వాల్ పేపర్ (కవిత)
వాల్ పేపర్

తొంగి చూస్తుంటావు ఒక్కోసారి
నీలోకి నువ్వే
ప్రశాంతమైన సంద్రంలా ఉందని సమాధానమిచ్చుకుంటావు
తెరచాపలు తెరుచుకొని తిరిగే అహాల్ని
ఎదురీతలీదే అంతు తెలియని ప్రశ్నల్ని
నువ్వప్పుడు గుర్తించలేవు
ఇవన్నీ నిజాలు కావని
సమాజమే సంద్రమని నువ్వు తెల్సుకున్నప్పుడు
ప్రశాంతపు అ(క)లలు నీ పాదాల్ని ఒక్కసారిగా
చుట్టుముడతాయి చూడూ
అపుడు మాయమౌతాయి
అహాల,ఇహాల నావలు
నీలోనుంచి
నువ్వే ఒక అంతమెరగని లక్ష్యం వైపు
తెడ్డేసుకొని ఎదురెళ్తావు
ఆ దృశ్యమెప్పుడూ
నీ హృదయఫలకం పై వాల్ పేపర్ లా నిలబడుతుంది
ఎలానా?
నీ అద్దంలో నీలా..!
నా అర్ధంలో నాలా...!!
- Raghu Alla



