Facebook Twitter
తెలుగు భాషా యోష

తెలుగు భాషా యోష

 


సీ.      ద్రావిడంబున బుట్టి తప్పటడ్గులు వేసి 
          కులికెను చిన్నారి తెలుగు బాల 
          అరవ కేరళ మలయాళ కన్నడ భాష
          లక్క చెల్లెండ్రతో నాడి పెరిగె
          అమర వాణి యనెడు నత్త వారింటికి
          ముద్దరాలై వచ్చె ముదిత తెలుగు
          తత్సమ తద్భవాల్ తనవార లయ్యిరి
          భారత భాషలు పాత చెలులె.

తే. గీ. అన్యదేశ్య సఖుల తోడ నాడిపాడి 
          ఇట్టి బంధు మిత్రులతొ తెల్గింతదయ్యె
          విశ్వమున చిత్ర కీర్తితో విస్తరించె.
          అన్నమాచర్య పాటతో హరిని గొలిచె.

సీ.      నన్నయ్య వాక్సుధా నానార్ధ సూక్తిచే
          నక్షర రమ్యత నమరె తెలుగు
          తిక్కనార్యుని యచ్చ తెలుగు పలుకులచే
          వయ్యారియై తెల్గు వన్నె కెక్కె
          నెర్ర నాంధ్ర కవిత నెలనాగ ప్రౌఢయై
          శ్రీనాథ ప్రియవాణి సిరులు గులికె
          పోతన భక్తితో పులకరించెను తెల్గు
          అష్ట దిగ్గజముల నందమలరె.
         

 
రచన : శ్రీ అచ్యుతానంద బ్రహ్మచారి