Facebook Twitter
‘‘అజ్ఞాత కులశీలశ్య….” 23వ భాగం

 ‘‘అజ్ఞాత కులశీలశ్య….” 23వ భాగం

  పురుషోత్తమదేవుడు, పరివారంతో పూరీ  పట్టణం చేరే సరికి జ్యేష్ఠ బహుళ చతుర్దశి వచ్చింది.

   మరునాడే అమావాస్య.. నూతన దేవతా మూర్తుల నేత్రోత్సవం జరిగే రోజు. పూజలు మామూలుగా జరుగుతాయి. మరునాడు ప్రజలకు నవయవ్వన దర్శనం.

  ఆలయంలో పూజల ఏర్పాట్లు జరుగుతుండగానే రాచ పరివారం వారి వారి వసతి గృహాలలో కుదురు కున్నారు.

  పూరీ పట్టణం అంతా జన సందోహంతో కళకళ లాడుతోంది. ఎక్కడెక్కడి వారూ, బళ్లలో, గుర్రాల మీద, కాలి నడకన వస్తున్నారు. ప్రధాన రహదారి అంతా మామిడాకులతో, పూల తోరణాలతో అలంకరించారు. నగరంలోని అన్ని ధర్మ సత్రాలు, పూటకూళ్ల ఇళ్లు నిండి పోయి, ఖాళీ ప్రదేశాలలో డేరాలు వేసుకుని స్థిర పడ్డారు.

  అంత మంది జనం ఉన్నా.. ‘మనిమా’ (జగన్నాధా) అంటూ క్రమశిక్షణతో వ్యవహరిస్తున్నారు. వారందరికీ సదుపాయాలు చూడడానికి సేవా సమితి ఉంది. అందులోని స్వచ్ఛంద సేవకులు నిరంతరం తిరుగుతూనే ఉంటారు. ఆలయంలోనే ప్రజలందరికీ భోజన ఏర్పాట్లు జరుగుతాయి.

  పాడ్యమి రోజున కాంచీపురం నుంచి మంత్రి వరదయ్య వచ్చారు. వస్తూనే అక్కడి కోలాహలాన్ని చూసి సంభ్రమంతో కన్నులు తిప్పుకో లేకపోయారు.

  వరదయ్యగారికి, మాధవుడి కుటుంబం ఉన్న దగ్గరే విడిది ఏర్పాటు చేశారు.

  జనంలో కలిసి పోయి, పురుషోత్తముడు ఎటువంటివాడో కనుక్కుంటున్నాడు వరదయ్య.

  తృప్తిగా రాత్రి నిదురించాడు.. రథయాత్ర సంబరాలు చూడడానికి సంసిద్ధ మౌతూ.

  

                      

  ఆషాఢ శుక్ల విదియ.. ఏడాదిగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది.

  పాండాలు సూర్యోదయానికి ముందే లేచి పూజలు నిర్వహించారు. ‘మనీమా..’ అని పెద్దగా అరుస్తూ విగ్రహాలని కదిలించారు. పహండీ ఉత్సవం ఆరంభమయింది.

  ప్రధాన రహదారి వద్దకు తీసుకుని వచ్చి, రథాల వెనుక భాగం నుంచి అలంకరించిన రత్న పీఠముల మీద సుభద్ర, బలభద్ర, జగన్నాధులని ఆసీనులని చేశారు.

  ఆదిదేవుడు రథారూఢుడయ్యాడు. ఇరు ప్రక్కలా నున్న రథాలలో భగినీ, అగ్రజులు..

  

  ఒక్క సారిగా కోలాహలం మొదలయింది. మనీమా అని అరుస్తూ భక్తులు ఆవేశంతో ఆనంద తాండవం చేస్తున్నారు.

  ఆనవాయితీగా వచ్చే రాజుగారి బదులుగా సాక్షత్ విష్ణు స్వరూపులైన రాకుమారులు పల్లకీలో, పరివారంతో వచ్చేశారు.,బాజా భజంత్రీలు మారు మ్రోగాయి. ప్రజల సంభ్రమం పెచ్చు పెరిగింది.

  రాచకుటుంబం ముందుకు నడిచింది, ప్రజలంతా దారి నివ్వగా. మాధవుడు, పురుషోత్తముని వెనుకే ఉన్నాడు అప్రమత్తుడై. నంద, గౌతమిలు, సీతమ్మతో సహా ఆ పరివారంలోనే ఉన్నారు.

  కాంచీపురం నుంచి వచ్చిన వరదయ్య మంత్రి మాధవుని వెనుకనే ఉన్నాడు.. కన్నుల పండువగా జరుగుతున్న ఉత్సవాన్ని వీక్షిస్తూ.

  సీతమ్మ ఆనందానికి అవధుల్లేవు. ఇంత దగ్గరగా జగన్నాధుని వీక్షించ గలగడం.. జన్మ ధన్య మయిందనుకుంది. భక్తులందరూ, కులమత భేదాల్లేకుండా వినమ్రతతో రథాలకి ఇరు ప్రక్కలా, రహదారి మీద వేచి ఉన్నారు... జయజయ ధ్వానాలతో.

   రాకుమారుడు పురుషోత్తమ దేవుడు పల్లకీ దిగి, భక్తులందరికీ అభివాదం చేశాడు.

  పదహారు కళలతో వెలుగొందుతూ, ఆదిదేవుని ప్రతిరూపంలాగే, విష్ణు స్వరూపుని వలెనే ఉన్నాడు. కాకుంటే ఇతడు పచ్చని పసిమి.. నీల మాధవుడు నల్లన.

  పూజారులు వేద మంత్రాలుచ్ఛరిస్తూ ఉండగా, మంగళ వాద్యాలు మ్రోగుతుండగా పురుషోత్తమ దేవుడు స్వామి రథం వద్దకు నడిచాడు.                       

 

                              

  లోకాలనేలే పరమాత్మునికి, దేశాన్నేలే రాజు సేవకుడైనాడు. రథాన్ని అదిరోహించి, బంగరు పిడిగల చీపురు నందుకున్నాడు. స్వయంగా రథం లోపల జాగ్రత్తగా, ఎక్కడా దుమ్ము ధూళి కనబడకుండా తుడిచాడు.. మరీ మరీ. సవినయంగా, భక్తి ప్రపత్తులతో.

  అదే.. ‘చెరా పహారా’ సేవ.

  భక్తుల సందడి మిన్నంటింది.

  కాంచీపుర రాయబారి వరదయ్యకి మాత్రం ఒడలంతా కారం రాచుకున్నట్లయింది.

  రాకుమారుడు, కాబోయే మహారాజు, చీపురు పట్టుకుని ఊడవడమా! ఎక్కడయినా, ఎన్నడయినా. ఎవరైనా కన్నారా? కనగలరా? చిరచిర లాడుతూ పక్కకి జరిగి తలతిప్పుకున్నాడు.

  ఆ హడావుడిలో ఎవరు పట్టించుకుంటారు అతడినీ, అతడి భావాలనీ..

  కన్నుల పండువలా జరుగుతున్న ఉత్సవాన్ని తిలకించడంలో మునిగి పోయారు.

  జగన్నాధ రథయాత్ర ప్రారంభ మయింది.

  జగన్నాధుని రథం పేరు ‘నందిఘోష’, సారధి దారుకుడు.

  బలభద్రుని రధం ‘తాళ ధ్వజం’.

  సుభద్రాదేవి రధం ‘దేవదళం’.

 

          సీ.      నగరి యా యది మరి నడచుచున్న నగమా

                          యని భ్రాంతి తోడనే అందరు కన

                   జగమేలు సామియే జనుల మనమునందు

                           నాల్కలందును కూడ నాను తుండ

                   సొగసైన సోదరి, సోదరు కూడియు

                           తాదాత్మ్య మొందుచూ తరలి రాగ

                   అటునిటు నడయాడ యవె రెండు రథములు,

                            నందిఘోష యనెడి నరద మొకటి

 

       ఆ.వె.     ఆది విష్ణు తాను యధిరోహణము చేసె

                   అన్న చెల్లి కలసి యంత గాను

                   జయజయ ధ్వనులవె ఝంపె తాళము తోను

                   వెనుక రమని వదలి వెడలె తాను.

 

  ఈ యాత్రలో లక్ష్మీ దేవిని పాల్గొన నియ్యరు. దానికి ఒక కమ్మని కథ చెప్తారు. రథయాత్ర అరకోసు దూరంలో ఉన్న గుండీచా ఆలయం వరకూ సాగుతుంది. గుండీచా ఆలయం జగన్నాధుని, తోట విడిది. అరటి, కొబ్బరి మొదలైన చెట్ల మధ్యలో ప్రశాంతంగా ఉంటుంది.

