Facebook Twitter
క్షణమంటే...

క్షణమంటే...

 

 

మెుగలి పొదల్ని గుప్పున అలుముకున్న చీకటి
ఎందుకో నడిజామున ఉన్నపళంగా నడవమని పిలుస్తూ..
కళ్ళు పొడుచుకొని చూడబుద్ధేయని నిర్వర్ణ ఆనందం
ఆ తర్వాత ఆ కల చెదిరిపోతుంది
మరలా ఊహిస్తాను..వెలుతురు కోసం నడవడాలనూ, ఉషోదయాలనూ ..
కానీ, వెలుతురులో నన్ను నేను కలుసుకోవటం కన్నా
ఆ గమ్యం కోసం అంధకారంలో లిఖించుకున్న వెలుతురు క్షణాలు గొప్పగా కనబడతాయి
గమ్యాన్ని ప్రేమించటం కన్నా
గమనాన్ని అనుభూతించటమే
బతకటానికి, బతికేవున్నావనటానికీ మధ్యనున్న చిన్న గీత

కళ్ళ నిండా ఒంపుకునే పెరటి మెుక్కల నవ్వులు
పెదవుల మీద తచ్చాడుతూ కాఫీ కప్పు రాగాలు
కిటికీలోంచి తొంగి చూసిన వెన్నెల
అన్నీ.. అన్నీ కాసేపటికో రేపో వెక్కిరించిపోతాయి
అయినా సరే అవన్నీ నీకిపుడు ఉండటం ఇష్టమంతే
నువ్వు కావాలనుకున్న క్షణాలేవీ అట్టే నిలిచిపోవు
చేయాల్సిందల్లా అవి ఉన్నపుడు నీకంటూ నువ్వు లేకుండా వాటిలోనే కలిసిపోవటం
నిన్ను నువ్వు కోల్పోయిన క్షణమంటే
నిన్ను కొత్తగా వెతుక్కోవటమే

- సరిత భూపతి