డైరీ (కవిత)
//డైరీ//
.png)
గుండెల్లో బాధ గొంతుకు అడ్డుపడి
మాట పెగలనపుడు కష్టాన్నంతా ఒంపేసి
భారం తగ్గించుకోవడానికి
దొరికిన ఏకైక నేస్తం నువ్వు..
ఎంత చెప్పినా ఓపిగ్గానే వింటూ
కదలక మెదలక సహకరిస్తూ
పెన్ నిబ్ ల ఒత్తిడిని మౌనంగానే భరిస్తూ
నా జీవితాన్ని లిఖించుకుంటూనే
నాకు పాఠాన్ని నేర్పుతుంటావు...
నా జ్ఞాపకాలన్నీ భధ్రంగా దాచుకుంటూ
నాకు నన్నే కొత్తగా పరిచయం చేస్తుంటావు
నేను ఒంటరిగా ఉన్నపుడు
నా మనసులో భావాలను వింటూ
నాకో తోడువవుతావు..
నాకు తెలుసు నువ్వేమీ చెప్పలేవని
కానీ ఏం చెప్పినా శ్రద్ధగా వింటూ
నా ఒంటరి భావాలను
కన్నీళ్ళను,కష్టసుఖాలను పంచుకుంటూ
ఎప్పటికీ నా ప్రతిరూపంగా మిగిలిపోతావు
.jpg)
...సరిత భూపతి



