Facebook Twitter
క్షణ క్షణం నీతో నేను

క్షణ క్షణం నీతో నేను

 

 

ఆ రోజు చూశా
ఇరవై యేళ్ళు పెంచిన అమ్మ నాన్న
దూరం అవుతుంటే నీ కళ్ళల్లో వచ్చిన
స్వచ్ఛమైన కన్నీళ్ళని...
అప్పుడే తెలిసొచ్చింది
బంధం అంటే ఇదేనని....

ఆ ఒక్క క్షణం నువ్వు నాకు
దగ్గరవ్వబోతున్నావన్న సంతోషం కన్నా
నీ వాళ్ళని దూరం చేస్తున్నానన్న
బాధే ఎక్కువనిపించింది....
అప్పుడే తెలిసొచ్చింది
బాధ్యత పెరిగిందని....

మీ ఇంటి నుండి మా ఇంటికున్న
రెండుగంటల ప్రయాణంలో
దారంత నా చేయి గట్టిగా పట్టుకునే ఉన్నావ్.
ఆ స్పర్శలో సున్నితత్వం కన్నా
నీ మనసు సంధిస్తున్న ప్రశ్నలే తాకాయి నన్ను...
అప్పుడే తెలిసొచ్చింది
ప్రతి నిమిషం నీ తోడుండాలని....

వచ్చేశావు
కొత్త హద్దులున్న బంధులోకం లోకి
పరిచయమే లేని కొత్తలోకం లోకి
మీ లోకం నుండి మన లోకం లోకి...

ఎన్ని మార్పులొచ్చినా.... తెచ్చినా...
నీ నవ్వుతో నెట్టుకొచ్చేస్తావ్
అనుకున్న నా నమ్మకాన్ని గెలిచేశావు

గడుస్తున్నాయి
పన్నెండేళ్ళుగా రాత్రింబవళ్లు...
ఎన్నోసార్లు
మనం దాచేస్తున్నా ఇబ్బందిలా
రాకుండా ఆపుతున్న కన్నీళ్ళలా
కలిసే గడపాలనుకున్న క్షణాల్లా
మనాశలను కలిపి కడుతున్న ఊహల్లా...

కొన్ని రోజులు
ఇంకొన్ని రోజులు... ఇలాగే గడిచిపోని...
ఓపికనే ముసుగులో
భవిష్యత్తనే మాయలో పరిగెడుతున్న
మన విలువైన కాలాన్ని
పోరాడి మరీ ఏదో ఒక రోజు శాశిద్దాం
వినకుంటే మన శ్వాసలనే ఆపేద్దాం
ఇది క్షణికావేశపు నిర్ణయం కాదని నిరూపిద్దాం....

 

-సయ్యద్ తాజుద్దీన్