Facebook Twitter
స్వప్నలోకం! (కవిత)



స్వప్నలోకం!

 



కనురెప్పలు భారంగా మూసుకున్నాయి,

పెనుచీకటిలో భాగంగా కలిసిపోయాను.

కనుపాపలు కాసేపు కలతగా కదలాడి,

కలల లోకానికింక పయనమయ్యాయి.

 

కలలంటే అవి కలలు కావు…

ప్రతి కలా ఓ ప్రతీకే!

కష్టమేదో వీడినట్టు, కోరీకేదో తీరినట్టు,

భయాన్ని జయిచినట్టు, అభయమేదో పొందినట్టు…

తలపులన్నీ అలా తనువు దాల్చాయి.

గుర్తుండాలే కానీ ప్రతి కలా ఓ కావ్యమే!

ప్రతి ఒక్కరం కాళిదాసంతటి వారమే!

 

కల-కాలం మధురమైన కలలా సాగాలని,

అనుకుంటూ ఉండగానే మెలకువ వచ్చేసింది.

కళ్లు నులుముకుని చూస్తే ఎదురుగ ఉందేమిటి?

వీడని కష్టాలు, తీరని కోరికలు,

వెంటాడే భయాలు, దక్కని అభయాలు,

నా తనువులో భాగమైన కఠిన వాస్తవాలు!

తల్చుకుంటేనే చాలు…

కలలు చూపిన కళ్ల నుంచే కన్నీరు రాలు.

- నిర్జర.