  

                                  

గుండీచా ఆలయంలో, ప్రధాన ఆలయంలో లాగ బ్రాహ్మణేతరులు కాకుండా బ్రాహ్మణ పూజారులు పూజలు సల్పుతారు. దేవదాసీలు తమ నాట్యాలతో స్వామిని అలరిస్తారు. తాము గోపికలై గీతగోవిందంలోఅష్ట పదులు పాడుతూ నాట్యం ఆడుతూ ఉంటారు.

  మూడవ రోజును హీరా పంచమి అంటారు. ఆ రోజున, తనని ఇంట్లో వదిలేశారని కోపగించిన లక్ష్మీదేవి, సువర్ణ లక్ష్మిగా వస్తుంది గుండీచా గుడికి. అలంకరించిన పల్లకీలో భక్తులు తీసుకు వస్తారు ఆది లక్ష్మిని. అక్కడి పూజారులు అమ్మవారిని పూజించి, జగన్నాధుని వద్దకు గుడిలోనికి తీసుకెళ్తారు. ఆది దంపతులిరువురినీ ఎదురెదురుగా కూర్చో పెడతారు.

  ఈ ముచ్చట మనసారా ఆస్వాదించడానికి భక్తులు తండోపతండాలుగా వస్తారు.

  పదుగురిలోనూ స్వామిని తమ నివాసానికి రమ్మని అర్ధిస్తుంది లోక మాత. అంగీకారాన్ని తెలిపి పూల హారాన్ని.. జ్ఞాన మాలని ప్రసాదిస్తాడు స్వామి. గుండీచా గుడినుండి బైటికి వచ్చి, తన అసహనాన్ని, “రథ భంగం” చేయడంలో.. నందఘోషని కొద్దిగా విరగ కొట్టడంలో చూపించి, చింత చెట్టు చాటున దాగుతుంది రమ. వచ్చిన దారి లో కాకుండా, హీరా ఘోరీ బాటలో వెను తిరుగుతుంది మహాలక్ష్మి.. తన కోపానికి స్వామి ఏ విధంగా స్పందిస్తాడో అని భయపడుతూ.

  ఈ విన్యాసాలన్నీ పూజారులు పరమానందంతో చేస్తుంటారు.

  మరునాడు.. షష్ఠి రోజున రథాలని పడమటి దిక్కు నుంచి దక్షిణం వైపుకి బహుదా యాత్రకి అనుకూలంగా తిప్పుతారు. దీనిని దక్షిణ మోడా సేవ అంటారు.

  సప్తమి రోజునుంచి మూడు రోజులు, రాసలీల జరుగుతుంది. జగన్నాధుని రసమండపానికి తీసుకొస్తారు. గీత గోవిందం నుంచి గీతాలు గానం చేస్తూ నాట్యం చేస్తారు దేవదాసీలు, గోపికల వలె అలంకరించుకుని.

 

కవిరాజవిరాజితం (హంసగీతి)

 

           1.          మురళియె మోగెను మోదము కల్గగ

                                 ముద్దుగ నర్తనముం సలిపే

                        కురికొని వచ్చిరి కోరిక చెప్పిరి

                                 గోపిక లందరు ఘోష్టిగనే

                        గిరికొను చుండగ కేళినొనర్చగ

                                 కీర్తనలూ సరి గీతములూ

                        సిరులొలికించుచు చేరిరిగా మరి

                                 సేవలు బాగుగ చేయగనే

           2.          విరులను కూర్చిరి వేడుకగానదె

                                 వెల్లువగా నిడె ప్రేమగనే

                        హరి చిరునవ్వుతొ యానతి నిచ్చెను

                                 నాటలకే సిరి హాసముతో

                        మరులను గొల్పగ మానస మంతయు

                                 మన్నన సేయగ మప్పిడెనే

                         చరణము లన్నియు జాలము సేయగ

                                 చక్కగ నాట్యము సల్పగనే.

 

   మామూలుగా నిశ్శబ్దంగా ఉండే గుండీచా ఆలయంలో ఆ ఏడు రోజులూ శ్రవణాభరణంగా సాగుతుంటాయి గీత నర్తనాలు.

 

  “జగన్నాధా.. పరాత్పరా, మనీమా..” భక్తులు పారశ్యంతో అరుస్తూ ఉండగా, మేళతాళాలతో మొదలయింది జగన్నాధ రథయాత్ర. ఆ రథాలను లాగడానికి పోటీపడి వస్తున్నారు భక్తులు. అరకోసు దూరం.. కానీ, ఒక రోజంతా పడుతుంది గుండీచా గుడికి చేరడానికి.

