
“అమ్మా .. దీన్ని తలకి అతికిస్తే తల పగిలిపోవడం తగ్గిపోతుంది. ఇదిగో తీసుకుని అతికించు” అని గుండ్రంగా ఉన్న ప్లాస్టర్ రీలు తెచ్చిచ్చాడు నాలుగేళ్ల రవి.
“ తలనొప్పి తగ్గడానికి దీన్ని అతికించమని ఎవరు చెప్పారు” అడిగింది రజని ఆశ్చర్యంగా. వాడేమి చెప్పాడో సరిగా అర్ధం కాకపోవడంతో.
“ ఇందాక నీ తల పగిలి పోతుందని పక్కింటి ఆంటీతో చెప్పావు కదా. అందుకే తెచ్చా. మన ఇంట్లో ఏదైనా కాగితం చినిగితే దీనితోనే అతికిస్తారు నాన్న. నువ్వు కూడ తల పగలకుండా దీనితో అతికించు” బదులిచ్చాడు అమాయకంగా రవి.
కొడుకు ముద్దు వచ్చే మాటలు విని నవ్వుకుంది. ఊరిలో తిరునాళ్లు జరుగుతుండడంతో రజని వాళ్ల అమ్మా నాన్నలను, చెల్లెలు , తమ్ముళ్ల కుటుంబాలను ఇంటికి ఆహ్వానించింది. వాళ్లంతా ఇంటిలో ఉండడంతో ఆమెకి రోజూ చేసే పని కంటే ఎక్కువయింది.
చీకటితోనే నిద్ర లేచి చేస్తున్నా పని తరగలేదు. సరిగ్గా అలాంటప్పుడే నువ్వుల నూనె అప్పు కావాలని పక్కింటావిడ వచ్చింది .
“అబ్బబ్బ.. ఎంత చేస్తున్నా పని తరగట్లేదు. చేతులు నెప్పి పుడుతున్నాయి. తల పగిలిపోతోంది” అని రజని ఆమెతో చెప్పింది. ఆ మాటలు విన్నాడు రవి. అందుకే .. అమ్మ తలనొప్పి తగ్గించడానికి అన్నయ్య పుస్తకాలు చినిగిపోకుండా నాన్న అతికించే ప్లాస్టర్ ని తెచ్చిచ్చాడు. తలకి అతికించమన్నాడు. అప్పటికి విషయం అర్థమైంది రజనికి. కొడుకు ఉపాయానికి నవ్వింది .
“ఎందుకు నవ్వుతున్నావు? ఇది అతికిస్తే తలనొప్పి తగ్గదా ?” మళ్ళీ అమాయకంగా అడిగాడు రవి.
“తల పగిలిపోతుందంటే ప్లాస్టర్ వెయ్యకూడదు. తలనొప్పి వచ్చిందని అర్ధం. అమృతాంజనంతో రాస్తే తగ్గిపోతుంది” అని వాడికి అర్థమయ్యేలా వివరించింది రజని.
కొడుకు చేసిన ఘనకార్యం గురించి ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళకి చెప్పింది రజని. వాళ్లు కూడ సరదాగా నవ్వుకున్నారు.
ఆ రోజు మధ్యాహ్నం భోజనాలకు కూర్చున్నారు ఇంట్లో వాళ్లు. కోడి గుడ్లుతో వండిన కూర అందరికీ వడ్డించింది రజిని.
“అదేమిటి” అని రవి అడిగాడు. కోడిగుడ్డు అని చెప్పింది రజని. “నాకు గాడిద గుడ్డు కావాలి” అన్నాడు. మొదట వాడేమన్నాడో అర్ధం కాలేదు రజనికి. అక్కడ ఉన్న మిగతావాళ్ళు కూడా ఆసక్తిగా రవి వైపు చూసారు.
“గాడిద గుడ్డు ఉండదు. కోడిగుడ్డు, బాతు గుడ్డు ఉంటుంది” రవిని బుజ్జగించడానికి వాళ్ల అమ్మమ్మ కూడ చెప్పింది.
“ఉహు .. ఉంటుంది. అదే కావాలి నాకు” అని ఏడుపు అందుకున్నాడు రవి. ఎన్ని విధాలుగా చెబుతున్నా వాడు ఏడుపు ఆపలేదు.
‘రవి ఎందుకలా అడుగుతున్నాడో, ఎవరైనా అంటేనే కదా పిల్లలకి తెలిసేది’ అని వాళ్ల నాన్నకి అనుమానం వచ్చింది. అసలు సంగతి వాడి ద్వారానే చెప్పించాలని రవిని దగ్గరకు తీసుకుని బుజ్జగిస్తూ “గాడిద గుడ్డు అని ఎవరన్నారు? నాతో చెప్పు. నువ్వు చెబితే కదా తెలుస్తుంది . అలా అన్నవాళ్ళని అడిగి అది తెప్పిస్తాను” అన్నాడు. రవి ముఖంలోకి వెలుగు వచ్చింది నాన్న మాటలు వినగానే . వెంటనే తాతయ్య వైపు వేలు చూపించాడు.
