపాప నిద్రపోతోంది. ఇంకో పిల్ల ఆడుకుంటోంది. ఒక పక్కగా కూర్చునివున్న మరో ఇద్దరు పిల్లలు మాత్రం పోలీసుల్ని చూసి చటుక్కున లేచి నిలబడి.
    
    "మా అమ్మ కూడా చచ్చిపోయింది"
    
    "అవున్సారూ.... అమ్మ కూడా చచ్చిపోయింది"
    
    చావంటే ఏదో అబ్బురమైన విషయం అన్నట్లుగా కళ్ళింతచేసి ఒకరితర్వాత ఒకరు చెప్పారు ఆ పిల్లలు.
    
    పోలీసులు సాయిబు శవాన్ని పరిశీలనగా చూసారు. తర్వాత ఆ ఇంటి పరిసరాల్ని అంతా ఒకసారి పరికించి చూసి, ఆ తర్వాత తండ్రి పక్కలో కూర్చున్న పిల్లల వైపు చూస్తూ అడిగారు.
    
    "బేబీ... మీ అక్కను ఏంచేశారు?"
    
    "మా అబ్బా అమ్మేసాడు" ఒక పిల్ల వెంటనే చెప్పింది.
    
    "కాదుకాదు" అంటూ ఆ పిల్లను మెల్లగా గిల్లి "మా ఆపా మాకు చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది" మరోపిల్ల తెలివిగా చెప్పింది.
    
    "అది కూడా కాదు, మా ఆపాకు పెళ్ళయి వెళ్ళిపోయింది" ఇందాక వాళ్ళమ్మ గురించి మాట్లాడిన పిల్లల్లో ఒక పిల్ల అందుకుంది.
    
    "ఎవ్వరితో పెళ్ళయ్యింది" ఆ పిల్ల దగ్గరకి వెళ్ళి, కాసింత వంగి మృదువుగా అడిగాడు ఓ పోలీసు.
    
    "సైతాన్ తో" ముఖం చిట్లించింది ఆ పిల్ల.
    
    అప్పటికి ఖతీజాబీని ఎమర్జెన్సీ డాక్టరు పరిశీలిస్తున్నాడు.
    
    "డాక్టర్... ఆమె త్వరగా కోలుకునేలా చూడండి" చెప్తూ పోలీసులు బయటికి నడిచారు.

 

...... ఇంకా వుంది .........