Facebook Twitter
( శీర్షిక) తెలుగు భాష

టోరీ ఉగాది కవితల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కవిత 

( శీర్షిక) తెలుగు భాష 


సీ. “దిరిసెన పువు” కంటె, కరము సున్నితమహో .......”అలసాని” సాక్షి నా తెలుగు భాష 
“వసుచరిత్ర”సుకవి పలుకుల సాక్షిగా.... “కాంభోజి” వినిపింప,కమ్ర భాష, 
“సుకవి ధూర్జటి” సాక్షి, శూలి నర్చిం పగన్... “కల నాదము”గలది తెలుగు భాష
ఘనుడు “పింగళి” కవి,”కల భాషిణి” దయిన, ఊయల తూగు” నిజము నా తెలుగు భాష

అభిజాత్యపు జాణ “సత్యా”వధూటి ....దర్పమున గెల్చుకున్నట్టి తరువు సాక్షి
“పరమ వికట కవివరుని”పాద సాక్షి.....తిరుగు లేనిది నిజము నా తెలుగు భాష!


సీ. అబ్ధి కన్యను గన్న,ఐశ్వర్య శాలినే....తలదన్ను “పొగరున” నలరు భాష
అమర నాథుని దైన,”ఐరావతము”కంటె.....వన్నె మిన్నగ నౌచు వరలు భాష
చేత వీణియ దాల్చి,చెలువంబుగా గుల్కు ...”శుక్ల వర్ణను” మించి సొక్కు భాష
ముక్కంటి గారిదౌ ,”ముసలి యెద్దును” మించి....తెల్లనై మివుల రాజిల్లు భాష

ఎనయ నిద్ధాత్రి నంది వర్ధనము కంటె...”తుమ్మి పువు” కంటె,తెల్లదౌ “తమ్మి”కంటె
పోరి చిననాటి నాచెలి “గౌరి” కంటె......తెలుపు నిక్కంబు వినుడి నా “తెలుగు భాష”!


“గౌళ”... “కల్యాణి”... “నాట”... “హిందోళ” ..“కాపి” 
“వలజి”... “సింహేంద్ర మధ్యమ”...”బిలహరి” యును.,
సార యశుడైన “కాకర్ల”వారి సాక్షి
చెలువు ధట్టించి పాడ బల్ “జిలుగు” భాష!


రచన :  డా.అక్కిరాజు సుందర రామ కృష్ణ గారు