Facebook Twitter
నువ్వే!! -పావనీ సుధాకర్

నువ్వే!!


                                                                                            
-పావనీ సుధాకర్

 

పల్చటి ఉదయం కాలపు ఎండరంగులా

నీ ఉనికి........

నా కనురెప్పల మధ్య

 

స్వప్నంలా చిక్కుకుని,

నీ ఆలోచన్ల రుచి -

 

షాంపేన్ లా మనసుకెక్కి,

నేను ఇంద్రధనస్సుల మీద నడుస్తాను -

నువ్వు వొదిలిపోయిన జాడల్లోకి

నిన్ను తిరిగి తెచ్చుకుంటాను -

గాలి సవ్వడిలో............

నీళ్ళ రుచిలో.....

ఎండ రంగుల్లో.....

ఇప్పుడు....

నీ వునికి కాదు -

నువ్వే!-

 

నీకూ - నాకూ మధ్య!

 

దశాబ్దాల నిశ్శబ్దంలో

మొద్దుబారిన మనసులు -

గాయాలు తగిలినా

రక్తాలు కారవు

హృదయాలు పగిలినా

ముక్కలవ్వవ్-

గొప్ప చిత్రమేమిటంటే !....

అల్లుకున్న అక్షరాల హారాల్ని

మధ్యన పెట్టుకుని,

అపురూపంగా కాపలా కాస్తో......

ఆ చివర నువ్వూ -

ఈ చివర నేనూ

మొహాలకి ముసుగు వేసుకుని -

 

ఏం చెప్పమంటావ్ నన్ను?

 

నేను నిన్ను చర్మం కింద దాచుకున్నాను

వూపిరిలా నింపుకున్నాను

నువ్వు మాత్రం నన్ను -

నీళ్ళలా....

వేళ్ళ మధ్య నించి

జార్చుకున్నావ్

పెదవి చివరి వొంపులో

ముడుచుకున్న దిగులు నీడలో

కంటి చివర,

ఒంటరి చినుకు వొదిలిపోయిన జాడలో

కదుల్తో....

మెదల్తో....

ప్రాణంలా కొట్టుకుంటో

జీవితమంతా పరచుకున్నావ్

ఒఖ్ఖ హృదయాన్ని మాత్రం వొదులుకొని

 

తప్పిపోయి.......

 

ఒక్కో పలకరింపు

ఒక్కోపాట

శబ్దం

నిశ్శబ్దం

మనసుని కలవరపెట్టి

మనిషిని ఒక ప్రపంచంలోంచి

మరో ప్రపంచంలోకి లాక్కెళ్ళిపోతాయ్

తిరిగి రావడవే...

గొప్ప కష్టం!

 

మంత్రించినట్టే....

 

ఈ కనురెప్ప మీద నిద్రవాలదు

గుండె చప్పుడూ కాదు

ఒఖ్ఖ ఆలోచనా రాదు -

నులి వెచ్చని శాలువాలా కమ్ముకుంటో

ఆ పలకరింపు.....

చంపల మీద......

సింఫొనీలా సంతకాలు చేస్తో... ఆ పిలుపు

మాట మాటకీ మధ్య ......

మాటలు దొరకని వెదుకులాటలో

అలసి, దొరికిపోయిన దగ్గరతనం!

బ్రతుకు....బ్రతుకంతా....

ఒఖ్ఖ క్షణపు తిరునాళ్ళలో

తెలిసి, తప్పిపోయి..........

ఒఖ్ఖ మాట రాదు

మౌనవూ కాదు...........

మంత్రించినట్టే....

మెలకువలో

కల కంటో

ఈ కల ఎక్కడ ఎగిరిపోతుందోనని

నిద్రపోడానికే భయపడుతో......

 

ఆ క్షణంలోనో

 

వేళ్ళలో వేళ్ళు జొనుపుకొని,

అడుగుల్లో అడుగులు వేసుకుంటో

చుక్క......

చక్క.....గా......

కవిత్వాన్ని చప్పరిస్తో.....

మత్తులమై.....

వున్మత్తులమై.....

మరో ప్రపంచంలోకి అడుగుపెట్టినపుడు

ఒఖ్ఖ క్షణమే... అయినా

అమరులమై కాలాన్ని ఆపి నిలిపినప్పుడు

చప్పున....

ఉమర్ ఖయాం, సాఖిల చిత్రం గుర్తొస్తుంది.

కీట్స్ చెప్పినట్టు..........

కళ ఎంత శాశ్వతం!

ప్రియతమా! చూడు.......

మనవూ

ఆ చిత్రంలోలా......

ఈ ..... అక్షరాల మలపుల్లో

వేళ్ళలో వేళ్ళు జొనుపుకొని

అడుగుల్లో అడుగులు వేసుకుంటో

ఎంత సేపూ......

ఆ క్షణంలోనే తిరుగుతోంటాం.