Facebook Twitter
‘‘అజ్ఞాత కులశీలశ్య….” 31వ భాగం

 

                   ‘‘అజ్ఞాత కులశీలశ్య….” 31వ భాగం

  “మాధవా! జగన్నాధుని సేవకి సమయం ఆసన్నమవుతోంది. ఈ సారి మరింత ఘనంగా ఏర్పాట్లు చెయ్యమని తండ్రిగారు ఆదేశ మిచ్చారు. మొత్తం భారమంతా మన మీదనే.. ఇంక ఒక మాసము మాత్రమే ఉంది. ఈ లోగా, నీవు రెండు మారులు పూరీ పట్టణమునకు పోయి రావలెను.” పురుషోత్తమ దేవుడు, కొలనులో ఈత కొడ్తూ అన్నాడు.

   గుర్రపు స్వారీ.. కత్తి యుద్ధం సాధనలయ్యాక మిత్రులిరువురూ వనములో కొలను వద్ద, స్నానం చేసి మంటపంలో కూర్చుని ఆ రోజు రాచకార్యాలను ముచ్చటిస్తారు.

  “అలాగే రాకుమారా! ఈ మారు కూడా జగన్నాధుని సేవించుకునే అదృష్టం మిమ్ములను వరిస్తున్నట్లుంది. తప్పకుండా అన్ని ఏర్పాట్లనూ చేసెదను.” మాధవుడు కొలనులోనుండి బైటికి వచ్చి, అంగ వస్త్రముతో త్వర త్వరగా అద్దుకుని, మంటపం వెనుకకు వెళ్లి దుస్తులు ధరించి వచ్చాడు.

  “ఏమాయె మాధవా? ఏమా తొందర? సభకి ఇంకా సమయమున్నది కదా!” మాధవుడు పలుక కుండా మంటపంలో ఆసనం మీద కూర్చున్నాడు.

  అప్పుడు వినిపించింది, పురుషోత్తమునికి కలకలా రావం..

  “ఓహో.. మా సోదరి వచ్చుచున్నదా? నిజమే.. ఇప్పుడు అంతఃపుర స్త్రీలు విహారం చేసే సమయం ఆసన్న మయింది కదా! మనం బయలు దేరుదాం.”

  కాదంబరీ దేవి, కొలనులో దిగడానికి కావలసిన దుస్తులు ధరించి వచ్చింది చెలులతో. వెనుకే చెలులందరు అవసరమైన ఇతర సామగ్రి తో అనుసరిస్తూ వస్తున్నారు.

  సోదరిని చూసినంతనే పురుషోత్తముని మోము మందహాసంతో విచ్చుకుంది. వనమంతా చిరు సవ్వడులు మొదలయ్యాయి. వాతావరణ మంతా ఆహ్లాదంగా తయారయింది.

 

మహా స్రగ్ధర.   అరుగో యా నెచ్చెలుల్ కాయగ నదె రయమున్ హాయిగా రాకుమారే

                   యరుదెంచంగానె యా తోయముల యలల నా హాసముల్ యేమనేనో

                   చిరు వయ్యారాలు చూపించి యుడుత లదె వేంచేసి యానంద మందే

                   మురిపెం మెండైన నెంతో ముదము నిలిచెగా మోమునే మెచ్చగానే.

 

  అన్నగారి పాదములంటి నమస్కారము చేసింది కాదంబరి.

  “కుశలమేనా సోదరీ!” చిరునవ్వుతో విచారించి, స్నేహితుని వెదకుతూ పయనమయ్యాడు పురుషోత్తముడు.

 

  మాధవుడు మహారాజుగారి ఆనతి మేరకు పూరీలో జరుగబోవు రథయాత్ర ఉత్సవానికి పర్యవేక్షణ జరుపుతున్నాడు. వారమునకొక మారు పూరీ వెళ్తున్నాడు.

  కోటలో కొలువునకు ప్రతీ దినమూ వెళ్ల వలసిందే.

  అప్పుడప్పుడు, చెలులతో నడయాడుతూ.. అరుదుగా ఏకాంతమును ఆస్వాదిస్తూ, వనములలో కాదంబరీ దేవి ఎదురు పడుతూనే ఉంది మాధవునికి.

