Facebook Twitter
రాము తెలివి

పార్వతీపురంలో కార్లు  అమ్మే దుకాణం తెరుద్దామని వ్యాపారవేత్త సుందరం అనుకున్నాడు. ఆ వ్యాపారం చూసుకోడానికి ఆయన కొడుకు వివేక్  అంగీకరించడంతో తగిన ఏర్పాట్లు చేసాడు.   పురోహితుడిని అడిగి ముహూర్తం నిర్ణయించాడు. 
ప్రారంభోత్సవ కార్యక్రమానికి   చాలా  మంది అతిధులను పిలిచాడు.   మొదటి కొనుగోలు కోసం మరో వ్యాపారవేత్తని  పిలిచారు. 
వచ్చే అతిధులకు  సమోసా, మిఠాయి, చల్లని పానీయం  ఇవ్వాలని ఏర్పాట్లు చేసారు. అరగంటలో అతిథులంతా  వస్తారనగా   పానీయపు సీసాలు చల్లబడలేదని  తెలిసింది. 
తెప్పించిన సమోసాలు, మిఠాయిలు , పానీయపు సీసాలు  ఒక గదిలో పెట్టి ప్రారంభోత్సవం కాగానే ఇవ్వాలనుకున్నారు. అయితే  పానీయాలు చల్లబడలేదు.  అసలే మండుతున్న వేసవి.  వాతావరణం వేడిగా ఉంది.   అతిథులకు  చల్లని పానీయాలు అందిస్తే  సంతోషిస్తారన్న సుందరం గారి   ఆలోచన దెబ్బ తినేలా అయింది. 
  “ అతిథులకు  వేడిగా ఉన్న  పానీయాలను   ఇస్తామా?  ఇంత మంది పనివాళ్లు ఉండీ  ఏం చేస్తున్నారు? ఫ్రీజర్ కి కరెంట్ వెళ్లే  స్విచ్ వేసారో లేదో చూడక్కరలేదా?” అని కోపం అయ్యాడు సుందరం. 
  “మనది  కొత్తగా ప్రారంభిస్తున్న దుకాణం కావడంతో విద్యుత్ సరఫరాలో లోపం ఉందేమో  స్టెబిలైజర్ కాలిపోయింది. దానిని మరమ్మతు చేయించి పానీయాలు చల్లబరచడానికి  కొన్ని గంటలు పడుతుంది.  ప్రస్తుతానికి   బయటి దుకాణాల నుండి కూల్  డ్రింక్స్ తెప్పిద్దాం. మన దగ్గర మిగిలినవి వెనక్కు పంపేద్దాం” అన్నాడు వివేక్ తండ్రితో.  
“ఒకేసారి అన్ని  సీసాలు  ఒకే  దగ్గర  దొరకవు. చాలా  చోట్లకు  పంపాలి. అన్ని సీసాలు చల్లటివి  సిద్ధంగా  ఉంటాయో లేవో” అని సందేహ పడ్డాడు సుందరం. 
 వాళ్లలా మాట్లాడుతుండగా  అతిథుల్లో ఉన్న  ఎనిమిదో తరగతి కుర్రాడు  రాము విన్నాడు.  రాము నాన్న సందరం దగ్గర పని చేస్తాడు.  ఆ మాటలు వినగానే  రాముకి ఒక  ఆలోచన స్ఫురించింది. 
వెంటనే  సుందరం గారితో “అంకుల్ । చల్లని పానీయాల కోసం ఎవరినీ   బయటకు పంపక్కరలేదు. అతిథులు రాగానే  కార్యక్రమాన్ని ప్రారంభించండి. మీరు ప్రారంభోత్సవం  పూర్తి చేసేసరకి  చల్లని పానీయాలను అందించే కిటుకు నాకు తెలుసు. ఇద్దరు  పనివాళ్లని  నాకు అప్పజెబితే చాలు” అన్నాడు.
 రాము వాళ్ళ నాన్న వచ్చి సుందరం గారితో “వీడు మావాడే. పేరు  రాము. వాడిని నమ్మండి” అనడంతో  వాళ్లు   సరేనన్నారు.  
 ముఖ్య అతిథి, ఇంకా    అతిథులు   రావడంతో   ఇద్దరు పనివాళ్లని రాముకి అప్పజెప్పి  వెళ్లిపోయారు సుందరం, వివేక్. 
అనుకున్న   ముహూర్తానికే   ప్రారంభోత్సవం జరిగింది.  
వచ్చిన అతిథులందరికీ   చల్లటి పానీయాలను  అందించారు  కుర్రాళ్ళు.  కార్యక్రమం అయిపోయాక రాముని పిలిచి ప్రత్యేకంగా అభినందించాడు  సుందరం . “ఇంత తొందరగా పానీయాలను ఎలా  చల్లబరిచావు?’ అనడిగాడు. 
   “ ఇందులో పెద్ద  రహస్యమేమీ  లేదు.   నేను బడిలో  తెలుసుకున్న  ఫిజిక్స్ సూత్రాన్నే ప్రయోగించాను. మీరేమో కూల్ డ్రింక్స్ తెప్పించాలని చూసారు. కానీ  నేనలా చేయకుండా  ఐస్ ఫాక్టరీ నుండి నలుపలకలు కలిగిన ఐసు దిమ్మలను   తెప్పించాను. ఆ ఐస్ గడ్డలను పానీయపు సీసాలున్న బాక్సుల్లో పెట్టాను. ఆ ఐస్ దిమ్మల  మీద ఉప్పుని చల్లితే ఘనీభవ స్థానం మైనస్ నాలుగు డిగ్రీలకు చేరుతుందని నాకు తెలుసు కదా. ఆ  సూత్రం ప్రయోగించాను. దాంతో    పానీయపు సీసాలు మామూలు కన్నా అతి వేగంగా చల్లబడ్డాయి. ఐస్ క్రీమ్ లేదా కుల్ఫీ తయారీలో ఇదే సూత్రం పాటిస్తారు.   మా ఇంట్లో ఆ   ప్రయోగం చేసి విజయం సాధించాను. దాన్నే  ఇక్కడా అమలు పరిచాను“ అన్నాడు రాము .  
రాము తెలివి, సమయస్ఫూర్తిని అభినందించారు వచ్చిన అతిథులు. కార్యక్రమానికి రాముని కూడా తీసుకువచ్చినందుకు వాళ్ళ అమ్మ నాన్నలను  అభినందించారు.