Facebook Twitter
‘‘అజ్ఞాత కులశీలశ్య….” 21వ భాగం

 ‘‘అజ్ఞాత కులశీలశ్య….” 21వ భాగం 

“రాకుమారా! నేను మంత్రినా?”

  “అవును మాధవా! మంత్రివవకూడదా? ఇప్పుడు నువ్వు చెయ్యవలసిన ఒక బృహత్ కార్యం ఉంది. పద్మావతీ దేవికి నేను మాట ఇచ్చాను. మా ఇద్దరి కళ్యాణం తప్పక జరుగుతుందని. ఆ వాగ్దానం నెరవేర్చ వలసిన బాధ్యత నీదే. ఏ రీతిగా చేస్తావో మరి.”

  నది ఒడ్డున కలిసిన రాకుమారితో ఏకాంతంగా మాట్లాడాడు పురుషోత్తముడు. త్వరలో రాయబారిని పంపి రాజుగారితో విషయం చెప్తానని మాట ఇచ్చాడు.

  తన తండ్రికి ఎటువంటి అభ్యంతరం ఉండబోదని చెప్పింది పద్మావతీ దేవి.

  “కాంచీపురం రాజుగారి వద్దకు కళింగ రాయబారిగా వెళ్లాలి. మా కళ్యాణం జరిపించాలి.”

  ఇరవై సంవత్సరాలు ఇంకా పూర్తిగా నిండలేదు. లౌక్య సంభాషణ రాదు. అందునా రాజుగారి వద్దకు..

  “రాకుమారా! నేనేమిటి.. రాయబారం ఏమిటి? నా కసలు సరిగ్గా మాటలాడడం రాదు. ఏదో మా పూటకూళ్ల ఇంటికి వచ్చినవాళ్లతో నాలుగు కబుర్లు చెప్పడం తప్ప.” మాధవుడు బెదురు కన్నులతో అటునిటు చూస్తూ అన్నాడు.

  ముద్దుమోముతో ముచ్చటగా కనిపించాడు మాధవుడు. తనకి ఒక అనుజుడుంటే ఈ బాలుని వలెనే ఉండే వాడేమో! కానీ తప్పదు. రాజుగారి వద్దకు పంపాలిసిందే. పురుషోత్తముడు తప్పదన్నట్లు తల నిలువుగా ఊపాడు.

  మాధవునికి ఒకింత ఉత్సాహము, ఒకింత సందేహము..

  అందుకే అన్నాడు..

 

                 కం.  “ఆనతి మీరను సాధ్యమ

                          యేను హితుడ నదియు కాక భృత్యుడ గాదా

                          కానగ కళ్యాణమునకు

                          నేను ప్రయత్నము సలిపెద నిక్కము మిత్రమా!”  

 

  “రేపే వారి సభలోనికి అనుమతి సంపాదించెదము.”  చిరునవ్వుతో అన్నాడు పురుషోత్తముడు.

  వారితో వచ్చిన అనుచరులిరువురికి ఆపని అప్పజెప్పి, స్నేహితులిద్దరూ, తమతమ అశ్వాల మీద కాంచీపురం అందాలు చూడడానికి బయలుదేరారు. దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం పల్లవరాజులు తమ రాజధానిని చేసుకుని, అనేక ఆలయాలు నిర్మించిన పట్టణం.

  విద్యా బోధనలో, విద్వాంసులను తయారు చెయ్యడంలో కాశీ పట్టణమంత ప్రాముఖ్యతను పొందింది.

  ఏకాంబరేశ్వరుని ఆలయంలో గాలిగోపురం, వెయ్యి స్తంభాల మండపం నిర్మితమౌతున్నాయి. విజయనగరరాజుల సామంతులు కూడా ఆలయనిర్మాణాల మీద శ్రద్ధ వహిస్తున్నారు.

  కామాక్షీ దేవి కంచిని కాపాడుతూ ఉంటుందని అంటారు. అందుకే పల్లవులనుంచి, చోళులకి, చోళుల నుంచి రాయలుకీ రాజ్యం మారినా, ఆలయాలు చెక్కు చెదరలేదు.

 

          అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా

          పురీ ద్వారావతీ చైవ సప్తైతే మోక్షదాయికా!

 

 భారత దేశంలోని సప్త మోక్షపురులలో కంచి ఒకటి. అతి ప్రధానమైన శక్తి క్షేత్రం.

 మాధవ, పురుషోత్తములు ఆలయాలను దర్శించుకుని, తమ వసతిగృహానికి చేరుకున్నారు.

  భోజనానంతరం, రాజ్య సభలో వినిపించవలసిన వివరాలను పత్రం మీద రాసుకుని, విశ్రాంతి కుపక్రమించారు.

                                        ……………….

 

  “రాకుమారా! ఉద్యానవనమునకా? సాయం సంధ్య వీక్షణకా?” అశ్వాలనెక్కుతూ అడిగాడు మాధవుడు.

  “రెంటికీ..”

  “రాకుమారి వస్తున్నారా?”

  చిరునవ్వే సమాధానమయింది.

  “కొద్ది పరిచయంలోనే సన్నిహితులైనట్లున్నారే.. నేను మీ వద్దనే ఉండాలి మరి. రక్షకునిగా. చెవులు మూసుకుని కన్నులు బాగుగా తెరుస్తా.” మేలమాడాడు మాధవుడు.

  మాటల్లోనే ఉద్యానవనం వద్దకు చేరారు.

  రాకుమారి, చెలికత్తెలు వటవృక్షం కింద ఆసనాల వలే పేర్చిన రాళ్ల మీద కూర్చున్ని ఉన్నారప్పటికే.

  ఆకుపచ్చని చీని చీనాంబరాలలో వనలక్ష్మివలే మెరిసిపోతోంది రాకుమారి.

  పురుషోత్తమదేవుని రాక చూసి, చెలికత్తెలు తప్పుకున్నారు పక్కకి. పద్మావతీదేవి, లేచి నిలుచుని అభివాదం చేసింది. మాధవుడు, రాకుమారుడు కనిపించేటట్లుగా కొద్ది దూరంలో అప్రమత్తుడై నిలుచున్నాడు.

  పురుషోత్తముడు తన ఆలోచనని పద్మావతికి చెప్పాడు.

  “మీ తండ్రిగారే మందురో చూసి, మేము ఎల్లుండి తిరుగు ప్రయాణం సాగించెదము.”

  “మరి నా మాటేమిటి రాకుమారా” వణుకుతున్న కంఠంతో అడిగింది పద్మావతి.

  “రాజుగారి స్పందన మీద ఆధారపడి ఉంది. వారు సరేనంటే పెళ్లి వారమై వస్తాము. మిమ్మల్ని తోడ్కొని వెళ్తాము.”

  “కాదంటే..” రాకుమారి కన్నుల నిండా నీరు..

  “సమరమే!”

  “వద్దు రాకుమారా! నన్నొక్కదాన్నీ తీసుకెళ్లండి. సమరమంటే మళ్లీ జన నష్టం.. ఇక్కట్లు. శ్రీకృష్ణుల వారివలే తీసుకెళ్లండి. ఎవరేనా అడ్డు వస్తే వారితో యుద్ధం..” సిగ్గుపడి ఆపేసింది పద్మావతి, పురుషోత్తముని అనురాగపు చూపుల కని.

  “అటులనే.. దేవిగారి ఆనతి”

                                 …………………

 

                    

 

  “రాకుమారా! మన కర్తవ్యం?” మాధవుని వంక సాలోచనగా చూశాడు పురుషోత్తముడు.

  “రాజుగారి రాయబారిని ఆహ్వానిద్దాము. పత్రం రాశాను. మన అనుచరుని చేత పంపుదాము.”

  మాధవుడు, పురుషోత్తమ దేవుడు తిరుగు ప్రయాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ముందు రోజు, రాజ్య సభలో మాధవుడు, పురుషోత్తముని గురించి చెప్పి, రాకుమారి పద్మావతికి తగిన వరుడని వివరించి, వివాహమునకు అంగీకరించ వలసినదిగా కోరాడు.

  పురుషోత్తమదేవుని ప్రతిభ గురించి విని ఉన్న రాజు అంగీకారం తెలిపే లోపుగానే, మంత్రి సమూహంలోని ఒక మంత్రి లేచాడు..

  జరగబోయే సంఘటనలకి.. అవి మంచి అవనీ, చెడు అవనీ, ఎవరో ఒకరే కారణ భూతులవుతారు. దాని ఫలితం అనేక మంది అనుభవిస్తారు. రావణాసురిడి వధకి, లంక నాశనానికీ శూర్ఫణఖ లాగా.

  “రాజా! వినికిడి మాటలని బట్టి కన్యని ఇచ్చుట అంత సమంజసనీయం కాదు. మనలో ఎవరైనా కళింగదేశం వెళ్లి, అక్కడి స్థితి గతులని చూసి నిర్ణయించాలి. వివాహముల యందు తొందరపాటు పనికిరాదు.”

  రాజుకి ఆ సలహా నచ్చింది.

  “సరే మంత్రి వర్యా! ఈ మాటే వారికి అందజేయండి. కపిలేంద్ర దేవులు ఆహ్వానం పంపుతే, మీరే వెళ్లి రండి. ఆ పిదపనే వివాహం చేద్దాము.”

  సభలో జరిగినదంతా మాధవుడు పురుషోత్తమునికి చెప్పాడు. ఆ సమయానికి.. చెప్పినప్పుడు  కిమ్మనకుండా, ప్రయాణమౌతున్న రాకుమారుని చూసి ఆ ప్రశ్న అడిగాడు మాధవుడు.

  “ఐతే. జగన్నాధుని ఉత్సవాలప్పుడు రమ్మందాము రాకుమారా! అప్పుడు మన వైభవం కళ్లకి కట్టినట్లు కనిపిస్తుంది.” అనాలోచితంగా, అడక్కుండా సలహా ఇచ్చాడు మాధవుడు.

  పురుషోత్తమునికి మంచి సలహా వలెనే అనిపించింది. తన పత్రంలో ఆ సంగతి కలిపి, అనుచరునికి ఇచ్చి, మహారాజుకి అందజేసి రమ్మని ముందుకు కదిలాడు, మాధవునితో.

  తిరుగు ప్రయాణంలో అతి తక్కువ మజిలీలతో, వారంరోజుల లోగానే చేరుకున్నారు కటకం. చేరిన వెంటనే జగన్నాధుని రథయాత్ర ఉత్సవాలకి సన్నాహాలు మొదలయ్యాయి.

  కపిలేంద్ర దేవుని ఆనందానికి హద్దుల్లేవు.

  అనుకున్న విధంగా కాంచీపుర రాజుతో సంబంధం కలుస్తోంది. విజయనగర దేవరాయల్ని ఓడించడానికి, రాజ్యం ఆక్రమించడానికి చిన్నదైనా అవకాశం దొరుకుతుంది.

  

  “ఈ జగన్నాధుని రధయాత్ర ప్రాముఖ్యమేమిటి తండ్రీ? ఈ సారి రాకుమారినితో నేను కూడా వెళ్తున్నాను పూరీ.”

  “పూరీ జగన్నాధుని ఆలయంలో ఉన్న శ్రీకృష్ణ, బలభద్ర, సుభద్రల విగ్రహాలను, తొమ్మిది రోజులు గుండీచా ఆలయానికి ఆ తరువాత మౌసీమా దగ్గరకి, తీసుకెళ్తారు, మూడు రధాల్లో. ఈ రధాలను భక్తులు లాగుతారు. రధం లాగడం ప్రధాన సేవ కింద.. అది లాగడం అదృష్టం అన్నట్లు భావిస్తారు. ఆ భక్తులని జగన్నాధుడు కరుణతో చూస్తాడని నమ్మకం.

  ఏ ఆలయం లో నైనా మూల విరాట్టుల విగ్రహాలు రాతితో చేస్తారు. జగన్నాధుని ఆలయంలో చెక్కతో చేసి ఉంటాయి. విష్ణుమూర్తి పక్కన అన్ని ఆలయాల లో  శ్రీదేవి, భూదేవి ఉంటారు. కానీ ఆది విష్ణువు ఇక్కడ కృష్ణుడై, బలరామ, సుభద్రలతో కొలువై ఉన్నాడు.ఆ విగ్రహాలను స్వయంగా విశ్వకర్మే చెక్కాడట.

  ఈ గుడిలో సుదర్శన చక్రాన్ని పూజించడం మరొక ప్రత్యేకత.


 

                                   

 

                                అన్నా చెల్లెలి బంధం

                                కన్నార కనగ బలభద్ర కన్నయ్య లనూ

                                చెన్నారు సుభద్ర నడుమను

                                పొన్నారిగ విశ్వకర్మ పొడమెను బాగా.

       

  జగన్నాధుని గురించి వేదాలలో చెప్పలేదంటారు. దశావతారాలలో చేర్చ లేదు. అవతారాల అవతరణకే కారణ భూతుడని అంటారు. కానీ.. కొన్ని ఒరియా గ్రంధాలలో తొమ్మిదవ అవతారం కింద వర్ణించారు. అందుకనే నేమో.. బౌద్ధులు కూడా జగన్నాధుని కొలుస్తారు. హిందూ విధి విధానుసరణ ప్రకారం పూజలు కూడా జరగవు. బ్రాహ్మణేతరులు పూజలు నిర్వహిస్తారు. కొందరు ఆదివాసీల ఆరాధ్య దైవమని కూడా  చెప్తారు.

  విగ్రహాలు రత్న వేదిక మీద వెలసి ఉంటాయి. ఆ మూర్తులని ఆరడుగుల వేప కొయ్యలతో చేశారు. చతురశ్రాకారంలో ఉన్న మోములు, త్రికోణాకారపు తల. పెద్ద కన్నులు. జగన్నాధుని మోము నలుపు, బలభద్రుడు తెలుపు, సుభద్ర పసుపు పచ్చ రంగుల్లో ఉంటారు.”

  మాధవుడు అడిగిన ప్రశ్నకి నందుడు సమాధానం చెప్పాడు.

  “శిలలతో చేసినవి, లోహంతో చేసినవి చూశాం కానీ కొయ్య విగ్రహాలని ఆలయాలలో ఎక్కడా చూసినట్లు లేదు కదా నాయనగారూ?”

  “అవును. అడవులలో కోయదొరలు పెద్ద పెద్ద విగ్రహాలను చేసి వాళ్ల గూడేల మధ్యలో పెట్టుకుని పాటలు, నృత్యాలతో పూజిస్తారని విన్నాం. కానీ నాగరిక పట్టణాలలో పూరీ ఆలయమే ప్రసిద్ధమయింది.. ఇటువంటి ఆగమ శాస్త్రంతో.”

  “ఏది ఏమైనా కళింగ ప్రజల ఆరాధ్య దైవం పూరీ జగన్నాధుడు. రాజుగారితో రధయాత్రకు వెళ్లబోతున్నావు. ఎంతటి అదృష్టమో కన్నయ్యా!” సీతమ్మ మురిసిపోతూ అంది.

  “మనం అందరం వెళ్దాం అమ్మమ్మా! రాకుమారుడిని అనుమతి అడుగుతాను. రెండు రోజులు వసతి గృహానికి సెలవు ప్రకటిద్దాము.”

  “సెలవు అవసరం లేదు. సంభారాలు బయట పెట్టి సేవకులని చూసుకోమందాము. గత కొన్ని సంవత్సరాలుగా వారికి నేర్పించాము కదా!” నందుడు ఉత్సాహంగా అన్నాడు. రాజుగారి పరివారంతో రధ యాత్రకి అంటే.. మాటలా మరి..

                                         ……………….

 

 

......మంథా భానుమతి