Facebook Twitter
‘‘అజ్ఞాత కులశీలశ్య….” 22వ భాగం

‘‘అజ్ఞాత కులశీలశ్య….” 22వ భాగం

 

  

 

  “అబ్బా! ఎంత సుందరంగా ఉందో జగన్నాధుని ఆలయం.” మాధవుడు గట్టిగా అరిచాడు. మేనా లోంచి గౌతమీ, సీతమ్మలు తొంగి చూశారు.

  రాజుగారి పరివారంతో వెళ్తున్నారు నంద మహా పాత్రుని కుటుంబం. నంద, మాధవులు గుర్రాల మీద, గౌతమి, సీతమ్మలు మేనాలో. ఒక బిడారులా సాగుతున్నారు.

  సీతమ్మ ఆనందానికి అవధుల్లేవు. కళింగదేశంలో ప్రతీ ఒక్కరికీ పూరీ జగన్నాధుని దర్శనం జీవితంలో ఒక్క సారైనా చేసుకోవాలనే కోరిక ఉంటుంది. సీతమ్మ వంటి వారికి అది తీరని కోరికే.

  “మాధవుని ధర్మమా అని నా కన్నులు పుణ్యం చేసుకో బోతున్నాయి” కనిపించిన వారందరికీ చెప్పి మురిసిపోయింది.

  నెమ్మదిగా సాగుతోంది ప్రయాణం. పది మందితో ప్రయాణం కద! ఆడవారు వృద్ధులు మేనాలలో, సైనికులు అశ్వాల మీద, రాకుమారుడు, బంధువులు, అంతఃపుర స్త్రీలతో రధాల మీది, నడవగలిగిన ప్రజలు కాలి నడకన వెడలుతున్నారు.

  ఎంత ప్రయత్నించిననూ మహారాజు, ఇతర రాకుమారులూ రధయాత్ర సమయమునకు చేరుకో లేక పోయారు. ఉత్తరాన ముసల్మానులు, దక్షీణాన రెడ్డిరాజులు, పశ్చిమాన బహమనీ సుల్తానులు పోరు సల్పుతున్నారు.

  రధయాత్రలో రాచ కుటుంబం, రాజుగారు చేయవలసిన సేవలన్నింటినీ పురుషోత్తమ రాకుమారుని చెయ్యవలసినదిగా ఆదేశం ఇచ్చారు కపిలేంద్రుడు.

  “అయ్యవారూ! ఈ జగన్నాధ స్వామి, ఇక్కడ వెలిసిన స్థల పురాణం చెప్పరా? చాలా మందికి తెలియదు. కాలక్షేపంగా కూడా ఉంటుంది.” నందుడిని అడిగాడు రాచ పరివారంలోని ఒక సైనికుడు.

  “అవునవును..” అందరూ ఏక కంఠంతో పలికారు.

  నందుడు కొంచెం మొహమాటంగా నోరు విప్పాడు. అతడికి వివరాలు బాగా తెలుసును, కానీ ఎన్నడూ ఎవరికీ చెప్పలేదు. ఐతే, భక్తి భావంతో మొదలు పెట్టాడేమో, ధార అలవోకగా సాగి పోయింది.

  “స్కంద పురాణంలో, పురుషోత్తమ మహాత్ముడు చెప్పిన వివరం ఇది. సత్య యుగంలో, ఈ ఆది దేవుడు, నీలమాధవుడనే పేరుతో అడవిలో ఆదివాసీల పూజలు అందుకుంటుండే వాడు.

  ఒక రహస్య ప్రదేశంలో ఉన్న జగన్నాధుడిని, సవరులను పాలించే రాజు, విశ్వావసు ఎవరికీ తెలియకుండా వెళ్లి పూజలు చేసుకుని వస్తుండే వాడట.

  ఆ సమయంలో, అవంతీ నగరం రాజధానిగా కళింగ నేలే చంద్రవంశ రాజు ఇంద్రద్యుమ్నుడికి, అడవిలో వెలిసిన నీల మాధవుని గురించి ఒక యాత్రికుడు చెప్పాడు. ఇంకా వివరాలు అడుగుదామంటే, ఆ యాత్రికుడు కనిపించకుండా మాయమయ్యాడు.

