Facebook Twitter
సం'కీ'ళ్ళు(కవిత)

 

సం'కీ'ళ్ళు


పరుగలిడకుండా ఆపే కాలి బంధనాల
తాళం చెవిని గీయాలిపుడు
ఉన్నవవే కదా నేటి కాలపు కుదుపులలో..
అందుబాటు లేని అవసరాల కట్లలో నుంచి,
బంధాల పునాదులతో నిర్మించిన జీవితపు వసారాలో కాళ్లు పెట్టి ,
ఊహల వెలుగులలో కళ్లు మరింత మిటకరించి..
నిను వెక్కిరించే వింత లోకాన్ని విసురుగా చూస్తూ,
తలపుల తలుపులకు గడియ పెట్టి,
నీదేదో దొరుకుతున్న ఆశల వలువలను సరిచేసుకుంటూ..
అడుగు ముందుకు పడాలనే అద్భుతాన్ని అసాధ్యమనుకోక
అప్పుడప్పుడు తడిచే కనులకు
ఇప్పుడిప్పుడే గీస్తున్న పొడి చిత్రలేఖనపు నమూనాకి తగలకుండా..
బాధ్యతల రహదారిపై ఊసుల ఊయలలో ఊగలనుకునే బాటసారీ,
తెంచుకోవోయ్ సంకెళ్లు..
గీతగీసి
రాత రాసి
కూత వేసి
తనివితీరా నడవాలనిపించే నీ రహదారిపైకి,
తాళపు నమూనాని సిద్ధం చేయవోయ్
అలపుల అలల్ని తుడిచేయవోయ్
నీ లోకానికి పరుగులిడవోయ్
నీ పరుగులకి లోకాన్ని సిద్దం చేయవోయ్
నీ సత్తువ లోహాన్ని కరిగించవోయ్..
అది జరిగే వరకూ నిదురించకోయ్!!!!

 

 

 

 

 

-రఘు ఆళ్ల