Facebook Twitter
మేలు

మేలు

 

వ్యాపకాల దారుల్లో వ్యాకులతలు ఎదురౌతున్నప్పుడు
జ్ఞాపకాల గృహంలో కొంతసేపు విశ్రాంతి తీసుకోవటమే మేలు.
అనుభూతుల సుమగంధాలను ఆస్వాదించేవేళ
అపఖ్యాతుల దుర్గంధవాయువులు వీచుతున్నప్పుడు
అనునయపు ఆలోచనల అగరువత్తులను వెలిగించుకోవటమే మేలు.
అనుబంధాల భవనాలకు అపార్ధాలబీటలు వారుతున్నప్పుడు
భవబంధాల తలుపులు తెరుచుకొని బయటపడటమే మేలు.
ఆనందపు సాగరంలో హాయిగా ఓలలాడేవేళ
ఆత్మీయులనుకున్నవారి అసూయ కెరటాలై పైపైకొస్తున్నప్పుడు
కొంతకాలంపాటు మౌనతీరాన్ని చేరి మూగగా నిలవటమే మేలు.
వినోదాల వేకువని విషాదాల చీకట్లు క్రమ్ముకొన్నపుడు
విరక్తిని పారద్రోలే వివేకాన్ని నమ్ముకోవటమే మేలు.  
కనులుమూసే వేళ కలలను కలతలు వేదిస్తున్నప్పుడు
ఆ కలలతోనే చెలిమి చేసి వాటి గమనాన్ని
మనకనుగుణంగా మార్చుకోవటమే మేలు.

- భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు