Facebook Twitter
మెరీనాబీచ్ - డాక్టర్ మణిగోపాల

మెరీనాబీచ్


- డాక్టర్ మణిగోపాల

 

మొబైల్ పక్షులు

నగరం నిండా పక్షులు

ఒక్కో కువకువనీ చిదుగులా ఏరుకొచ్చి

మాటల గూడు కట్టుకున్న పక్షులు

హలో రాగాల హంసధ్వనుల నుంచి

బైబై ముక్తాయింపుల ఆనందభైరవులు!

 

ఉదయం నేర్చిన మెలకువల్లోంచి

ఉరుకుల తీసే జీవితాన్ని

మాటల గారడీతో మలుపు తిప్పే పక్షులు

తలకిందులుగా తపస్సు చేసే గబ్బిలాల్లా

బెల్టు కొమ్మలకు వేలాడేవి కొన్ని!

చొక్కా జేబుల్లో వాలి

మన గుండె చప్పుళ్ళు వినేవి కొన్ని!

ఈ పక్షులు నగరంలోకి వలసొచ్చాక

కరచాలన స్పర్శ ఎలా ఉంటుందో మర్చిపోయాం!

 

సాయంకాలాలు చెరిసగమై టీ కప్పులు

ఇప్పుడెక్కడా కనిపించవు.

ఎదురింట గుమ్మమే అయినా....

ఎన్నాళ్లవుతోందో ఎదురుపడి!

నెంబరు నొక్కితే చాలు.....

రెడీమేడ్ కబుర్లు సిద్ధం!

ఇన్ కమింగ్ స్వప్నాలు ఫ్రీ!

 

కర్ణుడు కవచకుండలాతో పుట్టినట్లు

మనతోపాటు ఇవీ పురుడోసుకుంటాయి

ఏ రాగంలో కావాలంటే

ఆ రాగంలో మేల్కొలుపుతాయి

రోడ్డు పక్కగా నడుస్తున్న వాళ్లం

ఒక్కసారిగా రిమోట్ నొక్కినట్టు ఆగిపోతాం

జేబుగూటిలోంచి జేగంటల రొద

నగరంలో ఉన్నా నల్లపూసైపోయిన మిత్రుని గొంతులో

తడిలేని పలకరింపు!

 

బిజీ షెడ్యూళ్ళని వల్లెవేసుకునే

బడాయి మాటల బాతాఖానీ!

 

లక్షలాది అడుగుల నడుమ

ఒంటరి పక్షిలా తిరుగుతుంటాం

మనకు తోడుగా

చెవికీ చేతికీ నడుమ

రెక్కలు విప్పుకొనే మొభైల్ పక్షులు

సాయంకాలమైనా గూటికి చేరవు

 

మన మిత్రుణ్ణి

మనకు కాకుండా చేశాయివి

 

మన కలయికల్ని

మాటలతో సరిపుచ్చేశాయివి

 

మాటల్ని అరచేతిలో

పెట్టి మన నోళ్ళు నొక్కేశాయివి

 

ప్రపంచాన్ని చేరువగా తెచ్చి

మన ప్రయాణాల్ని ఆపేశాయివి

 

ఇప్పుడు తెల్ల కాగితాల మీద

అక్షరాల అలికిడి లేదు!