  ఇంద్రద్యుమ్నుడు తన పురోహితుడైన విశ్వపతిని పిలిచి నీలమాధవుని ఆలయం దర్శించి, తెలుసుకుని రమ్మని పంపాడు.

  విశ్వపతి మహానది ఒడ్డున ఉన్న సవరద్వీపవనం వెళ్లి విశ్వావసుని కలిశాడు. విశ్వావసు కుమార్తె లలితని వలచి వివాహం చేసుకున్నాడు.

  ఒక రోజు మామగారిని, తనకి నీలమాధవుడిని చూపించమని అడిగాడు. అల్లుని మాట కాదనలేక, తన ఉనికిని రహస్యంగా ఉంచమన్న దేవుని ఆనతి ఉల్లంఘించలేక, విశ్వావసు, అల్లుని కళ్లకి గంతలు కట్టి తీసుకెళ్లాడు. విశ్వపతి తెలివిగా దారిలో ఆవాలు చల్లుకుంటూ వెళ్లాడు.

  దైవదర్శనం అయాక, ఉపవాస దీక్ష తీసుకుని, రోహిణీ కుండంలో స్నానం చేసి కల్ప వృక్షం కింద కూర్చుని తపస్సు చేశాడు. అప్పుడతనికి ఒక అపురూప దృశ్యం కనిపించింది.

                  

           సీ.  నింగినుండి విడియ నేలకొక వెలుగు         

                           దివినుండి వచ్చిరి దివిజు లందు

                 నారదాది మునులు నలువరాణి సిరియు

                           పరమేశ్వరుడు బ్రహ్మ పార్వతియును

                 ఇంద్రాది సురులును యీప్సితముల కోరి

                           రంభాది యచ్చరల సహితముగ

                 శ్వేతాంబరములను చిన్నిదపు నగల

                           ధరియించి వచ్చిరి ధరకు నంత.

 

                   భక్తినంత మదిని బాగుగా నిలిపియు

                   వినయముగ శిరముల వెలది నుంచి

                   నామము నిరతముగ నాలుక కదలాడ

                   నీల మాధవుని యనిశము కొలువ.

 

  ఆ దృశ్యం కనిన వెను వెంటనే విద్యాపతి అవంతీ నగరానికి వేగిరం వెళ్లి, ఇంద్రద్యుమ్నునికి నీలమాధవుని మహత్యమును వివరించాడు.

  సంభ్రమాశ్చర్యములతో విద్యాపతి చెప్పింది విని, మరికొందరు పరివారం వెంటరాగా సవర వనానికి బయలుదేరాడు రాజు, దైవదర్శనానికై.

  అతడికి మరింత ఆశ్చర్యం కలిగించే సంఘటన జరిగింది అంతలోనే..

  గోప్యతా వాంఛితుడైన నీలమాధవుడు, విద్యాపతి అవంతికి పయనమవగానే మాయమయ్యాడు.

 

                            

 

  మొలిచిన ఆవ మొక్కల సహాయంతో త్రోవ చూసుకుంటూ ఆలయానికి రాగానే, విగ్రహాలు లేని గుడి కనిపించింది.

  ఐతే ఆ తీరమంతా బంగరు ఇసుకతో కప్పబడి ఉంది.

  ఇంద్రద్యుమ్నుడు నిరాశగా నిరాహార దీక్ష మొదలుపెట్టి, అశ్వమేధయాగం చేస్తాడు. నీలాచలం మీద గుడి కట్టించి నరసింహ స్వామిని ప్రతిష్ట చేస్తాడు.

  ఆలయంలోనే నిద్రిస్తుండగా స్వామి కలలో కనిపించి సముద్ర తీరానికి వెళ్లమని ఆదేశిస్తాడు. చాంకీనది ముఖద్వారం దరికి వేప దుంగలు కొట్టుకొస్తాయనీ, వాటితో, జగన్నాదుడు, బలభద్రుడు, సుభద్ర, సుదర్శన చక్ర విగ్రహాలను తయారు చేసి ప్రతిష్టించమని చెప్తాడు.

  దుంగలైతే కొట్టుకొచ్చాయి కానీ, వాటిని విగ్రహాలుగా చెక్కే వాళ్లు కనిపించలేదు.

  రాజ్యంలోని శిల్పులని అందరినీ పిలిపించాడు రాజు. ఎవరికి వారే మా వల్ల కాదంటే మా వల్ల కాదని తప్పుకున్నారు.

  కలతతో ఆ మారాజు, మాధవుడినే స్మరిస్తూ ధ్యానం లోనికి వెళ్లాడు. కళ్ల ముదు నారాయణుడు ప్రత్యక్షమై యజ్ఞం నిర్వహించమని చెప్పాడు.

  ఇంద్రద్యుమ్న మహారాజు, దేశంలోని ఋత్విక్కులను ఆహ్వానించి అద్భుతమైన యజ్ఞం చేశాడు.

  శాస్త్రోక్తంగా జరిగిన ఆ యజ్ఞానికి దేవతలందరూ సంతోషించారు.

  యజ్ఞ పురుషుడు ప్రత్యక్షమై నారాయణున్ని నాలుగు అక్షలలో విశదీకరించి నిర్మించమని ఆజ్ఞాపించాడు. అవి పరమాత్ముణ్ణి వాసుదేవునిలాగా, వ్యూహని సంకర్షణ వలె, యోగమాయని సుభద్ర లాగా మరియు విభవున్ని సుదర్శనం వలె నిర్మించమన్నాడు.  

  ఆ నిర్మాణానికి శిల్పి త్వరలో రాగలడని చెప్పాడు.

 

                కం.   సాక్షాత్తు సుర స్థపతియె

                        యీక్షేత్రము న యడుగిడగ నేమర రాడా

                        వీక్షా సారించి మరీ

                        మాక్షీకముగ విగ్రహముల మలచుట కొరకై.

 

  యజ్ఞనరసింహరాజు చెప్పినట్లే దేవశిల్పి విశ్వకర్మ వృద్ధ బ్రాహ్మణుని వలె ఇంద్రద్యుమ్నుని వద్దకు వచ్చి తాను విగ్రహాలను చెక్కగలనని అన్నాడు.

  కానీ కొన్ని షరతులు విధించాడు.

  తాను ఒక్కడే ఏకాంతంలో పనిచేసుకుంటానన్నాడు.

 ఎట్టి పరిస్థితులలోనూ, ఎవరూ తలుపులు తీసి లోపలికి రాకూడదన్నాడు.

  ఆహారాది విషయాలకి కూడా తన వద్దకు రావద్దన్నాడు.

  అన్నింటికీ ఒప్పుకుని రాజు, ఆ చిత్రకారునికి పని ఇచ్చాడు. ఆలయం లోపలికి వెళ్లి తలుపులు బంధించమన్నాడతడు.

  ప్రజలతో సహా, రాచ పరివార మంతా కుతూహలంగా ద్వారాల వెలుపల వేచి చూస్తున్నారు. అప్పుడప్పుడు రాజు కూడా, రాణీ తో సహా వచ్చి చూస్తున్నాడు.

  కొన్ని రోజులు లోపలి నుంచి శబ్దాలు వినిపించాయి.

  తరువాత ఆ శబ్దాలు ఆగిపోయాయి. అందరూ ఆందోళనగా, ప్రాకారం బైట నిలబడి వేచి ఉన్నారు.

  మరి కొన్ని రోజులు గడిచాయి.

  రాజుగారు, రాణీగారు వచ్చి సంగతి విచారించారు.

  “ప్రభూ! ఆ శిల్పికి లోపల ఏదయినా అస్వస్థత కలిగిందంటే.. లేదా ప్రాణాపాయం కలిగినా, ఆ పాపం మనకి చుట్టుకుంటుంది. శిల్పాలు చెక్కుతుంటే శబ్దం రావాలి కదా?” రాణీగారి మాట విని రాజుకూడా వ్యాకులత చెంది. తలుపులు తెరవమని ఆజ్ఞాపించాడు.

  తలుపులు తెరిచి లోపలికి ప్రవేశించగానే ఎదురు పడ్డ దృశ్యం రాజుని, రాణీని కలవర పరచింది.

  తన షరతుని అతిక్రమించిన ఇంద్రద్యుమ్నునికి కనిపించడం ఇష్టం లేక విశ్వకర్మ మాయమయ్యాడు. జగన్నాధ, బలభద్ర, సుభద్రల విగ్రహాలు, చేతులు, కాళ్లు లేకుండా ఉండి పోయాయి.