  రాకుమారుడు కొద్దిదూరం రథం లాగి, పక్కకి తప్పుకున్నాడు. అతడి వెనుకే మాధవుడూ, మిగిలిన పరివారమూ. గుండీచా ఆలయానికి చేరాక, సాయం సంధ్యా పూజలకి వెళ్లి, మరునాడు తిరుగు ప్రయాణం చెయ్యాలని కార్యక్రమం నిర్ణయం జరిగింది. ఎక్కువ రోజులు రాజధానిని వదిలి ఉండరాదు. ఏ క్షణంలో ఏ పక్కనుంచి దాడి జరుగుతుందో చెప్పలేరు.. మహారాజు, మిగిలిన కుమారులు మూడు సరిహద్దులలోనూ దండయాత్రలు చేస్తున్నా కూడా!

  

  సంధ్యా పూజలు పూర్తయాక రాకుమారుని వసతికి వచ్చాడు మాధవుడు.

  “నీ పరివారంతో విశ్రాంతి తీసుకో మాధవా, సూర్యోదయాన్నే బయల్దేరదాం.”

  “మీకు రక్షణ..”

  “ఇక్కడి సైనికాధికారి చూస్తాడు. నమ్మకస్తుడే.”

  “ప్రభూ! రాయబారి, మంత్రి వరదయ్య ఇక్కడి నుంచే తీర మార్గాన వెళ్లిపోతానంటున్నారు కాంచీపురానికి.”

  “అదేమిటి? కొన్ని రోజులు మా ఆతిధ్యమో, లేదా బహుద యాత్ర (జగన్నాధుని తిరుగు ప్రయాణం) అయే వరకూ ఇచ్చటనో ఉంటారనుకున్నానే..” పురుషోత్తముడు ప్రశ్నార్ధకంగా చూశాడు.

  “కాంచీపురం రాజు, వీరి రాకకై చూస్తుంటారు కదా దేవా! రాకుమారి కూడా..”

  “అవునవును. వలసిన ఏర్పాట్లు చూడండి. దారిలో ఆహారానికి సమృద్ధిగా ఉండే టట్లు చూడండి.”

  “రాజుగారికి ఏమయినా పత్రం రాసిద్దామా? అదే.. మన రథయాత్ర గురించి, అందులో రాచ కుటుంబం, రాజుగారు వహించే పాత్ర..” మాధవుడు అడిగాడు. అతనికి వరదయ్య అసంతృప్తత  తెలిసి పోయింది, అతడి హావభావాలతో..

  “అక్కర లేదు. వారు దగ్గరుండి చూశారు కదా! మన భక్తి భావాలు జగద్విదితమే. ఆ పరాత్పరుని సేవలో మనకి కులమత భేదాలు లేవని తెలిసి పోతుంది బాగా. అంత కన్ననూ ఏం కావాలి ఎవరి కైనా!”

  పురుషోత్తమ దేవునికి చాలా తృప్తిగా ఉంది, మహారాజుగారు తనచేత జగన్నాధుని సేవ చేయించి నందుకు. ఈ జన్మమునకు అవకాశం దొరుకుతుందనుకోలేదు, తనకి కళింగ సింహాసనం దక్కుతుందనికూడా ఎన్నడూ ఆశించ లేదు.. అంతమంది సోదరులుండగా. మహారాజుగారి మనోగతం అవగతమయింది కూడా మొన్న మొన్ననే కదా! వారు దండయాత్ర కెళ్లడం, తనకి జగన్నాధుని సేవ దొరకడం అదృష్టమే!

  మాధవుడు కించిత్ ఆందోళనగా వెను తిరిగాడు.

  రాకుమారుడు, కాంచీపురం రాజుకి పత్రం రాసిస్తే ఎంతో సౌకర్యంగా ఉండేది.. తన మనసుకి.

  ఇప్పుడు ఈ వరదయ్య ఏం ప్రమాదం తెస్తాడో..

  ఏదో అనిర్వచనీయమైన భావం అస్థిమితతకి లోనయ్యేలాగ చేస్తోంది మాధవుని.

  పెను ముప్పు రానున్నదా? వేచి చూడవలసిందే!

                                   ………………..

 

......మంథా భానుమతి