  ఒక సారి మాత్రము, సూటిగా కళ్లలోకి చూసి చిరు నవ్వు నవ్వింది.

  హృదయం చిక్క బట్టుకుని పక్కకి తిరిగి వెళ్లి పోయాడు. అప్పటి నుండీ, గుండెలోనే తిష్ట వేసుకుని కూర్చుంది.

  రాకుమారునికి చెప్తే..

  తల విదిల్చాడు.. అసలే రాకుమారుడు పరిహాసం చేస్తుంటాడు. అది మహా రాజుగారికి తెలుస్తే.. తల తీసేసినా ఆశ్చర్యం లేదు. కోటలో రాకుమారికీ, పూటకూళ్ల మాధవునికీ పొంతనెక్కడ?

  అత్యాశే.. అందుకే సాధ్యమయినంత వరకూ అణచి వేస్తున్నాడు.

  ఒక వేళ, కోటలోని వారు ఆంగీకరించినా.. తన ఇంటిలోని వారు ఒప్పుకోవాలి కదా! వారి దృష్టిలో కుల సామరస్యం లేదాయె.

  ప్చ్.. ఈ స్పందనలనెందుకు పెట్టాడో ఆ భగవంతుడు?

  ఇంట్లో సీతమ్మ, మనుమని పెండ్లి చేయాలని గొడవ.. ఇంకెందుకాలిశ్యం, మాధవుడు మంత్రి అయ్యాడు కదా అంటుంది. తనకి తెలిసిన మంచి సంబంధాలు చెప్తూంటుంది.

  గౌతమీ నందులు కూడా అదే ఆలోచిస్తున్నారని తెలిసి పోతోంది.

  అంతా ఆ జగన్నాధుని మీదనె భారం పెట్టి కాలంగడుపుతున్నాడు మాధవుడు.

 

  అనుకున్న సమయం రానే వచ్చింది.

  మాధవుడు వారం రోజులు ముందుగానే పద్మావతీ దేవిని, సీతమ్మని తోడుగా తీసుకుని పూరీలో దింపి వచ్చాడు. అక్కడ మంత్రిగా అతనికి సకల సదుపాయాలతో భవనం ఏర్పాటు చేసుకున్నాడు.

  రథయాత్ర సమయంలో పద్మావతి జగన్నాధుని సేవ చేస్తానని మొక్కుకుందని సీతమ్మే గుర్తు చేసింది.

  పద్మావతి ప్రతీరోజూ, ఆలయానికి వెళ్లి ప్రాంగణ మంతా శుభ్రం చేస్తోంది, మిగిలిన భక్తులతో కూడి.

  ఆ సంవత్సరం మరింత వైభవంగా చేయాలని నిశ్చయించాడు కపిలేంద్ర వర్మ. కాంచీపుర విజయం ఒక ఎత్తైతే.. రాజ్యంలో సకాలంలో వానలు పడి సుభిక్షంగా ఉండడం మరొక కారణం.

  రథయాత్ర ప్రారంభ సమయానికి వచ్చేస్తానని వాగ్దానం చేశాడు మాధవునికి. అంతవరకూ స్వామి సేవని పురుషోత్తముని చెయ్యమని ఆదేశించాడు.

  రెండురోజులు ముందుగానే రాచ కుటుంబమంతా వచ్చేసింది.. వారితోనే నంద గౌతమిలు కూడా..

  మార్గ మధ్యంలో విశ్రాంతి సమయంలో పరిచయమయింది, రాకుమారి కాదంబరీ దేవి వారికి. మాధవ మంత్రి తల్లిదండ్రులనగానే, సమీపానికి వచ్చి పలుకరించింది. ఇంక.. రాకుమారిని జన మధ్యంలో చూసిన వారు ఆమె సౌకుమార్యానికి, అందచందాలకు ఆశ్చర్య చకితులై ఉండిపోయారు.