అందరి దృష్టి తాతయ్య మీదకు మళ్లింది. “మీరే వాడికి చెప్పారా? గాడిద గుడ్డు ఎక్కడైనా ఉంటుందా?” అని అందరూ తాతయ్యని ప్రశ్నించారు.
“ఆగండర్రా। నేనెందుకు వాడికి చెబుతాను ? కాసేపు ఆలోచించడానికి టైమ్ ఇవ్వండి “ అని వాళ్ళకి చెప్పేసి ఆలోచనల్లోకి జారారు. ఏం జరిగిందో గుర్తుకి తెచ్చుకోడానికి ప్రయత్నించారు. కాసేపటికి ఆయనకి ఒక విషయం గుర్తొచ్చింది.
ఆ రోజు ఉదయం పని వాళ్లలో ఒకరు చెప్పిన పని తప్పుగా చేసి, బుకాయించడంతో కోపం వచ్చి “ ఇలాగేనా చేసేది? గాడిద గుడ్డేం కాదు” అని తిట్టాడు తాతయ్య. అప్పుడు ఆయన ఒడిలోనే కూర్చున్న రవి ఆ మాటలు విన్నాడు. వెంటనే తాతయ్యని అడిగాడు ఆ గుడ్డు ఏమిటని? ఆయన ఉన్న చిరాకులో వాడికి బదులివ్వలేదు.
తాతయ్య దగ్గిర నుండి అసలు విషయం తెలుసుకున్న మిగతా కుటుంబసభ్యులు నవ్వుకున్నారు.
రవి వాళ్ల నాన్న రవిని ప్రేమగా బుజ్జగించి గాడిద గుడ్డు అనేది ఉండదని, అదొక తిట్టు పదంగా తాతయ్య మాట్లాడారని చెప్పాడు. వాడిని ఒప్పించేసరికి తల ప్రాణం తోకకి వచ్చింది రవి నాన్నకి.
రవికి అన్నయ్య కూడా ఉన్నాడు . వాడి పేరు రాము. రాముకి ఎనిమిదేళ్లు. వాడు బడికి వెళ్ళినప్పుడు , తిరిగి వచ్చిన తరువాత అన్నా తమ్ముళ్ళిద్దరూ ఏదో ఒక వస్తువు కోసం గొడవ పడుతుంటారు.
ఒకరోజు పిల్లలిద్దరూ బడి నుండి రాగానే బ్యాగు పక్కన పెట్టి, టీవీ రిమోట్ కోసం గొడవ పడ్డారు.
ఇంటి పనితో అలసిపోయి ఉన్న రజనికి వీరి గొడవతో మరింత చిరాకుగా అనిపించింది. “బడి నుండి రాగానే స్కూల్ యూనిఫామ్ విప్పేసి కాళ్లూ చేతులూ కడుక్కోవాలని చెప్పాను కదా. టేబుల్ మీద టిఫిన్ ఉంచాను.అది తినడం మానేసి తగాదా ఎందుకు? బుద్ధిగా ఉన్నారా సరే. లేదంటే పెనం మీద కాల్చిన అట్లకాడతో వాత పెడతాను” అంది.
“అమ్మా .. నాకది కావాలి. అన్నయ్యకివ్వకు. నాకిప్పుడే వాత పెట్టు” అమ్మ దగ్గరకు వెళ్లి మారాం చేస్తూ అడిగాడు రవి.
“నీకేం అర్ధమైందిరా ? వాత అంటే తెలుసా?” అని చిరాకు తగ్గించుకుని అడిగింది రజని.
“ఓ తెలుసు.. అది పెనం మీద కాల్చే అప్పచ్చి . ఆకలిగా ఉంది. తొందరగా వాత పెట్టమ్మా” అన్నాడు రవి అమాయకంగా. వాడి ముద్దు మాటలు వింటుంటే కోపం, చిరాకు ఎగిరిపోయింది రజనికి . మనస్ఫూర్తిగా నవ్వుకుంది.
ముద్దొస్తున్న రవి ముఖం మీద ముద్దు పెట్టి “ ఉండు. టిఫిన్ తెచ్చి తినిపిస్తాను” అంటూ వంట గదిలోకి పరిగెత్తింది.
“చిన్న పిల్లల ముందు అనకూడని మాటలు పలకకూడదని, వాటినే పిల్లలు వేరే విధంగా అర్ధం చేసుకుని పెద్దల దగ్గర, బడిలో ఇతర పిల్లల దగ్గర కూడా పలికే ప్రమాదముందని” తెలుసుకుంది రజని. అప్పటి నుండి రవి ముందు జాగ్రత్తగా మాట్లాడడం, ఉండడం నేర్చుకున్నారు .
నారంశెట్టి ఉమామహేశ్వరరావు



