టోరీ ఉగాది కవితల పోటీలో ప్రధమ బహుమతి పొందిన కవిత
గాదిలి ఉగాది (పద్యకవిత)
1) సీ" అత్తవారింటిలో అప్పుడే అడుగుమోపెడి క్రొత్త కోడలు పిల్లవోలె
నిగ్గుల సిగ్గుల మొగ్గయై మరుమల్లె బరువుతోడ తలెత్తు వధువువోలె
ఆంధ్రికి "హోదా"ల అమృతంబునేపంచ పొలుపుగానే తెంచు మొహినివలె
సగటు మానవుని నెమ్మొగమందు విరిసిన మవ్వంపు జిరునవ్వుపువ్వువోలె
రసము చిందింపనెత్తు కలంబువోలె హృదయమును దోచ సిద్ధమో ఉదయము వలే
అందములుమీఱ, అవనికానందమూర | వచ్చు " శ్రీ విళంబ్యబ్దమా ! "స్వాగతంబు " ||
2) సీ" లంచంబు పట్టు సొమ్మంచనంగ చెలంగె వెగటైనా రుచితోడ వేపపూత
పొగరుగా కట్నమ్ము పుచ్చుకొన్న వరుండనా వెల్గె వగరుతో మావిముక్క
వడి హడావుడిని చేసెడు "మృగాళ్ళో" యనవరలె కారంబుతో పచ్చిమిర్చి
తలలోని నాల్కయై మెలగు నేటి పడంతియుల్ల మౌచువెలింగె బెల్లమోర!
నాయకుని వోలె ఉప్పు కనంబడదుగ! చింతపండు నిరుద్యోగి జీవితంబె
పచ్చడిగ ఇచ్చు నీవిందు "బహుపసందు"; గాదిలి ఉగాది! రసవేది ! ఘనవినోది! ||
3) సీ" ముత్తైదువలెయైన మ్రోడులా? అవి - కావు వీరేశలింగంబు సౌరుగాని;
కమ్మని కోకిల గళరవమ్మటె? కాదు బాలమురళికృష్ణ వాణిగాని;
రెప్పవిప్పిన పూలరేకటే? అది - కాదు బాపు గీసిన బొమ్మ రూపుగాని ;
భావమాధుర్యంపు బరిమళంబటె? కాదు - అల కృష్ణశాస్త్రి గేయంబు గాని;
అనగ నొప్పారె వాసంతహాసరేఖ వేదమై, శుకశారికానాదమలర
తెలుగు భారతికల్యాణలలిత వేదియనగ నామనియొప్పెనుగాదివేళ ||
రచన :- డా|| రామడుగు వెంకటేశ్వర శర్మ గారు