 

               సీ.    దేవేంద్ర వనమునందే వెలసినయట్టి

                               పారిజాత విరుల పసిమిగలిగి

                       పున్నమి చంద్రుని పొలపము పొడచూప

                               మేని ఛాయ పొసగు మిసిమి వెలుగు

                       మల్లిరేకుల సుకుమారపు సొగసులు

                               మోమునందు విరియ మురిపముగను

                       సరస కొచ్చిననంత సంపంగి తావియె

                               ఆహ్లాదముగ నెంతొ ఆవరించ

 

       తే.గీ.         మీనముల పోలు కనుదోయి మెరుపులవియె

                       అభినివేశము కలిగిన యలతి యనగ

                       అణువునణువున కనబర్చ యణకువెంతొ

                       అతిశయము కూడ కానగ యరుదుగాను.

 

  అణకువతో, ఆదరముతో సంభాషించింది కాదంబరీ దేవి.

  సీతమ్మ పాడుతున్న జానపద గేయాలతో సునాయాసంగా గడిచి పోయింది సమయ మంతా.

      

మధురగతి రగడ..         అరె చూతముగా ఆది పురుషునే

                                   అరుగుచు నందరు ఆటల నాడను

                                   కరివరదుడతడె, కలియుగముననూ

                                   హరి హరి యన భవ హరమ్ము కల్గును.

 

                                   జగన్నాధు డతడె జాడతెలియగను

                                   జగముల నేలడ జలధిని నిల్చిని

                                   ఖగవాహనుడే కాచగ జనులను

                                   నగమెత్తినయా నారాయణుడును.

 

  పాటలయ్యాక, భజన చేస్తూ పూరీ పట్టణం చేరారు అందరూ.

  ఏటికేడు జగన్నాధ రధ యాత్రని వీక్షించడానికి భక్త సందోహం పెరిగి పోతోంది. భక్తులకి సదుపాయాలు చెయ్యడానికి ఆలయ నిర్వాహకులు కొత్త మార్గాలు వెతుకు తున్నారు.

  రాచకుటుంబం వారి విడిది సమూహం వద్దనే మాధవుని కుటుంబం కూడా ఉన్నారు. సముద్రపు ఒడ్డుకి దగ్గరలోనే కట్టిన వసతి గృహాలు.. సూర్యోదయం చూడాలంటే సముద్రపు ఒడ్డునే చూడాలి.

  ప్రతీ ఉదయం సముద్రపు ఒడ్డుకి వెళ్లడం కాదంబరీ దేవికి అలవాటయింది. చిన్నపిల్లలా ఒడ్డునున్న ఇసకలో గూళ్లు కట్టడం, రెండు చేతులతో పావడా ఎత్తి పట్టుకుని అటూ ఇటూ పరుగులు పెట్టడం.. అరమరికలు లేకుండా అందరితో కలిసిపోతోంది.

                           

                                 

  “నంద మహాపాత్రుల కుమార్తె నా మీరు?” పద్మావతిని చూసి అడిగింది కాదంబరి, సముద్ర పొడ్డున అలల్లో ఆడుకుంటూ.

  “అవును రాకుమారీ. దత్త పుత్రిక.” పద్మావతి సమాధానం చెప్పే లోగా, అక్కడి కొచ్చిన సీతమ్మ అందుకుంది.

  “చాలా సంతోషం. మీకు కత్తి యుద్ధం నేర్పిస్తాను. ఇక్కడున్న కాలమంతా. తరువాత కూడా మీరు మా కోటకి వస్తే మనం చాలా విద్యలు నేర్చుకొన వచ్చును.” కాదంబరీ దేవి, పద్మావతి దగ్గరగా వచ్చి అంది.

  “కత్తి యద్ధం.. అమ్మాయిలు యుద్ధాలు చెయ్యడం ఎందుకు రాకుమారీ?” సీతమ్మ సందేహం.

  “క్షత్రియ కన్యలకి యుద్ధ విద్యలన్నీ వచ్చి ఉండాలి అమ్మమ్మా? నేను రోజూ అభ్యాసం చేస్తుంటాను. పద్మావతీ దేవికి నేర్పిస్తాను.”