  వ్యాకులతతో వెనుతిరిగిన రాజుని, కలలో జగన్నాధుడే ఓదార్చి, అదే ఆకారములతో ఈ ఆలయంలో ఉండదలచుకున్నానని చెప్పాడు.

  “రాజా! అందుకనే శిల్పాలు ఆ స్థితిలో ఉండగా మిమ్మల్ని తలుపులు తెరిచేట్లు ప్రేరేపించాను. ఇదంతా నా సంకల్పమే. నువ్వు కలత చెందవద్దు. ఈ విగ్రహాలనే ప్రతిష్టించి పూజలు సలుపు?”

  ఇంద్రద్యుమ్న మహారాజు, అవే విగ్రహాలని ప్రతిష్టించాడు. పూరీ జగన్నాధ ఆలయం ఆ విధంగా ప్రసిద్ధి చెంది భక్తుల సందోహంతో కలకలలాడుతూ ఉంటుంది.”

  నందుడు పూరీ ఆలయం గురించి వివరించగానే అందరి మనసుల్లోనూ భక్తి పెల్లుబికింది. ఉత్సాహంతో, ఎప్పడెప్పుడు జగన్నాధుని చూద్దామా అని ముందుకు నడవసాగారు.. ఆ స్వామిని మనసారా కొలుస్తూ.. పాటలు పాడుతూ.

         

           కవిరాజవిరాజితము:  

   

          1.    పదపద ముందుకు పాటలు పాడుచు

                           పాదము లన్నియు బాగుగనే

                 తదిగిణ తోం తకతాం తకతోం యని

                           తప్పెట తాళము దంచగనే

                 ముదముగ నెంతను మోకరిలంగను

                           ముచ్చట గొల్పగ మోదమునే

                 సదమలమౌ మన సామిని కొల్వగ

                           సామముగా చన సారమునే

          2.    మది తలచేముగ మాదొరనే మరి

                           మాటికి నామము మాధవునే

                 కదడుకొనంగను కాలిడి సాగగ

                           ఖంగు మనే తమ గజ్జెలనే

                 వదలకనే నడవంగ మనం మధు

                           పమ్ముల సవ్వడి వాడిగనే

                 కదలెదమే మరి గట్టిగ సేయగ

                           గానము నంతను ఖాసమునే||

 

  ముందుగా నడుస్తున్న వారిలో ఒకతను పెద్దగా పాడడం మొదలుపెట్టాడు.

  ఎక్కడి నుంచి తీశారో.. డప్పులు, బూరాలు చేతుల్లోకి వచ్చేశాయి. ఒక చరణం సూత్రధారి పాడగానే మిగిలిన వారు అదే అందుకుని పాడుతున్నారు.

  రథయాత్రకై, కటకం నుంచి పూరీ వరకూ రాచ పరివారం యాత్ర సాగింది.

  

  మాధవుడు, పురుషోత్తమదేవుని రథం పక్కగా గుర్రాన్నినడిపిస్తున్నాడు.

  పూరీ నగరం దగ్గర పడుతోందనగా, రథం ఆపి, మాధవుని తన రధం మీదకి ఎక్కంచుకున్నాడు రాకుమారుడు. మాధవుని గుర్రాన్ని, కాలినడకనున్న ఒక సైనికుడు అందుకున్నాడు.

  “మాధవా! కాంచీపురం నుండి రాయబారి వస్తున్నాడు కదా?”

  “అవును ప్రభూ! వారి మంత్రులలో ఒకరు వచ్చి ఉంటారు. వారికి సరైన వసతి గృహం ఏర్పాటు చెయ్యమని చెప్పాము.”

  “ఈ కోలాహలంలో వారికి సరైన మర్యాద జరుగక పోవచ్చును. నువ్వే దగ్గరుండి చూసుకోవాలి సుమా!”

  “అలాగే దేవా! నేను స్వయంగా ఆ ఏర్పాట్లు చూస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి.” ముందు రథం మీదనున్న కాదంబరీ దేవిని ఓరకంట చూస్తూ అన్నాడు మాధవుడు.

  “ఈ రథయాత్ర మనిద్దరికీ ఒక పరీక్షయే. ఫలితాలు ఎవ్విధంగా ఉంటాయో వేచి చూడ వలసినదే!” సాలోచనగా అన్నాడు పురుషోత్తముడు.

                                       ……………….

 

......మంథా భానుమతి