Facebook Twitter
చాలా రోజుల తర్వాత వర్షంలో తడిశా

చాలా రోజుల తర్వాత వర్షంలో తడిశా

 

చాలా రోజుల తర్వాత వర్షంలో తడిశా...
వర్షంలో నడిచా...
వర్షాన్ని అనుభవించా...
వర్షాన్ని అనుభూతి చెందా...
ప్రవాహ వర్షానికి పాదాలు ఎదురీదుతూ ముద్దాడాయి.
చినుకులు పువ్వలై నేల తల్లిని అభిషేకించాయి.
పారే జలపాతంలో మనసు మునకలైంది.
పడే ప్రతి చినుకు పారే జలంలో సరికొత్త మొలకై చిగురించింది
చినుకు చుట్టూ చినకు, చినుకు పక్కన చినుకు...
చినుకు ముందు చినుకు.. చినుకు వెనక చినుకు..
నేల ఒడినిండా చినుకు రెక్కలు విప్పిన రత్నాలే...
అనుబంధాల అల్లికలతో తడిసిన మాలలా ఆ ప్రవాహం నేలపైనే కాదు... నాలో కూడా...
విచ్చిన రోజాకింద ఐస్ క్రీమ్ తింటున్న అమ్మాయి వాసన
ముద్దై ముద్దుల కోసం ఆరాటపడే ప్రేమికుల తడిఆరని మాటల ఉత్సాహం.
ఉరుకులు పరుగుల మధ్య చల్లటి గాలులు నిట్టూర్పుల ఎదలు
వాహనాల చిందుల్లో చినుకుల అల్లరి బాసలు.
బస్టాపుల నిండా భరోసా కోసం ఎదురు చూపులే... లే ఎండ గుండెలతో...
తీగల మధ్య కన్నుల్లో పలకిరంచే అందమైన కన్నెల శారీరక పలకరింపులు.      
బస్సులో నేను... నాలో కదిలే మనషులు...
వెరసి... ఆఫీసుకు అర్థగంట ఆలశ్యం..
అయినా ఫర్వాలేదులే... నేస్తం
నులివెచ్చని హృదిలో వెన్నెల్లా వెలిగావు.
కలతల మధ్య ఎద వీణ మీటావు.
చాలు... చాలదు... మనసు మాట వినదు కదా... ఆశ ఆగదు కదా...
అందుకే....
పరుగు పెడుతున్న ప్రపంచాన్ని పలకరించిన వానా... నీకు.. ఇదే... ఓ నమస్సుమాంజలి. 

ఎ. రవీంద్రబాబు