  “యుద్ధ విద్యల సంగతి ఎలా ఉన్నా, మీ స్నేహం కలకాలం వర్ధిల్లాలని ఆ జగన్నాధుని ప్రార్ధిస్తాను.” సీతమ్మ అక్కడి నుంచి వెళ్లి పోయింది.

 

  “రోజూ జగన్నాధుని సేవకి వెళ్తున్నారా మీరు పద్మావతీ?” ఎవరూ చెప్పక పోయినా, ఎందుకో పద్మావతిని ఇతర చెలుల్లాగా కాకుండా మన్నిస్తుంది కాదంబరీ దేవి.

  “అవును. ఆలయం శుభ్రం చేయడంలో నా వంతు నేను సహాయం చేస్తున్నాను. దేవునికి పూల మాలలు కడ్తాను. వంట శాలలో కూడా చేయందిస్తున్నాను. ఉదయం స్నానాదికాలు పూర్తవగానే వెళ్లి సంధ్యా సమయానికి విడిదికి చేరుతాను.” పద్మావతి చెప్పింది.

   మూడవరోజు రాత్రి భోజనాలయిన పిదప ఆరుబయట కూర్చున్నారందరూ. సముద్రపుగాలి ఆహ్లాదంగా వీస్తోంది. అక్కడక్కడ మేఘాలు కదలాడుతున్నా, ఆకాశంలో తారలు పలుకరిస్తున్నట్లుగా మిణుకు మిణుకు మంటున్నాయి.

  “మీరు కటకం వచ్చి చాలా దినాలయిందా? ఇక్కడి వాతావరణం నచ్చిందా?” కాదంబరీ దేవి ప్రశ్నలకి అవునన్నట్లుగా నిలువుగా తలూపింది పద్మావతి.

  రాకుమారి పద్మావతిలోని రాచఠీవి, ఆవిడ పూటకూళ్ల ఇంటికి చెందినది కాదని చెప్పకనే చెప్తోంది. కాదంబరికి కాంచీపురం దండయాత్ర గురించి కొంచెం తెలిసినా, పూర్తి వివరాలు తెలియవు. పద్ధెనిమిది మంది యువరాజులున్న కోటలో అంతఃపుర స్త్రీలు రాజకీయాలకి దూరంగానే ఉంటారు.

  “నంద మహా పాత్రులు మాకు బాగా కావలసిన వారు. దక్షిణదేశంలో జరిగిన యుద్ధంలో మా కుటుంబం చెల్లా చెదురై పోయింది. సోదరుడు మాధవుడు వచ్చి నన్ను కటకం తీసుకొని వచ్చారు, శతృ సైనికుల బారిని పడకుండా.” పద్మావతి, కొంచెం వ్యవధి తీసుకుని చెప్పింది.

  “అయ్యో.. అంత పని జరిగిందా! మేమంతా మీకు తోడుగా ఉంటాము పద్మావతీ దేవీ. మీరేమీ బెంగ పడకండి. జగన్నాధుని సేవలో ఏమైనా అంతరార్దం ఉందా?” చిరునవ్వు చిందిస్తూ అడిగింది కాదంబరి.

  “ఊ..” సిగ్గుపడుతూ అంది పద్మావతి. మోము యెర్ర మందారమే..

  “ఎవరా అదృష్ట వంతుడు?”

  “ఎవరైనా ప్రస్తుతం నా మీద కినుక వహించారు. వారి అనురాగం పొందేలాగ అనుగ్రహించమనే నా వేడుకోలు.”

  “జగన్నాధునికి సేవ చేస్తే కోరుకున్న వరుడు లభ్యమవుతాడా?” కాదంబరీ దేవి ఆశ్చర్యంగా అడిగింది.

  “అనే అంటారు పెద్దలు. కావలసింది నమ్మకం. ఆది దేవుని మీద భారమంతా వేసి స్మరణ చేస్తుంటే తప్పక కోరిక నెరవేరుస్తాడు. మన తల్లిదండ్రులేనా కాదంటారేమో కానీ ఆ అంతర్యామి మాత్రం మనని కాచుకునే ఉంటాడు.”

  సాలోచనగా చూస్తుండి పోయింది కాదంబరీ దేవి.

  “ఏమి రాకుమారీ.. ఎవరైనా రాకుమారుడు మీ హృదయాన్ని దొంగిలించాడా? రేపు ఉషోదయం అయిన వెంటనే ఆలయ ప్రాంగణానికి వచ్చెయ్యండి. మీ కోరిక తప్పక నెరవేరుతుంది.” పద్మావతి, కాదంబరీ దేవి వద్దకు వచ్చి భుజం మీద చేయి వేసి అంది.

  కాదంబరి తలకొద్దిగా వాల్చింది. మోములో కళ తగ్గింది.

  చూపుడు వేలుతో తల కొద్దిగా పైకి లేపి కళ్లలోకి చూసింది పద్మావతి.

  “ఏమయింది రాకుమారీ? ఎందుకా కలత?”

  “అతను రాకుమారుడు కాదు. మామూలు వ్యక్తి. కానీ హృదయ స్పందనకి ఆ విశేషం అక్కర లేదు కదా!”

  “ఆ సంగతి ఎవరికైనా అభ్యంతర పెట్ట వలసిన విషయం కాదనుకుంటాను.”

  “అతడు క్షత్రియుడు కూడా కాదు. అసలు నా మీద ఎటువంటి అభిప్రాయం ఉందో కూడా తెలియదు. ఈ విషయం ఇప్పుడు ప్రధమంగా మీ వద్దనే బైట పెట్టాను.” కాదంబరీ దేవి లో గొంతుతో అంది.

  పద్మావతికి అంతా అర్ధమవుతున్నా రాకుమారి నోటివెంటే చెప్పించాలని ఆగింది.

  మాధవుని మనసు కూడా గ్రహించింది. ఇరువురికీ ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్నప్పుడు అడ్డు చెప్పడానికేమీ ఉండదనే అనిపించింది.

  “మా ప్రాణాలు కాపాడిన మీ సోదరుడే పద్మావతీదేవీ..” రాకుమారి బిడియం వదిలి అనేసింది. ఎవరైనా తనకి సహాయం చెయ్య గలిగితే అది పద్మావతే అని గ్రహించిందామె.

  పద్మావతికి కాదంబరీ దేవి మీద అవ్యాజ్యమైన అభిమానం కలిగింది.

  దగ్గరగా తీసుకుని కౌగలించుకుని, నుదుటి మీద చిన్నగా ముద్దిచ్చింది.

  “తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది రాకుమారీ!”

  “మరి మీ మనసు దోచిన వీరుడెవరో నాకు చెప్పరా?” కాదంబరీ దేవి ప్రశ్నకి జవాబుగా చిరునవ్వు విసిరింది పద్మావతి.

  “త్వరలో తెలుస్తుంది. అంత వరకూ వేచి ఉండాలి. తప్పదు.”

  “నేనేమో మీతో అంతా చెప్పేశాను స్వేచ్ఛగా. మీరు మాత్రం..” బుంగమూతి పెట్టింది.

  పద్మావతి కిలకిలా నవ్వింది.

  “రాకుమారీ! మీ ప్రేమ ఫలిస్తుందని నాకు నమ్మకం ఉంది. కానీ నాది వేరు. అపార్ధాలు, అలుకలతో కూడి ఉంది. ముందు అవన్నీ తొలిగి పోవాలి. ఆ తరువాత మరుగున పడిన ప్రేమ బైటికి రావాలి. కాస్త సంక్లిష్టమయన ప్రేమ కథ నాది. అందుకనే సమయం వచ్చినప్పుడు చెప్తాను. మీ రంటే నాకు చాలా అభిమానం కలిగింది. మా సోదరునికి తోడైతే మనం బంధువులం కూడా అవుతాము. చాలా ఆనందంగా ఉంది.”

  కాదంబరీదేవి కూడా ఆనందంగా నవ్వింది.

  “నింగినున్న చందమామ కిందికి వచ్చినట్టుందే..”

  పద్మావతి కించిత్ ఆశ్చర్యంగా అంది. వాతావరణం ఆహ్లాదంగా తయారయింది.

                                          ………………..

......మంథా భానుమతి